విశాఖపట్నం, డిసెంబర్ 16: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో ప్రక్షాళన ప్రారంభమైంది. సుదీర్ఘ కాలంగా ఒకే సీటులో పాతుకుపోయి, చేతికందినంత దండుకుంటూ కోట్లు కూడబెట్టిన వారిని, వారికి ఇతోధికంగా సహాయం చేస్తున్న వారిని, ఎడా పెడా బదిలీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వివిధ శాఖల నుంచి కావాలని జివిఎంసిలో డిప్యుటేషన్ వస్తుంటారు. లక్షలు ఖర్చు చేసి ఇక్కడి పోస్ట్‌లను కొనుక్కుంటుంటారు. వారు పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవడమే కాకుండా, జివిఎంసిలో ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచన వారిలో బలంగా పాతుకుపోతుంది. దీంతో బల్ల కిందే కాదు, ఎక్కడపడితే అక్కడ చేయి చాచి, డబ్బులు దండుకుంటున్నారు. ఈ పాపాన్ని జివిఎంసి ఉన్నతాధికారులకు కూడా కాస్తంత అంటించి, సుదీర్ఘం కాలం ఆయా సీట్లలోనే పాతుకుపోయి, సంపాదన అంటే వెగటుపుట్టేంతగా సంపాదించుకుంటున్నారు. ఎంత మంది కమిషనర్లు వచ్చినా, వీరిని ఆయా సీట్ల నుంచి కదపడం సాధ్యం కాకుండాపోయింది. అప్పుడప్పుడు ఎసిబి అధికారులు వందలు..వేలు లంచం తీసుకునే చిరు ఉద్యోగులను వలలో వేసుకుని పట్టుకుపోతున్నారు. కానీ ఇక్కడ లక్షలకు లక్షలు దిగమింగుతున్న వారిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఒకవేళ ఆయా సీట్ల నుంచి వీరిని కదపాలనకున్నా, ఉత్తర్వులు రాక మునుపే, రాజకీయ సిఫార్స్‌లు వచ్చేస్తున్నాయి. దీంతో కమిషనర్ కూడా ఏమీ చేయలేని దుస్థితికి చేరుకున్నారు.
తాజాగా జివిఎంసిలో అన్ని విభాగాల్లోని ఉద్యోగులను బదిలీ చేయడానికి ప్రస్తుత కమిషనర్ సత్యనారాయణ శ్రీకారం చుట్టారు. చాలా కాలంగా ఒకే సీటులో పాతుకుపోయిన ఉద్యోగులను బదిలీ చేస్తున్నారు. కమిషనర్ పేషీలో ఉన్న ఔట్ సోర్సింగ్ సిబ్బందితో సహా సుమారు 120 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని బదిలీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. అలాగే శాశ్వత ఉద్యోగులను కూడా వదిలిపెట్టడం లేదు. వారికి కూడా స్థాన చలనం కల్పిస్తున్నారు. దీంతో జివిఎంసి ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. చాలా కాలంగా కడుపులో చల్ల కదలకుండా కూర్చుని పనిచేసుకుంటూ, సాయంత్రానికి జేబులు నింపుకొంటూ వెళ్ళే వాళ్లంతా లబోదిబోమంటున్నారు. బదిలీ విషయం తెలుసుకున్న సదరు సిబ్బంది అంతా, రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు.
జివిఎంసిలో ఇటీవల ఓ అధికారి ఎసిబికి దొరికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి భరతం పట్టడమే కాకుండా, కార్పొరేషన్ పరువు ప్రతిష్ఠలను కాస్తంతైనా కాపాడాలన్న ఉద్దేశంతో కమిషనర్ తీసుకుంటున్న చర్యలు ఏమేరకు ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి.
22,23 తేదీల్లో జివిఎంసి బడ్జెట్ సమావేశాలు
* రేపటికి బడ్జెట్ సిద్ధం
విశాఖపట్నం, డిసెంబర్ 16: జివిఎంసి బడ్జెట్ సమావేశాలను ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించనున్నట్టు కమిషనర్ సత్యనారాయణ తెలియచేశారు. సోమవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ బడ్జెట్‌ను బుధవారం నాటికి సిద్ధం చేస్తామని తెలిపారు. జివిఎంసి స్పెషల్ ఆఫీసర్ జోషి 22, 23 తేదీల్లో విశాఖలోనే ఉంటారని కమిషనర్ వెల్లడించారు.
