వరంగల్, డిసెంబర్ 18: జాతీయికరణ చేసిన బ్యాంకింగ్ రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలతో తమకు చేటు జరుగుతుందని ఆరోపిస్తూ అఖిల భారత బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో జరిగిన ఒకరోజు సమ్మెతో జిల్లాలో అన్ని బ్యాంకులు మూతపడ్డాయి. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎటి ఎంలు కూడా పాక్షికంగా ఒక్కొచోట పూర్తిగా బంద్ కావడంతో మరింత అవస్థలపాలయ్యారు. బ్యాంకింగ్ రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలను ఇటీవలికాలంలో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం దేశవ్యాప్త సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల ఫెడరేషన్ పిలుపునిచ్చింది. అందులో భాగంగా సమ్మెలో జిల్లాలోని అన్ని బ్యాంకులు పాల్గొని బ్యాంకు కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. వరంగల్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ జోనల్ కార్యాలయం, హన్మకొండలోని ఆంధ్రా బ్యాంకు ప్రధాన కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు సంఘాల నేతలు సత్యనారాయణ, శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సర్వీసు రూల్స్‌కు సంబంధించి ప్రయోజనాలు కాపాడాలని, ఐదురోజుల పని విధానం అమలు చేయాలని, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులపై స్పష్టత కోరుతూ నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. దీంతో అఖిల భారత బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని అన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 10లక్షల మంది ఉద్యోగులు ఈ బంద్‌లో పాల్గొన్నారని తెలిపారు. ఇకనైనా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఐటిడిఎ అధికారుల తీరుపై..
జెసి ఆగ్రహం
ప్రణాళికతో పనులు పూర్తిచేయాలని సూచన
మేడారం అభివృద్ధి పనులను పరిశీలించిన జెసి
గోవిందరావుపేట, డిసెంబర్ 18: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులను జాయింట్ కలెక్టర్ పౌసమిబసు బుధవారం పరిశీలించారు. ట్రైనీ కలెక్టర్ రాజీవ్ హన్మంతు, ములుగు ఆర్డీఓ మోతిలాల్‌తో కలసి పస్రా, తాడ్వాయిల మీదుగా మేడారం చేరుకున్నారు. పలు శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు శాఖలు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభిస్తే ఐటిడిఎ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను టెండర్ల ప్రక్రియ పూర్తి చేయకపోవడంపై జెసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తేదీలోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారో సమగ్ర నివేదిక అందజేయాలని ఐటిడిఎ ట్రైబర్ వెల్ఫేర్ అధికారులకు జెసి ఆదేశాలు దాఖలు చేశారు. అభివృద్ధి పనులలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 2.25కోట్ల రూపాయలతో ఊరట్టం వంతెన పనులు అసంపూర్తిగా మిగలాగ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని సంబంధిత అధికారులను జెసి అడిగి తెలుసుకున్నారు. అయితే కాంట్రాక్టర్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, సకాలంలో స్పందించకపోతే శాఖా తరపున పనులు పూర్తిచేస్తామని అధికారులు జెసి వివరించారు. అంతేకాకుండా రోడ్డు పనులు చేపట్టే సమయంలో అటవీ శాఖ నుండి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలు శాఖల అధికారులు జెసి దృష్టికి తీసుకువచ్చారు. అయితే అభివృద్ధి పనుల అంచనాలు రూపొందించినప్పుడు మట్టి సేకరణ ఎక్కడి నుండి చేయాలో అంచనాల్లో పొందుపరచలేదా అని జెసి ప్రశ్నించారు. టెండర్‌లో పాల్గొనే సమయంలోనే కాంట్రాక్టర్లు ఆయా పనుల కోసం ముందుగానే అంచనాలు సిద్ధం చేసుకుంటారని, అటవీశాఖ అడ్డుకుంటున్నారనే పేరుతో పనులను జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అడవులకు నష్టం కలగకుండా ప్రైవేటు క్వారీల నుండే మట్టిని తరలించాలని సూచించారు. మేడారంలో పనులు చేసే అన్ని శాఖల అధికారులు ప్రణాళికలతో, నాణ్యతతో అభివృద్ధి పనులు పూర్తిచేయాలని అన్నారు. ప్రతి శాఖకు సంబంధించిన పనుల పురోగతిపై ప్రతివారం ముందుగానే నివేదికలు సిద్ధం చేయాలని, తమ పరిశీలనలో నివేదిక ప్రకారం స్థానికంగా పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని శాఖలు సమన్వయంతో జనవరి నెలాఖరులోగా