Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రజా ధనాన్ని దిగమింగిన అక్రమార్కులపై చర్యలేవీ...?

$
0
0

నిజామాబాద్, డిసెంబర్ 18: అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న ప్రజా ధనాన్ని దిగమింగిన అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సాహసించడం లేదు. ఈ నిస్తేజ వైఖరిని అనుకూలంగా మల్చుకుంటున్న పలువురు ప్రజాప్రతినిధులు దర్జాగా స్వాహాపర్వానికి పాల్పడుతున్నారు. తమ పరిపాలనా దక్షతతో అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తూ, కటువుగా వ్యవహరిస్తారనే పేరొందిన కలెక్టర్ల హయాంలోనూ దుర్వినియోగమైన ప్రజా ధనాన్ని తిరిగి రాబట్టుకోలేకపోతున్నారు. ఒత్తిళ్లు పెరిగిన సమయంలో అక్రమార్కులకు కేవలం నోటీసులు అందించడంతోనే సరిపెట్టుకుంటున్నారు. తప్పుడు లెక్కలు చూపి నిధులను పక్కదారి పట్టించినట్టు విచారణలో నిర్ధారణ అయినప్పటికీ, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టకపోవడంలో గల ఆంతర్యమేమిటన్నది అంతుచిక్కడం లేదు. మాజీ సర్పంచ్‌ల నుండి మొదలుకుని, ఉపాధి హామీ పథకంలో వివిధ స్థాయిలలో లెక్కకుమిక్కిలి చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై ఏళ్ల తరబడి ఉదాసీన వైఖరినే అవలంభిస్తున్నారు. చివరకు పొరుగు రాష్ట్రాల నుండి రావాల్సిన నష్టపరిహారాన్ని రాబట్టుకోవడంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నారు. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు ఉండగా, గడిచిన 1984వ సంవత్సరం నుండి ఇప్పటివరకు సుమారు 167 మంది మాజీ సర్పంచ్‌లు వివిధ అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులను స్వాహా చేసినట్టు అధికారుల విచారణల్లో వెలుగుచూసింది. ఆర్థిక సంఘం నిధులతో పాటు బిఆర్‌జిఎఫ్, ఇజిఎస్ పథకాల కింద మంజూరైన సొమ్మును, ప్రజల నుండి పన్నుల రూపేణా వసూలు చేసిన నిధుల్లో దాదాపు 1.28 కోట్ల రూపాయలను దిగమింగినట్టు నిర్ధారణ అయ్యింది. అయితే గడిచిన మూడు దశాబ్దాల కాలం నుండి అధికారులు ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాజీ సర్పంచ్‌ల నుండి అతికష్టం మీద 2.09 లక్షల రూపాయలను మాత్రమే రికవరీ చేయగలిగారు. మిగతా వారికి నోటీసులు అందించడంతోనే సరిపెట్టుకుని చేతులు దులుపుకున్నారు. వాస్తవానికి నిధులు పక్కదారి పట్టించిన వారిపై రెవెన్యూ రికవరీ యాక్టును ప్రయోగిస్తూ వారి ఆస్తులను జప్తు చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అధికారులకు వెసులుబాటు ఉన్నప్పటికీ, మాజీ సర్పంచ్‌ల రాజకీయ పలుకుబడి తదితర కారణాల వల్ల ఈ దిశగా చర్యలు చేపట్టేందుకు జంకుతున్నారు. ఇక ఉపాధి హామీ పథకంలో గల్లంతైన నిధులను చూస్తే అడ్డూఅదుపూ లేని అవినీతి, అక్రమాలు కనిపిస్తాయి. ఆరు విడతలుగా జరిపిన సామాజిక తనిఖీల్లో జిల్లాలో 8.60 కోట్ల రూపాయల పైచిలుకు ప్రజాధనం దుర్వినియోగమైనట్టు తేలింది. ఆ మొత్తాన్ని అక్రమార్కుల నుండి వసూలు చేయాల్సిన అధికారులు, కేవలం 1.28 కోట్ల రూపాయలను మాత్రమే రికవరీ చేయగలిగారు. ఇబ్బడిముబ్బడిగా మంజూరయ్యే నిధులతో కాసుల వర్షం కురిపిస్తున్న ఉపాధి పనుల్లో పలువురు మేట్లు మొదలుకుని గ్రూప్ లీడర్లు, విఓలు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎఇలు, పోస్టల్ సిబ్బంది, చివరకు ఎంపిడిఓ స్థాయి అధికారుల వరకు అందినమేరకు నిధులను దండుకున్నారు. ఇక ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమేయం లెక్కకు మిక్కిలిగా ఉన్నట్టు తేలింది. జిల్లాలో 3600 మందికి ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంతో సంబంధాలున్నట్టు సోషల్ ఆడిట్‌లో వెల్లడైంది. అయినప్పటికీ బాధ్యులపై చర్యలు శూన్యంగానే మారాయి. కనీసం పక్కదారి పట్టించిన ప్రజాధనాన్ని సైతం తిరిగి రాబట్టుకోలేని నిస్సహాయ స్థితిలో అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లా సరిహద్దులో మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక తరలింపునకు అనుమతులు మంజూరు చేసినట్టు జాయింట్ సర్వేలో వెల్లడైన నేపథ్యంలో పొరుగున ఉన్న మహారాష్టల్రోని నాందేడ్ జిల్లా యంత్రాంగం సుమారు 11 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని గత ఏడాదిన్నర క్రితం ఇక్కడి జిల్లా యంత్రాంగం నోటీసులు జారీ చేసింది. కోట్ల రూపాయల విలువ చేసే ఇసుకను కొల్లగొట్టిన మహా సర్కార్ ఈ నోటీసులకు నామమాత్రంగానైనా స్పందించకుండా, ఇంతవరకు నయాపైసా పరిహారం జమ చేయించలేదు. ఇదే తరహాలో అడ్డగోలుగా నాసిరకం పనులు జరిపించిన కాంట్రాక్టర్లకు సైతం లక్షలాది రూపాయల్లో విధించిన జరిమానాలు రికార్డులకే పరిమితం అవుతున్నాయి.

రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్న సీమాంధ్రులు

టి-బిల్లుపై అసెంబ్లీలో వెంటనే చర్చ జరపాలి

మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి

ఆర్మూర్, డిసెంబర్ 18: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో వెంటనే చర్చ జరపాలని, బిల్లుపై చర్చించకుండా అసెంబ్లీని అడ్డుకుంటూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారని మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి అన్నారు. మండలంలోని మంథని గ్రామంలో బుధవారం పార్టీ మండల అధ్యక్షుడు పిసి బోజన్న అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, టి-బిల్లుపై చర్చించాలని రాష్టప్రతి అసెంబ్లీకి పంపిస్తే సీమాంధ్రులు అడ్డుకోవడం శోచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల కలిగే నష్టాలు చర్చించాలే తప్ప బిల్లుపై ఎలాంటి చర్చ జరపకుండా అసెంబ్లీని వాయిదా వేయించడం రాష్టప్రతిని, రాజ్యాంగాన్ని అవమానపర్చడమే అవుతుందని అన్నారు. తెలంగాణ బిల్లును యుద్ధ విమానంలో పంపించకుంటే కాలినడకన పంపిస్తారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే నీటి, విద్యుత్ అంశాల్లో సీమాంధ్రులకు నష్టం జరుగుతుందని చెప్పడమే తప్ప అసెంబ్లీలో ఎందుకు చర్చించడం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు కావడం ఖాయమని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ సందర్భంగా మంథని సర్పంచ్ మెట్టు వౌనికసంతోష్, వైసిపి యువకులు, వివిధ యువజన సంఘాలు సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని ఆయన పూలమాలలు వేసి అభినందించారు. అంతకుముందు డప్పు వాయిద్యాలతో సురేష్‌రెడ్డిని ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ కూడలి వద్ద ఆయన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ శ్రావణ్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ వౌనిక, యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఖాందేశ్ శ్రీనివాస్, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ త్రివేణి గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోజారెడ్డి, సర్పంచ్‌లు బొడ్డు గంగాధర్, రవిగౌడ్, అనురాధ, బోజారెడ్డి, డిసిసి కార్యదర్శి అర్గుల్ సురేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇ.గంగాధర్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

