నల్లగొండ, డిసెంబర్ 18: ఇంజనీరింగ్ విద్యార్ధిని తలారి అరుణపై ప్రేమోన్మాది కిరోసిన్ దాడితో జరిపిన హత్యాయత్నాన్ని నిరసిస్తు బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుండి నిరసనలు వెల్లువెత్తాయి. విద్యార్ధి సంఘాలు ఈ ఘటనను నిరసిస్తు జిల్లా వ్యాప్తంగా తలపెట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. విద్యార్థులు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, రాజకీయ పక్షాలు పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీలు నిర్వహించి అరుణపై జరిగిన దాడిని తీవ్రంగా నిరసించారు. ర్యాలీల్లో బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటు రాసిన నినాదాలతో విద్యార్ధినిలు ఫ్లకార్డ్సు ధరించి నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, కోదాడ, సూర్యాపేట, చౌటుప్పల్, చిట్యాల, వలిగొండ, రామన్నపేట, మోత్కూర్, ఆలేరు, తిరుమలగిరి, తుంగతుర్తి, నేరడుచర్ల, హాలియా తదితర ప్రాంతాల్లో విద్యాసంస్థలు మూసివేసి విద్యార్థులు, రాజకీయ పక్షాలు, మహిళా సంఘాలు భారీ నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులతో కొద్ధిసేపు వాగ్వివాదం అనంతరం విద్యార్థి సంఘాల ప్రతినిధులను ఎస్పీని కలిసేందుకు అనుమతించారు. అరుణపై దాడికి పాల్పడిన నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలంటు ఎస్పీ టి.ప్రభాకర్‌రావు విద్యార్థి సంఘాల నాయకులు వినతి పత్రం అందించారు. సిపిఎం, సిపిఐ, న్యూడెమోక్రసీల, మహిళా సంఘాల నేతల బృందం జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులును కలిసి ఆరుణపై హత్యాయత్నం చేసిన నిందితులపై చట్టపర చర్యలు తీసుకోవడంతో పాటు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. నల్లగొండ మహాత్మగాంధీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి నిందితుల దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేసి తమ నిరసన తెలిపారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఎబివిపి, పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, టిఎన్‌ఎస్‌ఎఫ్, దళిత, ఐద్వా, ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం, బిజెపి మహిళా మోర్చా, ఎమ్మార్పీఎస్ తదితర సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు నిర్వహించి దాడికి పాల్పడిన నిందితుల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
పులిచింతల ముంపు బాధితులకు
అత్యధిక నష్టపరిహారం చెల్లించాం
గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హుజూర్‌నగర్, డిసెంబర్ 18 : భారతదేశ చరిత్రలోనే పులిచింతల ప్రాజక్టు ముంపు బాధితులకు అత్యధిక నష్టపరిహరం చెల్లించటం జరిగిందని రాష్ట్ర గృహనిర్మాణశాఖా మంత్రి యన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బుధవారం సాయంత్రం తన నివాసంలో జరిగిన పులిచింతల ముంపు బాధితుల, అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ 13915 ఎకరాలు ముంపుకు గురికాగా 13908 ఎకరాలకు 164 కోట్ల రూపాయలు నష్టపరిహరంగా చెల్లించామని అన్నారు. 5534 ఇండ్లు ముంపుకు గురికాగా 5399 గృహలనకు 43 కోట్లు చెల్లించారని చెప్పారు. ఇప్పటి వరకు సహాయ పునరావాస పనులకు 505 కోట్లు వ్యయం చేశారని 137 కోట్లు వౌలిక అవసరాలకు ఖర్చు చేశారని అన్నారు. 