Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అటవీ అధికారులకు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు

$
0
0

తిరుపతి, డిసెంబర్ 16: తిరుమల శేషాచల అడవుల్లో ఎర్రచందనం దొంగలను పట్టుకోవడానికి అడవిలోకి వెళ్లిన 8 మంది అటవీశాఖ అధికారుల బృందంలో శ్రీధర్, డేవిడ్ కరుణాకర్‌లను రంపాలతో కోసి, మర్మాంగయవాలను కత్తులతో కోసి, బండ రాళ్లతో మోది అత్యంత పాశవికంగా స్మగ్లర్లు హత్య చేసి, సిబ్బందిపై దాడులకు దిగిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో మరణించిన అధికారుల మృతదేహాలకు సోమవారం ఎస్వీ మెడికల్ కళాశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలతో నగరంలో భారీ శవయాత్ర నిర్వహించారు. శ్రీధర్ మృతదేహాన్ని శివజ్యోతినగర్‌లోని ఆయన స్వగృహం వద్దకు, డేవిడ్ కరుణాకర్ మృతదేహాన్ని రేణిగుంట కెఎల్‌ఎం ఆసుపత్రి సమీపంలోని ఆయన స్వగృహానికి తరలించారు. అనంతరం వీరి ఇరువురి మృతదేహాలకు అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతో వేర్వేరుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈసందర్భంగా మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, అటవీశాఖ అధికారులు, సహచరులు దుఃఖ సంద్రంలో మునిగి పోయారు. ఈసందర్భంగా ఆ పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీధర్ నిజాయితీ పరుడైన అధికారిగానే కాకుండా ప్రత్యేక ప్రతిభ కనపరిచి అధికారుల మన్నలను పొందుతూ అడవి దొంగల గుండెల్లో గుబులు పుట్టించి బంగారు పతకాన్ని కూడా పొందారు. అలాంటి అధికారిని ఎర్రచందనం దొంగలు అత్యంత పాశవికంగా హత్య చేయడంలో అటవీశాఖ సిబ్బందిలో ఎనలేని కసి కనపడుతోంది. ఇదిలా ఉండగా ఎఫ్‌ఆర్‌ఓ శ్రీధర్, ఎబిఓ డేవిడ్ కరుణాకర్‌ల మృతదేహాలతో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అటవీశాఖ రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు మధ్య నగరంలో ఈ ప్రదర్శన కొనసాగింది. తమ సహచరుల హత్యకు నిరసనగా అటవీశాఖ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి శవయాత్రలో పాల్గొన్నారు. ప్రదర్శన సమయంలో అటవీశాఖ, పోలీసు శాఖ సిబ్బంది అధికారులు భారీ ప్రదర్శన చేశారు. అటవీశాఖకు సంబంధించిన వాహనాలు కూడా ర్యాలీగా మృతదేహాల వెంట కదిలాయి. అటవీశాఖ అధికారులను స్మగ్లర్లు, కూలీలు అతిదారుణంగా చంపిన అంశాన్ని తెలుసుకున్న నగర ప్రజలు మృతదేహాల ర్యాలీల్లో కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డేవిడ్ కరుణాకర్ మృతదేహాన్ని రేణిగుంట మండలం కెఎల్‌ఎం ఆసుపత్రి సమీపంలో క్రైస్తవ మత సాంప్రదాయం ప్రకారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీధర్ మృతదేహానికి లీలామహల్ శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు శివజ్యోతినగర్‌లోని శ్రీధర్ నివాసం వద్ద ఆయన మృతదేహాన్ని ఉంచడంతో స్థానికులు, బంధువులు తండోప తండాలుగా చేరుకుని కడచూపు చూశారు. వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు శ్రీధర్ మృతదేహంపై పుష్పగుచ్ఛాలు వుంచి ఘనంగా నివాళులు అర్పించారు.

