Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు

$
0
0

ఒంగోలు, డిసెంబర్ 16: భారత ఎన్నికల కమిషన్ ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఓటర్ల జాబితా రూపకల్పనలో భారీగా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో భారీఎత్తున ఓటర్ల నమోదులో అక్రమాలు జరిగాయంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికీ జిల్లా యంత్రాంగంలో మాత్రం మార్పు రాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకేంద్రమైన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 13,400 దొంగ ఓట్లు ఉన్నట్లు ఒంగోలు ఆర్‌డిఒ మురళికి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు సోమవారం సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. కాగా ఓటర్ల నమోదులో అక్రమాలను అరికట్టాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈనెల 18న కలసి వినతిపత్రాన్ని సమర్పించనున్నట్లు ఆంధ్రభూమి ప్రతినిధికి హైదరాబాద్ నుండి ఫోన్‌లో తెలిపారు. మృతి చెందినవారి పేర్లను తొలగించకుండా ఆ ఓట్లను యథావిధిగా ఓటర్ల జాబితాలో ముద్రించారని టిడిపి నాయకులు ఆర్‌డిఒకు వివరించారు. నూతన ఓటర్లను చేర్పించాలని భారత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పదేపదే అధికారులను ఆదేశిస్తున్నప్పటికి ఆచరణలో మాత్రం జరగటం లేదని టిడిపి నాయకులు ధ్వజమెత్తుతున్నారు. ఫారం -7ను నూతన ఓటర్ల నుండి అధికారులు తీసుకోవటం లేదని ఆరోపించారు. ఇప్పటికి మూడుసార్లు ఆర్‌డిఒకు ఇచ్చినా ఫలితం లేదని నేతలు విమర్శిస్తున్నారు. బూత్‌లెవల్ అధికారులు ఆ బూత్‌లకు వచ్చే సమయంలో ముందుగా బూత్ ఏజెంట్లకు సమాచారం ఇవ్వాలని కాని అలాంటి సమాచారాన్ని అధికారులు ఇవ్వటం లేదని టిడిపి నేతలు మండిపడుతున్నారు. గతంలో కూడా ఒంగోలు నియోజకవర్గ పరిధిలో 14వేల దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. కాగా కొత్తపట్నం మండలంలోని అల్లూరు, ఒంగోలు మండలంలోని నర్సాపురం అగ్రహారం, పెళ్ళూరు, త్రోవగుంట ప్రాంతాలకు చెందిన వారి ఓట్లు ఒంగోలు నగరంలో ఉన్నాయని టిడిపి నేతలు పేర్కొంటున్నారు. అలాంటి ఓటర్లను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని సత్యనారాయణపురానికి చెందిన వీరిశెట్టి విజయలక్ష్మి తండ్రి పేరు సాంబశివరావు, ఇంటినెంబరు 4-300-1గా ఓటు ఉంది. అదే పేరుతో వీరిశెట్టి విజయలక్ష్మి, భర్త పేరు సాంబశివరావు, ఇంటి నెంబరు 4-300 (1)గా మరో ఓటు ఉంది. ఇలాంటి తప్పులు ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో కోకొల్లలుగా ఉన్నాయని టిడిపి నేతలు సాక్ష్యాధారాలతో ఒంగోలు ఆర్‌డిఒకు నివేదిక సమర్పించారు. ఆర్‌డిఒను కలిసిన వారిలో జిల్లా టిడిపి నేతలు టి మస్తాన్‌రావు, కె వెంకటేశ్వర్లు, బి వాసుకృష్ణ, చినయోగయ్య తదితరులు ఉన్నారు. మొత్తంమీద ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దొంగ ఓటర్లపై ఎన్నికల కమిషన్ స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

