గుంటూరు, డిసెంబర్ 16: జిల్లాలో చేపట్టాల్సిన 7వ భూ పంపిణీకి సంబంధించి అవసరమైన అన్ని చర్యలు ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ మండల అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయం నుండి నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని గురజాల, నరసరావుపేట డివిజన్లలో పంపిణీ చేయాల్సిన భూమి ఎక్కువగా ఉందని, గుంటూరు డివిజన్‌లో కొంతమేరకు పంపిణీ చేయాల్సిన భూములున్నట్లు తెలుస్తోందన్నారు. ఏడవ విడత భూ పంపిణీలో సుమారు 1533 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఒక కుటుంబంలో ఎక్కువ మంది ఆడపిల్లలు, పేదరికంతో ఉన్న వారికి పంపిణీలో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఓటరు నమోదు కార్యక్రమం ఈనెల 17వ తేదీతో పూర్తవుతుందని, ఇందుకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ స్వయంగా పరిశీలించి ఈనెల 30 లోగా విచారణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2014 జనవరి 16వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటించాల్సి ఉన్నందున ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు కోల్పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ చెల్లించేందుకు ఇంకా రైతులచే బ్యాంకు ఖాతాయలు తెరిపించే ప్రక్రియ పూర్తి కాలేదని చెప్పారు. త్వరితగతిన పూర్తిచేసి నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల కింద మంజూరు చేసిన యూనిట్లను జనవరి నెలాఖరులోగా గ్రౌండింగ్ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. రాజీవ్ విద్యాదీవెన కింద ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులచే బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియను ఈనెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత మండల విద్యాశాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. బహిరంగ మార్కెట్‌లో పత్తి కొనుగోలు ధర ఎక్కువగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, తహశీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. కేంద్రప్రభుత్వం పత్తి పంటకు కనీస మద్దతు ధరగా 4 వేలు నిర్ణయించినందున అంతకు తక్కువగా బహిరంగ మార్కెట్‌లో రైతుల నుండి పత్తి కొనుగోలు చేసినట్లయితే తక్షణమే భారత పత్తి సంస్థ (సిసిఐ) ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
సోనియాకు తొత్తుగా మారిన స్పీకర్
గుంటూరు, డిసెంబర్ 16: శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోనియాగాంధీకి తొత్తుగా మారారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టినందుకు నిరసనగా టిడిపి నాయకులు, కార్యకర్తలు సోమవారం స్థానిక లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ స్పీకర్ మనోహర్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని తొందరంగా చీల్చేందుకు ఉత్సాహ పడుతోందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు భిన్నంగా తెలంగాణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారన్నారు. స్పీకర్, గవర్నర్ వంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి సైతం దిగ్విజయ్‌సింగ్ ప్రలోభాలకు గురి చేయడం శోచనీయమన్నారు. 8 కోట్ల తెలుగు ప్రజల తలరాతను మార్చే కీలకమైన ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించకుండా గందరగోళం నడుమ హడావుడిగా శాసనసభలో ప్రవేశపెట్టారన్నారు. సభా సంప్రదాయాలకు, నియమాలను ఉల్లంఘించి స్పీకర్ పదవికే మనోహర్ కళంకం తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోక ముందే సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా టిఆర్‌ఎస్, తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దాడులకు పాల్పడటం క్షమార్హం కాదన్నారు. సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారిపై దాడిని తీవ్రంగా నిరసిస్తున్నామని, అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సెక్రటేరియట్‌లో సీమాంధ్ర ఉద్యోగులపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు దాడి చేయడం దారుణమన్నారు. 