31న జాతీయ రహదారుల దిగ్బంధం

ఈలోగా పసుపు కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి

ఆర్మూర్, డిసెంబర్ 18: పసుపు పండిస్తున్న రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరికి నిరసనగా ఈ నెల 31వ తేదీన ఆర్మూర్‌లో జాతీయ రహదారుల దిగ్బంధం చేయనున్నట్లు పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహంనాయుడు అన్నారు. ఆర్మూర్‌లోని రైతుసేవా కేంద్రంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. పసుపు రైతుల సమస్యలపై ఆర్మూర్‌లో నిర్వహించనున్న రాష్ట్ర సదస్సుకు హాజరుకావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ను కోరగా అందుకు సమ్మతించారని, ఈ విషయమై రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్లు మంత్రి శరద్‌పవార్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేయగా, రాష్ట్రంలో పరిస్థితులు బాగా లేవని, పర్యటనను వాయిదా వేసుకోవాలని సిఎం చెప్పడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. శరద్ పవార్ పర్యటనను వాయిదా వేయించిన ముఖ్యమంత్రి కిరణ్ వైఖరికి నిరసనగా ఈ నెల 31వ తేదీన ఆర్మూర్‌లో పసుపు రైతుల రాష్ట్ర స్థాయి గర్జన, జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంత రైతులపై ముఖ్యమంత్రికి ప్రేమ లేదని దీంతో నిరూపణ అయ్యిందని విమర్శించారు. నాఫెడ్ లేదా మార్క్‌ఫెడ్ ద్వారా పసుపును కొనుగోలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాల్సి ఉంటుందని, ఈ సందర్భంగా నష్టం సంభవిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా నష్టాన్ని భరించాల్సి ఉంటుందని అన్నారు. 31వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి క్వింటాలు పసుపుకు 10 వేల రూపాయల మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని ప్రకటన చేయాలని, కేంద్రానికి లేఖ రాసి అనుమతి పొందాలని, లేనిపక్షంలో 31వ తేదీన జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి కిరణ్ కళ్లు తెరవాలని, లేకుంటే పసుపు రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. పసుపు రైతులను ఆదుకోకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని అన్నారు. ఈ సమావేశంలో బాల్కొండ మాజీ ఎంపిపి జక్క రాజేశ్వర్ పాల్గొన్నారు.

జాతీయస్థాయిలో
ఐఎపి నిజామాబాద్ చాప్టర్ ఉత్తమ ప్రదర్శన

ఇందూర్, డిసెంబర్ 18: ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఎపి) స్వర్జజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో నిజామాబాద్ ఐఎపి చాప్టర్‌కు కనకవర్షం కురిసిందని అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ నీల రాంచందర్, డాక్టర్ శ్రీశైలం వివరించారు. బుధవారం ఏర్పాటు చేసిన నిజామాబాద్ ఐఎపి హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఐఎపి స్వర్ణ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన పోటీలకు ఈసారి నిజామాబాద్ నుండి పంపించిన విభాగాల్లోనూ బహుమతులు కైవసం చేసుకుందన్నారు. రెడ్‌క్రాస్‌తో సంయుక్తంగా 600పైగా విద్యార్థులతో కలిసి నిర్వహించిన బేసిక్ లైఫ్ స్కిల్స్ విభాగంలో దేశంలోనే అత్యుత్తమ శాఖగా ఎంపికైందన్నారు. ఓఆర్‌ఎస్ వారోత్సవాలు, పిల్లలు, కిశోర బాలల వారోత్సవాలలో ద్వితీయ స్థానం, తల్లిపాల వారోత్సవాలలో తృతీయ స్థానం దక్కించుకుందన్నారు. మొత్తం మీద ఓవరాల్‌గా నిజామాబాద్ ఐఎపి సెకండ్ బెస్ట్ ట్రూప్‌గా నిలిచిందన్నారు. ఇందుకు సంబంధించి 2014, జనవరి 9వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తారని అన్నారు. విలేఖరుల సమావేశంలో ఐఎపి ప్రతినిధులు డాక్టర్ సుమలత, డాక్టర్ ఆనంద్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టర్ల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహాం

దోమకొండ, డిసెంబర్ 18: మండలంలో వివిధ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనితీరుపై జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అంబారీపేట్ గ్రామంలో పలు పథకాలను పనులను పరిశీలించారు. మండలంలోని అంబారీపేట్, కోనాపూర్, బీబీపేట్, యడారం గ్రామాల్లో చేపట్టిన సిసి రోడ్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సిసి రోడ్లపై క్యూరింగ్ ఏమాత్రం సరిగా లేదన్నారు. పంచాయతీరాజ్ వర్క్ ఇన్స్‌పెక్టర్ కిరణ్‌ను పిలిచి అనుభవం ఉన్న కార్మికులచే పనులు చేపిస్తే నాణ్యత ఉంటుందని, నాణ్యత లేని పనులు ఎందుకు చేస్తారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. అదే గ్రామంలో ఉప ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ నిర్వహించి, అక్కడి విధులు నిర్వహిస్తున్న హెల్త్ అసిస్టెంట్ వినోద్‌ను రికార్డులోని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెలివర్ కేసులు ఉంటే 108 సేవలను వినియోగించుకోవాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా అంబారీపేట్ నుండి గ్రామ శివారు వరకు మెటల్ రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం బీబీపేట్, దోమకొండ గ్రామాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పనితీరు మార్చుకోకపోతే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల కేంద్రంలోని స్ర్తిశక్తి భవనం, ఎంపిపి కార్యాలయ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ గంగాధర్, ఎంపిడిఓ హిరణ్మయి, ఆర్‌ఐ గంగాధర్, పంచాయతీరాజ్ ఎఇ హన్మాగౌడ్, ఐకెపి ఎపిఎం సునితా, సర్పంచ్‌లు గంగవ్వ, గాడి లింగం, వెంకటి, తదితరులు ఉన్నారు.