టి-బిల్లు ప్రతులు దగ్ధం
జాతీయ రహదారిపై
వైకాపా రాస్తారాకో
ఒంగోలు, డిసెంబర్ 16: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించిన తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతవౌతున్నాయి. సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లాపార్టీ కార్యాలయం దగ్గర తెలంగాణ బిల్లు ప్రతులను చించి కాల్చివేశారు. ఈసందర్భంగా వైకాపా నాయకులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఉద్యమం దీర్ఘకాలంగా ఉద్ధృతంగా జరుగుతున్నప్పటికీ కిరణ్ ప్రభుత్వం నేరుగా అసెంబ్లీకి టి-బిల్లును పంపటం దారుణమన్నారు. సమైక్యాంధ్ర కోసం తీర్మానం చేయాల్సి ఉండగా తెలంగాణ బిల్లుకు అనుకూలంగా కేంద్రం వ్యహరించటం బాధాకరమన్నారు. అదేవిధంగా సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో టి బిల్లును వ్యతిరేకిస్తూ ఐదవ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారాకో నిర్వహించారు. స్ధానిక లాయర్‌పేటలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నుండి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి ఐదవ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈకార్యక్రమంలో విద్యార్థి జెఎసి రాష్ట్ర కోకన్వీనర్ రాయపాటి జగదీష్ మాట్లాడుతూ అసెంబ్లీలో టి-బిల్లును సీమాంధ్ర ప్రాంతానికి చెందిన శాసనసభ్యులందరూ వ్యతిరేకించాలని కోరారు. బిఎసి సమావేశంలో టి బిల్లుపై చర్చ లేకపోయినా కావాలని దిగ్జీరాజా ఇచ్చిన సొమ్ముతో సమైక్యాంధ్ర చాంపియన్ అయిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జ్వరం సాకుతో, సీమాంధ్ర ద్రోహి అయిన స్పీకర్ నాదెండ్ల మనోహర్ సీమాంధ్ర ప్రజలను మోసం చేసి టి బిల్లును అసెంబ్లీలో పెట్టి సీమాంధ్ర ప్రజల గొంతు కోశారన్నారు. ఆయా కార్యక్రమాల్లో వైకాపా ఒంగోలు నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, జిల్లా ఎస్‌సి సెల్ కన్వీనర్ కంచర్ల సుధాకర్, బిసి సెల్ కన్వీనర్ కఠారి శంకర్, జిల్లాపార్టీ అధికార ప్రతినిధి కఠారి రామచంద్రరావు, సమైక్యాంధ్ర రాష్ట్ర విద్యార్ధి జెఎసి జిల్లా యువజన కన్వీనర్ కన్నా వరప్రసాదు, నగర కన్వీనర్ ఎ ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలి
ఒంగోలులో ఆటోల బంద్ సంపూర్ణం
ఒంగోలు, డిసెంబర్ 16: ఆటో కార్మికులను ట్రాఫిక్ పోలీసులు వేధించడం మానుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఆటో కార్మికులపై ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న అధిక జరిమానాలు, వేధింపులకు వ్యతిరేకంగా ఎపి ఆటో అండ్ ట్రాలీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు నగరంలో ఆటోల బంద్ సంపూర్ణంగా జరిగింది. ఆటోడ్రైవర్‌లు స్వచ్ఛందంగా ఆటోలు నిలిపివేసి కొత్త మార్కెట్ వద్ద సిఐటియు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ భారీ సభ జరిగింది. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, సిఐటియు నగర ఉపాధ్యక్షులు జివి కొండారెడ్డి, నగర కార్యదర్శి బి వెంకట్రావు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎండి బేగ్‌లు మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ సిఐ ప్రతి ఆటోకు ప్రతిసారి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అధిక జరిమానాలు భరించలేక కార్మికులు అర్థాకలితో అలమటిస్తున్నట్లు తెలిపారు. హోంగార్డులు కార్మికులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ట్రాఫిక్ సిఐ ఉద్దేశపూర్వకంగా ఆటోస్టాండ్లు ఏర్పాటు కాకుండా తన కార్యాలయంలోనే ఫైళ్ళను తొక్కిపెట్టారని మండిపడ్డారు. యూనియన్ పలుమార్లు విన్నవించినప్పటికీ జాయింట్ మీటింగ్ ఏర్పాటుచేసి సామరస్యంగా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోకపోగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నట్లు ధ్వజమెత్తారు. ఒంగోలు వన్ టౌన్, తాలూకా సిఐలు బిటి నాయక్, ఐ శ్రీనివాసన్‌లు సభ దగ్గరకు వచ్చి ఛలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ విరమించుకొని డిఎస్‌పి చర్చలకు ఆహ్వానించారని తద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పడంతో సిఐటియు నాయకత్వం అందుకు అంగీకరించింది. దీంతో ఆటో కార్మికులు భారీ ప్రదర్శనతో కర్నూల్ రోడ్డు, అద్దంకి బస్టాండ్, పాత మార్కెట్, ట్రంకురోడ్డు సెంటర్ మీదుగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ప్రదర్శనకు ఆటో వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు డి వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంగరాల శ్రీనివాసరావు, కార్యదర్శి తంబి శ్రీనివాసులు, కోశాధికారి ఎ కోటేశ్వరరావు, డి పృద్వీరాజ్, సత్యానందం, రమణారెడ్డి, హనుమంతరావు, ఎస్‌కె సిలార్‌బాబు, కె శ్రీనివాస్ చౌదరి, సిహెచ్ శ్రీనివాసరావు, తోట శ్రీను, కుమార్‌లు నాయకత్వం వహించారు. అనంతరం సిఐటియు నగర అధ్యక్షులు దామా శ్రీనివాసులు, నాయకులు ఎస్‌డి హుస్సేన్, జి బాలకృష్ణ, కెఎఫ్ బాబు, ఎ శ్రీనివాసరావులతో కూడిన ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం ఒంగోలు డిఎస్‌పి చాంబర్‌లో చర్చలు జరిగాయి. ఒంగోలు డిఎస్‌పి జాషువా, వన్ టౌన్ సిఐ బిటి నాయక్, తాలూకా సిఐ శ్రీనివాసన్, ఎంపి మాగుంట ప్రతినిధులు అయినాబత్తిన ఘనశ్యామ్, మంత్రి శ్రీనివాసరావు, గొర్రెపాటి శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు జివి కొండారెడ్డి, బి వెంకట్రావు, చీకటి శ్రీనివాసరావు, రావూరి శ్రీనివాసరావు, పాపని సుబ్బారావు, ఆటో యూనియన్ స్టాండ్ వారి ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఇరువురు ఐదు అంశాలపై ఒక అంగీకారానికి వచ్చారు. ట్రాఫిక్ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటుచేసి క్షేత్రస్థాయి పరిశీలన చేసి త్వరలో ఆటోస్టాండ్లను ఏర్పాటు చేస్తామని, అధిక జరిమానాల విధానం రద్దు చేస్తామని, హోంగార్డుల ఆడగాలను నివారిస్తామని, పర్మినెంట్ పోలీస్ నెంబర్లు ఇస్తామని, ఒంగోలులో ఇచ్చే నెంబర్లు శింగరాయకొండ, కొండేపి, జరుగుమల్లి, చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, ఎన్‌జి పాడు, కొత్తపట్నం మండలాలకు కూడా పోలీస్ నెంబర్లు వర్తిస్తాయని హామీ ఇచ్చారు. డ్రైవర్ పక్కన ఒక ప్యాసింజర్‌ను కూర్చోబెట్టుకునే అవకాశం కూడా ఇవ్వనున్నట్లు డిఎస్‌పి వెల్లడించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సంపూర్ణంగా ఆటోల బంద్ జరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

