Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

టి.బిల్లు ప్రతులు దగ్ధం

$
0
0

కర్నూలు , డిసెంబర్ 16 : శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈమేరకు ఎన్జీవో నాయకుడు వెంగళరెడ్డి, సమైక్య ఐకాస నాయకుడు సోమశేఖర్ తదితరుల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కావాలని ఐదు కోట్ల మంది, నెలల తరబడి ఉద్యమం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దొడ్డి దారిన ప్రయత్నించడం శోచనీయమన్నారు. శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టిన రోజును చీకటి రోజుగా అభివర్ణించారు. సభలో ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ్యులు సైతం చర్చించకుండా రాష్టప్రతికి తిప్పి పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల డిమాండ్ మేరకు రాష్ట్ర సమైక్యతను కాపాడేందుకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ముసాయిదా బిల్లు ప్రతులతోపాటు విభజనకు కారణమైన కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టారు. రహదారిపై రాకపోకలను సమైక్యవాదులు అడ్డుకోవడంతో పోలీసులు అరెస్టు చేశారు.

రాజధానిని తెస్తారా...
రాజకీయంగా చస్తారా?
* ఆర్పీఎస్ వ్యవస్థాపకులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
కల్లూరు, డిసెంబర్ 16 : విభజన అనివార్యమైన నేపథ్యంలో రాయలసీమకు రాజధానిని తెస్తారా?, లేక ప్రత్యేక రాష్ట్రం చేస్తారా?, ఈ రెండిటిలో ఎ ఒక్కటి జరక్కపోయినా సీమాంధ్ర నాయకులు రాజకీయంగా చనిపోయి చరిత్రలో మిగిలిపోతారని ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. రాయలసీమ రాష్ట్ర సాధనకై శనివారం నగరంలోని శ్రీ కృష్ణదేవరాయ విగ్రహం వద్ద నిర్వహించిన రాయలసీమ రణభేరిలో ఆయన మాట్లాడుతూ ఈ పోరాటం ఇప్పటితో ఆగదని, పాలకులకు ప్రజలతోనే గుణపాఠం చెప్పిస్తారని హెచ్చరించారు. అసెంబ్లీలో బిల్లు రాదని అన్నారు.. వచ్చింది.. పార్లమెంటులో వెల్లదని అంటున్నారు... అదికూడా వందశాతం జరుగుతుందన్నారు. ఈ సమయంలో ఇంతకాలం విభజనను ఆపుతామని మభ్యపెట్టిన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో రాయలసీమ ఆత్మగౌరవాన్ని కుదవపెట్టిన నాయకులు, రాయలసీమకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక్కసారైనా ప్రస్తావించారా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలు కలిసి పోరాడితేనే సీమకు న్యాయం చేసుకున్న వారవౌతామని లేకుంటే, భవిష్యత్ తరాలు మనలను క్షమించరని ఆవేదన వ్యక్తం చేశారు. రతనాల సీమను రాళ్ల సీమగా మార్చిన సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర నుండి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన 16 మంది ముఖ్యమంత్రులు రాజధాని హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారే కానీ వారికి రాజకీయ భిక్ష పెట్టిన సీమాంధ్రకు అన్యాయం చేశారన్నారు. విభజన అనివార్యమైతే సీమకు న్యాయం చేయాలని గత కొంత కాలంగా ఎంతో పోరాటం చేసినా కేంద్రం స్పందించలేదంటే సీమ ప్రజలంటే ఎంత శ్రద్ధ ఉందో ఒకసారి ప్రజలు ఆలోచించాలన్నారు. ఇంత వరకు జరిగిన పోరాటం ఒకఎతైతే ఇక నుంచి మరోలా ఉంటుందని హెచ్చరికలు పంపారు. 68వేల కోట్ల రూపాయల ఆదాయంతో అభివృద్ధి చెందిన హైదారాబాద్ అందరికీ దూరవౌతుందంటే, ఇందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులే కారణమన్నారు. శ్రీబాగ్ ఒప్పందం కారణంగా సీమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. సీమకు చెందిన ప్రజలు ఇప్పటికైనా మేలుకోకపోతే సీమనే కోల్పోవాల్సి వస్తుందన్నారు. అసలు ఆట ఇప్పుడే మొదలైందని తాడోపేడో తెల్చుకుంటామన్నారు. కేంద్రానికి అమ్ముడుబోయిన ఒకపార్టీ అయితే మరో నాయకుడు మోడీని ఆశ్రయించి రాజకీయ లబ్ధి కోసం ఆరులు చాచుతున్నారని, ఇలాంటి వారా రాష్ట్రాన్ని కాపాడేది? అని ప్రశ్నించారు. సీమ పౌరుషన్ని రుచి చూపాల్సిన సమయం అసన్నమైందన్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు సీమ అంటే ఎంటో చూపిస్తామని హెచ్చరించారు.