బ్యాంకర్ల సమ్మెతో
వినియోగదారుల ఇబ్బందులు

నిజామాబాద్ టౌన్, డిసెంబర్ 18: డిమాండ్ల సాధన కోసం ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం వాణిజ్య బ్యాంకుల ఉద్యోగులు సమ్మె నిర్వహించడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా రోజువారీగా లావాదేవీలు నిర్వహించే వ్యాపార వర్గాల వారు బ్యాంకు సేవలు స్తంభించడంతో అపసోపాలుపడ్డారు. ఐసిఐసిఐ వంటి కొత్తగా ఏర్పాటైన కొన్ని బ్యాంకులు మినహా జాతీయం చేసిన జాబితాలో ఉన్న ఉన్న వాణిజ్య బ్యాంకులను మూసి ఉంచారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టి నిరసన తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో నూతనంగా ప్రవేశపెడుతున్న సంస్కరణలను ఉపసంహరించుకోవాలని, వేతనాల స్థిరీకరణ విషయంలో మొండి వైఖరిని విడనాడి ఇదివరకు కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. జిల్లా కేంద్రంలో ఎస్‌బిహెచ్ మెయిన్ బ్రాంచి ఎదుట సుమారు 400 మంది బ్యాంకు ఉద్యోగులు బైఠాయించి ధర్నా చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ గత ఎంతోకాలం నుండి పోరాడుతున్నప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యునైటెడ్ ఫోరం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేనిపక్షంలో నిరవధిక ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో బ్యాంకు ఎంప్లాయాస్ అసోసియేషన్ల ప్రతినిధులు బోస్‌బాబు, రాంకిషన్‌రావు, క్రాంతి, బల్వంత్‌రావు, నారాయణ, దివాకర్‌రెడ్డి, మాలతి, శ్రీనివాస్‌రావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

కేసుల సత్వర పరిష్కారానికి
ఇ-కోర్టులు దోహదం
జిల్లా జడ్జి షమీమ్‌అఖ్తర్

బిచ్కుంద, డిసెంబర్ 18: మండల కేంద్రమైన బిచ్కుందలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో నూతనంగా ఏర్పాటు చేసిన ఇ-కోర్టును బుధవారం జిల్లా జడ్జి షమీమ్‌అఖ్తర్ లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, కేసుల సత్వర పరిష్కారానికి ఇ-కోర్టు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆర్మూర్, బోధన్, బాన్సువాడ కోర్టుల్లో దీనిని ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అన్వయించుకుని సాధ్యమైనంత త్వరగా కేసులను పరిష్కరించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం ఆయన మెజిస్ట్రేట్ కోర్టు కోసం ఏర్పాటు చేస్తున్న భవన నిర్మాణం పనులను పరిశీలించారు. పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా లోపాలకు తావులేకుండా పనులను చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ అసద్‌అలీకి సూచించారు. జిల్లా జడ్జి వెంట మేజిస్ట్రేట్‌లు రమేష్, గంగాధర్, సిఐ వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
బాన్సువాడలో ఇ-కోర్టు ప్రారంభం
బాన్సువాడ: బాన్సువాడలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలోని భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇ-కోర్టు (జ్యుడీషియల్ సర్వీస్ సెంటర్)ను బుధవారం జిల్లా జడ్జి షమీమ్‌అఖ్తర్ ప్రారంభించారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు మొదలుకుని మున్సిఫ్ కోర్టు వరకు అన్ని న్యాయస్థానాల్లో కేసుల పురోగతి గురించి సామాన్యులు సైతం తెలుసుకునేలా అవకాశం కల్పించేందుకు ఇ-కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇ-కోర్టుకు సంబంధించిన వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్‌లైన్ విధానం ద్వారా వివిధ కేసుల వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు. బాన్సువాడ కోర్టు పరిధిలోని అన్ని కేసుల వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక మేజిస్ట్రేట్ ఈశ్వరయ్యకు సూచించారు. ఇ-కోర్టు వెబ్‌సైట్ ద్వారా పాత్రికేయులు సైతం వివిధ కోర్టులు వెలువరించిన తీర్పుల గురించి తెలుసుకుని వాటి వివరాలను సేకరించవచ్చని అన్నారు. కాగా, కోర్టు భవనం పక్కనే శ్మశానవాటిక ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు జిల్లా జడ్జి దృష్టికి తేగా, స్థానిక కమ్యూనిటీ సెంటర్ భవనాన్ని ఆయన పరిశీలించారు. గతంలో ఇక్కడే కొన్నాళ్ల పాటు మున్సిఫ్ కోర్టు కొనసాగిందని, ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన కోర్టును ఏర్పాటు చేస్తే ఎంతో అనువుగా ఉంటుందని సీనియర్ న్యాయవాదులు శివకుమార్, రమాకాంత్, లక్ష్మారెడ్డి, మోహన్‌రెడ్డి, లక్ష్మినారాయణమూర్తి, హమీద్, ఖలీల్ తదితరులు జిల్లా జడ్జిని కోరారు. దీనిపై జిల్లా జడ్జి స్పందిస్తూ, కమ్యూనిటీ సెంటర్ స్థలానికి సంబంధించిన నివేదికను పంపిస్తే, భవన నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానన్నారు. ఒకవేళ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భవన నిర్మాణం జరిపిస్తే, అద్దె చెల్లించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