పనులు పూర్తిచేసేలా చూడాలని, సమయం దగ్గర పడుతున్న కొద్ది అధికారులపై భారం పెరుగుతుందని గుర్తుచేశారు. కాగా పస్రా, తాడ్వాయి మధ్య గల రోడ్డు ఇరుకుగా ఉండటం, సైడ్‌బర్మ్‌లు అధ్వాన్నంగా ఉండటంతో అసహానం వ్యక్తం చేసిన జెసి పనుల పురోగతిపై నేషనల్ హైవే అధికారులను ప్రశ్నించారు. ఈ మేడారం జాతర ముందుగానే పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని ఎన్‌హెచ్ అధికారులు జెసికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తహశీల్దార్ పూల్‌సింగ్‌తోపాటు పలు ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సిఎం ఫొటోలపై బురదనీళ్లు
ప్రభుత్వ ప్రచార వాహనాలను అడ్డుకున్న కాంగ్రెస్ నేత శ్రీహరి
వరంగల్, డిసెంబర్ 18: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేసేందుకు జిల్లాకు వచ్చిన వాహనాలను కాంగ్రెస్ నాయకుడు, శాఫ్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి బుధవారం అడ్డుకున్నారు. ఆ వాహనాలపై ఉన్న ముఖ్యమంత్రి ఫొటోలపై పేడ, బురద నీళ్లను చల్లి సిఎం ఫొటోలు కనిపించకుండా చేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచార శాఖకు చెందిన ఆరు ప్రచార వాహనాలు బుధవారం జిల్లాకు వచ్చాయి. వీటిని రెవెన్యూ డివిజనల్ కేంద్రాలకు తరలించేందుకు వీలుగా జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో పార్కింగ్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న రాజనాల శ్రీహరి అక్కడికి చేరుకున్నారు. నీళ్లలో పేడ, బురదను కలిపి వాటిని సిఎం ఫొటోలపై చల్లారు. అంతేకాకుండా చీపురు కట్ట చేతపట్టుకుని పేడ నీళ్లలో ముంచి ఫొటోపై అద్దారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో ముఖ్యమంత్రి అడ్డుగా నిలుస్తున్నారని ఆరోపిస్తూ ఈ చర్యకు పూనుకున్నట్లు శ్రీహరి విలేఖరులతో చెప్పారు. తెలంగాణ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుని తథానుగుణంగా రాష్టప్రతి ద్వారా కేంద్ర ప్రభుత్వం బిల్లును అసెంబ్లీకి పంపించారని చెప్పారు. సీమాంధ్ర వాదనతో ముఖ్యమంత్రి విభజనకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. సిఎం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తగిన గుణపాఠం చెబుతామని శ్రీహరి హెచ్చరించారు.
-- ప్రభుత్వ వసతిగృహంలో --
విషాహారం తిని
విద్యార్థినులకు అస్వస్థత
నక్కలగుట్ట, డిసెంబర్ 18: నగరంలోని బాలసముద్రం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ విద్యార్థినుల వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ జరిగి పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు పూనుకోగా అధికారులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే.. బాలసముద్రంలో ఎస్సీ ఎస్‌ఎంహెచ్ హాస్టల్‌లో 280మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారు. విద్యార్థినుల తాగునీటి వినియోగానికి బోరుబావి నీరు వాడటంతో అవి కలుషితమయ్యాయి. అంతేకాకుండా ఆ నీటితోనే వంటలు చేయడంతో భోజనం కూడా కలుషితమయింది. గత వారంరోజులుగా విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురవుతూ వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నా హాస్టల్ వార్డెన్ నవమణి పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపించారు. ఈ వారంలో మొత్తం 40నుండి 60మంది వరకు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, దీంతో వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రి, వరంగల్ ఎంజి ఎం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారని తెలుస్తోంది. ఆలస్యంగా ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో ఎబిఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పాలకుర్తి వెంకటేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆ హాస్టల్ ముందు ఆందోళనకు దిగి ధర్నా చేశారు. వార్డెన్ నిర్లక్ష్యం, నాణ్యతలేని ఆహారం ఇవ్వడంతోనే విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ జరిగిందని, వెంటనే వార్డెన్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలసి డిఎస్‌డబ్ల్యుఓ రమాదేవి, డిడి రోసన్న రంగంలోకి దిగి తగిన చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎబిఎస్‌ఎఫ్ కార్యకర్తలు ఆందోళన విరమించారు.