63 పేజీలు, 13 షెడ్యూల్డ్ బిల్లును సభ్యులకు ఇచ్చి వారు బిల్లు పూర్తిగా చదవకుండానే సభలో చర్చ ప్రారంభించాలనడం అన్యాయమన్నారు. బిల్లులో ఉన్న లోటుపాట్లపై చర్చించాల్సిన ఆవశ్యకత సభ్యులందరికీ ఉందని, ఆ అవకాశం సభ్యులకు ఇవ్వకుండా హడావుడిగా ప్రక్రియ ప్రారంభించడం సరికాదన్నారు. సభ్యుల హక్కులను హరించే విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని, మొన్న బిఎసిలో తీసుకున్న అంశాలపై చర్చ పెట్టకుండా తెలంగాణ బిల్లుపై రాష్టప్రతి 40 రోజుల గడువు ఇచ్చినా ప్రజా సమస్యలు, బడుగుల సంక్షేమాన్ని గాలికొదిలేసి కెసిఆర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మానుకొండ శివప్రసాద్, కనగాల చిట్టిబాబు, వట్టికూటి హర్షవర్ధన్, దామచర్ల శ్రీనివాసరావు, అజయ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్ వైఖరి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
తెనాలి, డిసెంబర్ 16: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే తీరులో రాజ్యాంగానికి గొడ్డలి పెట్టుగా శాసన సభా సమావేశాల్లో స్పీకర్ నాదెండ్ల మనోహర్ టి బిల్లు ప్రవేశపెట్టారని వైసిపి నాయకులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం తీవ్ర స్థాయిలో వ్యక్తం చేశారు.సోమవారం శాసన సభా సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై, గుంటూరు జిల్లా తెనాలిలో వైసిపి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ రాత్రి పొద్దుపోయాక గాంధీచౌక్ సెంటర్‌లో స్పీకర్ నాదెండ్ల మనోహర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్టీ కార్యాలయం నుండి స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గాంధీ చౌక్‌కు చేరుకున్న నాయకులు అదే సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి సమైక్యవాదాన్ని చాటుతు నినాదాలు చేశారు. క్రమంలోమాజీ కేంద్ర మంత్రి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శాసన సభా సమావేశాల్లో నిబంధనలకు విరుద్దంగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలంగాణ బిల్లు హడావిడిగ ప్రవేశపెట్టారని, రాష్ట్ర పతి సందేశాన్ని కూడా సభ్యుల ఆందోళనలు మిన్నంటుతున్న చదివించిన తీరు, రాజ్యాంగానికి గొడ్డలి పెట్టన్నారు. వేమూరు నియోజక వర్గ ఇంచార్జి మేరుగ నాగార్జున మాట్లాడుతూ శాసన సభలో టి బిల్లు వచ్చే సమాయానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, స్పీకర్ కూడా మధ్యాహ్నం వరకు లేరని వీరంతా ఉద్దేశ్య పూర్వకంగా రాష్టవ్రిభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు. ఇదే కార్యక్రమంలో వైసిపి నాయకులు అన్నాబత్తుని శివకుమార్, గుదిబండి చినవెంకటరెడ్డి, గల్లా చందు, మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి,సుద్దపల్లి నాగరాజు, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, వేమూరు, తెనాలి నియోజక వర్గాల వైసిపి నాయకులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల దుర్మరణం
మంగళగిరి, డిసెంబర్ 16: మండల పరిధిలోని కాజగ్రామ పొలాల్లో సోమవారం విద్యుదాఘాతంతో బత్తల పాపారాయుడు (21), దాసరి కొండలరావు (22) అనే యువకులు దుర్మరణం పాలయ్యారు. రూరల్ పోలీసుల కధనం ప్రకారం నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం బొర్రారెడ్డిపాలెంకు చెందిన పాపారాయుడు, అదే జిల్లా దగదర్తి మండలం దగదర్తికి చెందిన కొండలరావు మూడురోజుల క్రితం వరినూర్పిడి యంత్రం వెంట కూలీలుగా కాజకు చేరుకున్నారు. వరినూర్పిడి కోసం యంత్రాన్ని లారీపై ఉంచి పొలానికి వెళుతుండగా మార్గమధ్యంలో విద్యుత్ వైర్లు యంత్రానికి తగిలేంత కిందికి ఉండటంతో లారీ ముందుకు వెళ్లేందుకు వీలుగా కర్ర సహాయంతో తీగలను పైకెత్తగా కర్ర విరిగి విద్యుత్ వైర్లు లారీకి తాకడంతో లారీలో ఉన్న పాపారాయుడు, కొండలరావు విద్యుత్ షాక్‌కు గురై అక్కడి కక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో యువకుడు క్షణాల్లో లారీనుంచి దూకేయడంతో ప్రాణాపాయం నుంచి బైటపడ్డాడు. సిఐ మధుసూధనరావు, ఎస్సై సత్యనారాయణ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
