![](http://www.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/maramaraalu_5.jpg)
హింస గురించి ఎవరు ఎన్నిరకాలుగా మాట్లాడుతున్నా, ఏ చట్టం చేసినా, సమాజం రవ్వంత కూడా మారడంలేదు.ఇది ప్రతి ఒక్కరికీ అర్థంకాని సమస్యలా తయారైంది. ఇదొక పెద్ద విషవలయంలా తయారైంది. దీనికి కారణం మనకి ఎన్ని చట్టాలున్నా, ధర్మాలున్నా అవి అమలుచేసేవాళు అహంభావంతో నీతులు వల్లిస్తూ పోతున్నారు. దీనివల్ల న్యాయానికే ఎంతో అన్యాయం జరుగుతోందనిగానీ, క్రమశిక్షణ ఉల్లంఘింపబడుతుందని గానీ, ఇది విపరీత పరిణామాలకు దారితీస్తుందని గానీ, ఏ మాత్రం ఆలోచించరు. కొన్ని సందర్భాలలో న్యాయం అమ్ముడుపోతోందని సామాన్యుల బాధ, అసంతృప్తి వల్ల న్యాయ నిర్ణేతలమైన తాము గౌరవం కోల్పోతున్నామని అనుకోరు.
కానీ, సామాన్యుని అసంతృప్తి ఎంత గాఢంగా సమాజంలో పెరిగిపోతోందో, దేశం అంతటా ప్రబలిపోతోందో, కొందరిలో ప్రతీకార వాంఛ వారిలో పెరిగి, దేశంమీద, వ్యవస్థమీద నమ్మకం ఎలా చచ్చిపోతోందో చెప్పలేకపోతున్నాం. బాలనేరస్థుల వయస్సు నిర్ణయం, వయస్సుని బట్టి శిక్షా.. చేసిన తప్పును బట్టి శిక్షా అని కూడా నిర్ణయించలేకపోతున్నాం. కౌనె్సలింగులూ, ఉపన్యాసాలూ కొందరిని సంపూర్ణంగా మార్చలేవు.
శిక్ష అనుభవిస్తేగాని ఉన్మాదం వదిలి, వాస్తవిక పరిస్థితి అర్థం కాదు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు ప్రతీవాళ్ల నెత్తురు మరిగిపోతుంది. కానీ శిక్షలు విధించడంలో జాప్యం, రకరకాల మార్పులూ, ఇలా స్వల్ప శిక్షలతో వదిలెయ్యడం చేత, వాళ్లలో మార్పులు అంత తేలిగ్గా రాదు సరిగదా, ‘‘ఓస్.. ఇంతేనా’’ అనే చులకన భావం వ్యవస్థమీద ఏర్పడుతోంది. డబ్బులో, హోదాలో, పలుకుబడిలో పులిసిన వ్యక్తులకైతే, ఇది చాలా తేలికైన విషయం. ఎంతటి జటిల సమస్యనైనా, డబ్బులు కుమ్మరించి అపరాధులను కాపాడేస్తున్నారు. వాళ్ల పిల్లలో, వాళ్ల తాలూకు పిల్లలో వుంటారు గనుక, సాధ్యమైనంతవరకు, పబ్లిసిటీ కూడా ఎక్కువ లేకుండా చూస్తున్నారు. దీనివల్ల లంచగొండితనం విలయ తాండవం చేస్తోంది.
ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ దగ్గరనుంచి, ఎటు తిరిగినా అవినీతి, లంచం, మోసం, కరాళ నృత్యం చేస్తోంది. ఎవరి స్థాయిని బట్టి వాళ్లు వాళ్ల దందా నడిపించేసుకుంటున్నారు. మూడేళ్ల పిల్ల, ముచ్చటగా ఏ పక్కింటికో ఆడుకోవడానికి వెళ్లలేని పరిస్థితి! ఈ అఘాయిత్యం చివరికి మూడు నెలల పసికందుని కూడా వదలట్లేదు. ఆడపిల్లగా పుట్టినందుకు పిల్లలే ఏడుస్తూ భయపడుతూ ఛస్తూ బతుకుతూ జీవించవలసిన పరిస్థితి ఏర్పడుతోంది! కన్నతల్లిదండ్రులే అమ్మేయడమో, కడుపులో వుండగానే ఛిద్రం చెయ్యడమో జరిగిపోతోంది.