దేశవ్యాప్తంగా 230 ఆలయాల్లో తిరుప్పావై ఉత్సవాలు
* టిటిడి ఇఒ గోపాల్ వెల్లడి
తిరుపతి, డిసెంబర్ 16: పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 230 ఆలయాల్లో తిరుప్పావై ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు టిటిడి ఇఓ ఎం.జి.గోపాల్ వెల్లడించారు. సోమవారం నుండి జనవరి 14 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. సోమవారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచనాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇఓ మాట్లాడుతూ భగవంతుని సేవించేందుకు ఈ మాసం చక్కటి సమయం అన్నారు. ఈ మాసంలో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి భగవంతుని సేవిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని తెలిపారు. తిరుప్పావై పాశురాల పారాయణం ద్వారా భగవంతుని రూప, గుణ, లీల విశేషాలను తెలుసుకోవచ్చన్నారు. అన్నమాచార్య కళామందిర్‌లో నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 6.30 నుండి 7.30గంటల వరకు తిరుప్పావై ప్రవచనాలు నిర్వహిస్తామన్నారు. తిరుపతివాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలని కోరారు. అనంతరం సీమాన్‌పాదుర్ సిఆర్ రంగరాజన్‌స్వామి మొదటి రోజు తిరుప్పావై పాశురాల్లోని అవతారికను తాత్పర్య సహితంగా వినిపించారు. తిరుప్పావైలో ‘తిరు’ అంటే పూజింపదగిన ‘పావై’ అంటే వ్రతం అని అర్థమన్నారు. మొత్తంగా ఇది పవిత్రమైన వ్రతమని వివరించారు. శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తునికి జన్మించిన గోదాదేవి శ్రీవారికి పుష్ప మాలలతోపాటు పచ్చమాలలను కూడా సమర్పించిందన్నారు. ధనుర్మాసంలో తప్పస్సు, యజ్ఞం, దానం, దేవతార్చన చేస్తే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయన్నారు. ఈ మాసంలో తెల్లవారు జామున ఒక రోజు భగవంతున్ని కొలిస్తే 12ఏళ్లు దేవున్ని పూజించే పుణ్యం దక్కుతుందని మార్గశీర్ష మహత్య గ్రంథం పేర్కొందని వివరించారు. టిటిడి ఆల్వార్ విజయప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి చొక్కలింగం మాట్లాడుతూ అన్నమాచార్య కళామందిరంలో రంగరాజన్ ఒక్కో రోజు ఒక్కో పాశురాన్ని ఆలపించి భావాన్ని తెలియ చేస్తారన్నారు. అనంతరం ద్వానం లక్ష్మి గానం చేస్తారని తెలిపారు. అటు తరువాత భక్తులకు ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. తిరుప్పావై పాశురాలను ప్రవచనం చేసే రంగరాజన్‌ను టిటిడి ఇఓ శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో టిటిడి జెఇఓ కోలా భాస్కర్, భక్తులు పాల్గొన్నారు.

స్మగ్లర్లు తెగబడుతున్నారు... అటవీశాఖ అధికారులు ఎలా ఎదుర్కొంటారు?
* సర్వత్రా ఇదే చర్చ... * విషపూరితమైన బాణాలు, మారణాయుధాలతో స్మగ్లర్లు
* నిరాయుధులుగా అటవీశాఖ అధికారులు * సొంత శాఖలోనే కోవర్టులున్నారా?
