మహబూబ్‌నగర్, డిసెంబర్ 18: రాజకీయాలలో ఉండాలంటే నేతలకు పదవులు ఎంతో అవసరం. పదవులు ఉంటేనే గౌరవం ఉంటుందని ప్రజల్లో నేతగా పిలువబడుతామని ప్రతి నాయకుడు భావిస్తుంటారు. అయితే మున్సిపాలిటీ పట్టణాలలో ప్రస్తుతం నాయకులు తీవ్ర నిరాశతో ఉన్నారు. 2005 సంవత్సరంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో సెప్టెంబర్ కౌన్సిలర్లుగా నాయకులు గెలుపొందారు. అయితే వీరి పదవి కాలం 2010 సెప్టెంబర్‌లో ముగిసింది. వెంటనే ప్రభుత్వం మున్సిపాలిటీలలో పరిపాలన సౌలభ్యం కోసం అధికారులకు ప్రత్యేక హోదా కల్పిస్తూ ప్రత్యేక అధికారులుగా నియమించారు. ప్రస్తుతం మూడు సంవత్సరాల మూడు నెలలు దాటుతున్నప్పటికినీ ఇంకా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండటం పట్ల నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అధికారులకే పాలన వ్యవహారాలను అప్పజెబుతూ ప్రభుత్వం జిఓలను జారీ చేస్తుంది. ఇటీవల మరో జిఓ జారీ చేస్తూ మరో ఆరునెలల పాటు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారుల పాలనే ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించడం నేతలకు మింగుడు పడటం లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల్లో మున్సిపల్ ఎన్నికలపై పెట్టుకున్న ఆశలు రోజురోజుకు అడియాశలవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాతనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో నాయకులంతా నిరాశ పడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా గెలుపొందాలనుకుంటున్న నాయకులు నిరుత్సాహానికి గురై పార్టీ కార్యక్రమాల వైపు కూడా కనె్నత్తి చూడటం లేదు. ఏదో నామమాత్రపు కార్యక్రమాలకు వస్తూ కంటితుడుపు చర్యగా ఇటు వచ్చి అటు వెళ్లిపోతున్నారు. జిల్లాలో గతంలో నాలుగు మున్సిపాలిటీలు మాత్రమే ఉండేయి. ప్రస్తుతం నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడటంతో జిల్లాలో షాద్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అయిజ పట్టణాలలో కూడా ఎన్నికలు జరగడం లేదు. అదేవిధంగా మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట మున్సిపాలిటీలలో కూడా ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో నాయకులంతా నిరాశతో ఉన్నారు. సొంత పనులపై దృష్టి సారించిన నాయకులు ఎన్నికలు వచ్చినపుడు చూద్దాంలే అంటూ తమ అనుచరులతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు నెలల క్రితం పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తరుణంలో మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహిస్తారని ఆశతో ఉన్న నేతలకు వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. దాంతో నాయకులు ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాతే పురపాలక ఎన్నికలు ఉంటాయని నిశ్చయించుకున్నారు. ఏదిఏమైనా పురపాలక పట్టణాలలో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న వివిధ పార్టీల నాయకుల ఆశలు ఇప్పట్లో నెరవేరే పరిస్థితి లేదు.
పురుగుల అన్నం పెడుతున్నారంటూ
విద్యార్థుల రాస్తారోకో
బాలానగర్, డిసెంబర్ 18: ఉడికి ఉడకని, పురుగులతో కూడిన అన్నం పెడుతున్నారని గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బుధవారం బాలానగర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై విద్యార్థులు నిర్వహించిన రాస్తారోకోతో అరగంట పాటు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. బాలానగర్ సమీపాన ఉన్న గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యత లేని అన్నం పెడుతున్నారని ఆరోపించారు. అదే విధంగా నీళ్లచారు, పలచని మజ్జిగ, పండ్లను సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు విద్యార్థులను పక్కకు జరిగే ప్రయత్నం చేయడంతో విద్యార్థులు రోడ్డుపై భీష్మించుకూర్చున్నారు. దీంతో డిసిసి ప్రధాన కార్యదర్శి దాస్‌రాంనాయక్ కల్పించుకుని విద్యార్థులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్ లింగ్యానాయక్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందజేసిన భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డికి సూచించారు. అనంతరం మధ్యాహ్నం జిల్లా గిరిజన గురుకుల విద్యాలయాల డిప్యూటీ సెక్రటరీ ఉపేంద్రచారి గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత గల ఆహారాన్ని అందించకపోతే కలెక్టరుకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రిన్సిపాల్‌ను హెచ్చరించారు.
