హైదరాబాద్, డిసెంబర్ 13: విభజన బిల్లు సచివాలయ ఉద్యోగుల మధ్య అగ్గిరాజేస్తోంది. గతంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యమాలు చేసుకున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు ఇప్పుడు బాహాబాహీకి సిద్ధమవుతున్నారు. శుక్రవారం ఇదే అంశంపై సచివాలయంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. మధ్యంతర భృతిపై ముఖ్యమంత్రిని కలిసేందుకు రెండు వర్గాల ఉద్యోగులు కలిసి నిర్ణయించారు. అయితే ప్రతి రోజు మాదిరిగానే సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయంలో విభజనకు వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తూ సమతా బ్లాక్ వద్దకు చేరుకున్నారు.
నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అక్కడికి తెలంగాణ ఉద్యోగులు కూడా చేరుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. తెలంగాణ జై అంటూ ఆ ప్రాంత ఉద్యోగులు, సమైక్యాంధ్ర కావాలంటూ సీమాంధ్ర ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఒకరి దగ్గరకు ఒకరిగా చేరుకునేందుకు ప్రయత్నించడంతో ఎస్పీఎఫ్ పోలీసులు ఆప్రమత్తమై రెండు వర్గాలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా రెండు వర్గాలకు, పోలీసులకు మధ్య తోపులాట కూడా ప్రారంభించారు. దీంతో బయట నుంచి అదనపు పోలీసు బలగాలను కూడా రప్పించి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. తాము ఎలాగైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవాలని పట్టుబడుతూ కొంతమంది సీమాంధ్ర మహిళా ఉద్యోగులు బారికేడ్లను దాటి సి-బ్లాక్ వద్దకు చేరుకుని అక్కడే బైఠాయించారు. వారిని బయటకు పంపించేందుకు కూడా పోలీసులు పలుమార్లు ప్రయత్నించాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా సోనియా జిందాబాద్ అంటూ తెలంగాణ ఉద్యోగులు, సోనియా డౌన్‌డౌన్ అంటూ సీమాంధ్ర ఉద్యోగులు నినాదాలు చేశారు. తెలంగాణ కావాలంటూ ఒకరు, సమైక్యమే ముద్దంటూ ఇంకొకరు నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం యుద్ధవాతావరణంగా మారిపోయింది. సచివాలయంలో ర్యాలీలు, ప్రదర్శనలు చేయడం ఏమిటని తెలంగాణ ఉద్యోగులు ప్రశ్నించగా, బయట నుంచి వచ్చిన ఉద్యోగులు వెంటనే సచివాలయం నుంచి వెళ్లిపోవాలంటూ సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేశారు. దాదాపు గంటన్నరకుపైనా జరిగిన ఈ ఉద్రిక్తత పరిస్థితిని చల్లార్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. (చిత్రం) సచివాలయంలో శుక్రవారం ర్యాలీ నిర్వహిస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు
ఎదురెదురుగా తెలంగాణ- సీమాంధ్ర ఉద్యోగులు భారీగా మోహరించిన పోలీసులు, తోపులాట
english title:
sachivalayam
Date:
Saturday, December 14, 2013