తిరుపతి, డిసెంబర్ 13 : అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 27 మంది కూలీలను శుక్రవారం రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. వీర వద్ద నుండి 27 లక్షలు విలువచేసే 27 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చైతన్యపురం రాస్ కృషి విజ్ఞాన కేంద్రం వెనుకభాగాన ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. ఈ దాడుల్లో డీ ఎస్పీ బి.శ్రీనివాసులు, అర్బన్ ఇన్‌స్పెక్టర్ రామచంద్రారెడ్డి, ఎస్ ఐ విజయ్‌కుమార్, ఎ ఎస్ ఐలు శ్రీనివాసులు, సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
మంత్రాలయం మఠంలో పాముకరిచి బాలుడి మృతి
మంత్రాలయం, డిసెంబర్ 13: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠంలో శుక్రవారం పాముకాటుకు బాలుడు మృతి చెందాడు. మంత్రాలయానికి చెందిన అర్చన తన కుమారుడు గురుదత్త(4)తో కలిసి శుక్రవారం స్వామి దర్శనానికి వెళ్లింది. గర్భగుడి ద్వారం వద్ద కన్నంలో గురుదత్తకు పాము కనిపించింది. మమీ పాము అని బాలుడు చెప్పినా తల్లి పట్టించుకోలేదు. ఇంతలో బాలుడు పామును పట్టుకునేందుకు యత్నించగా అది కాటు వేసింది. గుడినుంచి బయటకు వచ్చిన అర్చన కుమారుడి కుడి చేతి నుండి రక్తం కారడం గమనించి తుడిచివేసింది. ఇంటికి వెళ్లగానే బాలుడు సృహతప్పి పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందాడు.
మావోల చేతిలో గిరిజనుడు హతం
సీలేరు, డిసెంబర్ 13: ఆంధ్రా - ఒడిషా సరిహద్దు ప్రాంతంలో ఒక గిరిజనుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా ఎంవి 79 పోలీస్ స్టేషన్ పరిధి బలిగూడ గ్రామానికి చెందిన ప్రభాకర్ మడకామి (65) అనే గిరిజనుడి ఇంటికి శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి సాయుధులైన నలుగురు మావోయిస్టులు వెళ్ళి అతడిని బయటకు తీసుకు వచ్చారు. అనంతరం ప్రజాకోర్టు నిర్వహించి, ప్రభాకర్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ తుపాకులతో కాల్చి చంపారు. ఇలాఉంటే మల్కన్‌గిరి జిల్లా కలిమెల నుంచి బలిమెల వరకు తిరిగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును మావోయిస్టులు దగ్ధం చేశారు.