30 సార్లు రక్తదానం చేసిన పసుపులేటి శ్రీ్ధర్
పెదకూరపాడు, డిసెంబర్ 16: ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా 17 ఏళ్లుగా విధులు నిర్వహిస్తూ అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో తన వంతుగా పాలు పంచుకుంటున్న పసుపులేటి శ్రీ్ధర్, తాను పనిచేసే పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు స్కూలు దుస్తులు, ఇతర వౌలిక వసతుల ఏర్పాటుకు ఆర్థికసాయం అందజేస్తూ, అనేక మంది పేద విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తూ సాయమందజేసిన శ్రీ్ధర్‌ను సోమవారం పెదకూరపాడులో బుజ్జి జన్మదిన వేడుకల్లో 30వ సారి రక్తదానం చేసిన సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గుంటుపల్లి కోటేశ్వరరావు, జిల్లా యుటిఎఫ్ నాయకుడు కళాదర్, బెల్లంకొండ శివశంకర్, అవ్వారి రవి, వజ్చా మహేష్, కన్నబాబు, దాసరి ప్రకాష్ తదితరులు అభినందించారు. అలాగే ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ కె వియన్నారావు, జిడిసిసి చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య, డిసిఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు, వెన్నా సాంబశివారెడ్డి తదితరులు ఉపాధ్యాయుడు శ్రీ్ధర్‌ను పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
మోటారు సైకిళ్లు ఢీకొని ఐదుగురికి గాయాలు
మేడికొండూరు, డిసెంబర్ 16: రెండు మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఐదుగురికి గాయాలైన సంఘటన గుంటూరు-మాచర్ల ప్రధాన రహదారిపై గుంటూరు బ్రాంచ్ కాల్వ వద్ద ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పేరేచర్ల నుండి పిడుగురాళ్ల వెళ్తున్న షేక్ సుభాని, ఖాజా మొహిద్దీన్ మోటార్ సైకిల్, మేడికొండూరు నుండి గుంటూరు వెళ్తున్న నవత రాజు, కల్యాణ్, మురళిల ద్విచక్ర వాహనం ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో మొత్తం ఐదుగురూ గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్సు ద్వారా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సిఐ సుధాకర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి విజయం ఖాయం
గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 16: సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి విజయం తథ్యమని, ఈ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడే సామర్థ్యం ఏ పార్టీకీ లేదని భారతీయ జనతా మజ్దూర్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి సుబ్బారావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక 8వ డివిజన్‌లో బిజెపి కార్యవర్గ సమావేశం అరవపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు. బిజెపి నగర కార్యదర్శి అరవతల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందన్నారు. ఈ సమావేశంలో అమ్మిశెట్టి ఆంజనేయులు, నేరెళ్ల మాధవరావు, సూరిబాబు, కారంశెట్టి రమేష్, జూపూడి రంగరాజు, డి సత్యనారాయణ, పాండురంగ విఠల్ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
ముక్కోటికి సమన్వయంతో ఏర్పాట్లు
మంగళగిరి, డిసెంబర్ 16: స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) పర్వదినం సందర్భంగా వచ్చేనెల 10వ తేదీ రాత్రి జాగరణ, 11వ తేదీన తెల్లవారుఝాము నుంచి ఉత్తర ద్వార దర్శనానికి తరలివచ్చే భక్తులకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆప్కోచైర్మన్ మురుగుడు హనుమంతరావు అన్నారు. ముక్కోటి ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సోమవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ముక్కోటి వాల్‌పోస్టరును ధనుర్మాస మహోత్సవ ఆహ్వాన పత్రికను మురుగుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ఎంఎస్‌ఆర్ కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మురుగుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు త్వరిత గతిన దర్శనం జరిగే విధంగా క్యూలైన్లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, బంగారు దక్షిణావృత శంఖంతో ఇచ్చే తీర్థం పవిత్రంగా ఉండేలా చూడాలని, మంచిపాత్రల్లో