ధర్మవరపు మృతి కళాకారులకు తీరని లోటు
నల్లూరి ఘన నివాళి
ఒంగోలు, డిసెంబర్ 16 : ప్రఖ్యాత సినీ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణం కళాకారులకు తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు ( అన్న) అన్నారు. సోమవారం రాత్రి స్థానిక సివిఎన్ రీడింగ్ రూము హాలులో నల్లూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సినీ హాస్యనటుడు నవ్వులరేడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాకు చెందిన ధర్మవరపు దూరదర్శన్‌లో మొదటి తెలుగు సీరియల్స్ అయిన ఆనందోబ్రహ్మ, అనగనగా ఒక శోభ అనే కార్యక్రమాలను ప్రారంభించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారని కొనియాడారు. ఒంగోలులోని సిఎస్‌ఆర్ శర్మా కాలేజీలో చదువుతూ అనేక నాటికలలో ప్రదర్శించి మంచి పేరు ప్రతిష్టలు పొందినట్లు తెలిపారు. ఆ తరువాత సినీ రంగంలో కూడా ప్రవేశించి 589 సినిమాల్లో నటించి ప్రేక్షకులను తన నటనతో అలరింప చేశారని ప్రశంసించారు. అలాంటి ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆయన మృతికి ఘన నివాళులు అర్పిస్తూ కుటుంబానికి సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టిఆర్ కళాపరిషత్ అద్యక్షుడు ఈదర హరిబాబు, కళాకారులు ఎస్ సుబ్బారావు, మిడసల మల్లికార్జున్, పివిఆర్ చౌదరి, అంగలకుర్తి ప్రసాద్, ఎస్‌కె సబ్‌దర్, ఎల్ శంకర్, కెవి సుబ్బారావు, దాసయ్య, వీరాస్వామి, చిట్టా శివప్రసాద్, రాజశేఖర్, రాఘవులు, గాండ్ల శ్రీను తదితరులు పాల్గొని ధర్మవరపు నటనను, మంచితనాన్ని ప్రస్తుతించారు.