క్రిమిసంహారక మందుతాగిన కుటుంబం
భార్యాభర్తల మృతి
* చికిత్స పొందున్న ఇద్దరు కూతుళ్లు
పాములపాడు, డిసెంబర్ 16 : వేధింపుల నేపధ్యంలో ఓ కుటుంబం క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భార్యాభర్తలు శెట్టి శేఖరయ్య(42), కోటమ్మ (35) మృతి చెందగా కూతుళ్లు విజయకుమారి(14), బిందుప్రియ(12) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామంలో ఈ సంఘటన సోమవారం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం గ్రామానికి చెందిన శేఖరయ్యకు ఎదుటి ఇంటివారితో గొడవ జరిగింది. వారు కొడతారన్న భయంతో సోమవారం ఉదయం ఇంటిల్లిపాదీ పురుగుల క్రిమిసంహారకమందు తాగారు. భార్యాభర్తలు ఇంట్లోనే ప్రాణాలు విడిచారు. కూతుళ్లిద్దరూ అపస్మారకస్థితికి చేరుకున్నారు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చనిపోవడానికి ముందు శేఖరయ్య ఓ ఉత్తరం రాశాడు. తమ ఇంటి ఎదురుగా ఉండే ఈశ్వర్‌రెడ్డి, రాము, సాంబయ్య తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, వాటిని భరించలేకే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నట్లు ఆత్మకూరు సిఐ ఇస్మాయిల్ తెలిపారు. ఈలేఖతో పాటు మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు.

శ్రీశైలంలో నూతన ఆర్జిత సేవ
కర్నూలు, డిసెంబర్ 16 : శ్రీశైల దేవస్థానంలో నూతనంగా సహస్ర నామార్చన సేవను ప్రవేశపెట్టారు. సోమవారం ఉదయం నుంచి ఈ సేవ ప్రారంభమైంది. ప్రతి రోజూ ప్రాతఃకాల పూజా సమయంలో శ్రీశైల దేవస్థాన ప్రత్యేక సేవగా స్వామి వారికి శివ సహస్ర నామాలతో అమ్మవారికి లలిత సహస్ర నామాలతో అర్చనను నిర్వహిస్తారు. ఈ సేవలో భక్తులకు ఆర్జిత సేవగా జరిపిస్తామని ఈ సేవలు ఉభయ దేవాలయాల్లో ఉదయం మహా మంగళ హారతి అనంతరం ఈ ఆర్జిత సేవను నిర్వహిస్తారు. ఈ సేవలో పాల్గొనాలకునే భక్తులు రూ.500 చెల్లించాల్సి ఉంటుందని ఆలయ ఇవో చంద్రశేఖర ఆజాద్ తెలిపారు. ఈ సేవకు దంపతులు, లేకుంటే ఒక్కొరినైనా అనుమతిస్తామన్నారు. అలాగే అమ్మవారి ఆలయంలో ప్రాకార మండపం వద్ద లలితా సహస్ర నామాలతో భక్తులకు కుంకుమ పూజ జరిపిస్తామన్నారు. ఈ సేవకు కూడా భక్తులు రూ.500 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇకపోతే ముక్కంటి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈనెల 18వ తేదీ రాత్రి స్వామి వారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహిస్తున్నట్లు ఇఒ చంద్ర శేఖర ఆజాద్ తెలిపారు. క్షేత్రంలో ప్రతినెలలో ఆరుద్రోత్సవాన్ని మాసోత్సవంగా నిర్వహిస్తుండగా ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవాన్ని దేవస్థానం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ రోజున ఉత్సవాన్ని పురస్కరించుకుని మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం నిర్వహిస్తామని మరునాడు 19వ తేదీ తెల్లవారుజామున స్వామి వారి ప్రాతఃకాల పూజ అనంతరం ఉత్తర ద్వార దర్శనం, నంది వాహన సేవ, గ్రామోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవం నిర్వఘ్నంగా జరుగాలని 18న గణపతి పూజ ఏర్పాటు చేశామన్నారు.