టిడిపితో పొత్తు ప్రసక్తే లేదు
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి

కామారెడ్డి, డిసెంబర్ 18: రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బిజెపి జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో మోడీ ప్రభంజనం కొనసాగుతుందన్నారు. టిడిపితో పొత్తు పెట్టుకుంటే గతంలో బిజెపి చాలా నష్టపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పార్లమెంట్‌లో బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు మురళిధర్‌గౌడ్, మోతె క్రిష్ణాగౌడ్, గౌరెని లింబాద్రి, విఠల్‌గుప్తా, జులూరి సుధాకర్, అరికెల ప్రభాకర్ యాదవ్, నీలం చిన్నరాజులు, ఉప్పల హరిధర్ తదితరులు పాల్గొన్నారు.

నిజాంసుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భిక్షమయ్య

బోధన్, డిసెంబర్ 18: తెలుగుదేశం సర్కారు హయాంలో ప్రైవేటుపరమైన నిజాంసుగర్స్ చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భిక్షమయ్య డిమాండ్ చేశారు. బుధవారం నాడిక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కర్మాగారాల ప్రైవేటీకరణలో అక్రమాలు జరిగాయని సభాసంఘం స్పష్టం చేసిందని వివరించారు. అంతేకాకుండా ఈ కర్మాగారాలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిఫార్సులు కూడా చేసిందని అన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా కర్మాగారాలను తిరిగి స్వాధీనం చేసుకోలేక పోయిందని ఆయన పేర్కొన్నారు. వందలాది కోట్ల రూపాయల విలువ చేసే ఈ కర్మాగారాలను కేవలం అరవై కోట్ల రూపాయలకు టిడిపి సర్కారు ధారాదత్తం చేసిందని ఆరోపించారు. స్వార్థపూరిత ఆలోచనలతో నిజాంనాటి కర్మాగారాలను కారుచౌక బేరంతో అప్పగించారని ఇది సమంజసం కాదన్నారు. ప్రస్తుతం వేసిన సబ్‌కేబినెట్ సంఘం ఈ ప్రాంత అభివృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్మాగారాలు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటేనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఇక్కడి కార్మికులు, కర్షకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్‌కేబినెట్ కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పట్ల ప్రైవేటు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన ధ్వజమెత్తారు. 2014 మార్చి 31 లోపు ఇక్కడి కార్మికుల డిమాండ్లకు యాజమాన్యం స్పందించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా అన్ని సంస్థల కార్మికులు సమ్మెకు దిగుతారని ఆయన స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు, శంకర్‌గౌడ్, ఏశాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

యువత రక్తదానానికి ముందుకు రావాలి
మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రావు