చెరువులోపడి ఒకరు మృతి
కంభం, డిసెంబర్ 16: కంభం చెరువుకట్టపై తేరాతేజ్ పండుగ నిర్వహిస్తుండగా అది చూసేందుకు చిన్నకంభంకు చెందిన బిటెక్ విద్యార్థి ఎ హరిబాబు (21) వెళ్ళి ఈత కొడుతూ మృతి చెందాడు. కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని స్నేహితులు తెలిపారు. విషయం తెలుసుకున్న తండ్రి వెంకటేశ్వర్లు సృహతప్పిపోయాడు. అతనిని వెంటనే 108 ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హరిబాబు మృతదేహాం కోసం చెరువులో గాలిస్తున్నారు.

ఆత్మహత్యలకు నెలవు కంభం చెరువు
* నిత్యం మృతి చెందుతున్న యువకులు
* భద్రత లేకపోవడమే కారణమా..?
మార్కాపురం, డిసెంబర్ 16: ఆసియాఖండంలోనే అత్యంత పెద్దచెరువుగా ప్రఖ్యాతిగాంచిన కంభం చెరువు ఆత్మహత్యలకు నిలయంగా మారింది. గత కొనే్నళ్ళుగా విద్యార్థులు, యువకులు, మహిళలు ఈ చెరువులోదూకి ఆత్మహత్యలు చేసుకోవడంతో కంభం చెరువు ఆత్మహత్యలకు నెలవుగా ప్రసిద్ధికెక్కింది. గతంలో ఒక వివాహిత యువతి కుటుంబ కలహాలతో కలతచెంది ఈ చెరువులోదూకి ఆత్మహత్య చేసుకోగా, మరోయువతి ప్రేమ విఫలమై కంభంచెరువులోని నీటి పరిణామం తెలుసుకునే వంతెనపై సూసైడ్ నోట్‌రాసిపెట్టి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా సంవత్సరంలో 10కిమించి ఆత్మహత్యలు ఈచెరువులో జరుగుతున్నాయి. మొన్నటికిమొన్న ఓ ఇంటర్ విద్యార్థిని పరీక్షలు తప్పుతాననే భయంతో చెరువులోదూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటన మరువకముందే చిన్నకంభంకు చెందిన యువకుడు గరికతొక్కుడు (తేరాతేజ్) పండుగ చూసేందుకు వెళ్ళి ఈత కొడుతూ మృత్యువాత పడ్డాడు. శ్రీకృష్ణదేవరాయల సమయంలో నిర్మించిన చెరువు రైతులకు సాగునీరు అందించేందుకు ప్రకృతి సోయగాల మధ్యఉంది. ఈప్రాంతప్రజలు సేదతీర్చుకోవాలంటే ఎలాంటి ఉద్యానవనాలు లేకపోవడంతో ఈ చెరువును సందర్శించి ఆనందం పొందుతారు. ఈ చెరువు మండలం చుట్టుపక్కల గ్రామాలకు సాగు, తాగునీరు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాంటి ఈ చెరువులో చేపల పెంపకందారులు చేపలను వదిలి పెంచుతారు. చేపల పెంపకందారుల మధ్య గతంలో ఒకసారి వివాదాలు ఏర్పడటంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ చెరువునీటిని విషపూరితం చేసి చేపలను చంపారు. ఈ పరిస్థితుల్లో ఈచెరువు సూసైడ్ పాయింట్‌గా మారడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా నీటిపారుదలశాఖ అధికారులు ఈప్రాంతంలో కాపాలా ఏర్పాటు చేసి ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