విద్యుత్ పొదుపు చేయాలి
* కరెంటు ఆదాపై ప్రభుత్వ ప్రచారం
* రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సిఇఓ చంద్రశేఖర్‌రెడ్డి
కర్నూలు, డిసెంబర్ 16 : విద్యుత్ కొరతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కరెంటు పొదుపుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి విద్యుత్ పొదుపుపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలను ప్రారంభించింది. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సిఇఓ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిఏటా రాష్ట్రం విద్యుత్ సమస్య ఎదుర్కొంటోందన్నారు. తద్వారా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన చెందుతున్నారన్నారు. విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో భారీ తేడా ఉండటంతో కోతలు అనివార్యమైన పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలో విద్యుత్ తలసరి వినియోగం ప్రతిఏటా 560 యూనిట్ల నుంచి 1050 యూనిట్లకు పెరిగిందన్నారు. రాష్ట్రంలో రోజువారీ 178మిలియన్ యూనిట్ల నుంచి 12,500యూనిట్లకు పెరిగిందన్నారు. ఇక విద్యుత్ ఉత్పత్తి 10 సంవత్సరాల కిందట 10,695 మెగావాట్లు ఉంటే ఇపుడు 16,613 మెగావాట్లు ఉందని వివరించారు. అలాగే రాష్ట్రంలో వినియోగదారుల సంఖ్య నాడు 1.57కోట్లు ఉండగా ఇప్పుడు 2.50కోట్లకు పెరిగిందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో కూడా 41శాతం పెరుగుదల కనిపించిందన్నారు. వాస్తవానికి విద్యుత్ వినియోగం పెరగడం అంటే రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థికాభివృద్ధికి సూచికలని అన్నారు. గత పదేళ్లలో విద్యుత్ ఉత్పత్తి 55 శాతం మాత్రం పెరుగ్గా వినియోగం 68 శాతం పెరిగినట్లు తేలిందన్నారు. పెరిగిన వినియోగం మేరకు సరఫరా చేసేందుకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఈ సమస్యలు తీరాలంటే విద్యుత్ పొదుపు తప్పనిసరి అని గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు విద్యుత్ పొదుపును పాటిస్తే ఏటా 15వేల యూనిట్ల మేర పొదుపు చేయవచ్చని లెక్కలు తేలినట్లు వివరించారు. ఇలా చేయడం ద్వారా వినియోగదారులు చెల్లించే బిల్లు కూడా తగ్గుతుందన్నారు. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ విద్యుత్‌తో పాటు ప్రభుత్వం వినియోగించే విద్యుత్ కూడా పొదుపు చేయడానికి వీలైన మార్గాలను కన్జర్వేషన్ కమిటీ చూపిస్తుందని తెలిపారు. ప్రజలు విద్యుత్ పొదుపుపై దృష్టి సారించేలా చైతన్యం తీసుకురావడంతో పాటు పొదుపు ఎలా చేయవచ్చనే అంశంపై వారికి అవగాహన కల్పించడానికి జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాధారణ బల్బుల స్థానంలో లెడ్ బల్పులు వాడటం, అత్యధిక స్టార్ రేటింగ్‌లు ఉన్న పరికరాలను వినియోగించడం, అవసరం లేని సమయంలో గుర్తు పెట్టుకుని విద్యుత్ పరికాలను ఆఫ్ చేయడం వంటివే కాకుండా సంప్రదాయేతర విద్యుత్ వినియోగాన్ని కూడా పెంచుకునే విధంగా ప్రజలకు వివరిస్తామన్నారు. అలాగే సోలార్ పరికరాల కొనుగోలులో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపై వివరించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కూడా వారు వినియోగించే విద్యుత్ పరికరాలు విద్యుత్‌ను తక్కువగా వినియోగించే పరికరాలను కొనుగోలు చేసే విధంగా వారిని ఒప్పించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ పరంగా ఇప్పటికే పలు కార్యాలయాలకు సౌర విద్యుత్ ఏర్పాటు చేయడంతో పాటు వీధి లైట్ల వినియోగంలో కూడా అనేక జాగ్రత్తలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరించాలి
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
కర్నూలు, డిసెంబర్ 16 : ప్రజాదర్భార్‌లో వచ్చిన వినతులను సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వరకు 31599 వినతులు వచ్చాయని, అందులో 28310 వినతులు పరిష్కరించినట్లు తెలిపారు. డోన్ మండలం కొండపేట గ్రామానికి చెందిన ఎఇ విజయలక్ష్మి పశుక్రాంతి పథకం కింద బురణం మంజూరు చేయాలని, కర్నూలు గడ్డ వీధికి చెందిన రేష్కామ ఇంటి స్థలం మంజూరు చేయాలని, కల్లూరు మండలం శరీన్‌నగర్‌కు చెందిన విజయభాస్కర్, పాస్టర్ ఆది సంభూతుడు చర్చికి స్థలం మంజూరు వినతిపత్రాలు అందజేశారు.