తీర్థం ఉంచి భక్తులకు అందించాలని అన్నారు. ఆర్‌టిసి డిపో మేనేజర్ బాపిరాజు మాట్లాడుతూ ముక్కోటి సందర్భంగా విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రాంతాలనుంచి భక్తుల రాకపోకలకు వీలుగా బస్సులు నడుపుతామని అన్నారు. ఆర్ అండ్ బి, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్, పోలీసు, దేవాదాయశాఖ, రెవిన్యూ, మున్సిపల్ అధికారులు తమ శాఖాపరంగా తీసుకునే చర్యలను వివరించారు. ఇఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ముక్కోటి ఏర్పాట్లపై వివరించారు. ఎంపిడిఓ శ్యామలాదేవి, మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాసరావు, సిఐ రావూరి రమేష్‌బాబు, ఎఎంసి చైర్మన్ సుంకర రఘుపతిరావు తదితరులు ప్రసంగించారు. ముక్కోటి పర్వదినాన్ని రాష్టస్థ్రాయి ఉత్సవంగా ప్రభుత్వం గుర్తించే విధంగా చూడాలని వాసవి సేవాసమితి అధ్యక్షుడు మాజేటి సూర్యవేణుగోపాలకృష్ణ కోరగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి ప్రయత్నిస్తామని ఆప్కో చైర్మన్ మురుగుడు హామీ ఇచ్చారు. వాకా ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
నత్తనడకన మరుగుదొడ్ల నిర్మాణం
పొన్నూరు, డిసెంబర్ 16: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని నిర్మల్ భారత్ అభియాన్ ప్రాజెక్టు ద్వారా యుద్ధ ప్రాతిపదికన చేపట్టినప్పటికీ మండలంలో నత్తనడక నడుస్తోంది. మండల పరిధిలోని 29 గ్రామాల్లో కేవలం ఆరు గ్రామాల్లో మాత్రమే ఈ పథకం ద్వారా పనులు చేపట్టారు. ఈ ఆరు గ్రామాల్లో 1,512 మరుగుదొడ్ల నిర్మాణానికి అంచనాలు వేసి అనుమతి ఇచ్చినప్పటికీ పూర్తయినవి కేవలం 34 మాత్రమే. పరిసరాల పరిశుభ్రత మన లక్ష్యం సురక్షిత పారిశుద్ధ్య మన ధ్యేయం అని గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగంగా మలవిసర్జన చేయవద్దని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించడంలో మాత్రం విఫలమవుతుందని చెప్పక తప్పదు. మండల పరిధిలో మొత్తం 29 గ్రామ పంయతీలున్నాయి. కాగా గోళ్లముడిపాడు, కసుకర్రు, మామిళ్లపల్లి, నండూరు, సీతారామపురం, వల్లభరావుపాలెంలలో మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. ఇవి కూడా నత్తనడకన సాగుతున్నాయి. మామిళ్లపల్లి గ్రామంలో అత్యధికంగా 530 మరుగుదొడ్లకు అంచనా పనులు పూర్తికాగా కేవలం 2 మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమే పూరె్తైంది. నండూరులో 480కు గాను 16, కసుకర్రులో 204కు గాను 9, గోళ్లముడిపాడులో 190కు గాను 4, సీతారామపురంలో 97కు గాను 2, వల్లభరావుపాలెంలో 29కు గాను కేవలం ఒకటి మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. గోళ్లముడిపాడులో మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం దాదాపు 3,600 రూపాయలు పై చిలుకు ఇవ్వడానికి నాట్కో కంపెనీ ముందుకు వచ్చింది. అయినా ఆశించిన ఫలితం లేకపోయింది. దీనికితోడు ప్రతినెలా 100 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ఇందిరా క్రాంతి పథం ద్వారా టార్గెట్లు ప్రకటించినప్పటికీ పథకం ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనన్న చందంగా ఉంది. గత నెల 20వ తేదీన దొప్పలపూడి, పెదపాలెం, ములుకుదురు గ్రామాలకు చెందిన 70 మంది మహిళలు తమకు మరుగుదొడ్లు నిర్మించాలని ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహశీల్దార్, ఎండిఒ కార్యాలయాల వద్ద ధర్నా చేసి తమ సమస్యను వివరిస్తూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అయినప్పటికీ ఆయా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం సజావుగా సాగేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.
పంట రక్షణకు రైతుల అవస్థలు
తాడేపల్లి, డిసెంబర్ 16: తాడేపల్లి మండల పరిధిలోని చిర్రావూరు గ్రామంలో రైతులు సోమవారం అష్టకష్టాలు పడ్డారు. ఇటీవల కురిసిన వర్షాల వలన వరి చేలు నీటిలో మునిగిపోవటంతో రైతులు కోతలు ప్రారంభించి పంటను రోడ్డుపై పరిచారు. ఈ క్రమంలో ఎకరానికి 5వేలు రూపాయలు కోతకు, ఇతర కూలీ చార్జీలు ఒక్కొక్కరికి రూ. 300 రైతులు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది.
