Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కలెక్టర్ పల్లె పిలుపు

$
0
0

కడప, డిసెంబర్ 16: ఈనెల 19వ తేది గురువారం నుంచి జిల్లాలో ప్రతి గురువారం పల్లెపిలుపు పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ శశిధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సభాభవన్‌లో కలెక్టర్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పెన్షన్లు, ఉపాధిహామీ, గృహాలు, బంగారుతల్లి, అమ్మహస్తం, అమృతహస్తం తదితర అనేక ప్రతిష్టాత్మక పథకాలు అమలుచేస్తోందన్నారు. ఈ అభివృద్ధి సంక్షేమపథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరు తెన్నులను తెలుసుకుని ఎక్కడైనా లోపాలుంటే వాటిని సరిదిద్దేందుకు పల్లె పిలుపు కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈకార్యక్రమాన్ని ఈనెల 19 నుంచి మొదలుకుని ప్రతి గురువారం సాయంత్రం 4గంటలకు గ్రామం చేరుకుని రాత్రి 8గంటల వరకు ప్రభుత్వ పథకాలపై అక్కడి గ్రామ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందన్నారు. తొలుత మారుమూల ఉన్న గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, చివరిగా మండల కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. ఈ పల్లెపిలుపు పర్యటన కార్యక్రమ వివరాలను 17వ తేది సాయంత్రంలోగా అందజేయాలన్నారు. ఈకార్యక్రమంలో గుర్తించిన లోపాలను నిర్ణీత నమూనాలో పొందుపరిచి శుక్రవారం లోగా సంబంధిత ప్రభుత్వశాఖకు మండల ప్రత్యేక అధికారులు పంపించాలన్నారు. దీనిపై జిల్లా అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో పాఠశాల, గ్రామ పంచాయతీ భవనాల వద్ద ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రాంతాల్లో ముఖ్యంగా ఈకార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రతి అంశంలోనూ సంబంధిత సర్పంచ్‌లను తప్పనిసరిగా భాగస్వాములు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో భాగంగా తాను ఏదోఒక గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించడం జరుగుతుందన్నారు. అలాగే ఉపాధిహామీ పథకం పనులు సక్రమంగా జరుగుతున్నాయా, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయా అని పరిశీలించాలన్నారు. విధులపట్ల అధికార యంత్రాంగం అలసత్వంప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పరీక్షల మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ చేతులమీదుగా సభాభవన్‌లో డిఇఓ కె.అంజయ్య పరీక్షల మెటీరియల్‌ను ఆవిష్కరించారు. వీటిని ఈనెలాఖరులోగా అన్ని పాఠశాలలకు పంపడం జరుగుతుందన్నారు. ఈసమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కె.నిర్మల, డిఆర్వో ఎన్.ఈశ్వరయ్య, జెడ్పి సిఇఓ మాల్యాద్రి, డిఆర్‌డిఏ, డ్వామా పిడిలు వెంకటసుబ్బయ్య, బాలసుబ్రమణ్యం తదితర జిల్లా అధికారులు , మండల అధికారులు పాల్గొన్నారు.