తిరుపతి, డిసెంబర్ 16: అటవీశాఖ, పోలీసు శాఖ సమన్వయంగా ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్న నేపధ్యంలో స్మగ్లర్లు విరక్తి, నిరాశ, నిస్పృహలకు లోనై అటవీశాఖ అధికారులను అత్యంత పాశవికంగా హత్యలు చేయడానికి తెగబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులు గాలిలో మూరలు వేసే విధానం కాకుండా అత్యంత అధునాతనమైన ఆయుధాలతో, కనిపిస్తే కాల్చివేత హక్కులతో దాడులు చేస్తే తప్ప స్మగ్లర్లకు సరైన సమాధానం చెప్పడం సాధ్యమయ్యే పనికాదని అటవీశాఖలో జోరుగా చర్చ సాగుతోంది. స్మగ్లర్లు దారుణ హత్యలకు పాల్పడటం వెనుక ఒక ప్రత్యేక వ్యూహం ఉందనే అనుమానం కలుగుతోంది. కొంత మందిని పాశవికంగా హత్య చేస్తే అటవీశాఖ అధికారులు తమ వైపు కనె్నత్తి చూడటానికి కూడా సాహసం చేయకుండా వారిని భయభ్రాంతులకు గురి చేయడమే ఈ హత్యల వ్యూహంలో భాగమనే విశే్లషణ సాగుతోంది. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే స్మగ్లర్లకు వంత పలుకుతున్న కోవర్టులు అటవీశాఖలో పనిచేస్తూ వారికి సమాచారం అందించడం కూడా ఇలాంటి పరిస్థితులకు కారణమంటున్నారు. వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే చైనా, జపాన్ వంటి దేశాల్లో ఎర్రచందనంకు డిమాండ్ పెరగడంతో పెద్ద ఎత్తున సొమ్ము చేసుకోవడానికి స్మగ్లర్లు పోటీపడుతున్నారు. ఇందులో భాగంగా ఎర్రచందనం సంపద ఉన్న శేషాచల గిరులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గతంలో 20 నుండి 30 మంది కూలీలు వస్తున్న పరిస్థితులుండగా నేడు 200 నుండి 400 మంది కూలీలను అడవుల్లోకి పంపి ఎర్రచందనం చెట్లను నరికిస్తున్నారు. అటవీశాఖ అధికారులు, పోలీసు అధికారుల దాడులు పెరగడంతో స్మగ్లర్లు కూలీలను హత్యలకు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా తాము చెట్లను నరకడానికి తీసుకువచ్చే గొడ్డళ్లు, రంపాలు, పదునైన కత్తులే కాకుండా, విల్లంబులతో విష పూరితమైన బాణాలను సంధించానికి కూడా సంసిద్ధులై వస్తున్నట్లు సమాచారం. ఇందుకు తగిన శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. స్మగ్లర్లు తిరుగులేని ప్రణాళికలను రూపొందిస్తున్నా ఆ విషయం అధికారులకు తెలిసినా తగిన ప్రణాళికలను రూపొందించడంలో వైఫల్యం చెందుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. వందల సంఖ్యలో వస్తున్న కూలీలను ఎదుర్కొనేందుకు నిరాయుధలైన అటవీశాఖ అధికారులను పంపడమే ఇందుకు నిదర్శనమని చెప్పుకోవచ్చు. అయిన దానికి కాని దానికి ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుని చర్చించే అధికారులు ఇలాంటి కీలక అంశాలపై ఎప్పటికప్పుడు సమాచాలోచనలు చేయడం లేదనే విమర్శలున్నాయి. అంతేకాకుండా నిజాయితీ, నిబద్దతతో పనిచేసే అధికారులకు తగిన ప్రోత్సాహం కూడా ఉండటం లేదు. చివరకు ప్రాణాలకు తెగించి అటవీ ప్రాంతాల్లో స్మగ్లర్లను, కూలీలను పట్టుకుంటున్నా ప్రోత్సాహకరమైన బహుమతులు కూడా ఇవ్వడం లేదు. అంటే పరోక్షంగా స్మగ్లర్లను పట్టుకునే వారిలో నిరుత్సాహాన్ని నింపడానికేనని, అందుకు కారణం స్మగ్లర్లకు వెన్నుదన్నుగా ఉండే కోవర్టులు శాఖలో పనిచేయడమేనని విమర్శలు ఉన్నాయి. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఆరు మాసాలు అవుతున్నా వారికి తగిన నిధులు, విధులు కేటాయించడంలో అటవీశాఖ పూర్తిగా వైఫల్యం చెందింది. టాస్క్ఫోర్స్ మంచి ఫలితాలు ఇస్తున్నా తగిన నిధులు లేక వెలవెలపోతోంది. కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇప్పటి వరకూ టాస్క్ఫోర్స్‌కు నిధులు కేటాయించారంటే ఏ స్థితిలో అక్కడ పనిచేసే సిబ్బందికి ప్రోత్సాహం ఉంటుందో ఎవరికైనా ఇటే అర్థం అవుతోంది. పిడి యాక్టు పేరుకు గొప్పగా కనపడుతున్నా వాటిని అమలు చేయడంలో మాత్రం చట్టంలో ఉన్న లోపాలు స్మగ్లర్లకు వరంగా మారుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పరిస్థితి ఆలోచిస్తే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత అధునాతమైన సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉన్నా వాటిని వినియోగించుకోవడంలో అటవీశాఖ పూర్తిగా వెనుకబడిందనే చెప్పవచ్చు. ఇది వెనుకబాటా? లేక బడా నేతల అండదండలున్న స్మగ్లర్లను కాపాడటం కోసమా? అన్న అనుమానాలు కలుతున్నాయి. ఇటీవల పట్టుబడిన ఒక వైట్ కాలర్ స్మగ్లర్ విద్యాసంస్థలను, మిల్క్ డైరీలను నడుపుతున్నారంటే ఏ స్థాయిలో స్మగ్లర్లు ఆరితేరి పోతున్నారో ఇట్టే అర్థమవుతోంది. ఇలాంటి వారు రాజకీయాల్లోకి రావడానికి యమ తాపత్రయం పడుతున్నారు. అటవీ ప్రాంతాల్లో కీలకమైన ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో కెమేరాలను ఏర్పాటు చేయడం ద్వారా స్మగ్లర్ల కదలికలను పసిగట్టవచ్చునని పలువురు అటవీ ప్రేమికులు సలహాలు ఇస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు తరలివెళుతున్న ఆంధ్రాకు పొరుగు రాష్టమ్రైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సహకారంతో కూడా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇందుకు కేంద్రం మూడు రాష్ట్రాల అధికారులతో కలిపి ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనాన్ని, వాహనాలను పట్టుకున్నా వాటిని మార్కెట్లో విక్రయించడంలో ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తుండటంతో నిధుల కొరత కూడా వెంటాడుతుంది. అటవీశాఖ సిబ్బంది ఎంతో శ్రమపడి పట్టుకుంటున్న కూలీలు, జైళ్లకు అలా వెళ్లి ఇలా వస్తుండటం కూడా వారిలో మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచే పరిస్థితి నెలకొంటున్నది. ఇలాంటి కేసులకు సంబంధించి నాన్‌బెయిల్‌బుల్ కేసులు బనాయించడమే కాకుండా అటవీశాఖ అధికారులు, పోలీసులపై తిరగబడే స్మగ్లర్ల కాల్చివేతకు అనుమతులు ఉన్నప్పుడే వారిలో భయాన్ని నింపి స్మగ్లింగ్‌ను నివారించడానికి కొంత మేరకు సహకరిస్తుందనే వాదనలు వినవస్తున్నాయి. ఎర్రచందనం దుంగలను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్‌లో పనిచేసే సిబ్బందికి సంబంధించి పూర్తి వివరాలు ఉన్నతాధికారులు సేకరించి కోవర్టులనే అనుమానం ఉన్న వారి కదలికలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని స్మగ్లర్ల దాడితో ఇబ్బంది పడుతున్న అనేక కుటుంబాలు కోరుతున్నాయి. అలా కానిపక్షంలో భారతదేశంలోని పొరుగు దేశాలు అక్రమంగా చొరబడేందుకు అవకాశం లేకుండా చేపట్టిన విధానాలను శేషాచల గిరుల్లో అమలు చేయాల్సిన అవసరం కూడా లేకపోలేదు. ఏది ఏమైనా పట్టుపడిన ఎర్రచందనం స్మగ్లర్లు అయినా, కూలీలు అయినా కఠిన శిక్షలు ఉంటే తప్ప ఈ ఎర్రయుద్ధానికి తెరపడే అవకాశం కానరాదన్నది అక్షర సత్యం.