సబ్సిడీపై వరికోత యంత్రం
అనంతరం వ్యవసాయ యాంత్రీకరణ 2013-14 పథకం కింద రూ.18.92 లక్షలు విలువజేసే వరికోత యంత్రాన్ని సబ్సిడీతో సి.బెళగల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన గోకారయ్య రైతుమిత్ర గ్రూపు లబ్ధిదారులకు కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అందజేశారు. అలాగే వరికోత యంత్రాలు జిల్లాకు 14 వచ్చాయని, నియోజక వర్గానికి ఒకటి చొప్పున పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెసి కన్నాబాబు, డిఆర్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, వ్యవసాయశాఖ జెడి ఠాగూర్‌నాయక్, హౌసింగ్ పిడి రామసుబ్బు తదితరులు పాల్గొన్నారు.
విశ్వమంతా గణిత శాస్త్రంలోనే..
* శ్రీనివాస రామానుజన్ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ టాలెంట్ (చెన్నై) డైరెక్టర్ శ్రీనివాసరావు
కర్నూలు ఓల్డ్‌సిటీ, డిసెంబర్ 16 : విశ్వమంతా గణిత శాస్త్ర ఆధీనంలోనే ఉందని శ్రీనివాస రామానుజన్ అకాడమి ఆఫ్ మ్యాథమెటిక్స్ టాలెంట్ (చెన్నై) డైరెక్టర్ ఆచార్య శ్రీనివాసరావు అన్నారు. సోమవారం స్థానిక సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ గణిత మేథావి శ్రీనివాస రామానుజన్ జీవితం పరిశోధనలపై జిల్లాస్థాయి వర్క్‌షాపు జరిగింది. ఈవర్క్‌షాపునకు ముఖ్య అతిథిగా విచేసిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచం అంతా గణితశాస్త్రంపైనే ఆధారపడి ఉందన్నారు. చాలామంది గణితం విషయమని అనుకుంటారని కానీ సానుకూలంగా పరిశీలిస్తే గణితం సులభమైన, అతిముఖ్యమైన అంశమని గ్రహిస్తామన్నారు. సీనీయర్ కళాశాల చదువు కూడా పూర్తి చేయని శ్రీనివాస రామానుజన్ లాంటి భారతీయ గణిత మేథావులు ప్రపంచానికి అనేక గణిత సిద్ధాంతలను అందించారన్నారు. యూనిక్ గస్, జాకోమీ లాంటి పాశ్చాత్య గణిత శాస్తవ్రేత్తలతో పోల్చదగిన రామానుజన్ తాను విద్యార్థిగా ఉన్నప్పుడే మూడు నోటు పుస్తకాల్లో ప్రపంచం ఆశ్చర్యపోయే సిద్దాంతాలను రాసుకున్నారన్నారు. జిఎస్ కార్ రాసిన ప్యూర్ మ్యాథమేటిక్స్ అనే పుస్తకం రామానుజంను ఆత్యంత ప్రభావితం చేసిన గ్రంథమన్నారు. ‘ఎన్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ వన్’ అనే సూత్రం మ్యాజిక్ స్క్వేర్ బాక్స్ రామానుజం కనుగొన్న విలువైన సూత్రాలన్నారు. విశ్వవిద్యాలయాలు, ఆధ్యాపకులు రాబోయే తరాల విద్యార్థులకు రామానుజన్ వర్క్స్‌పై అవగాహన కల్పించి గణిత శాస్త్రంపై మక్కువ కలిగించాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ గణిత శాస్త్రం హిమాలయాలంత పాతదని దేవుడే మొదటి గణిత శాస్తవ్రేత్త అని అన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతిదీ లెక్క ప్రకారం జరుగుతుందన్నారు. ఆర్‌యూ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య ఆనందరాజ ఆచారి మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గణిత విజ్ఞానాన్ని విశ్వ వ్యాప్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ యూనివర్శిటీ గణిత విభాగ ఆచార్యులు భాస్కర్‌రెడ్డి, గణిత అష్టవదాని నాగెల్ల ఎలియ, వర్క్‌షాపు సమన్వయకర్త, గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టరు దేవికారాణి, వృక్షశాస్త్రం విభాగాధిపతి జాన్సన్ సాట్యురస్, నాక్ సమన్వయకర్త రంగనాథ, కళాశాల సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త శ్రీ్ధర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

స్వార్థంతోనే రాష్ట్ర విభజన
* సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్