అమ్మహస్తం పథకానికి జిసిసి చింతపండు సిద్ధం
* ఈ సారి ఐదు జిల్లాలకు సరఫరా
విశాఖపట్నం, డిసెంబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అమ్మహస్తం పథకానికి అవసరమైన చింతపండును అందించేందుకు గిరిజన సహకార సంస్థ (జిసిసి) సిద్ధపడుతోంది. ఇందుకు సంబంధించి గతంలోనే కుదిరిన అంగీకారం మేరకు తొలుత రెండు జిల్లాలకే చింతపండు అందించేందుకు అంగీకరించిన జిసిసి ఇపుడు ఐదు జిల్లాలకు దీనిని అందివ్వాలని నిర్ణయించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చింతపండు ప్యాకెట్లను అందజేస్తోంది. వీటిని ఆయా జిల్లాల పౌరసరఫరాల విభాగాలకు అందజేస్తుంది. ఐదు జిల్లాలకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రభుత్వం కోరిన నాణ్యతతో కూడిన చింతపండును అందివ్వగలిగితే ఆ తరువాత దశలవారీగా మరికొన్ని జిల్లాలకు విస్తరించే యోచనలో ఉంది. ఇప్పటికే విశాఖ జిల్లా పాడేరు, విజయనగరం జిల్లాలో పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట, చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతాల నుంచి చింతపండును పెద్ద మొత్తంలో జిసిసి సేకరించగలుగుతోంది. ఈ తరహాలో సేకరించిన చింతపండును పిక్కతీసి, ప్యాకెట్ల రూపంలో మార్పు చేసేందుకు గిరిజన మహిళా సంక్షేమ సంఘాలకు జిసిసి అవకాశం కల్పిస్తోంది. దీనివల్ల గిరిజన మహిళ ప్రోత్సహించి ఉపాధి కల్పించవచ్చని సంస్థ భావిస్తోంది. లాభ, నష్టాలు లేని పద్ధతిలో చింతపండును అమ్మహస్తం పథకాన్ని అందిస్తున్న జిసిసి ఈ పథకంలో భాగమైన కారం, పసుపు, పప్పులు వంటివి సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ విధంగా ప్రతి ఏడాది 250 కోట్ల రూపాయల మేర సాధిస్తున్న ఆదాయాన్ని 300 కోట్లకు పెంచే విధంగా సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తీరప్రాంత పరిరిక్షణ అందరి బాధ్యత
విశాలాక్షిగనర్, డిసెంబర్ 16: సాంప్రదాయ వనరుల వెలకితీతకు కీలకంగా ఉన్న తీరప్రాంతాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైన ఉందని ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ ఆచార్య జిఎస్‌ఎన్ రాజు అన్నారు. సోమవారం ఏయు డెల్టా స్టడీస్ ఇనిస్టిట్యూట్ విభాగం వద్ద ఓఎన్‌జిసి సహకారంతో డెల్టా స్టడీస్ విభాగం మోడర్నన్ డెల్టా - ఏ ఫీల్ట్ అనే అంశంపై సదస్సు, శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్, గ్యాస్, వెలికితీతకు గోదావరి, కృష్ణా, డెల్టా నదీ పరివాహక ప్రాంతాలు దేశంలోనే ప్రసిద్దిగాంచాయన్నారు. ఇది వ్యవసాయానికే కాకుండా రసాయనక అవసరాలు వెలికితీయడానికి అవసరం అవుతుందన్నారు. వనరులు వెలికితీసే క్రమంలో పర్యావరణ కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. అనంతరం ఓఎన్‌జిసి డిజిఎం జనరల్ ఎస్‌కె మహంతి మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధితో డెల్టా ప్రాంతం ముడిపడి ఉందన్నారు. అయితే ఈ డెల్టా ప్రాంతంలో ఇక్కడ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందన్నారు. వ్యవసాయం, వనరుల వెలికితీత సమన్వయంతో ఓఎన్‌జిసి వ్యవహరిస్తోందన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు డెల్టా స్టడీస్‌పై అధ్యయనం చేస్తారు. దీనికి ఓఎన్‌జిసి శిక్షణిస్తారని డెల్టా స్టడీస్ ఇనిస్టిట్యూట్ కోర్సు డైరెక్టర్ ప్రొఫెసర్ కె.సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఏయు కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.జ్ఞానమణి, డిఎస్‌ఐ డైరెక్టర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎం.జగనాధరావు, టీచింగ్ అసోసియేషట్ నుంచి డాక్టర్ టి.కరుణకరుడు, విద్యార్థులు, పరిశోధకులు, ఆచార్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డెల్టా స్టడీస్‌కు చెందిన సావనీర్‌ను ఆవిష్కరించారు.
