నాగార్జున యూనివర్సిటీ, డిసెంబర్ 13: రాబోయే కాలంలో అంతరిక్ష రంగంతోపాటు మిగిలిన అన్ని పరిశోధనా రంగాలలోను చైనాకు దీటుగా భారతదేశం నిలుస్తుందని రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు పద్మశ్రీ అవినాష్ చందర్ అన్నారు. గుంటూరుకు సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనటానికి వచ్చిన అవినాష్ చందర్ సదస్సు అనంతరం జరిగిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనారంగంలో చైనాకన్నా భారత్ మెరుగైన విధానాలను ఆవిష్కరిస్తోందని తెలిపారు. సైబర్ టెక్నాలజీ ద్వారా జరుగుతున్న దాడులను నివారించడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం తయారు చేయడానికి కృషి చేస్తున్నామని, సమాచారం రంగంలో నేవిగేషన్ ప్రక్రియ పాత్ర అపారమని తెలిపారు. కృష్ణాజిల్లాలోని నాగాయలంక వద్ద మిస్సైల్ లాంఛింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయని, అయితే దీనికి సంబంధించిన అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు. లాంఛింగ్ సెంటర్ ఏర్పాటు చేయటం వల్ల స్థానికంగా రవాణా, విద్యుత్, సమాచార రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని, దీనిపై ప్రజలలో తగిన అవగాహన కల్పించాల్సిన అవసరముందని తెలిపారు. దేశీయ ఆర్థికరంగంలో వచ్చిన మార్పులు రక్షణరంగంలోని పరిశోధనలపై పడిన మాట వాస్తవమేనని, కాని ప్రభుత్వం ఈ రంగానికి కావాల్సిన నిధులను మంజూరు చేయటం ద్వారా ఈ సమస్యను అధిగమిస్తామని తెలిపారు. డిఆర్‌డిఒ సంస్థ ఆధ్వర్యంలో వివిధ శాటిలైట్లకు అనుసంధానం చేయడానికి వీలుగా అతిచిన్న పరిణామంలో ఉండే మైక్రోసెన్సార్లను తయారు చేయడానికి విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ ఆర్‌సిఐ, డిఆర్‌డిఒ డైరెక్టర్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఈ దేశీయ అంతరిక్ష పరిశోధనారంగంలో విప్లవాత్మమైన ఆవిష్కరణల దిశగా పరిశోధనలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. అత్యంత తక్కువ ధరకు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే మైక్రోసెన్సార్లను తయారు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. రానున్న పది సంవత్సరాలలో భారత్ 9 నుండి 13 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపే సామర్థ్యాన్ని సముపార్జించుకుందని తెలిపారు. ఈ సమావేశంలో వర్సిటీ విసి ఆచార్య కె వియన్నారావు, రిజిస్ట్రార్ ఆర్‌ఆర్‌ఎల్ కాంతం, సదస్సు డైరెక్టర్ ఆచార్య పి సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) అంతర్జాతీయ సదస్సును ప్రారంభిస్తున్న రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు అవినాష్ చందర్
రాబోయే కాలంలో అంతరిక్ష రంగంతోపాటు మిగిలిన
english title:
india top
Date:
Saturday, December 14, 2013