దేశ ఆర్థికాభివృద్ధిలో రిజర్వు బ్యాంకు పాత్ర కీలకం
గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 16: స్వాతంత్య్రానంతరం దేశ ఆర్థిక, సామాజికాభివృద్ధికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రణాళికాబద్ధమైన కృషి కొనసాగిస్తున్నట్లు ఆ బ్యాంకు హైదరాబాద్ శాఖ అసిస్టెంట్ మేనేజర్ చంద్రమోహన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక బ్రాడీపేటలోని బండ్లమూడి హనుమాయమ్మ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ఆంధ్రాబ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సహకారంతో ఆర్‌బిఐ కార్యకలాపాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యవక్తగా పాల్గొన్న చంద్రమోహన్ మాట్లాడుతూ ఆర్‌బిఐ దేశ ద్రవ్య వ్యవస్థపై పర్యవేక్షణాధికారం కలిగి ఉంటుందన్నారు. అంతేకాకుండా విదేశీ ఆర్థిక ప్రభావాలకు కాపలాదారుగా పనిచేస్తుందన్నారు. జాతీయ ప్రైవేటు బ్యాంకులతో పాటు ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే సంస్థల తీరు తెన్నులను విశే్లషిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 20 ప్రాంతీయ కార్యాలయాలతో వాణిజ్య బ్యాంకుల్లోని 4,200 కరెన్సీ చెస్ట్‌ల ద్వారా నోట్లు, నాణాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు దాచుకున్న డబ్బులకు భరోసా కల్పిస్తూ ఆ ధనం ద్వారా ఆర్థిక ప్రగతికి ఉపయోగపడేలా గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు వివరించారు. ఎల్‌డిఎం రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పొదుపుపై, బ్యాంకుల ద్వారా రైతులకు వ్యవసాయం, విద్య, వైద్య, స్వయం సహాయక రుణాల కార్యకలాపాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సదస్సులో ఆర్‌బిఐ సహాయాధికారి ఎంసి ప్రసాద్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఫైనాన్షియల్ ఇన్‌క్లూషన్ విభాగాధికారి జనార్ధనరావు, బ్రాంచి మేనేజర్ శివరామిరెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ శాంతి భూషన్, హెచ్‌ఎం జెవి రమణి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఏసీబీ వలలో మున్సిపల్ ఆర్‌ఐ
చిలకలూరిపేట, డిసెంబర్ 16: స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఆర్‌ఐగా పనిచేస్తున్న వెంకట్రామయ్య లంచం తీసుకుంటూ సోమవారం మధ్యాహ్నం ఎసిబి అధికారులకు దొరికిపోయాడు. ఎసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని పాటిమీద నివాసముంటున్న ప్రభుత్వ టీచర్ కె శ్రీనివాసరావు ఇంటిపన్ను విషయంలో జరిగిన ఉదంతమన్నారు. 5 వేల లంచం ఇవ్వకపోతే శ్రీనివాసరావు ఇంటికి 3,500 రూపాయల పన్ను విధిస్తానని తరచూ బెదిరించే వాడని తెలిపారు. అధికారుల పథకం ప్రకారం శ్రీనివాసరావు మున్సిపల్ ఆర్‌ఐ వెంకటరామయ్యకు 5 వేలు లంచం ఇవ్వగా ఆ డబ్బును ప్యాంటు జేబులో పెట్టుకున్నాడని, తాము దాడి చేసిన సమయంలో అవి బయటపడ్డాయని ఎసిబి డిఎస్‌పి విజయబాబు తెలిపారు. ఈ దాడిలో ఎసిబి సిఐలు శ్రీనివాసరావు, నాగరాజు, సీతారామాంజనేయులు, రవి తదితరులు పాల్గొన్నారు.
శ్రామిక మహిళా ఉద్యమ నిర్మాణానికి నడుం బిగించాలి
గుంటూరు , డిసెంబర్ 16: శ్రామిక మహిళా ఉద్యమ నిర్మాణంలో మహిళలు కీలకపాత్ర పోషించాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి సంధ్య పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నగరంలో జరిగింది. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి విప్లవ మహిళా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ప్రగతిశీల మహిళా సంఘం ఇటీవల మహిళా ఉద్యమంలో పలు కీలక అంశాలపై చర్చించిందన్నారు. అణిచివేతకు గురవుతున్న ఆదివాసి, దళిత, బహుజన, అట్టడుగు శ్రామిక వర్గాల ప్రజలను సమీకరించి ఉద్యమంలో భాగస్వాములను చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బాలికల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు. రాష్ట్రంలో నానాటికీ మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, దాడులను నియంత్రించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా వి సంధ్య, ఎన్ విష్ణు, మరో 13 మందితో ఆఫీసు బేరర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. పార్లమెంటు ముందున్న స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్, షెడ్యూల్ ట్రైబల్ ప్లాన్‌కు సంబంధించిన బిల్లును వెంటనే ఆమోదించి కోటాలో సబ్ కోటా కింద నిధులు కేటాయించాలని, పలు తీర్మానాలు సమావేశంలో చేశారు.
నకిలీ విత్తన బాధిత రైతులకు
నష్టపరిహారం ఇవ్వాలంటూ ధర్నా
వినుకొండ, డిసెంబర్ 16: నకిలీ విత్తనాలను సాగుచేసి నష్టపోయిన రైతులకు తక్షణమేప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతుసంఘం, సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక శివయ్యస్థూపం సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గంలోని వేల్పూరు, ఇర్లపాడు, పోట్లూరు, ముప్పాళ్ళ, బొగ్గరం, చిట్టాపురంగ్రామాలకు చెందిన రైతులు ఖరీఫ్ సీజన్‌లో పట్టణంలోని పలు విత్తనాల దుకాణాల్లో వరివిత్తనాలను సాగుచేశారని, ఎకరాకు 20వేలనుండి 25వేలవరకు పెట్టుబడులు పెట్టి సాగుచేయగా, పైరు పెరగకపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోయారని రైతుసంఘం నాయకులు కంచేటి శివరామకృష్ణ, ఉలవలపూడి రాము, బండి కోటయ్య, బొల్లా శ్రీనివాసరావు, మారుతీవరప్రసాద్‌లు తెలిపారు. సిపిఐ, రైతుసంఘం నాయకులు, రైతులు స్థానిక వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, నకిలీ విత్తనాలను విక్రయించిన దుకాణాల యాజనుమాలపై చర్యలు తీసుకోవలేదన్నారు.
తక్షణమే రైతులకు న్యాయం జరగని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో రైతుసంఘం నాయకులు, సిపిఐ నాయకులతోపాటు పలుగ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
టెన్నికాయిట్‌లో ఓలేరు విద్యార్థినుల ప్రతిభ
భట్టిప్రోలు, డిసెంబర్ 16: ఇటీవల చెరుకుపల్లి మండలం రాజోలులో జరిగిన జిల్లా బాలికల సెంట్రర్ జోన్ ఆటలపోటీల్లో మండలంలోని ఓలేరు ఎస్‌జెవిఎస్ పాఠశాల విద్యార్థినులు సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో టెన్నీకాయిడ్‌లో ప్రథమ స్థానం సాధించినట్లు హెచ్‌ఎం సత్యప్రసాద్ తెలిపారు. ఈసందర్భంగా సోమవారం పాఠశాలలో జరిగిన అభినందన సభలో గెలుపొందిన బాలికలను, పిఇటి సాంబశివరావును పాఠశాల కరస్పాండెంట్ దేవినేని మల్లిఖార్జునరావు, ఉపాధ్యాయులు రామారావు, సురేష్, వెంకటరావు తదితరులు అభినందించారు.
రబీలో వరికి సాగునీరు ఇవ్వాలి
పిడుగురాళ్ళ, డిసెంబర్ 16: రబీలో వరిసాగుకు ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీటిని ఇవ్వాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుడిమాండ్ చేశారు. సోమవారం స్థానిక తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలు భారీవర్షాలకు దెబ్బనడంతో అన్నదాలు తీవ్రంగా నష్టపోయారన్నారు. బ్యాంకులు, ఎరువుల వ్యాపారులవద్ద అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారని, ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు రబీలో వరిపంటసాగుకు నీటిని ఇవ్వాలన్నారు. నాగార్జునసాగర్‌ప్రాజెక్టులో 574అడుగుల నీరు ఉందని, సాగు, తాగునీటికి సరిపోతుందన్నారు. జిల్లాలో ముగ్గురు రాష్ట్ర, ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నప్పటికీ, రైతులను ఆదుకోవడంలో వారు విఫలమయ్యారన్నారు. జిల్లాలో దెబ్బతిన్న పంటలను వ్యవసాయశాఖమంత్రి రఘువీరారెడ్డి ఎక్కడా పరిశీలించలేదన్నారు. రబీలో రైతులకు ఉచితంగా విత్తనాలను అందజేయాలని, 75కిలోల ధాన్యం బస్తాకు 1500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల శాఖామంత్రిని, సిఎంను కలిసి రబీలో వరిసాగుకు సాగునీరు వచ్చేవిధంగా కోరతామన్నారు. ఈసమావేశంలో టిడిపి నాయకులు వర్ల రత్నం, బాబావలి, షేక్ అమీర్, దేవదానం, హనుమంతరావుతదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీలో దాడి ఘటనపై చీఫ్‌విప్ చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట, డిసెంబర్ 16: పోలీసులు, మీడియాసాక్షిగా అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి సంఘటనపై ఛీప్‌విప్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీలో టీబిల్లు చర్చకు వస్తుందని తెలిసినప్పటికీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనాయకుడు నారా చంద్రబాబునాయుడు సమైక్యాంధ్ర, సమన్యాయం ముసుగులో రాష్ట్రప్రజలను అయోమయానికి గురిచేశారని, దీనికి వారిరువురు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రులచే రాజీనామాలు చేయించకుండా, అసెంబ్లీలో తీర్మానం వస్తే తమ తడాఖా చూపిస్తామని మీడియా ముందు ప్రగల్భాలు పలికారని, టి బిల్లు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగలేదంటూ నాటకాలాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్జీవోలచే సమ్మె చేయించారని, అనంతరం సమ్మెను విరమింపచేశారని, టి బిల్లు వచ్చిన తర్వాత అశోక్‌బాబు మీడియాముందు మాట్లాడటమే తప్ప కార్యాచవరణలో ఏమీలేదన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తెలంగాణాబిల్లు అసెంబ్లీకి వస్తే గైర్హాజరుకావడం ఏమిటని ప్రశ్నించారు. కనీసం తాను చెప్పే సమన్యాయం గురించి అయినా అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉందా, లేదా అని ప్రశ్నించారు. హైదరాబాదులో జరిగిన బీసీల సదస్సుకు చంద్రబాబునాయుడు హాజరయ్యారని, అసెంబ్లీకి మాత్రం సమయం కేటాయించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరి ప్రజలకు తెలుసన్నారు. ఇక్కడి తెలుగుదేశంపార్టీ నాయకులు సమైక్యాంధ్ర కోసం ధర్నాలు, బంద్‌లు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇవన్నీ వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలను తెలుగుదేశంపార్టీ నాయకులు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. టిడిపి నాయకులు చంద్రబాబునాయుడు ఇంటిముందు ధర్నాచేసి, సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లు చెప్పించాలని డాక్టర్ గోపిరెడ్డి కోరారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం నాడే ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటుచేసి సమైక్య నినాదాన్ని అసెంబ్లీలో వినిపించాలని చెప్పినట్లు డాక్టర్ గోపిరెడ్డి తెలిపారు. ఈసమావేశంలో పిల్లి ఓబుల్‌రెడ్డి, శంకర్‌యాదవ్, సుజాతపాల్ తదితరులు పాల్గొన్నారు.