ఆయుధాలు లేకుండా విధులు నిర్వహించలేం
* అధికారులకు స్పష్టం చేసిన అటవీశాఖ సిబ్బంది
తిరుపతి, డిసెంబర్ 16: గత మూడు నెలల వ్యవధిలో ముగ్గురు ప్రతిభ గల అధికారులను అత్యంత దారుణంగా స్మగ్లర్లు హత్య చేసినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో అటవీశాఖ సిబ్బంది తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీధర్, డేవిడ్ కరుణాకర్‌ల మృతదేహాలకు శ్రద్దాంజలి ఘటించడానికి వచ్చిన పిసిసిఎఫ్ బిఎస్‌ఎస్ రెడ్డి ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రచందనం దొంగల ఆట కట్టించడంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది చేస్తున్న దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న స్మగ్లర్లు హత్యలకు తెగబడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో నిరాయుధులైన తమకు ఆయుధాలున్న స్మగ్లర్లతో పోరాటం సాధ్యం కాదని అటవీశాఖ అధికారుల సంఘం నేతలు సురేష్, నారాయణలు తేల్చి చెప్పారు. స్మగ్లర్లను పట్టుకోవడానికి కేవలం తమ ప్రయత్నం ఉంటే సరిపోదని, అందుకు అవసరమైన వౌళిక సదుపాయాలు కూడా సమకూర్చడం అవసరమన్నారు. అందుకు ప్రభుత్వం, ఉన్నతాదికారులు ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇప్పటికైనా పాలకులు స్పందించకపోతే భార్యా, పిల్లలు తమను విధులకు పంపలేరన్నారు. స్మగ్లర్లను ఎదుర్కోవడంలో తాము ఎక్కడా వెనుకాడబోమని, అయితే నిరాయుధులుగా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోలేమని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా శవయాత్ర సందర్భంగా శ్రీధర్, డేవిడ్ కరుణాకర్‌లు అమర్ రహే... మీ మరణం వృధాకాదు... ఎర్రచందనం గుండాల్లారా.. ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. తమ ప్రాణాలకు భద్రత లేని ఉద్యోగాలు మేము చేయలేం... చేయలేం... అంటూ నినాదాలు చేశారు. ఎఫ్‌ఆర్‌ఓ శ్రీధర్‌ను అత్యంత పాశవికంగా హత్య చేసిన తీరు పోస్టుమార్టంలో వెలుగు చూసింది. దీన్ని తలుచుకుని తోటి సిబ్బంది, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చేతికి ఉన్న బంగారు ఉంగరం కోసం స్మగ్లర్లు వేలిని నరికివేసి లాక్కున్న తీరు. శ్రీధర్ కొన ఊపిరితో ఉండగా కత్తులతో, రంపాలతో పీక కోసిన విధానం అటవీశాఖ అధికారుల హృదయాలను కలిసి వేసింది. అంతేకాదు శ్రీధర్ మర్మాంగవయవాలను సైతం స్మగ్లర్లు తీవ్రంగా గాయపరిచిన తీరు తెలిసిన ప్రతి హృదయం చలించింది. స్మగ్లర్లను కూడా అదేవిధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమకు ఆయుధాలు ఇచ్చి ఆత్మరక్షణకు ప్రభుత్వం భరోసా ఇవ్వకుంటే ఉద్యోగాలు చేయలేమని, తమ భార్యా, పిల్లలు తమను ఉద్యోగాలకు వెళ్లనివ్వరన్నారు.
మాకు దిక్కు ఎవరు - శ్రీధర్ సతీమణి
ఎంతో ఆప్యాయంగా అందరినీ పలుకరిస్తూ ఎవరికి ఎటువంటి హాని చేయని నిన్ను పొట్టన పెట్టుకోవడానికి వారికి మనసెలా వచ్చిందని, ఇక మాకు దిక్కెవ్వరంటూ శ్రీధర్ సతీమణి ఆయన మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది.

