కొవ్వూరు, డిసెంబర్ 22: నకిలీ నోట్లు తయారుచేసి, చలామణి చేస్తున్న ముఠాను కొవ్వూరు రూరల్ పోలీసులు ఆదివారం చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ నోట్లు మార్కెట్‌లో చలామణి కాకుండా చర్యలు తీసుకున్నారు. కొవ్వూరు డిఎస్పీ వి రాజగోపాల్ ఆధ్వర్యంలో రూరల్ సిఐ ఎం బాలకృష్ణ, రూరల్ ఎస్సై ఎం అర్జునరాజుతో పాటు ఐడి పార్టీ సిబ్బంది ఎండి షరీప్, ఎ ధర్మరాజు, ఎస్‌వివి సత్యనారాయణ, డి ప్రసాదబాబు, కె వీరబాబు ఈ ముఠాను పట్టుకున్నారు. ఈ సందర్భంగా కొవ్వూరు సిఐ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ 500 రూపాయల నకిలీ నోట్లను చలామణి చేయడానికి ప్రయత్నించిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 1.93 లక్షల రూపాయలు విలువైన 386 నకిలీ 500 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నోట్లు ముద్రించడానికి ఉపయోగించే పరికరాలను కూడ స్వాధీనం చేసుకున్నామన్నారు. కొవ్వూరు మండలం ఐ పంగిడి గ్రామానికి చెందిన చదలవాడ అనిల్‌కుమార్‌ను రూరల్ సిఐ ఎం బాలకృష్ణ, రూరల్ ఎస్సై అర్జునరాజు అదుపులోకి తీసుకుని ముఠా వివరాలు తెలుసుకుని అతి చాకచక్యంగా నిందితులను అరెస్టు చేశారన్నారు. ఈ దొంగనోట్లు చలామణి చేస్తున్న ముదునూరుపాడుకు చెందిన తాడి వెంకట రమణారెడ్డి, నర్సీపట్నంకు చెందిన టి రంజిత్‌సింగ్, ఏలూరుకు చెందిన యల్లంపల్లి శ్రీనివాసరావు, నిడదవోలుకు చెందిన తిగురుపల్లి వెంకటేశ్వరరావు, పిట్టల వేమవరానికి చెందిన ఎం నాగిరెడ్డిని అరెస్టు చేసి వారి వద్ద నుండి దొంగనోట్ల తయారీకి వినియోగించే లాప్‌టాప్, ప్రింటర్, పెన్ డ్రైవ్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. రూరల్ సిఐ ఎం బాలకృష్ణ, రూరల్ ఎస్సై ఎం అర్జునరాజు, తాళ్లపూడి ఎస్సై లక్ష్మీనారాయణ, దేవరపల్లి ఎస్సై తిలక్, ట్రైనీ ఎస్సై ఫణీంద్ర తదితరులు విలేఖర్ల సమావేశంలో పాల్గొన్నారు.
నిరంతర అధ్యయనం అవసరం
ఏలూరు, డిసెంబర్ 22 : నిరంతర అధ్యయనంతోనే పాత్రికేయులకు నైపుణ్యం అలవడుతుందని ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్, ఎమ్మెల్సీ డాక్టర్ కె నాగేశ్వర్ పేర్కొన్నారు. స్థానిక సెయింట్ ఆన్స్ కళాశాలలో ప్రెస్ అకాడమీ, ఆదికవి నన్నయ్య యూనివర్శిటీల సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న గ్రామీణ విలేఖరులకు శిక్షణా కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న డాక్టర్ నాగేశ్వర్ మాట్లాడుతూ సమాజానికి ప్రజా అజెండాను అందించాల్సిన బాధ్యత పాత్రికేయులపై వుందన్నారు. ఇంతకుముందు టివి ఛానళ్లు విస్తృతమవడం వల్ల పత్రికలు దెబ్బతింటాయని, ఆ తరువాత ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోతున్నందున ఫలితంగా ఛానళ్లు దెబ్బతింటాయన్న వాదన తెరపైకి వచ్చిందన్నారు. అయితే ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే ఛానళ్ల విస్తృతితో సమానంగానే పత్రికలు కూడా విస్తరిస్తున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ రంగాల్లో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, అయితే నైపుణ్యం వున్న వారికే ఈ అవకాశాలు దక్కుతాయని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో పది శాతం మందికి మాత్రమే కంప్యూటర్లు ఉన్నాయని, వాటిలో మూడు శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్ వుందని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో మీడియాకు ఆదరణ తగ్గదని చెప్పారు. పత్రికా వ్యవస్థలో ప్రస్తుతం వున్న జిల్లా ఎడిషన్ల వ్యవస్థ విస్తరించి రానున్న రోజుల్లో మండల, గ్రామాల వారీగా ప్రచురించే పరిస్థితులు వస్తాయని చెప్పారు. పాత్రికేయ రంగంలో ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నా పాత్రికేయులు నిరంతర అధ్యయనాన్ని కొనసాగించడం ద్వారానే కొనసాగగలరన్నారు. సమాజంలో ఇబ్బందులను తొలగించే విషయంలో ప్రజల అభిప్రాయాలను తెరపైకి తీసుకురావడంలో పాత్రికేయులే ప్రధానపాత్ర పోషిస్తారని చెప్పారు. ప్రతీ మానవుడు పుట్టుకతోనే పాత్రికేయుడంటే అతిశయోక్తి కాదని, తొలి నుంచి ఎందుకు, ఏమిటి అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరిలోనూ తలెత్తుతుందని చెప్పారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రెస్ అకాడమీ ఛైర్మన్ తిరుమల గిరి సురేందర్ మాట్లాడుతూ సమాజంలో ప్రజల తరపున ప్రశ్నించే సాధనం మీడియా అని, ఈ రంగంలో పనిచేస్తున్న వారు వృత్తినైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ శిక్షణా తరగతులు దోహదపడతాయని చెప్పారు. సాంకేతిక పరమైన శిక్షణలో భాగంగా పాత్రికేయులకు దశల వారీగా అన్ని జిల్లాల్లోనూ కంప్యూటర్ శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేస్తామన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ ఫైన్ ఆర్ట్స్ విభాగం సమన్వయంతో జర్నలిస్టులకు మూడు నెలల వ్యవధి వున్న ఫోటోజర్నలిజం, డిజిటల్ ప్రొడక్షన్ ఇన్ మీడియా అన్న రెండు కోర్సులను నిర్వహిస్తున్నామని, ఈ కోర్సులకు అయ్యే ఫీజు ఏడు వేల రూపాయల్లో ప్రెస్ అకాడమీ అయిదు వేల రూపాయలు భరిస్తుందని చెప్పారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కోర్సు చదివే వారికి కూడా ఫీజులో రాయితీలు అందిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రెస్ అకాడమీ గ్రామీణ జర్నలిస్టుల కోసం మరిన్ని శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వక్తలు జి నాగరాజు, కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ మెర్సీ, ఎ అమరయ్య, ప్రెస్ అకాడమీ కార్యదర్శి ఎస్ ఎ హష్మీ, డిడి రహ్మాన్, డిపిఆర్‌వో ఆర్‌వి ఎస్ రామచంద్రరావు, డివిజనల్ పిఆర్‌వో ఎం భాస్కరనారాయణ, ఎపిఆర్‌వో మాధవ్, సూపరింటెండెంట్ గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.