శేషాచలం అడవులపై ముప్పేట దాడి
కడప, డిసెంబర్ 16: శేషాచలం అటవీ ప్రాంతంపై కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పోలీసు, అటవీ, టాస్క్ఫోర్సు అధికారులు, సిబ్బంది సోమవారం ముప్పేటకు దిగారు. ఆదివారం సాయంత్రం శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఇరువురు అటవీశాఖ అధికారుల హత్య, మరికొంతమంది అధికారులపై దాడితో రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా స్పందించి గాలింపు చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ మూడుశాఖల ఉన్నతాధికారులు కడప జిల్లాకు చెందిన శేషాచలం అడవుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈనేపధ్యంలో జిల్లాకు చెందిన సుండుపల్లె, వీరబల్లి, రాజంపేట, చిట్వేలి, రైల్వేకోడూరు అటవీప్రాంతాల్లో గాలింపుచర్యలు చేపట్టగా దాదాపు 300 మంది ఎర్రచందనం నరికివేతకు వచ్చిన కూలీలను అదుపులోకి తీసుకుని వారందరినీ విచారణ నిమిత్తం తిరుపతికి తరలించారు. పలువురు స్మగ్లర్ల ఆచూకీకోసం పోలీసులు, అటవీశాఖ, టాస్క్ఫోర్సు అధికారులు, సిబ్బంది జల్లెడ పట్టారు. శేషాచలం అటవీప్రాంత పరిసర గ్రామాల్లో సివిల్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడి స్మగ్లింగ్‌కు స్వస్తిచెప్పిన వారిని పోలీసులు వెంట బెట్టుకుని అడవుల్లో వేటాడుతున్నారు. ఇప్పటివరకు పోలీసులకు పట్టుబడిన ఎర్రచందనం కూలీలంతా అధికసంఖ్యలో తమిళ రాష్ట్రానికి చెందిన వారేనని పోలీసులు నిర్దారించారు. మొత్తంమీద స్మగ్లర్లు, కూలీలవేటలో పోలీసు, అటవీశాఖ, టాస్క్ఫోర్సు అధికారులు, సిబ్బంది చర్యలు వేగవంతం చేయడంతో స్మగ్లర్లు, కూలీలు, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తెలిసింది.

150 మంది తమిళ కూలీల అరెస్ట్
రైల్వేకోడూరు, డిసెంబర్ 16:మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం తమిళనాడు రాష్ట్రానికి చెందిన 150 మంది తమిళులను టాస్క్ఫోర్స్ అధికారులు, పోలీసులు, అటవీ అధికారులు మూకుమ్మడిగా అరెస్ట్ చేసి వారిని తిరుపతికి తరలించారు. అందిన సమాచారంతో రైల్వేకోడూరు రైల్వేస్టేషన్‌లో 48 మంది, కడపజిల్లా సరిహద్దు ప్రాంతమైన కుక్కలదొడ్డి సమీపంలో 102 మంది తమిళ కూలీలను అరెస్టు చేశారు. రెండు రోజుల క్రిందట కడప - చిత్తూరు జిల్లాల సరిహద్దులోగల శేషాచలం అటవీ ప్రాంతంలో కొందరు తమిళ కూలీలు ఇద్దరు అటవీ శాఖాధికారులను హత్య చేయడమే కాకుండా పలువురి సిబ్బందిని గాయపరిచిన సంఘటనకు ప్రభుత్వం మేల్కొంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి నుండి శేషాచలం అటవీ ప్రాంతంలో తమిళ కూలీల కోసం భారీ ఎత్తున క్యూంబింగ్ నిర్వహించడంతో అటవీ ప్రాంతంలో ఉన్న తమిళ కూలీలు వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు అటవీ ప్రాంతం నుండి వస్తున్న తరుణంలో వారిని అధికారులు పట్టుకుని తిరుపతిలో విచారిస్తున్నారు.

మారనున్న ఎన్నికల సమీకరణలు
కడప, డిసెంబర్ 16: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి అనుకూలంగా వీస్తున్న అనుకూల పవనాలకు కొన్ని నియోజకవర్గాల్లోనైనా అడ్డుకట్టవేసేందుకు తెలుగుదేశం పార్టీలో పెద్దఎత్తున రాజకీయ సమీకరణలు మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు జిల్లా కంచుకోటగా ఉండగా గత 10 ఏళ్లుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలుగుదేశం కోటలు బీటలుబారాయి. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని స్థాపించిన అనంతరం కూడా తెలుగుదేశం నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. అయితే దశాబ్దకాలం నుంచి తెలుగుదేశం పార్టీకి అధికారం లేనందున తెలుగుతమ్ముళ్లు ఢీలాపడ్డారు. కొన్ని నియోజకవర్గాల్లో దేశం పార్టీకి కేడర్ ఉన్నా నాయకుల ఆదిపత్యపోరు, అనైక్యత, ఇతర నాయకులతో మ్యాచ్‌పిక్సింగ్‌లు, తమ పనులు చక్కదిద్దుకోవడానికి లోలోపల పలు రాజకీయ పార్టీలతో వ్యాపార లావాదేవీలు చేసుకుంటుండటంతో ఆ పార్టీ శ్రేణులు ఢీలాపడ్డారు. ఈ తరుణంలో ఆర్థికబలం, అంగబలం, విస్తారంగా పరిచాయలున్న కమలాపురం ఆ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ కమలాపురం నుంచి కాకుండా కడప నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కడప నియోజకవర్గంలో బలమైననాయకులు ఉన్నప్పటికీ మూడు ముక్కలాట ఆడుతున్నందున పుత్తానరసింహారెడ్డిని బరిలోకి దించితే అన్ని సర్దుకుపోతాయని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. అలాగే రాష్టమ్రాజీ మంత్రి డాక్టర్ ఎస్‌ఎ ఖలీల్‌బాషా పార్టీలో పునఃప్రవేశంతో ఒక వర్గం ఆయన్ను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఖలీల్‌బాషా అందరిని కలుపుకుని పోయేందుకు ప్రయత్నించినా ఎవరూ ముందుకురావడం లేదని కూడా తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్, అటు వైఎస్సార్ పార్టీ ఇరు పార్టీలు మైనార్టీ అభ్యర్థులనే ప్రకటించారు. టిడిపి నుంచి మైనార్టీలకు స్థానం కల్పించేందుకు జిల్లాలో కడప తర్వాత అత్యదిక ముస్లింలు కలిగివున్న రాయచోటిలో డాక్టర్ ఖలీల్‌బాషాను తెరపైకి తీసుకొచ్చేందుకు ఆపార్టీ నాయకులు యోచిస్తున్నట్లు తెలిసింది. ఖలీల్‌బాషా మాత్రం కడప కావాలని పట్టుబడుతున్నారు. ముఖ్యంగా కమలాపురం నుంచి గతంలో ఆపార్టీలో ఉన్న ప్రస్తుతం అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ను కమలాపురంలో దేశం తరపున బరిలోదింపి, పుత్తానరసింహారెడ్డిని కడపలో బరిలో దించనున్నట్లు తెలుస్తోంది. ఇక బద్వేలు నియోజకవర్గం విషయానికొస్తే వైఎస్సార్ పార్టీకి బలమైన గాలి వీస్తున్నప్పటికీ అక్కడ పదులు సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతుండటంతో హైకమాండ్‌కు అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. విద్యావంతురాలు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఆ నియోజకవర్గంలో ఇంచుమించు అన్ని మండలాల్లో మేనేజర్‌గా పనిచేసిన ఎన్‌డి జ్యోతి పేరును తెలుగుదేశం అధిష్టానం తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఆ నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. ఆమె సైతం జ్యోతిపేరునే ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. జ్యోతి కుటుంబ సభ్యులకు రాజకీయంగా తెరపైకి తీసుకొస్తున్నప్పటికీ విజయమ్మ నిర్ణయంపై ఆ కుటుంబ సభ్యులు చూపుపెట్టారు. దేశం హైకమాండ్‌తోపాటు జిల్లా నాయకులు సైతం జ్యోతితో పలువురు నేతలు సంప్రదించినా ఆమె నోరుమెదపకుండా విజయమ్మపై ఆమె రాజకీయ భవిష్యత్‌ను వేసినట్లు తెలిసింది. అధికార పార్టీలో ఆ నియోజకవర్గ కీలకనేత , రాష్ట్రంలో కేబినెట్ హోదాకల్గిన నేత ఆ శీస్సులు జ్యోతికి ఉన్నట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని అన్ని విధాలా ఢీ కొనేందుకు జ్యోతికే శక్తిసామర్థ్యాలున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పిఎం కమలమ్మ బరిలో దిగనున్న ఆ పార్టీకి నేతలు, కేడర్ కరువు కావడంతో ఈ నియోజకవర్గంలో వైఎస్సార్, టిడిపి పార్టీల మధ్యేపోటీ ఉంటుందని బాహాటంగా చెబుతున్నారు. ఇక టిడిపి అభ్యర్థిగా జ్యోతికాని పక్షంలో వైఎస్సార్ పార్టీ అభ్యర్థి ఎవరైనా గెలుపునకు ఢోకా ఉండదని రాజకీయ పరశీలకులు భావిస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో తెలుగుదేశం పార్టీలో రాజకీయ సమీకరణలు భారీ ఎత్తున మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయి.