బోధన్ రూరల్, డిసెంబర్ 18:యువకులు, విద్యార్థులు రక్తదానానికి ముందుకు రావాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం బోధన్ మండలం ఆచన్‌పల్లి గ్రామంలో గల ఇందూర్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం ఎంతో గొప్పదని వివరించారు. ఒక వ్యక్తి ఏడాదికి ఆరుసార్లు రక్తదానం చేయవచ్చన్నారు. రక్తదానం చేయడం వలన ఒక మనిషి ప్రాణాన్ని కాపాడినట్లని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. రక్తదానంపై విద్యార్థులు గ్రామాలలోని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. యువత గ్రామాలలో చేపట్టే ఇటువంటి సేవా కార్యక్రమాలకు తాము అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. రక్తదాన శిబిరంలో 68 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ ప్రతినిధులు కొడాలి కిషోర్, నర్సింహారెడ్డి, వై.శ్రీనివాస్‌రావు, లావణ్య, పి.లక్ష్మి, బసవేశ్వర్‌రావు, రమారెడ్డి, అనంతలక్ష్మి, సూర్యనారాయణ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఓటరు నమోదు గడువు పెంపును
సద్వినియోగం చేసుకోవాలి

బాన్సువాడ, డిసెంబర్ 18: ఓటరు జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకునే వారి కోసం ఎన్నికల సంఘం గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినందున ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని అదనపు జెసి డాక్టర్ శేషాద్రి కోరారు. బుధవారం ఆయన తహశీల్ కార్యాలయాన్ని సందర్శించారు. కొత్తగా ఓటర్ల జాబితాలో పేర్ల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాల గురించి తహశీల్దార్ శ్రీకాంత్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, నిబద్ధతతో సేవలందించే వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఓటు హక్కుతోనే అవకాశం లభిస్తుందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని హితవు పలికారు.

గుల్లాలో ఘనంగా కుస్తీ పోటీలు

జుక్కల్, డిసెంబర్ 18: మండలంలోని పెద్దగుల్లాలో దత్త జయంతిని పురస్కరించుకుని బుధవారం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. కుస్తీలు పట్టేందుకు గాను పరిసర ప్రాంతాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులోని హనేగాం, ఔరాద్, దెగ్లూర్ తదితర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మల్లయోధులు పాల్గొన్నారు. సుమారు 20 వేల రూపాయలతో నిర్వహించిన ఈ పోటీల్లో ఆఖరి కుస్తీలో గెలుపొందిన విజేతకు 1100ర పాయల నగదు బహుమతిని అందజేశారు. ఉత్సవాల సందర్భంగా జారత నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వైశాలిసుధాకర్, గ్రామ నాయకులు మాధవరావుదేశాయ్, రాజుసేట్, కిషన్‌సేట్ తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ హిందీ సదస్సుకు శెట్పల్లి షరీఫ్ ఎంపిక

మోర్తాడ్, డిసెంబర్ 18: మోర్తాడ్ మండలం శెట్పల్లి ఉన్నత పాఠశాలకు చెందిన హిందీ భాష ఉపాధ్యాయుడు షరీఫ్ బెంగుళూర్‌లో జరుగనున్న అంతర్జాతీయ హిందీ సదస్సుకు ఎంపికయ్యాడు. ఈ నెల 27, 28వ తేదీలలో రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో షరీఫ్ సినిమా యొక్క పరిభాష, స్వరూపం అనే అంశంపై ఉపన్యసించనున్నాడు. హిందీ సాహిత్యం-సినిమాలు అనే అంశంపై నాలుగు సంవత్సరాలుగా షరీఫ్ పరిశోధనలు చేస్తుండటంతో ఆయనకు ఈ అవకాశం లభించింది. ఢిల్లీలోని యుజిసి, హిందీ విభాగం, న్యూ ఆర్ట్స్ కామర్స్, సైన్స్ కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదస్సుకు అనేక దేశాల నుండి ప్రతినిధులు హాజరుకానున్నారు. కాగా, ఈ సదస్సుకు ఎంపికైన షరీఫ్‌ను గ్రామ సర్పంచ్ లింబాద్రి, ప్రధానోపాధ్యాయుడితో పాటు విద్యా కమిటీ అభినందించారు.