రేపటి నుండి కాకతీయ
ఉత్సవాల ముగింపు
సౌండ్ అండ్ లైట్ ప్రదర్శన తిలకించిన కలెక్టర్
వరంగల్, డిసెంబర్ 18: ఏడాదికాలంగా కొనసాగుతున్న కాకతీయ ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం నుండి మూడురోజులపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. కాకతీయ ప్రభువులు నిర్మించిన చారిత్రక వేయిస్తంభాల ఆలయం, వరంగల్‌కోట, రామప్ప దేవాలయం ప్రాంగణం వేదికలుగా ముగింపు కార్యక్రమాలను ఘనంగా చేపట్టనున్నారు. ముగింపు కార్యక్రమాల గ్రాండ్ రిహార్సల్ బుధవారం జరిగింది. వరంగల్‌కోట వేదికగా ప్రదర్శించిన సౌండ్ అండ్ లైట్ కార్యక్రమాన్ని కలెక్టర్ కిషన్ కుటుంబసభ్యులతో తిలకించారు. కాగా ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను పురస్కరించుకుని వరంగల్‌కోట ప్రాంగణంలోని కీర్తితోరణం, కుష్‌మహాల్ తదితర చోట్ల ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులు కాంతులీనుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించిన కాకతీయ ఉత్సవాలలో భాగంగా ఏడాదిపాటు వివిధ కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించారు. ముగింపు వేడుకను కూడా గుర్తుంచుకునేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చరిత్రలో కాకతీయ ప్రభువుల ప్రాభవం నిలిచే విధంగా, కాకతీయ ఉత్సవాల గుర్తుగా వరంగల్ నగరంలో భారీ పైలాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
అందరూ దేశభక్తిని
పెంపొందించుకోవాలి
స్వామి అర్చనానంద
ఆత్మకూరు, డిసెంబర్ 18: సమాజంలో ప్రతి ఒక్కరు దేశభక్తిని పెంపొందించుకోవాలని రామకృష్ణ మఠం స్వామి అర్చనానందజీ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో చేపట్టిన రథయాత్ర బుధవారం ఆత్మకూరు మండలకేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా సర్పంచ్ సామ్యెల్, మాజీ సర్పంచ్ పలుకల మంజుల, మాజీ జడ్పీటిసి సత్యనారాయణ, ఆర్‌ఎస్‌ఎస్ మండల కార్యవాహ్ ఆర్.ఎల్.కె.ప్రసాద్, గ్రామ వికాస్‌పరిషత్ జిల్లా బాధ్యుడు శంకర్‌జీ, బిజెపి మండల అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్, ప్రొబేషనరీ ఎస్సై రవిచంద్ర, వివిధ పాఠశాలల విద్యార్థులు స్వాగతం పలికారు. రథయాత్ర సందర్భంగా కొత్తబస్టాండ్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో వాడవాడల శోభాయాత్ర ఘనంగా జరిగింది. మహిళలు సరస్వతి విద్యామందిర్ వద్ద మంగళహారతులతో స్వాగతం పలికారు. పోచమ్మ సెంటర్‌లో శివాజీ విగ్రహానికి అర్చనానందజీ పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానందుడి అగ్నిమంత్రాలు మహాత్మాగాంధీ, భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, సుభాష్‌చంద్రబోస్ వంటి స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తిని ఇచ్చాయని అన్నారు. ఇప్పటికీ స్వామిజీ జీవితచరిత్ర పఠిస్తే ఎందరో దేశభక్తులు తయారవుతారని చెప్పారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు 120దేశాలలో జరుపుతున్నారని తెలిపారు. స్వామిని విశ్వగురువుగా ఆయన కొనియాడారు. దేశంకోసం త్యాగాలు చేసిన వారే నిజమైన హీరో అని అభివర్ణించారు. బలమే జీవనం, బలహీనమే మరణమని, వజ్రసంకల్పంతో దేశానైనా సాధించవచ్చని వివేకానందుడి బోధనలు నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
యువకుడి
దారుణ హత్య