2014 పోరుకు కమలనాథుల సమాయత్తం
* గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టతకు వ్యూహం
* అనుబంధ సంఘాల బలోపేతంపై దృష్టి
* మండల స్థాయిలో సమావేశాలకు నిర్ణయం
మహబూబ్‌నగర్, డిసెంబర్ 18: ఇతర పార్టీలలో ఎన్నో సందేహాలు, రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటికీ బిజెపిలో మాత్రం 2014 సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తంగా కనబడుతోంది. వంద రోజుల్లోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో కమలనాథులు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. అందులో భాగంగా జిల్లా నేతలతో రాష్ట్ర పార్టీ నాయకులు తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై అంచనాలు వేస్తూ ఇక దూకుడుగా ఉండాలంటూ జాతీయ, రాష్ట్ర నేతలు క్యాడర్‌కు సూచనలు ఇస్తుండటంతో ఇక నాలుగు నెలల పాటు నిరంతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు జిల్లా నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలలో అవలంబించాల్సిన వ్యూహాలను కింది స్థాయి నుండి కార్యకర్తల మనోభిష్టం మేరకు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలి, నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలనే వ్యూహాలపై సీనియర్ బిజెపి నాయకులతో తరచూ భేటీలు కావాలని జిల్లా నాయకత్వం భావిస్తోంది. ఒకపక్క బిజెపిని బలోపేతం చేస్తూనే మరోపక్క ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా కార్యవర్గ సభ్యులలోని మంచి వక్తలను గ్రామాలలో నిర్వహించే కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా పిలిపించి తమ ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే విధంగా కూడా వ్యూహాలను రచించుకుంటున్నారు. తెలంగాణ అంశం తేలిపోయినా, తేలకున్నా రెండు విధాలుగా లాభం ఉంటుందని భావిస్తున్న బిజెపి నాయకత్వం ఇక దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలోని షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, నారాయణపేట, మక్తల్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి నియోజకవర్గాలలో పార్టీ క్యాడర్ బలంగా ఉండటం, ఇప్పటికే నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తుండటం, మిగతా నియోజకవర్గాలలో కొంత కష్టపడితే మరింత క్యాడర్ పెరిగి వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలలో మంచి ఫలితాలను సాధించవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలలో కొంత నాయకత్వ లోపం ఉండటంతో త్వరలోనే ఆ లోపాన్ని భర్తీ చేసేందుకు నాయకులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. గద్వాల, కొల్లాపూర్, కొడంగల్, అలంపూర్, దేవరకద్ర నియోజకవర్గాలలో ఇతర పార్టీలకు సంబంధించిన నియోజకవర్గ స్థాయి నాయకులు బిజెపిలోకి వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే జిల్లాలో బిజెపి కూడా బలీయమైన శక్తిగా ఎదుగుతుందని, మోడీ ప్రభావంతో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునే విధంగా వీలుపడుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. పార్టీ అనుబంధ సంఘాలను గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా గ్రామాలలో అన్ని వర్గాలకు సంబంధించిన యువకులను పార్టీలోకి చేర్పించుకునేందుకు వ్యూహాలను రచించుకుంటున్నారు. ప్రతి గ్రామంలో వందమంది యువకులను పార్టీలో చేర్పించుకుని వారికి బాధ్యతలు అప్పజెప్పి నరేంద్ర మోడీ గురించి ప్రజలకు వివరించే బాధ్యత కూడా వారికే అప్పగించనున్నట్లు తెలిసింది. మండల కేంద్రాలలో దాదాపు 150 మందికి పైగా యువకులకు బాధ్యతలు అప్పజెప్పి పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. ఒకపక్క పార్టీ బలోపేతంతో పాటు మరోపక్క సంఘ్ పరివార్‌తో తరచూ పరివార్ బైటక్‌లను నిర్వహించి లోటుపాట్లను కూడా సవరించుకోవాలని జిల్లా నాయకత్వం భావిస్తుంది. పరివార్ సూచనల మేరకు ముందుకుపోవాలని కూడా వివిధ నియోజకవర్గాల నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.