వైభవంగా ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు
సింహాచలం, డిసెంబర్ 16 : శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు దేవాలయంలో దర్శనాలు నిలిపివేశారు. సూర్యభగవానుడు ధనూరాశిలో ప్రవేశించిన శుభ ఘడయలలో ఆగమ శాస్త్రానుసారం దేవాలయంలో వైదికాదికాలు నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభానికి ప్రతీకగా నెలగంట మోగించారు. గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై తొలి పాశురాన్ని వైదికులు శాస్త్రోక్తంగా విన్నపం చేశారు. ఉత్సవ మూర్తులను ఆస్థాన మండపంలో వేంచింపజేసి సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. వేద పారాయణలు నిర్వహించారు. గోదాదేవిని పల్లకిలో వేంచింపజేసి బేడా మండపంలో తిరువీధి నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చక పురోహితుడు మోర్త సీతారామాచార్యులు ధనుర్మాస విశిష్టతను వివరించారు. గోదాదేవి వైభవ వైశిష్ట్యమే తిరుప్పావై అని తెలిపారు. శ్రీరంగనాథుడిని పొందడం కోసం గోదాదేవి నెలరోజుల పాటు ఆచరించి చూపినదే మార్గశిర వ్రతమని వివరించారు. శ్రీ రంగనాథుడిపై ముప్ఫై పాశురాలను స్వయంగా రాసి పారాయణ చేయడం జరిగిందని, వాటినే ఆలయాలలో ప్రతిరోజూ పారాయణ చేస్తామని ఆయన తెలిపారు. జనవరి 14న బోగి పండగ రోజుల గోదా శ్రీరంగనాథుల కల్యాణంతో ధనుర్మాస వ్రతం పూర్తి అవుతుందని ఆయన తెలిపారు.
మన్యంలో ప్రతి గ్రామానికి రోడ్డు
ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వినయ్‌చంద్
పాడేరు, డిసెంబర్ 16: విశాఖ మన్యంలో ప్రతి గ్రామానికి రహదారిని నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ తెలిపారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఏజెన్సీలో ప్రస్తుతం ఉన్న రహదారి సదుపాయాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధిని వేగవంతం చేయవచ్చునని అన్నారు. ఏజెన్సీ పదకొండు మండలాల్లో ప్రస్తుతం రహదారి లేని గ్రామాలను ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే గుర్తించి ఆయా గ్రామాలకు రోడ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. మన్యంలోని పదకొండు మండలాల పరిధిలో గల 244 పంచాయతీలలో చిట్టచివరి గ్రామానికి సైతం అంబులెన్స్ వెళ్లే విధంగా రహదారులు నిర్మించేందుకు మ్యాప్‌లతో సహా ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన సూచించారు. ఇందుకుగాను డివిజన్ స్థాయి ఇంజనీరింగ్ అధికారుల నేతృత్వంలో ఇంజనీరింగ్ అధికారులు స్వయంగా ప్రతి గ్రామాన్ని సందర్శించి పది రోజులలోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసేటప్పుడు స్థల సమస్య, అటవీ శాఖ అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. రోడ్ల నిర్మాణం ఎక్కడ చేపడితే గిరిజనులకు ప్రయోజనం ఉంటుందో గిరిజనులకు అవగాహన ఉండాలని ఆయన అన్నారు. అందుబాటులో ఉన్న నిధులను బట్టి ఏజెన్సీలో ఫ్రతి గిరిజన గ్రామానికి రహదారిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆదిమజాతి గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణంలో ముందుగా ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథక ప్రయోజనాలను ప్రతి గ్రామానికి వర్తింప చేయాలని ఆయన ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు అంకితబావంతో పనిచేయాలని, అభివృద్ధి పనులలో ఒక్క రూపాయి వృధా చేసినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇంజనీరింగ్ అధికారులు ముందుగా అనుమతులు తీసుకోకుండా ఏజెన్సీ ప్రాంతాన్ని విడిచివెళ్లరాదని ఆయన ఆదేశించారు. ఏజెన్సీలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన బాధ్యత పర్యవేక్షక ఇంజనీర్లదేనని ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతానికి నూతనంగా 22 అంబులెన్స్‌లు మంజూరైనట్టు ఆయన తెలిపారు. గిరిజనులకు అంబులెన్స్ సేవలు అందించాలని వినయ్‌చంద్ చెప్పారు. ఈ సమావేశంలో ఐ.టి.డి.ఎ. సహాయ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్.నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.ఆర్.జి.నాయుడు, ఏజెన్సీలోని పదకొండు మండలాల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ఆరువేల కోట్ల రుణాలు లక్ష్యం
కోటవురట్ల, డిసెంబర్ 16: జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా ఈ ఏడాది ఆరువేల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయిచినట్లు జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జయబాబు తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం బ్యాంకు మేనేజర్లు, ఎడీవోలు, వివిధ శాఖలకు చెందిన అధికారులతో రుణాలు మంజూరు, వసూళ్ళపై జయబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీప్‌లో 600 కోట్ల రూపాయల రుణాలు రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా 500 కోట్ల రూపాయలు అందజేసామన్నారు. రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈవిషయాన్ని రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. బ్యాంకర్లు రుణ వసూళ్ళఫై దృష్టి సారించాలన్నారు. వసూళ్ళఫై ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని చేరే విధంగా కృషి చేయాలన్నారు. మొండి బకాయి దారులపై ఆర్. ఆర్.యాక్టును అమలు చేయాలన్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు మాత్రమే వడ్డీ రాయితీ వర్తిస్తుందన్నారు. ఈవిషయాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. రుణ వసూళ్ళలో బ్యాంకర్లకు అధికారులు సహకరించాలని కోరారు. ఈసమావేశంలో ఇన్‌చార్జ్ ఎడీవో చంద్రశేఖర్, స్థానిక ఎస్.బి. ఐ. బ్రాంచ్ మేనేజర విక్రమ్, ఫీల్డ్ ఆఫీసర్ నూర్‌భాషా , స్థానిక డి.సి.సి.బి. బ్రాంచ్ మేనేజర్ టి. శ్రీరామ్మూర్తి, పలువురు అధికారులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.
కారు ఢీకొని రైతు మృతి
సబ్బవరం, డిసెంబర్ 16: మండలంలోని గొటి వాడ వద్ద సబ్బవరం - చోడవరం రోడ్డుపై సోమవారం ఉదయం 6 గంటలకు జరిగిన కారు ఢీ కొట్టిన ప్రమాదంలో పాల కేంద్రానికి పాలు తీసుకెళ్తున్న రైతు ఇరోతి రాములు(58) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈసంఘటనకు సంబంధించి స్ధానిక ఎస్‌ఐ జి.గోవిందరావు తెలిపిన వివరాలిలాఉన్నాయి. గొటివాడ కాలనీ కి చెందిన ఇరోతి శ్రీరాములు సోమవారం ఉదయానే్న పాలకేంద్రానికి సైకిల్‌పై పాలు తీసుకెళ్తున్న సమయంలో చోడవరం వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీరాములు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే స్ధానికులు ఆతడిని ప్రాణం ఉందని సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు సంఘటనా స్ధలంలోనే అతను మృతి చెందినట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ తెలిపారు.