కల్లూరు, డిసెంబర్ 16 : కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వార్థానికే రాష్ట్ర విభజనకు పూనుకుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్ విమర్శించారు. సోమవారం స్థానిక కెకె భవన్ లో సిపిఎం జిల్లా స్థాయి రాజకీయ శి క్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో ఏర్పాటు చేసిన మొదటి భాషా ప్ర యుక్త రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం అంటే మిగిలిన రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగా చీల్చేందుకు కుట్ర లు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రాల విభజన వల్ల దేశ సమగ్రత, సమైఖ్యతలకే ప్రమాదం వస్తుందన్నారు. అంతేగాకుండా కేంద్రం ఆధిపత్యం మరింత పెరికి రాజ్యాంగంలో పేర్కొన్న సమా ఖ్య స్ఫూర్తికి విఘాతం వాటిల్లుతోందన్నారు. మొదటి నుండి సిపిఎం భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానానికే కట్టుబడి ఉందని, అవకాశ వాద రాజకీయాలకు అతీతంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడం వల్ల వేర్పుటువాదం డిమాండ్లు ముం దుకు వచ్చాయన్న వాస్తవాన్ని ప్రతి ఒ క్కరూ గమనించాలన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో సిపిఎం క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న నిత్య జీవిత సమస్యల పై పదునైన ఉద్యమాలకు సన్నద్ధం కావాలనే ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్, రాష్ట్ర నాయకులు మిరియం వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు సాగర్, వెంకటేశ్వర్లు పాఠ్యాంశాలను బోధిస్తారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, రామాంజినేయులు, రమేష్ కుమార్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆధునిక వ్యవసాయం రైతులకు మేలు
* నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానం ఎడిఆర్ పద్మ
నంద్యాల, డిసెంబర్ 16: ఆధునిక వ్యవసాయ పద్ధతులు రైతులకు ఎంతో మేలు జరుగుతాయని, వ్యవసాయ శాస్తవ్రేత్తల పరిశోధనల ఫలితాలు రైతులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానం ఎడిఆర్ డా.వై.పద్మలత అన్నారు. సోమవారం స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం డా.వైఎస్‌ఆర్ సెయింటనరీ హాల్‌లో బొజ్జా వెంకటరెడ్డి అగ్రికల్చరల్ పౌండేషన్ 11వ వార్షికోత్సవం ట్రస్ట్ చైర్మన్ బొజ్జా ధశరథరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅథితిగా పాల్గొన్న ఆర్‌ఎఆర్‌ఎస్ ఎడిఆర్ డా.వై.పద్మలత మాట్లాడుతూ నంద్యాల ఎమ్మెల్యేగా, ఎంపిగా, భారతజాతీయ విత్తనాభివృద్ది సంస్థకు చైర్మన్‌గా బొజ్జా వెంకటరెడ్డి పనిచేసి వ్యవసాయ అభివృద్ధికి, ఆధునిక వ్యవసాయ విధానం కోసం ఎంతో కృషి చేశారన్నారు. బొజ్జా వెంకటరెడ్డి అగ్రికల్చరల్ పౌండేషన్ ద్వారా ఆధునిక వ్యవసాయ విధానాన్ని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు ఎలా రైతులు సాధించాలి అన్న విధానంపై అవగాహన కల్పిస్తూ, యువతను వ్యవసాయంపై ఆకర్షించేలా ఎన్నో పథకాలు చేస్తున్న పౌండేషన్ చైర్మన్ బొజ్జా దశరథరామిరెడ్డిని ఆమె అభినందించారు. నేషనల్ విద్యాసంస్థల అధినేత డా.ఎస్.ఇంతియాజ్ అహమ్మద్, మహానంది వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.బి.రవీంద్రనాథరెడ్డి, రైతుశిక్షణా కేంద్రం డిడిఎ డా.గోవిందరావు, సీనియర్ వ్యవసాయ శాస్తవ్రేత్త డా.కె.రవీంద్రనాథ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లగిశెట్టి సుబ్బగురుమూర్తి, భారతీయ కిసాన్‌సంఘ్ రాష్ట్ర నాయకులు ఏర్వ రామచంద్రారెడ్డి తదితరులు మాట్లాడారు. బొజ్జా వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అగ్రికల్చరల్ పౌండేషన్ 11వ వార్షికోత్సవ సావనీర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, శాస్తవ్రేత్తలు, పౌండేషన్ సభ్యులు, నందిరైతుసమాఖ్య నాయకులు పాల్గొన్నారు.