భర్తను హతమార్చిన భార్య, ప్రియుడు
* అలంపూర్ మండలంలో మృతదేహం లభ్యం
మానవపాడు, డిసెంబర్ 18: మహబూబ్‌నగర్ పట్టణంలో నివాసముంటున్న షేక్‌అప్సర్ అలియాస్ సాలేబాబాను భార్య, ప్రియుడు కలిసి హతమార్చి అలంపూర్ మండలంలోని క్యాతూరు గ్రామసమీపంలో మృతదే హాన్ని పూడ్చిపెట్టిన సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. మహబూబ్‌నగర్ వన్‌టౌన్ సిఐ బాలాజీ కథనంమేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలోని రామయ్యబోలేలో నివాసముంటున్న షేక్‌అప్సర్(32)ను ఈ నెల 10వ తేదీ రాత్రి నిద్రిస్తున్న సమయంలో భార్య ఫాతిమాభేగం, కారుడ్రైవర్ సోహెల్ ఆస్తికోసం హతమార్చారు. మృతదేహాన్ని అదేరోజు రాత్రి అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి తీసుకువచ్చి సోహెల్‌తాతగారి సహాయంతో సమీపంలో ఉన్న కందిపంట పొలంలో పూడ్చిపెట్టారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ నెల 15వ తేదిన మృతుడి భార్య ఫాతిమా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు భార్య ఫాతిమాను, డ్రైవర్ సోహెల్‌ను విచారించగా 10వ తేది అర్ధరాత్రి క్యాతూరు గ్రామసమీపంలో పూడ్చిపెట్టినట్లు పోలీసులకు తెలిపారు. బుధవారం వన్‌టౌన్ సిఐ నిందితుడు సోహెల్‌తో గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ హత్యను ఆస్తికోసమే హతమార్చినట్లు సిఐ తెలిపారు. ఈ సంఘటనలో అలంపూర్ సిఐ రాజు, మానవపాడు తహశీల్దార్ సైదులు పంచనామా నిర్వహించారు. వారితో పాటు డిప్యూటీ తహశీల్దార్ షేక్‌హుసేన్, విఆర్‌ఓలు భీంసేన్‌రావు, సాయిబాబాలు ఉన్నారు.
సమాజంలో యువత పాత్ర కీలకం
* కలెక్టర్ గిరిజాశంకర్
మహబూబ్‌నగర్, డిసెంబర్ 18: సమాజంలోని సమస్యలు పరిష్కరించడంలో యువత ముందుండాలని, ముఖ్యంగా యువత పాత్ర అన్ని రంగాలలో కీలకపాత్ర పోషిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ అన్నారు. జిల్లా యువజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ కళాభవన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువజన ఉత్సవాలను నిర్వహిస్తాయని, అయితే యువత సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ లాంటి జిల్లాలో నిరక్షరాస్యత, పేదరికం, అవగాహన లోపం వాటితో ప్రజలు బాధపడుతున్నారని, ప్రజలను చైతన్యం చేసే బాధ్యతను యువత స్వీకరించాలని కోరారు. అక్షరాస్యతను పెంపొందించడంలో ప్రతిఒక్కరు చదువుకునేలా చూడాలని కోరారు. జిల్లాలో ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగ యువతీ, యువకులు ఉన్నారని, ఉద్యోగావకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అయితే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఉద్యోగాలు పొందవచ్చని కలెక్టర్ సూచించారు. జీలితంలో ఎలా బతకాలనే విషయాన్ని యువత నేర్చుకోవాలని అన్నారు. చదువుతో పాటు ఆటలు, పాటలు అన్నింటిలో ప్రావీణ్యం సంపాధించాలని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో సైతం నైపుణ్యం పొందాలని అన్నారు. పోటీ ప్రపంచంలో అన్నింటిని తట్టుకుని ధైర్యంగా నిలబడి విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి యువత కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. సెట్మా ఇన్‌చార్జి సిఇఓ సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, విలువలను చాటిచెప్పేందుకు యువజన ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గతంలో మాదిరి కాకుండా ఈ సంవత్సరం గ్రామీణ ప్రాంతంలోని యువతను సైతం ఉత్తేజ పరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో యువజన ఉత్సవాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని అన్నారు. ఈనెలాఖరులో రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయని, రాష్ట్ర స్థాయి పోటీలలో గెలుపొందిన వారికి 2014 జనవరిలో లూథియానలో జరిగే జాతీయ స్థాయి యువజన ఉత్సవాలలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. జానపద నృత్యం, జానపద గీతం, ఏకాంకిక, శాస్ర్తియ సంగీతం తదితర అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో నెహ్రూ యువక కేంద్రం సమన్వయ కర్త సయ్యద్ సదాదోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో 90 శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి
* కలెక్టర్ గిరిజాశంకర్
పాలమూరు, డిసెంబర్ 18: కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలలో ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో 90శాతంకు పైగా ఉత్తీర్ణత సాధించేందుకు నూతన ప్రత్యేక అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని రాజీవ్ విద్యామిషన్ సమావేశ మందిరంలో కెజిబివిలకు కొత్తగా ఎంపికైన ప్రత్యేక అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ ప్రత్యేక అధికారులు కెజిబివిల పరిపాలనతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందిపై ఆజమాయిషి కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా కెజిబివిలలో మంచి మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని తెలిపారు. 9, 10వ తరగతుల విద్యార్థినులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఈ సంవత్సరం పదవ తరగతిలో 90శాతంకు పైగా ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. కెజిబివిలు చక్కగా నిర్వహించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని, ఈనెల 20 నుండే దానిని అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు. మాజీ ప్రత్యేక అధికారులు ఎవరైనా రికార్డులు అప్పగించేందుకు సహకరించనట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కెజిబివిలలో మధ్యలో బడిమానేసిన బాలికలు ఎలాంటి ఆధారం లేని వారు చేరుతారని, అందువల్ల ప్రత్యేక అధికారులు విద్యార్థినుల విద్యపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కెజిబివిని విడిచివెళ్లరాదని, ఒకవేళ ఎవరైనా అనుమతి లేకుండా వెళ్తే ఉద్యోగం నుండి తొలగిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ గిరిజాశంకర్ ఆర్‌విఎం కార్యాలయంలో ఇంజనీర్లతో కెజిబివిల భవనాల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణంపై సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి చివరి నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. భవనాల నిర్మాణ ప్రగతిపై ప్రతిరోజు తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు జెసి, ఇన్‌చార్జి ఆర్‌విఎం పిఓ రాజారాం, ఆర్‌విఎం ఎఎంఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన యువత
తలకొండపల్లి, డిసెంబర్ 18: మండల కేంద్రమైన తలకొండపల్లిలో గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి బుధవారం ఎబివిపి, బిజెపి, టిఆర్‌ఎస్ తదితర పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు రోడ్డెక్కి నిరసనను వ్యక్తం చేశారు. గ్రామంలో కొత్తగా సర్పంచ్ అభ్యర్థి గెలిచినా సమస్యలు పరిష్కరించడం లేదని, సర్పంచ్ వెంటనే రాజీనామా చేయాలని యువకులు నినాదాలు చేశారు. గ్రామంలో పేరుకుపోయిన డ్రైనేజీల శుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణాలు, రోడ్డు విస్తరణ, బస్టాండ్ సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, ఆర్యనాయక్ తండాకు రోడ్డు వేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు పాండుప్రసాద్, నాయకులు సజ్జుపాష, కృష్ణ, రామచంద్రి పాల్గొన్నారు.
ఆరోపణలు అవాస్తవం
గద్వాల, డిసెంబర్ 18: మాజీ మంత్రి డికె సమరసింహారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని లాయర్లలో క్రిమినల్ లాయరంటూ మాట్లాడడం అవివేకమని న్యాయవాదులు వసంతరావు, పెద్దరాముడు, పూజారిశ్రీ్ధర్, లత్తిపురం వెంకట్రామిరెడ్డిలు అన్నారు. బుధవారం మాజీ మంత్రి సమరసింహారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ పెన్సిలిన్ ఫ్యాక్టరి భూముల విషయంలో ఎన్నికలు ముగిసిన నాలుగు నెలల తరువాత బంగ్లాలో పిలిచి రైతులకు ఒక్కోక్కరికి రూ.25వేలు ఇచ్చి మీరెంత తిన్నారో ప్రజలకు వివరించాలన్నారు. వక్ఫ్‌బోర్డు భూములు కబ్జాచేసిన వారిలో మీ అనుచరులే ఎక్కువగా ఉన్నారని గుర్తించుకోవాలని, పునరావాస కేంద్రాల్లో వాటాలు తింటున్నది ఎవరో ఆయా గ్రామాల ప్రజలకు తెలిసిందేనని విమర్శించారు. లాయర్లలో అనుచరులెవ్వరు ఉండరని జూనియర్లు ఉంటారని ఈ విషయం గ్రహించాలని వారు సూచించారు.