పాత రాజంపేట్ హౌసింగ్ కాలనీ
పెండింగ్ పనులకు మోక్షం
ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ

కామారెడ్డి, డిసెంబర్ 18: మండలంలోని పాతరాజంపేట్ హౌసింగ్ కాలనీలో పెండింగ్ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించిందని ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ చెప్పారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుండి ఫోన్‌లో మాట్లాడుతూ, రాజంపేట పాత హౌసింగ్ కాలనీపై సంబంధిత శాఖలో హౌసింగ్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రివ్యూ సమావేశం నిర్వహించారని తెలిపారు. ఈ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న పనుల కోసం అధికారులకు సూచించడంతో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అధికారులు ఒప్పుకున్నారన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో 97 ఎకరాల భూమిలో 2400 వరకు ప్లాట్లను పేదలకు ఇచ్చానని, తన ఆదేశల మేరకు దర్శి కన్‌స్ట్రక్షన్స్ కాంట్రాక్టు 130 ఇళ్ళను నిర్మించారని, 2009నుండి మళ్ళీ ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. నిలిచిపోయిన ఆ పనులను ప్రారంభించేందుకు సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించి, అదే స్థలంలో కొత్త లేఅవుటు తయారుచేసి, అక్కడ రోడ్లు, స్కూల్స్ బిల్డింగ్‌లు, 10 లక్షలతో కమ్యూనిటీ హాల్ లాంటి సౌకర్యాలతో మోడల్ కాలనీగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో గృహ నిర్మాణం కోసం 40 వేలు ఇచ్చే వారని, ఇప్పుడు 80 వేల రూపాయల వరకు ఇచ్చిన ఈ స్కీం పూర్తి కావడం లేదని, అందుకనే ఒక్కొక్క ఇంటికి లెట్రిన్, బాత్‌రూంలు నిర్మించేందుకు అదనంగా స్పెషల్ జీవో కింద కోటి రూపాయలు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనులను నెలలోపు పూర్తి చేస్తారని, నూతన సంవత్సరం జనవరిలో సంబంధిత శాఖ మంత్రిచే శంకుస్థాపన పనులు చేయిస్తామన్నారు. సర్ట్ఫికెట్లు ఉన్న వారికి ఇక్కడ ఇళ్ళ స్థలాను చూపిస్తామన్నారు. అదనంగా 10వేల వరకు పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయన్నారు. సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఐఎఎస్ కార్యదర్శి కలికులం, హౌసింగ్ ఎండి వెంకటేశ్వర్‌రావు, నిజామాబాద్ పిడి చైతన్యకుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు.

విశ్వబ్రాహ్మణుల డిమాండ్లను టి.బిల్లులో పొందుపర్చాలి

ఇందూర్, డిసెంబర్ 18: తెలంగాణ ప్రాంత విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, తమ డిమాండ్లను తెలంగాణ బిల్లులో పొందుపర్చాలని నగర కమిటీ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టి.బిల్లులో తమ డిమాండ్లను చేరుస్తూ, అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల్లో వాటిపై చర్చించాలని కోరుతూ ఈ నెల 22వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఒకరోజు నిరాహార దీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. బుధవారం నగర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణుల డిమాండ్లపై అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల్లో సమగ్రంగా చర్చ జరిపి, టి.బిల్లులో వాటిని పొందుపర్చాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు 22న చేపట్టనున్న నిరాహార దీక్షల్లో పెద్ద సంఖ్యలో విశ్వబ్రాహ్మణులు పాల్గొనాలని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు సంఘీభావంగా నిలవాలని కోరారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్న విశ్వబ్రాహ్మణ జాతిని సమున్నత స్థాయిలో నిలిపేందుకు తెలంగాణ సమాజం అండగా నిలువాలని అభ్యర్థించారు. ఈ సమావేశంలో తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు రవీంద్రకుమార్, వడ్ల మదన్, ఎం.బాలవీరాచారి, రాంమోహనచారి తదితరులు పాల్గొన్నారు.

స్ర్తినిధి రుణాలు అందరికీ అందేలా చూడాలి

ఐకెపి ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశం

భీమ్‌గల్, డిసెంబర్ 18: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్ర్తినిధి రుణాలు మహిళా సంఘాల సభ్యులందరికి అందేలా చూడాలని ఐకెపి ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశం సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో నాలుగు మండలాలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, అర్హులైన మహిళా సంఘాలకు రుణాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదివరకు రుణాలు పొందిన మహిళా సంఘాలు సకాలంలో వాయిదాలు చెల్లించే విధంగా చూడాలన్నారు. ప్రతినెలా గ్రామస్థాయిలో సదస్సులు ఏర్పాటు చేసి మహిళా గ్రూప్‌లలోని సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంతో వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. మహిళ సంఘాలు రిజిస్ట్రర్లు సక్రమంగా నిర్వహించేలా సూచనలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఐకెపి జిల్లా ప్రాజెక్టు డిపిఎంలు నూకల శ్రీనివాస్, రమేష్‌తో పాటు భీమ్‌గల్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, వేల్పూర్ మండలాలకు చెందిన ఎపిఎంలు, సిసిలు తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాలో
బోగస్ పేర్ల నమోదును నిలువరించాలి