హాస్టల్ విద్యార్థిని నీటిగుంతలోకి తోసేసిన తోటి విద్యార్థులు
* మదనపల్లె ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వద్ద కుటుంబసభ్యుల ఆందోళన
మదనపల్లె, డిసెంబర్ 16: వసతిగృహంలో చదువుకుంటున్న 5వ తరగతి విద్యార్థి 9వ తరగతి విద్యార్థులు చెప్పినమాట వినలేదన్న కోపంతో ఏకంగా 20 అడుగుల లోతు నీటితొట్టిలో తోసేశారు. నీటితొట్టిలో కేకలు వేస్తుండగా సమీపంలోని ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న ఆ విద్యార్థి అక్క పరుగున తన సోదరుడిని బయటకు తీసింది. ఈ సంఘటన మదనపల్లె పట్టణం ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మదనపల్లె మండలం కోటవారిపల్లె పంచాయతీ బండకాడపల్లె గుట్టమీదపల్లె నివాసి కృష్ణప్ప కుమారుడు ప్రసాద్(11) మదనపల్లె పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. కుమార్తె జ్యోతి సాంఘిక సంక్షేమహాస్టల్-1లో ఉంటూ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటోంది. బాలికల ఉన్నత పాఠశాల, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఒకే ఆవరణంలో ఉండటంతో అక్కాతమ్ముడు బాగోగులు చూసుకుంటూ చదువుకుంటున్నారు. ఇంటిగ్రేటెడ్ విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఆరుబయట బంతాట ఆడుకుంటుండగా బాల్ నీటితొట్టిలో పడిపోయింది. బాల్‌ని బయటకు తీయాలని ఇద్దరు 9వ తరగతి విద్యార్థులు 5వ తరగతి విద్యార్థి ప్రసాద్‌ను పురమాయించారు. నీటితొట్టిలోకి దిగి బాల్ తీస్తున్న ప్రసాద్‌ను ఆ ఇద్దరు విద్యార్థులు నీటితొట్టిలోకి నేట్టేసి పై కప్పువేసేశారు. అదేరోజు సాయంత్రం తమ్ముడికోసం వచ్చిన అక్క జ్యోతి హాస్టల్‌లో అడిగితే చెప్పకపోవడం, ఆరుబయట వెతికినా కన్పించకపోగా.. చిన్నపాటి కేకలు విన్న జ్యోతి హాస్టల్ పక్కనే ఉన్న నీటితొట్టి పైకప్పును తొలగించగా నీటిలో తేలియాడుతూ కన్పించాడు. దీంతో కేకలు వేసిన జ్యోతి తమ్ముడిని స్థానికుల సహకారంతో బయటకు తీసుకుని హాస్టల్ వార్డెన్ గంగిరెడ్డిని నిలదీసింది. ఆ ఇద్దరిని కర్రతో బెదిరించి పంపించేశాడు. జరిగిన విషయం ఫోన్‌ద్వారా తల్లిదండ్రులకు చెప్పడంతో హుటాహుటిన హాస్టల్‌వద్దకు చేరుకున్నారు. వార్డెన్‌ను విచారిస్తే తల్లిదండ్రులపై కూడా గదమాయించి మాట్లాడటంతో బాధితులు స్థానిక విలేఖరులను ఆశ్రయించారు. హాస్టల్ వద్ద విచారించగా మోటారు పనిచేయకపోతే బాలుడిని నీటితొట్టిలోకి దింపినట్లు హాస్టల్‌లో పనిచేసే మహిళ చెప్పింది. జరిగిన విషయం గమనిస్తుంటే హాస్టల్‌లో ఏదైనా జరిగి ఉండవచ్చునని విద్యార్థి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తు.. హాస్టల్ ఎదుట ఇన్‌చార్జ్ వార్డెన్ మోహన్‌రామ్‌తో తమ బిడ్డకు ఏదైనా అయివుంటే ఏంటని.. బాధితులు గొడవకు దిగారు. జరిగిన విషయం సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు బాధిత తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంత జరిగినా ఎఎస్‌డబ్ల్యూఓకానీ, రెగ్యులర్ హాస్టల్ వార్డెన్‌గాని హాస్టల్ వద్దకు వచ్చిన దాఖలాలు లేవు.