అటవీశాఖ అధికారులకు ఆయుధాలు మంజూరు చేయాలి
* ఎపి జూనియర్ ఫారెస్టుఅసోసియేషన్ డిమాండ్
మార్కాపురం టౌన్, డిసెంబర్ 16: అటవీశాఖ సిబ్బందికి ప్రభుత్వం ఆయుధాలను మంజూరుచేసి విధినిర్వహణకు పంపాలని ఎపి జూనియర్ ఫారెస్టు అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ టి చిరంజీవి అన్నారు. స్థానిక అటవీశాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన అటవీఅధికారుల సంతాపసభలో ఆయన మాట్లాడారు. శేషాచలం కొండల్లోని అటవీప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల చేతుల్లో అతిదారుణంగా హత్యకాబడిన అటవీశాఖ అధికారులు శ్రీధర్, ఉపఅటవీక్షేత్ర అధికారి డేవిడ్‌కరుణాకర్‌లను చంపడం హేయమైన చర్య అన్నారు. అధికారులు నిరాయుధులు కావడంతో దుంగడులు దుశ్చర్యలకు పాల్పడ్డారని, ప్రభుత్వం అధికారులకు ఆయుధాలను మంజూరుచేసి కనపడితే కాల్చివేత ఉత్తర్వులను అమలుచేస్తేకానీ అడవిదొంగల ఆటలు అరికట్టలేమని అన్నారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స చేయించాలని, కిడ్నాప్‌కు గురైన వారిని సురక్షితంగా కాపాడాలని కోరారు. బేస్‌క్యాంప్‌ల పహారీని మరింతగా ప్రతిష్టపరచి అటవీజంతువుల అభివృద్ధికి కృషి చేయాలని, అంతరించిపోతున్న వృక్షాలను కాపాడేందుకు ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన స్పీకర్
* తండ్రిని తలపించేవిధంగా వ్యవహరించడం అన్యాయం
మార్కాపురం, డిసెంబర్ 16: రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడం అన్యాయమని జిల్లాటిడిపి అధికారప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం అన్నారు. సోమవారం శాసనసభలో జరిగిన తీరుపై ఆయన మాట్లాడుతూ ఆనాడు ఎన్టీ రామారావు ఇతరదేశాలకు వెళ్ళిన సమయంలో స్పీకర్ తండ్రి నాదెండ్ల భాస్కర్‌రావు అక్రమమార్గంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనిచేసి అధికారం చేజిక్కించుకున్నారని అన్నారు. ప్రస్తుతం శాసనసభ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారని అన్నారు. శాసనసభలో సీమాంధ్ర ఎమ్మెల్యేలకు కనీస సమాచారం లేకుండా బిల్లును ప్రవేశపెట్టడం అన్యాయమని అన్నారు. అలాగే శాసనసభ నాయకులు ముఖ్యమంత్రి సభలో లేని సమయంలో ఇలాంటి కీలకమైన బిల్లును శాసనసభలో తీసుకురావడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఒకవైపు బిఎసిలో చర్చించి సభకు బిల్లు తీసుకురావడం జరుగుతుందని చెప్పినప్పటికీ ఆయన మాటలుకూడా కాదని ఎలా బిల్లు ప్రవేశపెట్టారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఆనాడు ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావుకు ప్రజలు ఏవిధమైన గుణపాఠం చెప్పారో స్పీకర్‌కు అదే గుణపాఠం చెబుతారని అన్నారు. తెలుగుదేశంపార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, కేవలం యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానంపైనే తాము వ్యతిరేకిస్తున్నామని, బిల్లుపై చర్చ జరిగేవిషయంలో కూడా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేయడం ఖాయమని అన్నారు.