తిరుపతి సంఘటన ఆటవికం
ప్రొద్దుటూరు, డిసెంబర్ 16 : చిత్తూరు జిల్లాలోని తిరుమల శేషాచలం అడవులలో అటవీశాఖ సిబ్బందిపై తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు జరిపిన దాడుల్లో ఇద్దరు అటవీశాఖ అధికారులు మరణించడంతో పాటు పలువురు గాయపడిన సంఘటన దురదృష్టకరమని ప్రొద్దుటూరు డి ఎఫ్ ఓ శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ప్రొద్దుటూరులోని డి ఎఫ్ ఓ కార్యాలయంలో తన సిబ్బందితో కలిసి ఆయన నల్లబ్యాడ్జిలను ధరించి విధులకు హాజరయ్యారు. మృతులకుసంతాపాన్ని ప్రకటిస్తూ రెండు నిమిషాల పాటు వౌనం పాటించారు. సిబ్బందిని ఉద్దేశించి డిఎఫ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో అటవీశాఖ సిబ్బంది, తమ విధులు నిర్వహించేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు వహించాలన్నారు. సమాచారం వచ్చిన వెంటనే సిబ్బంది వెనకా ముందూ చూడకుండా అడవులలోకి వేగంగా పరుగెత్తడం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. కలిసి అడవుల్లోకి వెళ్ళాక వేరువేరు అవుతున్నారన్నారు. శేషాచలం అడవుల్లో డిఆర్‌ఓ, ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్నారి వారిని విడిపించడానికి మూకుమ్మడిగా దాడి చేసి విచక్షణా రహితంగా నరికిచంపారన్నారు. ముఖ్యంగా సిబ్బందికి ఆయుధాలు లేకపోవడం కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇటీవలే సిబ్బందికి కొత్త ఆయుధాలను సమకూర్చడంతో పాటు కొత్త సిబ్బందిని రిక్రూట్ చేస్తున్నారన్నారు. చాలామంది అటవీశాఖ సిబ్బంది ప్రాణభయంతో సెలవుపై వెళుతున్నారని, అందువల్ల బీటుకు ఒకరు అర నిలబడుతున్నారన్నారు. ఖచ్చితంగా వీటిపై ఉక్కుపాదం మోపి స్మగ్లర్ల ఆటకట్టిస్తామన్నారు. ఈకార్యక్రమంలో రెంజర్స్ ఎం ఎ ఖాన్, జెడెన్‌జా, స్వామి వివేకానంద, ఎఫ్‌బి ఓ హరినాథరాజు, డి ఆర్ ఓ సుధాకర్, సూపరిండెంట్ ఓ విప్రమీల, ఆరీఫ్, లక్ష్మినర్సమ్మ, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కడపలో...
