ఆత్మకూరు, డిసెంబర్ 16: మర్రిపాడు మండలం వెంకటాపురం బీట్ పరిధిలో పొదల్లో దాచి ఉంచిన 27 ఎర్రచందనం దుంగలను ఆదివారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. జిల్లా అటవీశాఖ అధికారి నాగేశ్వరరావు అందించిన సమాచారంతో రాపూరు స్క్వాడ్ అధికారులు వేదయ్య, కృష్ణమూర్తి వెంకటాపురం బీట్ పరిధిలో తనిఖీలు నిర్వహించి అక్రమంగా దాచి ఉంచిన ఎర్రచందనం దుంగలను గుర్తించారు. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో అటవీశాఖ సిబ్బంది గోపాల్, హనుమంతు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
సమన్యాయం చేయకుంటే విభజన ఒప్పుకోం
కావలి, డిసెంబర్ 16: చిన్న రాష్ట్రాల విధానం తమ పార్టీది కాగా, రాష్ట్ర విభజనకు తమ అధినేతలు అనుకూలంగానే ఉన్నారని, కానీ సమన్యాయం చేయకుంటే తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుకు మద్దతు ఇవ్వదని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు కందుకూరి వెంకట సత్యనారాయణ అన్నారు. సోమవారం పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ సమీపంలోగల పార్టీ కార్యాలయంలో నాయకులు సివిసి సత్యం, నంబూరి శ్రీనివాసులురెడ్డి, చలువాది సత్యం, భరత్‌కుమార్ తదితరులతో కలిసి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 18న హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రాంతం బిజెపి నేతలంతా సమావేశం అవుతుండగా, దీనిపై చర్చించి తమ పార్టీ అధిష్ఠానానికి నివేదించనున్నట్లు చెపుతూ సమన్యాయం జరగకుంటే బిల్లును బలపరచబోమని గతంలోనే తమకు పార్టీ అధినేతలు తమకు హామీ ఇచ్చిన విషయాన్ని వివరించారు. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు అవినీతి అధికారులపై ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఒక చిన్నపాటి చిరుపరిశ్రమ కూడా వ్యాపారవేత్తగా ఉన్న బీద తేలేకపోయారని విమర్శించారు. తాను చిరువస్త్ర వ్యాపారిగా జీవితాన్ని ప్రారంభించి అందుకు సంబంధించిన పరిశ్రమను స్థాపించి మొత్తం 3వేల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్లు మూడువేల కుటుంబాలకు ఏదో ఒక రూపంలో ప్రయోజనం కలిగిస్తున్నట్లు తెలియచేశారు. కావలి కాలువను వెడల్పుచేసి రైతులకు శాశ్వత మేలు చేకూర్చేలా ప్రయత్నం చేయలేకపోయారని, కేవలం తాత్కాలిక ప్రయోజనాలే తప్ప దూరదృష్టితో వ్యవహరించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పన్నులను ప్రజలపై బాది సౌకర్యాల పరంగా ఏమాత్రం వృద్ధిచేయలేదని, నిత్యావసర సరుకులు చుక్కలనంటుతున్నాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో తమ పార్టీదే అధికారమని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారన్నారు.