తేనె టీగల దాడి.. మృత దేహాన్ని వదిలి పరాయిన బంధువులు
ఇదిలా ఉండగా మండలంలోని గొటివాడ వద్ద కారు ఢీ కొట్టిన ప్రమాదంలో మృతి చెందిన ఇరోతి శ్రీరాముల మృత దేహాన్ని సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బంధువులు సంఘటనా స్థలానికి తీసుకెళ్లి అక్కడ చింత చెట్లకింద ఉంచారు. అదే చెట్టుపై తేనె పట్టుకు ఉన్న తేనెటీగలు మృత దేహం వద్దకు చేరుకున్న బంధువులను చూసి ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో మృత దేహాన్ని వదిలి తమ ప్రాణాలు నిలుపుకునేందుకు పరుగులు తీశారు. అయితే మృత దేహాన్ని తీసుకెళ్లిన బంధువులు ఒక్కసారిగా పరుగులు తీయటం పట్ల విషయం అర్ధంకాని జనం అవాక్యయ్యారు. చివరికి విషయం తెలియటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఐరన్ వ్యాపారులకు బురిడీ
రూ. 40 కోట్లతో పరారీ
* పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
గాజువాక, డిసెంబర్ 16: తమను మోసం చేసి సుమారు 40 కోట్ల రూపాయలతో ఇద్దరు ఐరన్ వ్యాపారులు పరారయ్యారని ఉక్కు తుక్కు వ్యాపారులు సోమవారం గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి బాధితులు, పోలీసులు అందించిన వివరాలిలావున్నాయి. విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యాపారి, గాజువాక, ఆటోనగర్ ప్రాంతానికి చెందిన మరో వ్యాపారి బంధువులు. వీరిద్దరు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో సుమారు 60 మంది ఇనప తుక్కు వ్యాపారులు వద్ద పాత ఇనుమును కొనుగోలు చేసే వారు. కొనుగోలు చేసిన ఈ ఇనుమను ఇనప రాడ్లుగా తయారు చేసి విక్రయిస్తారు. దీంట్లో భాగంగా ఇనుప తుక్కు వ్యాపారులకు సుమారు 40కోట్ల రూపాయలు బకాయి పడినట్లు బాధితులు తెలిపారు. ఆరు నెలలు నుండి వ్యాపారులకు డబ్బు చెల్లించకుండా తిరుగుతున్నట్లు బాధితులు తెలిపారు. ఈ తరుణంలో విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీంట్లో భాగంగా విశాఖపట్నం ప్రాంతానికి వ్యాపారి స్టీల్ పరిశ్రమ ముందు సోమవారం బాధితులు ఆందోళనకు దిగారు. ఈ తరుణంలో గాజువాక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారుల ఆచూకీ తెలియజేస్తే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని బాధితులు ప్లకార్డులు ప్రదర్శించారు.
‘నష్టపరిహారం అందించాలి’
విశాఖపట్నం, డిసెంబర్ 16: ఇటీవల ఏర్పడిన పైలిన్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలు సోమవారం కలెక్టరేట్‌కు చేరుకున్నాయి. తుపాను బీభత్సంతో ఇళ్ళలోకి నీరు చేరి, కూలిపోవడం, మరికొన్ని దెబ్బతినడంతో నిలువ నీడ లేని పరిస్థితులు నెలకొన్నాయని మహిళలు ఆందోళన వ్యక్తంచేశారు. వైఎస్సార్‌సిపి నాయకుడు గోవింద్ నాయకత్వంలో యలమంచిలి అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీకి చెందిన దాదాపు వంద మంది మహిళలు, కుటుంబ సభ్యులు తరలి వచ్చారు. వీరంతా తమ గోడును కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌కు విన్నవించుకున్నారు. తుపాను కారణంగా ఆస్తులు కోల్పోయి, తీవ్రంగా నష్టపోయామని, దీనిని అంచనా వేసి తగిన ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా కోరారు.