చోరీకి గురైన 9 సవర్ల బంగారం స్వాధీనం
మాచవరం, డిసెంబర్ 16: మండలంలోని కొత్తపినె్నల్లిగ్రామంలో చోరీకి గురైన రెండులక్షల విలువైన బంగారాన్ని పిడుగురాళ్ళ రూరల్ సిఐ బిలాలుద్ధీన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ మహమ్మద్ షఫీ ఎట్టకేలకు రికవరీ చేశారు. వివరాల్లోకి వెళితే...ఈనెల మూడోతేదీన కొత్తపినె్నల్లిగ్రామానికి చెందిన గాదె శివారెడ్డి ఇంట్లో ఎవరులేని సమయంలో ఇంట్లోని బీరువాను పగులగొట్టి దొంగలు తొమ్మిది సవర్ల బంగారాన్ని చోరీచేశారు. ఈనెల పదోతేదీన మాచవరం పోలీసుస్టేషన్‌లో శివారెడ్డ్ఫిర్యాదుచేశారు. ఈమేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు జరిపారు. సోమవారం పినె్నల్లిబస్టాండ్ సెంటర్‌లో ఉన్న సిరా పూర్ణచంద్రారెడ్డిపై అనుమానంతో విచారణ జరపగా, బంగారాన్ని చోరీ చేసినట్లు పూర్ణాచంద్రారెడ్డి వెల్లడించాడు. పూర్ణచంద్రారెడ్డివద్దనుండి తొమ్మిది సవర్ల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడైన పూర్ణచంద్రారెడ్డిని పిడుగురాళ్ళకోర్టులో హాజరుపర్చినట్లు ఎస్‌ఐ మహమ్మద్ షఫీ, ట్రైనింగ్ ఎస్‌ఐ హరిబాబు తెలిపారు.
కేరళ రైల్వే పోలీసుల దౌర్జన్యంపై హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు
నరసరావుపేట, డిసెంబర్ 16: ఆంధ్రరాష్ట్రానికి చెందిన అయ్యప్పస్వామి భక్తులపై కేరళరాష్ట్ర రైల్వే పోలీసులు దౌర్జన్యం చేయడంపై మానవహక్కుల కమిషన్‌కు నరసరావుపేట అయ్యప్పస్వామి భజన బృందం సభ్యులు శనివారం ఫిర్యాదుచేయగా, దీనిపై స్పందించిన హెచ్‌ఆర్‌సి సభ్యులు ఏపి చీఫ్ సెక్రటరీకి జరిగిన దాడిపై విచారణ జరిపి కేరళ రాష్ట్రప్రభుత్వంతో మాట్లాడి, వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటోతేదీలోగా నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఈమేరకు నరసరావుపేట అయ్యప్పస్వామి భక్తులు సోమవారం ప్రకటనను అందజేశారు. ఆంధ్రరాష్ట్రం నుండి కేరళకు వెళ్ళిన అయ్యప్పభక్తులు తిరుగు ప్రయాణంలో శబరి ఎక్స్‌ప్రెస్‌లోని లింగారెడ్డి అనే భక్తుని సీటులో మప్టీలో ఉన్న రైల్వే కానిస్టేబుల్ కూర్చుని అహంకారంతో లింగారెడ్డికి సీటు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తూ, భౌతికదాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో తీర్థయాత్రలు చేస్తున్న ఆంధ్రరాష్ట్ర భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని వారి కోరినట్లు పేర్కొన్నారు. భక్తులు స్వేచ్ఛగా ప్రయాణం చేసే హక్కును కల్పించాలని కోరినట్లు డప్పు శ్రీను, చౌడం శ్రీనివాసరావు, మాచర్ల బాబు, చందోలు సాంబశివరావుగుప్త, రామచంద్రరావు, మణికుమార్ బహుదూర్, చంద్రశేఖర్, పి కృష్ణ తదితరులు ఆ ప్రకటనలో తెలిపారు.
ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్
ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు
వినుకొండ, డిసెంబర్ 16: పట్టణ ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్టీసిడిపోవద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వపరం చేయాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని, రిటైర్డ్ ఉద్యోగులకు ఐదువేల రూపాయలకు పెన్షన్‌ను పెంచాలని, కార్మికులపై పనిభారం తగ్గించాలనే తదితర డిమాండ్లతో ఎంప్లారుూస్ యూనియన్ కార్మికులు దీక్ష చేపట్టారు. దీక్షలో ఆర్టీసీ కార్మికులు జెజె జశ్వంత్, ఏపిరెడ్డి, వి ఆంజనేయులు, షేక్ షరీఫ్, రావు, రవీంద్రనాధ్, జెఎస్ రావు, షేక్ ముస్త్ఫా తదితరులు పాల్గొన్నారు. దీక్షాశిబిరాన్ని ఆర్టీసీ నాయకులు కె రమేష్‌బాబు, పి శ్రీనివాసరావు, సాంబశివరావు, సంజీవరావు, షేక్ బాజీ, జె చంద్రశేఖరరావులు పర్యవేక్షించారు.