71 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
బంగారుపాళ్యం, డిసెంబర్ 16: తిరుపతి నుంచి కర్నూలుకు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నట్లు ట్రైనీ ఎస్సై రామాంజులు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ తిరుపతి నుంచి కర్ణాటకకు టెంపోలో అక్రమంగా తరలిస్తుండగా బంగారుపాళ్యం వద్ద నాల్గవ నెంబరు జాతీయ రహదారిపై గల డివైడర్‌ను ఢీకొని బోల్తాపడిందన్నారు. దీంతో టెంపోలోని ఎర్రచందనం దుంగలు రోడ్డుకు అడ్డంగా పడ్డాయని, టెంపోలో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఐదుగురు పరుగులు తీశారన్నారు. ఐదుగురూ తమిళనాడు వాసులుగా తెలుస్తోందన్నారు. వీరిలో తమిళనాడు వేలూరు జిల్లా కన్నడ మంగళంకు చెందిన దుండగుడు రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. రోడ్డుకు అడ్డంగా పడివున్న 71 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ట్రైనీ ఎస్సై రామాంజులు తెలిపారు. నలుగురు పరారీలో ఉన్నారని చెప్పారు.

వైసిపి రాస్తారోకో
తిరుచానూరు, డిసెంబర్ 16: రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరశిస్తూ చంద్రగిరి నియోజకవర్గం వైసిపి ఇన్‌ఛార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తనపల్లి క్రాస్ బైపాస్‌రోడ్డులో రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చెవిరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల మనోభావాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న విభజన బిల్లును ప్రవేశపెట్టడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఏకైక రాజకీయ యోధుడు వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న చంద్రబాబు, కిరణ్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు శ్రీరాములు, కేశవులు, గణేష్, శివ, రామ్మూర్తి, చిన్నియాదవ్, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారికి రూ. 31లక్షల విరాళం
తిరుపతి, డిసెంబర్ 16: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి న్యూఢిల్లీకి చెందిన సీనియర్ అడ్వకేట్ పివి రావు ప్రాణదాన ట్రస్టుకు 16 లక్షల రూపాయలు, నిత్య అన్నదాన ట్రస్టుకు 15లక్షల రూపాయలు మొత్తం 31 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ డిడిలను టిటి పరిపాలనా భవనంలో ఆయా ట్రస్టు కార్యాలయాల్లో అందజేశారు.

ఆలస్యంగా నడిచిన ఇండియన్ ఎయిర్‌లైన్స్
తిరుపతి, డిసెంబర్ 16: రేణిగుంట విమానాశ్రయానికి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం సోమవారం ఆలస్యంగా చేరుకుంది. మధ్యాహ్నం 1.45 గంటలకు రావలసిన విమానం ఢిల్లీలో పొగమంచు కురుస్తున్న కారణంగా మధ్యాహ్నం 3.45 గంటలకు చేరుకున్నది.

కూతుర్ని నరికిన తండ్రి
పీలేరు, డిసెంబర్ 16: ఆలనా,పాలన చూసుకోవాల్సిన తండ్రి కన్న కూతురి పట్ల కాలయముడిగా మారి కొడవలితో నరికిన సంఘటన సోమవారం చిత్తూరు జిల్లా పీలేరు మండల శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ విశ్వనాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఎర్రావారిపాలెం మండలం ఎల్లమంద తాండాకు చెందిన చంద్రనాయక్ తన కుమార్తె మల్లీశ్వరి(12) బ్యాంక్ ఎటిఎం కార్డు పారేసిందని ఆగ్రహించి కొడవలితో ఆమె కుడిచెయ్యి, చెంప, తలపై నరికాడు. ఈ సంఘటనలో తీవ్ర రక్తస్రావంతో మల్లీశ్వరి స్పృహతప్పి పడిపోగా మృతిచెందినట్లు భావించిన చంద్రానాయక్ కడప రోడ్డు ఎల్లమంద క్రాస్ వరకు నడుచుకుంటూ వెళ్లి 100 నెంబరుకు ఫోన్‌చేసి తన కుమార్తెను తానే చంపేశానని సమాచారం ఇచ్చాడు. డిజి కంట్రోల్‌రూం నుండి పీలేరు పోలీసులకు సమాచారం రాగా ఎస్‌ఐ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న మల్లీశ్వరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

* మృతదేహాలతో నగరంలో భారీ ర్యాలీ * నల్లబ్యాడ్జీలతో అటవీశాఖ సిబ్బంది నిరసన ప్రదర్శన
english title: 
protest

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>