కడప: విధి నిర్వహణలో అమరులైన అటవీశాఖ అధికారులు డిఆర్వో ఎన్‌ఆర్ శ్రీ్ధర్, అసిస్టెంట్ బీట్ అధికారి డేవిడ్ కరుణాకర్‌లకు జిల్లా అధికారుల సంఘం ఘనంగా నివాళులర్పించింది. అటవీశాఖ అధికారులకు సంఘీభావాన్ని ప్రకటించింది. విధి నిర్వహణలో అటవీశాఖాధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని మద్దతు పలికారు. సోమవారం నగరంలోని అటవీ అతిధిగృహం ఆవరణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా అధికారుల సంఘం, అటవీశాఖాధికారులు పాల్గొని అమరులైన అధికారులకు నివాళులర్పించారు. ఈసందర్భంగా జిల్లా అధికారుల సంఘం తరపున స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ అడవులు మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమని, అలాంటి ముఖ్యవనరులు సంరక్షించే అటవీశాఖాధికారుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్రచందనం డిమాండ్‌ను తగ్గించాలని ప్రభుత్వాధీనం డిపోల్లో మూలుగుతున్న ఎర్రచందనాన్ని మార్కెట్‌కు తరలించేలా ప్రభుత్వ పాలసీలను మార్చాలన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలను తప్పనిసరిగా కాపాడాలన్నారు. కడప డిఎఫ్‌ఓ నాగరాజు మాట్లాడుతూ మొన్నటి సంఘటనతో మనోధైర్యం కోల్పోయిన శాఖకు జిల్లా అధికారుల సంఘం సంఘీభావం ప్రకటించి మనోబలాన్ని పెంచారన్నారు. ప్రొద్దుటూరు డిఎఫ్ శిశశంకర్‌రెడ్డి మాట్లాడుతూ అటవీశాఖ సిబ్బందిమీద దాడులు పెరిగాయని సిబ్బందిని పెంచడమేగాకుండా తుపాకులు ఇవ్వాలన్నారు. అమరులైన వారి కుటుంబ సభ్యులకు ప్రొద్దుటూరు డివిజన్ సిబ్బంది ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి ప్రతిభాభారతి, డిఎంహెచ్‌ఓ ప్రభుదాస్, సబ్ డిఎఫ్‌ఓ, లీగల్ అడ్వైజర్ జయరాం పాల్గొన్నారు.

టి.బిల్లును వ్యతిరేకించాలి
రాయచోటి, డిసెంబర్ 16: రాష్ట్రానికి వచ్చిన టి-బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానించాలని బార్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక కోర్టు ఆవరణంలో న్యాయవాదులు చేపట్టిన సమైక్య రిలే దీక్షలు సోమవారానికి 138వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే సీమ ప్రాంతవాసులు తీవ్రంగా నష్టపోతారని, సీమప్రాంతం ఎడారికావడంతో పాటు ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కోల్పోయి, నిరుద్యోగులుగా మిగిలిపోతారన్నారు. సమైక్యత కోసం సీమాంద్రకు చెందిన మంత్రులు వెంటనే పదవులను వీడి వత్తిడి తేవాలన్నారు. గత 138 రోజులుగా సీమాంధ్రలోని 13 జిల్లాల ప్రజలు ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువత, మహిళా, ఉధ్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు అలు పేరగక సమైక్య పోరు సాగిస్తున్నప్పటికీ ప్రజా ప్రథినిధులు మాత్రం పదవులను పట్టుకుని గబ్బిలాళ్లా వేలాడుతుండడం వల్లే కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు శ్రీ కారం చేట్టిందన్నారు. తెలుగుజాతిని ముక్కలయ్యేలా సహకరించిన రాజకీయ పార్టీలకు, నాయకులకు భవిష్యత్తులో తెలుగు ప్రజలు తగిన గుణపాటం చేప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. నేటి దీక్షలో శ్రీనివాసులు, రవికుమార్, నాగేశ్వరరావు, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగుజాతిని చీల్చేకుట్ర
కడప, డిసెంబర్ 16: ఓట్లు, సీట్లతో రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు కాంగ్రెస్ తెలుగుజాతిని నిలువునా చీల్చేందుకు కుట్ర పన్నిందని సమైక్యాంధ్ర యాక్షన్ కౌన్సిల్ చైర్మన్ డా.జయానంద తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రలోని కాంగ్రెస్ పెద్దలు విభజనకు అడుగులు ముందుకువేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆయన దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికుట్రలు పన్నినా రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యేది కల మాత్రమే అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సీమాంధ్ర ఎంపిలు, ఎమ్మెల్యేలు ముందుకురాక పోవడం విచారకరమన్నారు. సీమాంధ్ర ఎంపిలు కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులు వత్తకుండా ఆత్మపరిశోధన చేసుకుని తెలుగుజాతికున్న పేరును నిలబెట్టాలంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనతో అన్ని ప్రాంతాలు 20 ఏళ్ల ప్రగతిని కోల్పోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈనెల 19వ తేది గురువారం నుంచి జిల్లాలో ప్రతి గురువారం
english title: 
collector palle

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>