అమలు కాని భూపంపిణీ
పేదలకు పట్టాలు ఇవ్వాలి
సిఎస్‌పురం, డిసెంబర్ 16: ప్రభుత్వం ఆర్భాటంగా విడతల వారీగా భూములు పంపిణీ చేస్తున్నరే తప్ప లబ్ధిదారులకు భూములు పంపిణీ చేయడంలేదని, ఇదంతా ఒక బూటకం అని ఏపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రావు విమర్శించారు. సిపిఐ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రావు మాట్లాడుతూ మూడవ విడత భూ పంపిణీలో భాగంగా పెదరాజుపాలెం, నల్లమడుగుల గ్రామాలలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను అస్సైన్డ్‌మెంట్ కమిటీలో ఆమోదించినప్పటికి నేటికి వారికి భూపంపిణీ చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని తెలిపారు. అధికారుల చుట్టూ పలుసార్లు లబ్ధిదారులు తిరిగినా పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. అర్హులైన పేదలకు భూమి పట్టాలు, నివేశన స్థల పట్టాలు ఇవ్వాలని కోరారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని, ఆపథకాలు ఎస్సీ,ఎస్టీలకు దక్కడం లేదన్నారు. పేదల ప్రయోజనాలను కాపాడడంలో యుపిఎ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అందుకు నిదర్శనం నిన్న నాలుగు రాష్ట్రాలలో వచ్చిన ఫలితాలే అని ఆయన విమర్శించారు. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ సిహెచ్ నాగభూషణానికి అందజేశారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్‌డి వౌలాలి, గిరిజన సమైక్య జిల్లా కన్వీనర్ శ్రీరామ్ శ్రీనివాసులు, సిపిఐ మండల కార్యదర్శి ఎస్‌కెవై పెదమస్తాన్, ఎం వెంకటకొండయ్య, బాలగురువయ్య, ఏసోబు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా కాశినాయన ఆరాధన
కనిగిరి, డిసెంబర్ 16: స్థానిక కొత్తపేటలో వెలసిన శ్రీ్భగవాన్ కాశినాయన ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ ఉత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆరాధనోత్సవాలలో భాగంగా గుడిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు సుబ్బారావు అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశినాయన ఆరాధన పూజాలను ముక్కు కాశిరెడ్డి, అదిలక్ష్మమ్మ దంపతులు నిర్వహించాగా, పులి శ్రీవాసులురెడ్డి విజయలక్ష్మి స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు రాజాల ఆదిరెడ్డి అధ్వర్యంలో నెల్లూరు సాయిబాబ అర్కెస్ట్రా పాటకచ్చేరి నిర్వహించారు. కాగా వేలాదిమంది భక్తులకు అన్నదానం కార్యక్రమానికి హాజరయ్యారు. ఆరాధనోత్సవాలను ఆలయ కమిటీ వర్క్‌ంగ్ ప్రెసిడెంట్ వెన్న శ్రీనివాసరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ముక్కు శ్రీహరిరెడ్డి, సుబ్బరెడ్డి, కత్తులపల్లి భాస్కరరెడ్డి, బి మాలకోండయ్య, తోకల తిరుపతిరావు అరాధనా మహోత్సవాన్ని పర్వవేక్షంచి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూశారు.

‘అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి’
కందుకూరు రూరల్, డిసెంబర్ 16: కార్మికులను పక్కదారి పట్టించేందుకు చేస్తున్న అసత్య ప్రచారాలను యూనియన్ కార్మికులు తిప్పి కొట్టాలని ఎంప్లాయిస్ యూనియన్ స్థానిక డిపో కార్యదర్శి పి రామ్మూర్తి అన్నారు. సోమవారం స్థానిక ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం సమీపంలో ఆర్టీసీలో కాంట్రాక్టు పద్దతి ద్వారా విధులు నిర్వహిస్తున్న కార్మికులను కొనసాగించాలని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర సమితి ఇచ్చి పిలుపు మేరకు కార్మికులు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈదీక్షా శిబిరాన్ని సందర్శించి రామ్మూర్తి మాట్లాడుతూ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న విధంగా 24వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని యాజమాన్యంతో పలు దఫాలుగా చర్చించామన్నారు. అందులో భాగంగా గత నెల 25న రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో యూనియన్ రాష్ట్ర నాయకులు చర్చించారని ఆయన అన్నారు. అయితే కొన్ని యూనియన్లు యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేస్తుందని ధర్నాలకు పిలుపునిచ్చి విరమించారని అన్నారు. అయితే కార్మిక సంక్షేమమే లక్ష్యంగా గల ఎంప్లాయిస్ యూనియన్ మరలా యాజమాన్యంతో చర్చించి కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికైనా కార్మికుల పక్షాన నిరంతరం పోరాడే ఎంప్లాయిస్ యూనియన్‌పై అసత్య ప్రచారాలు చేస్తే కార్మికులే గుణపాఠం చెబుతారన్నారు. దీక్షా శిబిరంలో ఆర్టీసీ కార్మికులు ఎంఎన్ రావు, పిసిహెచ్ నరసింహారావు, ఎం నరసింహారావు, కె శ్రీనివాసులు, జి హరిబాబు కూర్చున్నారు. ఈకార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ మాజీ నాయకులు డిపి రంగయ్య, నాయకులు గోళ్ళ మాధవరావు, రాజు, శివయ్య, ఆదినారాయణ, బాబు, నరసింహారావు, కార్మికులు పాల్గొన్నారు.

టిడిపి నేతల ఆరోపణ * రేపు ఎన్నికల ప్రధానాధికారిని కలవనున్న దామచర్ల
english title: 
donga votlu

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles