హైదరాబాద్, డిసెంబర్ 13: ఒకే పార్టీ మూడు విధానాలపై టిడిపి నాయకులు శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో విలేఖరుల ప్రశ్నలతో ఇబ్బంది కరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా సమైక్యాంధ్ర వాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ ఎమ్మెల్యేలు తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్నారు. ఎవరి వాదం వారిదిగా పార్టీ ప్రాంతాల వారిగా రెండుగా చీలిపోతే వీరిద్దరితో కాకుండా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మూడవ విధానం అనుసరిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు మినహా మరో ప్రత్యామ్నాయానికి అంగీకరించేది లేదని తెలంగాణ నాయకులు, సమైక్యాంధ్ర మినహా మరో దానికి ఒప్పుకునేది లేదని సీమాంధ్ర నాయకులు అంతే గట్టిగా వాదిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రెండు వాదాలు కాకుండా మధ్యే మార్గంగా సమన్యాయం అంటున్నారు. తాను తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించడం లేదని సీమాంధ్రకు సైతం న్యాయం చేయాలని సమన్యాయం గురించి అడుగుతున్నానని చంద్రబాబు ప్రతి రోజు సాయంత్రం ఆరుగంటలకు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ డిమాండ్ చేస్తున్నారు. అయితే సీమాంధ్ర ఎమ్మెల్యేలు మాత్రం సమైక్యాంధ్ర కోసం చివరి వరకు పోరాడతామని, సమైక్యాంధ్రను సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు. డిసెంబర్ 9, 2009న తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చినప్పుడు విజయవంతంగా అడ్డుకున్న తామే ఇప్పుడూ అడ్డుకుంటామని తెలిపారు. తెలంగాణ నాయకులేమో బాబు ఇచ్చిన లేఖ వల్లనే తెలంగాణ ఏర్పడుతోందని అంటున్నారు. సీమాంధ్రకు సైతం న్యాయం చేయాలని కోరడంలో తప్పు లేదని సమైక్య అనడం మాత్రం పార్టీ వ్యతిరేక చర్య అవుతుందన్నారు. తెలంగాణపై ఇలా కలలు కంటూనే ఉండండి వచ్చే ఎన్నికల తరువాత కూడా తెలంగాణ ఏర్పాటు కోసం మీరిలా డిమాండ్ చేస్తూనే ఉంటారు అని పయ్యావుల కేశవ్ అన్నారు. పదేళ్లు కలిసి ఉండాలి కాబట్టి ఆ రకంగా కలుస్తామేమో కానీ తెలంగాణ ఏర్పాటు అనివార్యమని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తారక రామారావు తెలిపారు. అధ్యక్షునిది ఒకవాదన, రెండు ప్రాంతాల వారిది రెండు వాదనలు కావడం పార్టీ నాయకులకు ఇబ్బంది కరంగా తయారైంది. ఏం చేస్తాం ఈ సమస్య మా ఒక్క పార్టీకే కాదు అందరిదీ అని టిడిపి సీనియర్ నాయకుడొకరు వాపోయారు.
అంత ఆవేశం అవసరం లేదు
గురువారం మీడియా సమావేశంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అకస్మాత్తుగా ఆవేశం తెచ్చిపెట్టుకుని మాట్లాడడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. బాబు అంత ఆవేశానికి గురికావలసిన అవసరం లేదని కెసిఆర్‌పై ఇతర నాయకులు మాట్లాడుతున్నప్పుడు తాను మాట్లాడడం ఎందుకని రాయలసీమకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ప్రశ్నించారు. బహిరంగ చర్చకు రమ్మని సవాల్ చేశాం, సరే వస్తాను ఎక్కడో మీరే నిర్ణయించండి అని కెసిఆర్ అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి అని ఆ ఎమ్మెల్యే వాపోయాడు. బాబు మాట్లాడింది వింటే నిద్ర వస్తుంది, కెసిఆర్ ఎదుటి వారిని నమ్మించే విధంగా మాట్లాడతాడు, జన సమీకరణ చేయిస్తాడు మనకెందుకా గొడవ అని సీనియర్ ఎమ్మెల్యే మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ విమర్శించారు. ఎప్పటి మాదిరిగానే కెసిఆర్‌ను తిట్టే బాధ్యత ఇతర నాయకులకు అప్పగించడం మంచిదని, ఇదే విషయాన్ని బాబుకు వివరించినట్టు సీనియర్ ఎమ్మెల్యే తెలిపారు.
టిడిపిలో గందరగోళం
english title:
tdp
Date:
Saturday, December 14, 2013