పెద్దకడబూరులో ప్రజాదర్బార్ ముట్టడి
పెద్దకడబూరు, డిసెంబర్ 16: స్థానిక బిసి హాస్టల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించాలని సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రజాదర్బార్‌ను ముట్టడించారు. గ్రామ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాదర్బార్‌లో స్పెషల్ అధికారి లక్ష్మ, ఎంపిడిఓ వరలక్ష్మితో విద్యార్థులు వాగ్వివాదానికి దిగారు. ఈసందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రామన్న, డివిజన్ నాయకులు చిన్న, రాజేష్, ప్రజాదర్బార్‌ను అడ్డుకొని విద్యార్థుల దాహార్థిపై అధికారులను నిలదీశారు. ఏళ్లు గడుస్తున్నా బిసిహాస్టల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు రక్షిత మంచినీటికి నోచుకోవడం లేదని అన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులు తాగునీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మంచినీటి వసతి లేకపోవడంతో మధ్యాహ్న భోజనం తినడమే మానుకుంటున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బిసిహాస్టల్ విద్యార్థులు తాగునీటి కోసం దగ్గరలో ఉన్న ఎస్‌ఎస్ ట్యాంకు వద్దకు వెళ్తున్నారని, ప్రమాదాలు జరిగితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బోజప్ప, రాజు, నాగరాజు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

క్రీడాకారులకు 50 శాతం ఫీజు రాయితీ
నంద్యాల అర్బన్, డిసెంబర్ 16: పట్టణంలోని నేషనల్ జూనియర్, డిగ్రీ, పిజి కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు క్రీడా రంగంలో రాణించిన వారికి కోర్సు ఫీజుల్లో 50శాతం రాయితీ కల్పిస్తున్నట్లు నేషనల్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్. ఇంతియాజ్ అహమ్మద్ ప్రకటించారు. సోమవారం నేషనల్ జూనియర్ కళాశాల క్రికెట్ టీం గడ్డం పెద్ద ఈశ్వర్‌రెడ్డి టోర్నమెంట్‌ను గెలిచి ఛాంపియన్‌గా నిలిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ కళాశాల స్థాయిలోనంద్యాల ప్రాంతంలో క్రీడాకారులకు నేషనల్ విద్యాసంస్థలు చిరునామాగా మారిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. జూనియర్ కళాశాల స్థాయిలో నంద్యాల పట్టణంలో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2004 సంవత్సరం నుంచి 2013వరకు పదిసార్లు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో తమ కళాశాల జట్టు ఆరుసార్లు విజయం సాధించి రికార్డు సృష్టించిందన్నారు. క్రికెట్‌లోనే కాక ఖోఖో, హాకీ, కబడ్డీ, తదితర క్రీడా పోటీలలో ప్రతిభ చాటి జిల్లాస్థాయి, రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులందరికీ వారు చదువుతున్న కోర్సులలో 50శాతం ఫీజు రాయితీ కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే తమ కళాశాలలో ఉన్నత విద్యనభ్యసించిన వారికి కూడా ఈరాయితీ వర్తిస్తుందన్నారు. తమ కళాశాలలకు చెందిన విద్యార్థులు వివిధ క్రీడాపోటీలలో అంతర్ విశ్వవిద్యాలయ స్థాయిలో పోటీ పడేందుకు ఎంపిక అయ్యారని తెలిపారు. అనంతరం క్రీడాకారులను అభినందించారు. ఈ అభినందనలో కళాశాల ఎఓ రఫీ అహమ్మద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్, అధ్యాపకులు నజీరుద్దీన్, కరీముల్లా, రఘునాథరెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ పిఓ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

కౌలు రైతు ఆత్మహత్య
