తిరుపతి, డిసెంబర్ 13: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే సంపన్నులైన భక్తులకు వసతి, ఆర్జిత సేవా టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తూ భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్న శివయ్య అనే దళారీని గురువారం రాత్రి టిటిడి విజిలెన్స్ ఇన్స్‌పెక్టర్ గోవిందరెడ్డి పట్టుకున్నారు. 3వేల రూపాయలు విలువ చేసే ఆరు విఐపి టిక్కెట్లు, రెండు వేల రూపాయలు విలువ చేసే రెండు కల్యాణం టిక్కెట్లను 17 వేలకు విక్రయిస్తుండగా శివయ్యను విజిలెన్స్ సిబ్బంది వలవేసి పట్టుకున్నారు. ఈ టిక్కెట్లను ఒక టీవి ఛానెల్ ప్రతినిధి సిఫారసు ఉత్తరంపై దళారీ పొందినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కాగా శివయ్య వద్ద ఉన్న ఒక డైరీని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందులో తాను టిక్కెట్లు పొందడానికి సహకరించి ఉత్తరాలు ఇచ్చిన కొంత మంది ప్రజాప్రతినిధులు, పాలక మండలి సభ్యులు పిఏలు, టిటిడి ఉద్యోగులు, కొంత మంది మీడియా ప్రతినిధుల పేర్లు ఉండటాన్ని విజిలెన్స్ అధికార్లు గమనించారు. వీరికి ఎంతెంత సొమ్ము ముట్టజెప్పింది కూడా శివయ్య వివరంగా రాయడాన్ని చూసి విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు. ఈ డైరీలో టిటిడి ఉద్యోగులు, మీడియా ప్రతినిధుల పేర్లు ఉండటంతో పోలీసు కేసు పెట్టాలా? వద్దా? అన్న అంశంపై ఇఓ ఎంజి గోపాల్ అనుమతి కోరారు.
ఇఓ నుండి అనుమతి రావడంతో శివయ్యను టూటౌన్ పోలీసులకు అప్పగించారు. శివయ్యపై సెక్షన్ 420 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు. డైరీలో ఉన్న పేర్ల ప్రకారం ఎవర్ని విచారించాలో, ఎవర్ని కూడదో అన్న అంశంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. గదులు, ఆర్జిత సేవా టిక్కెట్లు, విఐపిల దర్శన సేవా టిక్కెట్లు, లడ్డూలు బ్లాక్ మార్కెట్‌కు అవకాశం లేకుండా టిటిడి అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దళారుల తెలివితేటల ముందు చిన్నబోతున్నాయి. టిటిడి అధికారులు ఒక రకమైన నిబంధన పెడితే అదే నిబంధనలను ఏజెంట్లు, దళారులు తమ ఆయుధాలుగా మలుచుకుంటున్నారు. తిరుమలలో వసతి దగ్గర నుండి సేవా టిక్కెట్లు, లడ్డూలు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కావాలనుకుంటే ప్రజాప్రతినిధులు, టిటిడి ఉద్యోగులు, పాలక మండలి సభ్యులు, మీడియా ప్రతినిధుల సిఫారసు ఉత్తరాలను టిటిడి స్వీకరిస్తూ వాటిని కూడా పరిశీలించి అనుమతులు ఇస్తుంది. ఈ అవకాశాన్ని కర్ణాటక అతిథి గృహంలో పనిచేసే శివయ్య తనకు అనుకూలంగా మలచుకున్నారు. గతంలో ఇలాంటి పనుల్లో అనుభవం పొంది ఎజెంటుగా వ్యవహరిస్తున్న ఓ ఆర్‌ఎంపి వైద్యుడ్ని శివయ్య ఆశ్రయించాడు. అతని సహకారంతో మీడియా సిఫారసు ఉత్తరాలతో పాటు ప్రజాప్రతినిధుల ఉత్తరాలతో టిటిడి అధికారుల నుండి అనుమతి పొంది సొమ్ము చేసుకునే వారు. ఈ నేపథ్యంలో ఎవరెవరి వద్ద ఎప్పుడెప్పుడు ఎన్ని టిక్కెట్లు పొందింది? వాటి వివరాలు, అందుకు ప్రతిఫలంగా వారికి అందజేసిన సొమ్మును సవివరంగా శివయ్య తన డైరీలో రాశాడు. ప్రస్తుతం ఆ డైరీ విజిలెన్స్ అధికారులు చేతుల్లో ఉంది. సర్వసాధారణంగా సిఫారసు ఉత్తరాలు పొందిన వారు తిరుమలలో గదులు, ప్రసాదాలు, కావాలనుకునే పైరవీకారులు తాము తెచ్చుకున్న ఉత్తరాలను రిసెప్షన్, జెఇఓ కార్యాలయాలకు ఇస్తారు. వాటిని జెఇఓ పరిశీలించి వారు అందించిన ఆధారాలు, పరిస్థితులను బట్టి అనుమతి ఇస్తారు. ఈ పరిస్థితిని శివయ్య తనకు అనుకూలంగా మలుచుకుని కల్యాణం, విఐపి టిక్కెట్లను పొంది సొమ్ము చేసుకుంటారు. ఇతనిపై అడిషినల్ సివిఎస్‌ఓ శివకుమార్‌రెడ్డికి అనుమానం కలగడంతో నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో శివయ్య వెనుక ఉన్న వారి గుట్టు రట్టు అవడంతో పాటు అనేక కీలక అంశాలు వెలుగు చూశాయి. గతంలో ఆర్జిత సేవా కుంభకోణాలపై టిటిడి సిబిసిఐడితో విచారణ జరిపిస్తున్న విషయం విదితమే. ఈ అంశంపై రానున్న ధర్మకర్తల మండలి సమావేశంలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సిఫారసులపై దర్శనం చేయించే విధానాన్ని పూర్తిగా రద్దు చేయడంతో పాటు సేవా టిక్కెట్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేసి, అందరికీ ఉచిత దర్శనం విధానాన్ని అమలు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. స్వామివారి దర్శనం ఏదైనా భక్తులకు ఉచితంగా కల్పించేందుకు టిటిడి యాజమాన్యం సంకల్పిస్తే పెద్ద పనికాదన్నది జగమెరిగిన సత్యం. అయితే ఆర్జిత సేవలు, విఐపి దర్శనాలు లేకుండా, సామాన్యుడికి, సంపన్నుడికి తేడా లేకుండా పోతే తమకు విలువ ఎక్కడుంటుందని, భక్తుల నమ్మకంతో, విశ్వాసాలను సొమ్ము, పరపతిని పెంచుకోవడానికి యమ తపన పడుతున్న అనేక మంది వాదన ఇది.
టిటిడి అధికార్లు, పాలక మండలి సభ్యులు, మీడియా సిఫార్సులు *తిరుమలలో విజిలెన్స్‌కు చిక్కిన చిట్టా
english title:
dalari arrest
Date:
Saturday, December 14, 2013