ముగ్గురు పాత నేరస్థులు అరెస్ట్
గూడూరు, డిసెంబర్ 16: గూడూరు 1,2 పట్టణాల్లో నేరాలకు పాల్పడిన వేరువేరు కేసుల్లో ముగ్గురు పాత నేరస్థులను గూడూరు పోలీసులు అరెస్ట్‌చేసి వారి వద్ద నుండి చోరీకి గురికాబడిన బంగారు, వెండి ఆభరణాతో పాటు, వాహనాలకు సంబంధించిన బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ కె చౌడేశ్వరి విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేసి చోరీకి పాల్పడిన నిందితులను హాజరుపరిచి వారు చోరీ చేసిన వస్తువులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డిఎస్పీ స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ గూడూరు ఒకవ పట్టణ పరిధిలోని ఈనెల 11న గమళ్లపాళెం నందిపూడి చక్రధర్‌సింగ్ విధులకు వెళ్లినపుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గూడూరు దళితవాడకు చెందిన కొల్లపూడి వెంకయ్య అలియాస్ బట్టోడు, అదే ప్రాంతానికి చెందిన పందిటి వెంకటేష్ అలియాస్ మట్టోడు అనే వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్టు, వారి కదలికలపై తమ పోలీసులు నిఘా ఉంచడంతో వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో వారిని ఆదివారం సాయంత్రం తాళమ్మ గుడి సమీపంలోని చల్లకాలువ వద్ద అరెస్టుచేసి, వారి వద్ద నుండి చోరీకి గురైన బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఆమె తెలిపారు. వీటి విలువ సుమారు 2 లక్షల రూపాయల పైచిలుకు ఉంటుందన్నారు. వీరిద్దరూ గతంలో 16 కేసుల్లో ఉన్నారని, వీరు జిల్లాలో అనేక నేరాలు చేసివున్నారని ఆమె తెలిపారు. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల కారణంగా జైలుకు వెళ్లి తిరిగి నేరాలకు పాల్పడుతున్నారని, వారికి కౌనె్సలింగ్ నిర్వహించి నేరాలు చేయకుండా వారి జీవనోపాధికి తగిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. జిల్లాలో గూడూరు డివిజన్ నేరాల నియంత్రణలో ప్రధమ స్థానంలో ఉన్నట్టు ఆమె తెలిపారు. అదే విధంగా రెండో పట్టణ పరిధిలో మాళవ్యానగర్ ప్రాంతానికి చెందిన కంచి శ్రీహరి అనే వ్యక్తి నిలిపి ఉన్న లారీలను గమనించి ఎవరూలేని సమయం చూసి లారీల్లో ఉన్న బ్యాటరీలను అపహరించేవాడని, ఆదివారం రాత్రి రెండో పట్టణ పిఎస్సై బీట్ తిరుగుతుండగా ఆనుమానాస్పదంగా తిరుగుతుండిన శ్రీహరిని పట్టుకొని ప్రశ్నించడంతో హైస్కూలో రోడ్డులో అక్కుపల్లి వెంకటచలపతికి చెందిన లారీలోని బ్యాటరీలతో పాటు గూడలి శ్రీనివాసులరెడ్డి, గుర్రం విజయబాబు, కొల్లూరు వేణురెడ్డి లారీల బ్యాటరీలను అపహరించుకొని వెళ్లి విక్రయించినట్టు విచారణలో వెల్లడించడంతో అతనిని కూడా అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 53 వేల రూపాయల విలువ చేసే 7 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్టు ఆమె తెలిపారు. వీరిని పట్టుకొనుటలో చొరవ చూపిన టౌన్ సిఐ కె రవికుమార్, ఎస్సై ఎస్‌కె షరీఫ్, పిఎస్సై వీరనారాయణ, టూటౌన్ పిఎస్సై, సిబ్బంది మోహనకృష్ణ, మస్తానయ్యను ఆమె అభినందించి వారికి ఎస్పీ ద్వారా రివార్డులు అందివ్వనున్నట్టు తెలిపారు.
నిబంధనలు కాదని సభలో బిల్లు ప్రవేశపెట్టడమా?
* టిడిపి జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర
నెల్లూరు, డిసెంబర్ 16: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును సభా నిబంధనలను తుంగలో తొక్కి సోమవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ శాసనసభలో ప్రవేశపెట్టారని టిడిపి జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర విమర్శించారు. తొలి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం విభజన విషయంలో ప్రజాస్వామ్య పద్దతులను పక్కనపెట్టి కేవలం రాజకీయ లబ్దిపొందాలనే ఉద్దేశంతో సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చిందని దుయ్యబట్టారు. క్యాబినెట్ నోట్‌ను సభ ముందుకు తీసుకొచ్చేటప్పుడు కూడా అజెండాలో చేర్చకుండా టేబుల్ ఐటెంగానే పెట్టారన్నారు. అదేవిధంగా విభజన బిల్లుకు శాసనసభ అభిప్రాయం తెలియజేసేందుకు రాష్టప్రతి ఆరు వారాలు గడువు ఇచ్చినా కేంద్రప్రభుత్వం హడావుడిగా ప్రత్యేక విమానం ద్వారా రాష్ట్రానికి చేర్చారన్నారు. బిల్లు మొత్తం కూడా తప్పులతడకగా ఉందన్నారు. అసలు నాలుగు నియోజకవర్గాల పేర్లు లేకుండానే బిల్లును పంపించారన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన స్పీకర్ నాదెండ్ల మనోహర్ సీమాంధ్ర ప్రజల మనోగతానికి విరుద్దంగా ప్రవర్తించడం దృరదృష్టకరమన్నారు. గతంలో స్పీకర్ తండ్రి అయిన నాదెండ్ల భాస్కర్‌రావు తెలుగు ప్రజలకు వెన్నుపోటు పొడిచి చరిత్రలో వెన్నుపోటుదారుడుగా నిలిచిపోయారన్నారు. స్పీకర్ తండ్రి బాటలో నడవకుండా ఇప్పటికైనా సభా సాంప్రదాయాల ప్రకారం నడుచుకొని తప్పులతడకగా ఉన్న విభజన బిల్లు వెనక్కి త్రిప్పి పంపాలని డిమాండ్ చేశారు. గతంలో శాసనసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేంత వరకు శాసనసభను నడవనివ్వమని సభా మర్యాదలు మరిచి స్పీకర్ టేబుల్ ఎక్కి కాగితాలు చించి స్పీకర్‌పై విసిరిన టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నేడు శాసనసభలో తెలంగాణ విభజన బిల్లును అడ్డుకొన్న సీమాంధ్ర ఎమ్మెల్యేలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
స్మగ్లర్ల కిరాతకంపై బిజెపి ఖండన
* జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అణచివేయండి
*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిడతల విజ్ఞప్తి
నెల్లూరు కల్చరల్, డిసెంబర్ 16: చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీశాఖ అధికారులను పాశవికంగా హత్యచేయడాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిడతల రమేష్ సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. నెల్లూరు జిల్లాలో కూడా ఎర్ర చందనం స్మగ్లర్లు అడ్డు అదుపూ లేకుండా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, ఈ స్మగ్లింగ్ వెనుక అధికార పార్టీకి చెందిన వారి అండదండలున్నాయని, స్మగ్లింగ్‌ను అటవీశాఖ అధికారులు అణచివేయలేకపోతున్నారని పేర్కొన్నారు. ఉదయగిరి, రాపూరు, వెంకటగిరి అడవుల్లోని ఎర్రచందనం చెట్లను నరికి తరలించడం వెనుక రాజకీయ ప్రలోభాల వల్ల పోలీసులు, అటవీశాఖ అధికారులు విధులు నిర్వహించలేకపోతున్నారన్నారు. తిరుపతి అటవీశాఖ టాస్క్ఫోర్స్ అధికారులు జిల్లాలో స్మగ్లర్లను పట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు జోక్యం చేసుకుని అధికారులపై వత్తిడి తేవడం జరిగిందని, తమపై వస్తున్న వత్తిడిని అధికమించి అటవీశాఖ అధికారులు పనిచేయాల్సి ఉందని బిజెపి డిమాండ్ చేస్తోందన్నారు. ఒక్క ఈఏడాదిలోనే ఇప్పటివరకు 2వందలకు పైగా ఎర్రచందనం అక్రమ రవాణా వాహనాలను పట్టుకోవడం, జిల్లాలో ఎర్రచందనం చెట్లు నరికేందుకు తమిళనాడునుండి వచ్చిన వందమంది కూలీలను అధికారులు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో అటవీశాఖ అధికారులకు అధునాతన ఆయుధాలు అందించి సిబ్బందిని పెంచి కూంబింగ్ నిర్వహించి స్మగ్లింగ్‌ను అణచివేయాలని కోరారు. ప్రపంచంలోనే అత్యంత ఔషధ విలువలు కలిగిన అటవీసంపద అక్రమ రవాణాను నిరోధించి పర్యావరణాన్ని కాపాడాలని రమేష్ డిమాండ్ చేశారు.