నందికొట్కూరు, డిసెంబర్ 16 : నందికొట్కూరు పోలీసు డివిజన్ పరిధిలోని మిడుతూరు మండలం పైపాలెం గ్రామానికి చెందిన పులిగొండ తిరుపాలు (46) అనే కౌలురైతు నందికొట్కూరు- మిడుతూరు రహదారిలోని బావిలో సోమవారం దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పైపాలెంలో నివాసం ఉంటున్న తిరుపాలు బావి సమీపంలో 14 ఎకరాల పొలాన్ని రూ.2లక్షలకు కౌలుకు తీసుకుని మిరపపంట సాగు చేశాడు. భారీ వర్షాల వల్ల పంట దిగుబడి రాకపోవడం, పంట పెట్టుబడికి చేసిన అప్పులు పెరిగిపోవడంతో అప్పులు తీర్చలేనని మనస్థాపానికి గురై ఆదివారం పొలానికి వెళ్లి సమీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు. తిరుపాలుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు బంధువులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు మిడుతూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ ఆత్మహత్య
ఆదోనిటౌన్, డిసెంబర్ 16: ఆస్పరి మండలంలోని జోహారాపురం గ్రామానికి చెందిన అరుణకుమారి (25) కడుపు నొప్పి తాళలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్యాకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేదని నొప్పి తీవ్రం కావడంతో సోమవారం ఇంట్లోనే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాకు పాల్పడినట్లు కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అగ్ని ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు
ఆస్పరి మండలంలోని ములుగుందంకు చెందిన సుంకమ్మ అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైంది. సోమవారం ఇంట్లో వంట చేస్తుండగా ఆకస్మాత్తుగా చీరకు నిప్పుంటుకొని ప్రమాదం జరిగిందని ఏరియా ఆసుపత్రి ఔటుపోస్టు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మేకల కాపరి ఆత్మహత్య
కోడుమూరు, డిసెంబర్ 16 : మండలంలోని పులకుర్తి గ్రామంలో మేకల కాపరి హరిజన బాబు (13) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పులకుర్తిలో హరిజన పెద్దరాముడుకి నలుగురు కుమారులు ఉన్నారు. వీరిలో నాలుగో కుమారుడు హరిజనబాబు రోజూ మేకలు కాసుకొచ్చేవాడు. ఇందులో భాగంగా ఎప్పటిలాగే సోమవారం ఉదయం మేకలను కాచేందుకు పొలాల గట్టుకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో రెండు మేకలు కనపడలేదు. దీంతో కంగారు పడిన బాబు ఇంటికి వెళ్తే తండ్రి మందలిస్తాడని భయపడి పొలంలో ఉన్న పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానిక రైతులు వెంటనే చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కోడూమూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బావిలో పడి యువకుడి మృతి
కోడుమూరు, డిసెంబర్ 16 : కోడుమూరుకు చెందిన దూళ్ల ఈరన్న (30) ప్రమాదవశాత్తు స్థానిక నర్సప్ప బావిలో పడి మృతి చెందాడు. ఈరన్నకు ఇది వరకే మూర్చ వ్యాధి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈత కోసం బావికి వెళ్లిన ఈరన్నకు ఈత కొడుతున్న సమయంలో మూర్చ వచ్చింది. దీంతో బావిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో అతని కోసం బంధువులు రాత్రి నుంచే వెతకడం ప్రారంభించారు. అయితే సోమవారం ఉదయం బావిలో శవమై తేలడంతో విషయం వెంటనే పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షీంచారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం కర్నూలు తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆదాయం పన్ను శాఖ అధికారుల దాడులు
ఆళ్లగడ్డ, డిసెంబర్ 16 : ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆళ్లగడ్డలోని ప్రముఖుల ఇళ్లపై 8 మంది అధికారులు రెండు భాగాలుగా విడిపోయి సోమవారం దాడులు నిర్వహించారు. అయితే దాడుల వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు చేయడంతో కొంతమంది షాపుల యజమానులు షాపులు మూసివేశారు.
హత్య కేసులో నిందితుడి అరెస్టు
పట్టణంలోని ఎల్‌ఎం కాంపౌండ్‌లో గత మూడు రోజుల క్రితం జరిగిన కుమారి హత్య కేసుకు సంబంధించిన కేసులో భర్త నరసింహులును సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు.

* కర్నూలులో నల్లజెండాలతో నిరసన
english title: 
t. bill

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>