148 కోట్లతో కృష్ణానది నుండి 4 ఎత్తిపోతల పధకాలు నిర్మాణం అవుతున్నాయని 18300 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని అన్నారు. ప్రస్తుతం 90 కోట్ల రూపాయలతో మరో 2 ఎత్తిపోతల పధకాలు మంజూరు అయినాయని పులిచింతల ముంపు బాధిత రైతుల భూములకు నీరు సరఫరా కానున్నదని మంత్రి చెప్పారు. జిల్లా యంత్రాంగ పులిచింతల ముంపు ప్రజలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సహాయ, పునరావాస పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కోరారు. నక్కగూడెం, రఘునాధపాలెం, గుండ్లపల్లి, మట్టపల్లి గ్రామాలు ముంపుకు గురైతున్నవా, లేదా తెలుసుకోవటానికి జాయింట్ కలెక్టర్, పులిచింతల యస్‌ఇ, హుజూర్‌నగర్ ఓయస్‌డిల ఆధ్వర్యలో ముగ్గురు సభ్యుల కమిటీ వేశారని వారం రోజుల్లో నివేదిక అందజేస్తారని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో సహాయ పునరావాస కమీషనర్ శ్రీదేవి, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదిత్యనాధ్‌దాసు, పులిచింత సిఇ సాంబయ్య, యస్‌ఇ వెంకటేశ్వరరావు, పంచాయితీరాజ్ యస్‌ఇ భాస్కర్‌రావు, పులిచింతల ప్రత్యేక కలెక్టర్ జె వెంకటేశ్వరావు, ఐడిసి డైరెక్టర్ సాముల శివారెడ్డి, బాధిత రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
జిల్లాలో బ్యాంకుల బంద్ విజయవంతం
నల్లగొండ టౌన్, డిసెంబర్ 18: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం పలు బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన బ్యాంకుల బంద్ జిల్లాలో విజయవంతమైంది. జిల్లాలోని భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ డివిజన్‌లలో బ్యాంకుల బంద్‌తో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా స్తంభించడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని ఎస్‌బిహెచ్, ఎస్‌బి ఐ, కెనెరా, ఆంధ్ర బ్యాంకుల ఉద్యోగులు బ్యాంకులు బంద్ చేసి బ్యాంకుల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతన సవరణ, బ్యాంకు రంగంలో చేపడుతున్న సంస్కరణలకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి దిగనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సమ్మెలో 42బ్రాంచిలలో 3వేల మంది సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పిజె.జేమ్స్, వి.శ్రవణ్‌కుమార్, ఎల్లయ్య, మూర్తి, కలీం, బ్రాంచి సెక్రటరీ బిక్షమయ్య, మల్లయ్య, అంజయ్య, విక్రం, మనోహర్, అస్మాసుల్తానా, శ్రీకాంత్, కమలాకర్‌రెడ్డి, వినోద్‌కుమార్, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.
27న ఎస్సీ, ఎస్టీల భూసమస్యల పరిష్కారానికై ప్రత్యేక గ్రీవెన్స్
కలెక్టరేట్, డిసెంబర్ 18: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు( ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల( ఎస్టీ)లకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ఈనెల 27న ప్రత్యేక గ్రీవెన్స్‌డేను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహింస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలు వారి భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు, ఫిర్యాదులును ప్రత్యేక గ్రీవెన్స్‌డే ద్వారా స్వయంగా స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. దరఖాస్తులు స్వీకరించి తగిన రశీదులను అందజేస్తామని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని ఎస్సీ, ఎస్టీ వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రత్యేక గ్రీవెన్స్‌డే రోజు ఆయా డివిజన్లకు సంబంధించిన డివిజనల్ పరిపాలనాధికారులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో ఉండి దరఖాస్తులను స్వీకరించి రశీదులు జారీ చేయాల్సి ఉంటుందని, తప్పని సరిగా హజరుకావాలని జెసి పేర్కొన్నారు.