‘ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి’
కోవూరు, డిసెంబర్ 16: వికలాంగులకు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు ఆర్డీవో సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి అన్నారు. పట్టణంలోని తాలుకా ఆఫీసు ఆవరణలో నెల్లూరు డివిజన్ స్థాయిలో వికలాంగులకు ఏర్పాటు చేసిన వికలాంగుల వైద్య పరీక్షలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు అవసరమైన సర్ట్ఫికెట్లు పొందేందుకు ఈశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈశిబిరానికి డివిజన్ స్థాయిలో వికలాంగులు భారీ స్థాయిలో హాజరయ్యారు. వీరికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. 629 మంది వికలాంగులు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అంగవైకల్యం కలవారు 280, వినికిడిలోపం గల వారు 300, దృష్టిలోపం 49 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరికి మధ్యాహ్నం భోజన ప్యాకెట్లు పంపిణీ చేసారు. ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకార సంస్థవారిచే ఈకార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో కోవూరు తహశీల్దార్ సాంబశివరావు, ఎంపిడిఓ నాగరాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
చెరకు రైతులకు బకాయిలు చెల్లించాలి
టిడిపి జిల్లా నేత చేజర్ల డిమాండ్
విడవలూరు, డిసెంబర్ 16: చెరకు రైతులకు బకాయిలు సత్వరమే చెల్లించాలని జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రామతీర్ధంలో సోమవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో చేజర్ల మాట్లాడుతూ నవంబర్ నెలాఖరులో చెరకు రైతులకు బకాయిలు చెల్లిస్తామని ఆర్థికమంత్రి ఆనం తెలిపినప్పటికీ ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. కోవూరు నియోజకవర్గ సమన్వయకర్త పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు బతకలేని స్థితిలో ఉన్నారన్నారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, రామతీర్ధం సర్పంచ్ చిమటా వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు ఎం శ్రీనివాసులు, కావలి వెంకటేశ్వర్లు, ఆవుల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
రొయ్యల గుంటలో పడి బాలిక మృతి
వాకాడు, డిసెంబర్ 16: మండలంలోని దుగరాజపట్నం శ్రీనివాసమెట్ట గ్రామానికి చెందిన అల్లెయ్య, అంకమ్మల కుమార్తె శ్రావణి(2) అనే బాలిక ప్రమాదవశాత్తు రొయ్యల గుంటలో పడి మృతిచెందింది. స్థానికులు, బంధువుల కథనం మేరకు అల్లెయ్య, అంకమ్మలు ఆదివారం సాయంత్రం రొయ్యల గుంటల వద్ద పనులు చేస్తుండగా వారి కుమార్తె శ్రావణి అక్కడికి వచ్చి ప్రమాదవశాత్తు గుంటలో పడి మృతిచెందింది. కొద్దిసేపటికి గుంటలో మృతదేహం తేలడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.
ఎకరా భూమి కూడా ఎండకూడదు
* అధికార యంత్రాంగానికి ఆర్‌డిఓ సూచన
కావలి, డిసెంబర్ 16: ఆకలి తీర్చే రైతన్నల కష్టం ఎట్టి పరిస్థితుల్లో వృథా కానివ్వకూడదని, 3నెలల పాటు నిద్రాహారాలు మాని సోమశిల నీటిని కావలి కాలువ చివరి పొలాల వరకు తరలించి ఒక్క ఎకరా సైతం ఎండకుండా చూడాల్సిన బాధ్యత తనతో పాటు ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని ఆర్‌డిఓ వెంకటరమణారెడ్డి అన్నారు. ఈనెల 18నుంచి పూర్తిస్థాయిలో సోమశిల నీటిని సిబిఆర్‌కు తరలించనుండగా ముందస్తు కార్యాచరణ మేరకు గస్తీ వుండి నీటిని సద్వినియోగం చేసే అంశంపై డివిజన్‌లోని విద్యుత్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ విభాగాల అధికారులతో సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కావలి కాలువ పొడవునా 9వేల మోటార్లు ఉన్నాయని, వీటికి శని, ఆదివారాల్లో మాత్రమే అవకాశం ఇచ్చి మిగిలిన ఐదు రోజులు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని సూచించారు. అలాగే ఆయిల్ ఇంజన్‌లు పనిచేయకుండా చూడాలని, అధికారుల మాటలు పెడచెవిన పెట్టే రైతులను ఒకటి రెండుసార్లు హెచ్చరించి అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సమీక్షలో పాల్గొన్న సిఐ ప్రసాద్‌తో పాటు వివిధ మండలాల ఎస్‌ఐలకు తెలియచేశారు. జలదంకి, కావలి మండలాల చివరి పొలాలకు సైతం నీరివ్వాలని తాము కృత నిశ్చయంతో ఉన్నామని, రెండు నెలల పాటు గట్టిగా కృషిచేసి పంటలు పండించాల్సి బాధ్యత అందరిపై ఉందన్నారు. విధి నిర్వహణలో అలసత్వం చూపితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. యంత్రాంగానికి అడ్డం తిరిగే అక్రమ నీటివాడకం దారులపైన అత్యంత కఠిన చర్యలు వుంటాయని, చివరి ఆయకట్టు రైతులకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కావలి తహశీల్దార్ వెంకటేశ్వర్లు, బోగోలు, దగదర్తి, జలదంకి మండలాల తహశీల్దార్లు, ట్రాన్స్‌కో ఏఇలు, పోలీస్ అధికారులు, సోమశిల డిఇ రాఘవరావు పాల్గొన్నారు.
మర్రిపాడు మండలం వెంకటాపురం బీట్
english title:
red sanders
Date:
Tuesday, December 17, 2013