
ఈ మధ్యకాలంలో టీ ప్రియులలో వినిపిస్తున్న మాట ‘గ్రీన్ టీ’. చాలామందికి ఉదయమో, సాయంత్రమో లేదా కాస్తంత రిలాక్స్ కోసమో టీ ఎంజాయ్ చేస్తూ తాగేయటం అలవాటు. అంతేకాదు పండితులనుండి పామరులదాకా ‘చాయ్’కున్న క్రేజే వేరు. ఈమధ్య ఛాయ్‌మీద మన హీరోలతో పసందైన పాటలు కూడా చూపిస్తున్నారు.
ఇంకేం ఎంచక్కా టీ తాగేయవచ్చు కదా! అనుకుంటున్నారా! కాస్త ఆగండి. ‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అన్నట్లు టీలందు శ్రేష్టమైన టీలు వేరయా’ అనాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని టీలకంటే కూడా ‘గ్రీన్ టీ’ శ్రేష్టమైనది, ఎంతో ఆరోగ్యకరమైనది అన్న వాస్తవాలను పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. గ్రీన్ టీని రోజుకు రెండు అంతకంటే ఎక్కువ కప్పులు తాగుతుంటే కొలెస్టరాల్ పూర్తిగానూ, తక్కువగానూ ఉంటుంది. అంతేకాదు, ఎల్‌డిఎల్ రకం అంగుళాల కొద్దీ తగ్గుతుందని అధ్యయనాల్లో తేలిన విషయం.
రక్తనాళాల్లో గడ్డకట్టుకుపోయిన కొలెస్టరాల్‌ను, వేడి వేడి గ్రీన్ టీ.. కొద్దికొద్దిగా కరిగించేయగలదు. అలాగే ఫ్రీ మోషన్ లేనివారు గ్రీన్ టీ ఉదయము, సాయంత్రం తాగడంవలన ఆ అవస్థ తగ్గిపోతుంది.
చిక్కటి పాలతో మరిగించిన టీలకు అలవాటుపడిన వాళ్లు హఠాత్తుగా టేస్ట్ మార్చుకుని గ్రీన్ టీ తాగడం కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు. కానీ, క్రమం తప్పకుండా గ్రీన్ టీ సేవిస్తుంటే దానిలోని అద్భుతమైన రుచి తెలిసి రోజూ గ్రీన్ టీ తాగందే ఉండలేమో అనిపిస్తుంది. డాక్టర్లు కూడా గ్రీన్ టీ తాగమని సూచిస్తుండటం విశేషం. ముఖ్యంగా గుండెకు చాలా మంచిది.