పరిపాలనలో దిక్సూచిగా నిలిచిన ఘనత జ్యోతిబసుదే
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు
చిట్యాల, డిసెంబర్ 18: ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలనందించి వారి హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచి పరిపాలనలో దిక్సూచిగా నిలిచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి జ్యోతీబసుదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం జరిగిన పార్టీ చిట్యాల, రామన్నపేట, నార్కట్‌పల్లి మండలాల సంయుక్త సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సిపిఎం ప్రభుత్వ హయాంలో భూసంస్కణలను అమలు పరిచారని, నీతి నిజాయితీ పరిపాలనను అందించి దేశానికే ఆదర్శంగా నిలిచారని, నిజాయితీ పరిపాలనను దేశానికి సూచించేలా ఆయన దిక్సూచిలా నిలిచారన్నారు. 2014 సంవత్సరంలో జ్యోతీబసు శతజయంతి ఉత్సవాలను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు అన్ని ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయని సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తనట్లుగా వ్యవహరిస్తూ సామాన్య ప్రజల గోడును పట్టించుకోవడంలేదని విమర్శించారు. ధరలు పెగుతున్నా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలంచెందినదని ఈ ప్రభుత్వం అసమర్ధ ప్రభుత్వమని ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలన్నారు. ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం, రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పామనగుళ్ళ అచ్చాలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ డివిజన్ కార్యదర్శి ఎండి. జహంగీర్, జిల్లా నాయకులు మేక అశోక్‌రెడ్డి, బోళ్ళ నర్సింహారెడ్డి, మామిడి సర్వయ్య, పార్టీ కార్యదర్శులు జిట్ట నగేష్, జల్లెల పెంటయ్య, నాయకులు రాచమళ్ళ రాంచంద్రం, చెర్కుపల్లి పెద్దులు, అవిశెట్టి శంకరయ్య, గాలి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
అరుణపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి
నల్లగొండ టౌన్, డిసెంబర్ 18: తలారి అరుణపై మంగళవారం దాడిచేసిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు నిర్భయచట్టం అమలు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ పలు సంఘాలు జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావులకు, ఉన్నతాధికారులకు బుధవారం ఆయా కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేశారు. బాధితురాలి కుటుంబానికి 10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా, ఎపి మహిళ సమాక్య, సిపి ఎం, సిపి ఐ నాయకులు కలెక్టర్‌కు వినతి పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహ్మరెడ్డి, సిపిఐ జిల్లాకార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి ఐద్వా సంఘం నాయకులు ప్రభావతి, అమరావతి, హేమలత, పద్మ, సునితా, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యనాయకులు యు.సృజన, పానుగంటి పద్మ, కలకొండ అరుణ, వసంత, ధనలక్ష్మి, శిరీష తదితరులు ఉన్నారు. ఎస్పీకి వినతి అందించిన వారిలో ఎబివిపి నాయకులు సంతోష్, సిద్దు, గణేష్, జహసింహ, హరీష్, సైదులు, వేణుగోపాల్, అశోక్, వసీం, టి ఆర్ ఎస్‌వి నాయకులు శోభన్‌బాబు, బోమరబోయిన నాగార్జున, తదితరులు ఉన్నారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో జెసి హరిజవహర్‌లాల్‌కు వినతి పత్రం అందించిన వారిలో కెవిపి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేకల భద్రాద్రి, కొండమడుగు నర్సింహ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ముల్కలపల్లి రాములు, అంబేద్కర్ భవన అభివృద్ధి కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, ఎస్సీ సంఘం నాయకులు బర్రె సుదర్శన్, కత్తుల షణ్ముఖ కుమార్, నల్లబెల్లి వెంకటయ్య, రవీందర్ నగేష్ శశిధర్ ఉన్నారు.
సారా అమ్మరాదని గ్రామస్థుల తీర్మానం
అమ్మితే 10వేల జరిమానా