కలెక్టర్‌ను కోరిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు

నిజామాబాద్ , డిసెంబర్ 18: కొత్తగా చేపడుతున్న ఓటర్ల జాబితాలో బోగస్ పేర్లు నమోదు కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ప్రద్యుమ్నను కలిసి వినతిపత్రం సమర్పించారు. నగరంలోని 15, 23, 25, 32 తదితర డివిజన్ల పరిధిలో బిజెపి, టిడిపిలకు చెందిన పలువురు నాయకులు ఓటర్ల జాబితాలో బోగస్ పేర్లను నమోదు చేయిస్తున్నారని, వారికి పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు సహకరిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వారి పూర్తి వివరాలను సమగ్రంగా పరిశీలన జరిపించాలని, అధికారులను ఇంటింటికీ పంపి సర్వే చేయించాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, ఓటర్ల జాబితాలో బోగస్ పేర్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి ఓటర్లుగా అర్హులని నిర్ధారించుకున్న మీదటే వారి పేర్లను నమోదు చేయిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో పిసిసి సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, మాజీ కార్పొరేటర్ వెంకటేశ్, సాయిబాబా ఆలయం చైర్మన్ ఆకుల చిన్నరాజేశ్వర్ తదితరులు ఉన్నారు.

హౌసింగ్ అధికారులకు ‘రాజీవ్ గృహకల్ప’ పాట్లు!

వసతుల లేమితో నివాసాలకు ససేమిరా అంటున్న లబ్ధిదారులు

నిజామాబాద్ , డిసెంబర్ 18: పట్టణ ప్రాంతాల్లోని పేద, బడుగు, బలహీన వర్గాల వారికి పక్కా గృహాలతో కూడిన వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ గృహ కల్ప పథకం కింద నిర్మించిన గృహ సముదాయాలు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉండిపోతున్నాయి. మొదట్లో వీటిని దక్కించుకునేందుకు ఎంతో ఆసక్తి కనబర్చిన లబ్ధిదారులు, వాటి నిర్మాణం అనంతరం గుజ్జన గూళ్లను తలపించే ఇరుకిరుకు గదులు, వౌలిక సదుపాయాల లేమిని చూసి, రాజీవ్ గృహకల్ప అపార్ట్‌మెంట్లలో నిర్మించిన ఫ్లాట్లలో నివసించేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే అధికారులు అనేక పర్యాయాలు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో, చివరకు వాటిని విక్రయించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఖాళీగా ఉన్న ఫ్లాట్లను విక్రయిస్తామని, ఆసక్తి గల వారు తమను సంప్రదించాలంటూ హౌసింగ్ అధికారులు ఇటీవల ఫ్లెక్సీలను వేలాడదీశారు. అయినప్పటికీ వీటిని సొంతం చేసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో ఏమాత్రం కనిపించడం లేదు. అధికారుల ఒత్తిడికి తోడు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో కొంతమంది లబ్ధిదారులు గృహకల్పలోని ఫ్లాట్లలో నివాసం ఉంటున్నారు. అయితే వారికి దాదాపు మూడు సంవత్సరాల నుండి వౌలిక వసతులు ఏమాత్రం మెరుగుపర్చకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ఇబ్బందులను గమనించిన ఇతర లబ్ధిదారులు గృహకల్ప సముదాయంలో నివాసం ఉండేందుకు జంకుతున్నారు. దీనివల్ల సగానికి పైగా ఫ్లాట్లు ఇంకా ఖాళీగానే దర్శనం ఇస్తున్నాయి. మరోవైపు గృహకల్ప అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల నుండి ఒత్తిడి పెరుగుతుండడంతో, చివరకు అధికారులు ఫ్లాట్లను విక్రయానికి పెట్టారని తెలుస్తోంది. నిజామాబాద్ శివారులోని నాగారం ప్రాంతంలో గత నాలుగున్నరేళ్ల క్రితమే వీటి నిర్మాణాలు పూర్తయినప్పటికీ, ఇంకా వాటిని లబ్ధిదారులు స్వాధీనం చేసుకునేందుకు జంకుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

గల్లంతైన సొమ్ము కోట్లలో...రికవరీ లక్షల్లోపే! అక్రమార్కులపై చర్యలకు సాహసించని అధికార యంత్రాంగం
english title: 
public money

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>