కాకినాడ, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకై కేంద్రం రూపొందించిన తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో సమైక్యవాదులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదానికి ముసాయిదా బిల్లును పంపడం పట్ల సమైక్యవాదులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో యుపిఎ ఛైర్ పర్శన్ సోనియాగాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల దిగ్విజయ్‌సింగ్‌ల ఫ్లెక్సీలను సమైక్యవాదులు తగులబెట్టారు. రాష్ట్ర అసెంబ్లీకి బిల్లును ప్రత్యేక విమానంలో పంపడంతో పాటు ఆ వెనుకే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి డిగ్జీరాజాను పంపడం, అసెంబ్లీలో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే పనిలో ఆయన తలమునకలు కావడం చూస్తుంటే ఏకపక్షంగా, బలప్రయోగంతో విభజన చేయాలన్న దురుద్దేశ్యంతో కేంద్రం ఉన్నట్టు స్పష్టమవుతోందని ఉద్యోగ జెఎసి నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్ర విభజనకు విరుద్ధంగా సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాస నోటీసులు ఇచ్చినట్టే, రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు విభజనకు వ్యతిరేకంగా తమ శక్తియుక్తులొడ్డి పోరాడాలని జెఎసి ఛైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కన్వీనర్ పితాని త్రినాథరావు తదితరులు కోరారు. ఇప్పటికైనా సీమాంధ్ర కేంద్రమంత్రులు రాజీనామాలను ఆమోదింపజేసుకుని ఉద్యోగ సంఘాలతో కలసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లా కేంద్రం కాకినాడలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు.
ప.గో. జిల్లాలో....
భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సమైక్య వాదులు ఆందోళనలతో దద్దరిల్లింది. తెలంగాణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ద్వారా తెలుగుప్రజలను అధోగతి పాల్జేసేలా కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో వ్యవహరిస్తున్నదని సమైక్యాంధ్ర ఉద్యమకారులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రకాశంచౌక్ సెంటర్ ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, మానవహారాలతో దద్దరిల్లింది. భీమవరంలో సమైక్యాంధ్ర ఉద్యమం మహోద్యమంగా సాగుతోంది. జెఎసి, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు కదంతొక్కారు. ప్రకాశంచౌక్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి 216 జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆంధ్రా కబడ్డీ జట్టు క్రీడాకారులు స్థానిక ప్రకాశంచౌక్ సెంటర్‌లో ధర్నా నిర్వహించి సమైక్యాంధ్రాకు మద్దతుగా నినాదాలు చేశారు.
కృష్ణాలో డిగ్గీరాజా దిష్టిబొమ్మలు దగ్ధం
మచిలీపట్నం: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కృష్ణా జిల్లాలో నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. పలుచోట్ల ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి గోబ్యాక్ అంటూ పెద్దపెట్టున నినదించారు. కైకలూరులో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 129వ రోజుకు చేరాయి. కలిదిండిలో ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి డిగ్గీరాజా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అవనిగడ్డలో వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నాగాయలంకలో జెఎసి ఆధ్వర్యంలో రాస్తారోకో జరిపారు.
లాయర్ల జెఎసి ఆధ్వర్యంలో నిరసన
విశాఖపట్నం: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి రాష్టప్రతి నుంచి అసెంబ్లీకి వచ్చిన టి ముసాయిదా బిల్లు నమూనా ప్రతులను శుక్రవారం విశాఖలో న్యాయవాదుల జెఎసి ఆధ్వర్యంలో తగులబెట్టారు. జిల్లా కోర్టు వద్ద లాయర్ల జెఎసి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. రాష్ట్రాన్ని విభజించే విషయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా జెఎసి కోకన్వీనర్ పి సత్యనారాయణ ఆరోపించారు. తెలంగాణా విభజన అంశాన్ని తెరపైకి తీసుకురావడం దగ్గర్నుంచి, అసెంబ్లీకి బిల్లు పంపే వరకూ దిగ్విజయ్ సింగ్ ఏకపక్షంగా వెళ్తున్నారని ఆరోపించారు. దిగ్విజయ్‌సింగ్ విభజనపై ఎందుకంత పట్టుదలతో ఉన్నారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం లభింపచేసేందుకు దిగ్విజయ్‌సింగ్ అడ్డదార్లు తొత్కుతున్నారని ఆరోపించారు. కోర్టు కార్యాలయ ప్రాంగణం వద్ద న్యాయవాదులు రాస్తారోకో చేస్తుండగా ఆర్టీసీ బస్ వీరిని దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా న్యాయవాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఆర్టీసీ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. (చిత్రం) విశాఖలో టి- ముసాయిదా బిల్లు నమూనా ప్రతులు దగ్ధం చేస్తున్న న్యాయవాదులు
శాప్స్ ఆధ్వర్యంలో నిరసనలు
తిరుపతి: సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని విభజించి రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టవద్దని నిరసిస్తూ శాప్స్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, రాజారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి డిగ్గీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాగా సీమాంధ్ర శాసససభ్యులు పార్టీలకతీతంగా విభజనను వ్యతిరేకించాలని, అలాకాకుండా సహకరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఎస్వీయూ జెఎసి కన్వీనర్ రంజిత్‌కుమార్ ప్రైవేటు విద్యాసంస్థల కార్యదర్శి ఇ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. కాగా విభజన ముసాయిదా బిల్లును చింపేయండి అంటూ మదనపల్లెలో సమైక్యవాదులు శుక్రవారం ఆందోళన చేశారు. మదనపల్లె జెఎసి, మిట్స్ కళాశాల జెఎసి, విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.అంతకు ముందు పట్టణంలోని ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు స్థానిక గాంధీరోడ్డు, చిత్తూరు బస్టాండు వాల్మీకి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలావుండగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం శుక్రవారం 135వ రోజున పుంగనూరులో ధర్నాలు, రాస్తారోకోలు, వినూత్న నిరసనలు కొనసాగాయి. జెఎసి ఆధ్వర్యంలో పట్టణంలోని సమైక్యవాదులు, అఖిలపక్ష నాయకులు, పట్టణ ప్రజలు, ఉపాధ్యాయులు సమైక్యాంధ్రకు మద్దతుగా ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న రాజకీయ నాయకుల చిత్ర ఫొటోలకు పూల దండలు వేసి, విభజన ద్రోహులకు చెప్పుల దండలు వేసి నిరసన తెలిపారు.
నిరసనలతో అట్టుడికిన సీమాంధ్ర * సోనియా, దిగ్విజయ్ దిష్టి బొమ్మల దగ్ధం
english title:
bhaga bhagalu
Date:
Saturday, December 14, 2013