ఆత్మకూర్, డిసెంబర్ 18: మండలంలోని కూరెళ్ల గ్రామంలో గ్రామస్తులంతా కలిసి బుధవారం గ్రామపంచాయతీ కార్యాయంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో సర్పంచ్ బాషబోయిన ఉప్పలయ్య, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, మహిళ సంఘాల సభ్యులు అఖిలపక్ష పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు, అన్ని కులాల సంఘలాల అధ్యక్షులు సమావేశం నిర్వహించారు. గ్రామంలో మధ్యపానం, నాటుసారా అమ్మరాదని గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ తీర్మాణాన్ని ఉల్లంగిచినట్లయితే సారా, మందు అమ్మిన వారిపై 10వేల జరిమానా విధించి, నల్లా కనెక్షన్, ఫిల్టర్ నీరు, రేషన్‌బియ్యం, విద్యుత్ సరఫరాలను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. కల్తీ కల్లు అమ్మిన వారిపై జరిమానా విధిస్తామన్నారు. ఈ సమావేశంలో కూరెళ్ల గ్రామ మధ్యపాన నిషేద కమిటీ అధ్యక్షుడు ఉప్పలయ్య, సభ్యులు వి.సత్యనారాయణ, శ్రీహరి, ఎం.నర్సింహ్మ, వెంకటేష్, రాములు, ముత్యాలకృష్ణ, యాదగిరిరెడ్డి, ఉప్పల నర్సింహ్మ, లాల్‌మహ్మద్, వేముల బిక్షం, ఇడుకుల శ్రీను, మారుపాక కృష్ణ, నిమ్మల చంద్రమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సెస్సీ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
భువనగిరి, డిసెంబర్ 18: సాంఘిక సంక్షేమ ఎస్సీ, బిసి వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న 10వ తరగతి విద్యార్ధులు రాబోయే వార్షిక పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి బి.శ్రీనివాస్‌రెడ్డి కోరారు. బుధవారం స్థానిక శ్రీసాయికృప డిగ్రీ కళాశాలలో పదవ తరగతి విద్యార్ధులకు అవసరమైన ప్రత్యేక ప్రేరణ తరగతులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక పరీక్షల్లో 80శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్ధులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా ఉన్నత విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి విద్యార్ధి పట్టుదలతో చదివి పదవ తరగతి వార్షిక పరీక్షల్లో వందకు వంద శాతం మార్కులు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. అదే విధంగా ప్రతిరోజు విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యలో వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్ధుల భవిష్యత్‌కు పునాదిగా నిలిచే పదవ తరగతి పరీక్షల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి దాని ప్రకారం బోధన కొనసాగించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈకార్యక్రమంలో వాత్సల్య విద్యాసంస్థల చైర్మన్ దరిపల్లి అనంతరాములు, కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్‌కుమార్, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు పి.నరేందర్‌రెడ్డి, పి.దయాకర్‌లు పాల్గొన్నారు.
వికలాంగుల హక్కుల సాధనకు నిరంతర పోరాటం
నల్లగొండ టౌన్, డిసెంబర్ 18: వికలాంగుల హక్కుల సాధనకు నిరంతరం ఉద్యమిస్తామని ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక టౌన్ హల్‌లో నిర్వహించిన జిల్లా వికలాంగులు విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇతర రాష్ట్రాలలో వికలాంగులకు వెయ్యి రూపాయలకు పైగా పించన్లు ఇస్తున్నారన్నారు. వందశాతం వికలాంగత కల్గిన వారికి ప్రతి నెల 1500 ఇవ్వాలని అదేవిధంగా 40నుండి 80శాతం కల్గిన వారికి వెయ్యి, 20నుండి 40శాతం వరకు వికలాంగత్వం కల్గిన వారికి 500పించన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యలపై చట్టసభల్లో ఏనాడు చర్చలు జరుగలేదని రాజకీయంగా వికలాంగులకు ఎక్కువశాతం సీట్లు కేటాయించి పాలనలో వారిని భాగస్వామ్యం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రాయితీని వికలాంగులకు సైతం ఇచ్చే విధంగా పోరాటం చేస్తున్నామని అదేవిధంగా వికలాంగులను పెళ్లి చేసుకునే సకలాంగులకు ఒక లక్ష రూపాయలు, పెళ్లి చేసుకునే ఇద్దరు వికలాంగులైతే వారికి 2లక్షలు ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వాలని పోరాటం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బడుగు బలహీన వికలాంగ అభివృద్ధికై వికలాంగుల సమక్షంలో త్వరలో తాను పెట్టే కొత్తపార్టీని ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు, జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకన్న, నాయకులు లింగాల పెద్దన్న, లక్ష్మి, కాశీం, సైదులు, రమేష్, జిల్లా నలుమూలల నుండి వచ్చిన వికలాంగులు పాల్గొన్నారు.
మూసీ నీటి విడుదల
కేతేపల్లి, డిసెంబర్ 18: జిల్లాలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టు నుండి ఆరుతడి పంటల సాగుకు మొదటి విడుతగా బుధవారం నీటిపారుదల శాఖ ఈఈ హమీద్‌ఖాన్ అధికారులు ఆయకట్టు పరిధిలోని కుడి, ఎడవ కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నీటిని దుర్వినియోగం చేయకుండా సక్రమంగా వాడుకొని చివరి ఆయకట్టుకు కూడా నీటిని అందించేందుకు సహకరించాలని కోరారు.