గోవిందరావుపేట, డిసెంబర్ 18: తాడ్వాయి మండలం భూపతిపూర్‌లో మంగళవారం అర్థరాత్రి పోడెం మహేష్ (20) యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సై హతిరాం కథనం ప్రకారం ఛత్తీస్‌గడ్ ప్రాంతానికి చెందిన గుత్తికోయల కుటుంబాలు గత సంవత్సరకాలంగా మండలంలోని భూపతిపూర్ ప్రాంతంలో ఉంటున్నారు. భార్య లక్ష్మితోపాటు కలసి ఉంటున్న మహేష్ గత నాలుగురోజులుగా భార్యకు జ్వరం రావడంతో దగ్గరలో ఉన్న అమ్మమ్మ ఇంటికి పంపించాడు. అయితే బుధవారం ఉదయం భార్య లక్ష్మి ఇంటికి చేరుకోగా హత్యకు గురై మహేష్ శవం కనిపించింది. దీంతో స్థానికుల సహకారంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై హతిరాం వివరించారు.
పోస్టుమార్టం వద్ద ఉద్రిక్తత
భవానీని కొట్టి చంపారని బంధువుల ఆందోళన
పరారీలో భర్త, అత్త, మరిది
డిఎస్పీ హామీతో పోస్టుమార్టం
గూడూరు, డిసెంబర్ 18: మండలంలోని చిన్న ఎల్లాపురం శివారు వెంగంపేట గ్రామానికి చెందిన వివాహిత ఆరెళ్ల భవానీ (22) మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా బుధవారం పోస్టుమార్టం గది వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భవానీని కొట్టి చంపిన అనంతరం క్రిమిసంహార మందు తాగించారని, మృతురాలి తల్లితండ్రులు అప్పరాజుపల్లి గ్రామానికి చెందిన పైండ్ల కిష్టయ్య, రామక్కలు ఆరోపించారు. మంగళవారం రాత్రి మృతురాలి బంధువులు, అప్పరాజుపల్లి గ్రామస్థులు దాదాపు యాబై మంది వెంగంపేటకు చేరుకున్నారు. ఇదే సమయంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని, ముందే అంచనా వేసిన నర్సంపేట డిఎస్పీ కడియం చక్రవర్తి, పోలీసు బలగాలతో అదే రాత్రి గ్రామానికి చేరుకుని పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం భవానీ మృతదేహాన్ని మండల కేంద్రంలోని పోస్టుమార్గం గదికి తీసుకరాగా అప్పరాజుపల్లి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చేరుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మృతురాలి భర్త దేవేందర్, అత్త సమ్మక్క, మరిది స్వామిలు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలపగా.. అయితే వీరంతా పోలీసు అదుపులో ఉన్నారని వారిని ఇక్కడికి తీసుకవస్తే పోస్టుమార్టం నిర్వహించేందుకు అంగీకరిస్తామని మృతురాలి బంధువులు భీష్మించుకుని బైఠాయించారు. ఈదశలో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చంద్రన్న జోక్యం చేసుకుని భవానీని చంపిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో తాము మృతురాలి కుటుంభానికి అండగా ఉండి ఆందోళన చేస్తామని చెప్పారు. డిఎస్పీ చక్రవర్తి మాట్లాడుతూ నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని హామి ఇచ్చారు. తీరా మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలోపలికి తరలించే క్రమంలో మహిళలు మళ్లీ అడ్డుకున్నారు. సుమారు అరగంట పాటు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ దశలో అప్పుడే చేరుకుని మృతురాలి తోటి కోడలు ఆరెళ్లి స్వామి భార్య చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన వౌనికి తనను కూడా తీవ్రంగా అత్త, మామలు వేధించేవారని, గత నెల రోజులుగా పుట్టింట్లో ఉన్నట్లు డిఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.పోస్టుమార్టం అనంతరం భవానీ మృతదేహాన్ని స్వగ్రామమైన అప్పరాజుపల్లికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.