ఇంక ఇతర కారణాలవల్ల పిల్లల్ని చంపేసి, ఆంబోతూ ఆంబోతూ పోట్లాడుకుని మధ్య దూడని చంపేసినట్టు, పిల్లల్ని చంపేస్తున్నారు కన్నవాళ్లే! ఇలాంటి వ్యవస్థ చూస్తే ఎలా భరించాల్రా అన్న బాధ తప్పితే, ఏం చెయ్యాలో అన్న భయం అందరిలోనూ నానాటికీ పేరుకుపోతోంది. అసలు ఎన్నడూ లేనివిధంగా ఈమధ్యన ఎందుకిలా జరుగుతోంది? అందులోనూ యువత, కొన్ని సందర్భాలలో మైనారిటీ కూడా తీరని పసివాళ్లు, ఈ అఘాయిత్యాలకి పాల్పడడానికి కారణం ఏమిటి? అని మేధావులూ, సామాన్యులూ ఎవరు ఎంత తల పగులగొట్టుకున్నా వచ్చే సమాధానం ఒక్కటే! ఇళ్లల్లోని పెద్దవాళ్ళలోని పెంపకం కూడా ఒక పెద్ద వీక్ పాయింట్‌గా కనిపిస్తుంది. చిన్నప్పటినుంచి ఇంట్లో ఆడపిల్లలకి భయాలు నేర్పించడం తప్ప, సమస్య వస్తే ఎట్లా తప్పించుకోవాలో చెప్పకపోవడం! మగ పిల్లలకి చిన్నప్పటినుంచే, పుట్టుకతోటే వాళ్లు చాలా ధైర్యవంతులూ, గొప్పవాళ్లూ, బలంలో అని పొగుడుతూ, ఆడపిల్లని ఒక బలహీనురాలిగా వర్ణించడం! ఇక మూడో పాయింటు ఆడపిల్లని గౌరవించడం నేర్పించకపోవడం. అన్నలు చెల్లెళ్లని వేధించడం అని వింటూ వుంటే, ఎందుకిలా జరుగుతోంది? అని ఆలోచిస్తే చెల్లెలు బలహీనురాలు, లొంగిపోతుంది తన శారీరక బలం ముందు అనే నమ్మకం. రెండవది- ఏం జరిగినా తనకు జరిగిన అవమానాన్ని ఎవరికీ చెప్పుకోదు అనే ధీమా. మూడవది- తను మాత్రం తను చేసిన తప్పిదం నుంచి ఎలాగో అలాగ బయటపడగలడు.
దీనివల్ల వాళ్లలో ఆ సాహసం పెరిగిపోతోంది మగ పిల్లలలో. ఇక ఆపుకోలేని ఉద్రేకం. నీలిచిత్రాలూ, సెల్‌ఫోన్లలో, కంప్యూటర్స్‌లో సెక్స్ గురించి అంగాంగ ప్రదర్శనలు చూడడం, అది చెక్ చెయ్యడానికి తల్లిదండ్రులకి తీరిక లేకపోవడం, విచ్చలవిడితనానికి పునాది వేస్తోంది. పూర్వం పెద్దలు ఏం చెప్పినా, ప్రతీ ఆడపిల్లలోనూ, తల్లినీ చెల్లినీ చూడాలని, ఆడవారిని గౌరవం, అభిమానం తప్ప, కామదృష్టితో చూడకూడదని పదే పదే చెప్పేవారు. ఇప్పుడు తల్లినీ చెల్లినీ కూడా కామదృష్టితోనే చూస్తున్నారు.
ఇది ఎంత ప్రమాదకరమో, అసలు అటువంటి మనస్తత్వం గ్రహించి, వాళ్ల దృష్టి మరల్చడానికి నేటి తల్లిదండ్రులకు తీరికేది? వాళ్లు స్కూలుకు వెళుతున్నారో లేదో, ఏ మార్నింగ్ షోలోనో ఏ చెత్త సినిమా చూస్తు కూర్చున్నారో తల్లిదండ్రులు పట్టించుకోరు. ఉపాధ్యాయులూ ఏం చెయ్యలేకపోతున్నారు. డ్రగ్స్ గల చాక్లెట్లు, ఇతర తినుబండారాలూ అందుబాటులో వుంటే పిల్లలకి, వాటిపై, ఎవ్వరికీ దృష్టి పెట్టే టైమ్ లేదు. చివరకి ప్రభుత్వాలకి కూడా! పిల్లలవాడి వయస్సు పదేళ్లు! వాడు చేసిన తప్పు, చిన్న దొంగతనమో, అబద్ధాలాడడమో కాదు. అందిన ఆడపిల్లని అనుభవించడానికి పనే్న పన్నాగాలూ జరిపే దురాగతాలూను! వయస్సు చిన్నదే జువినైల్‌లోకే వస్తాడు.
కానీ చేసిన తప్పో? వీళ్లు కౌనె్సలింగ్‌కీ, ఉపన్యాసాలకీ, నాలుగు నెలల జైలుశిక్షకీ భయపడడంలేదు. మరి?... మరి?... మరేం చెయ్యాలి? అదే ప్రశ్న... ఎవరి పిల్లలు ఇరుక్కుంటారో పెద్ద శిక్షలు వేస్తే... తమ పిల్లలే వుండొచ్చు.. అవీ భయాలు!.. పరిష్కారం... అగమ్యం...! ఆవేదన..! దిక్కుతోచని స్థితి.. అదే నేటి దుస్థితి! కాలమే చెప్పాలి తీర్పు...!