
క్రిస్మస్ అనగానే చిన్నారుల కళ్లల్లో మెదిలే ఆకారం శాంతాక్లాజ్. ఎర్రటి సూట్ ధరించి తలపై తెల్లటి టోపీ పెట్టుకొని పిల్లలకు చాక్లెట్స్, బహుమతులు ఇచ్చే క్రిస్మస్ తాత అంటే ఎవరికి ఇష్టముండదూ! శాంతాక్లాజ్ వచ్చాడంటే చాలు అక్కడ వాతావరణమే నవ్వుల పువ్వులు పూయిస్తూ ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లలకు ఆటవస్తువుగానూ, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించే కథానాయకుడిగా, బహుళజాతి కంపెనీలకు బ్రాండ్‌గా మారి కోట్లాది రూపాయల లాభాలను ఆర్జించే శాంతాక్లాజ్ గురించి తెలుసుకోవాలంటే కొన్ని వందల సంవత్సరాల వెనక్కివెళ్లాలి. చిన్నారుల ఆత్మీయ నేస్తంగా మారిన ఈ క్రిస్మస్ తాత క్రీ.శ.270 సంవత్సరంలో జన్మించాడు. ఆయన పేరు సెయింట్ నికోలస్. టర్కీలోని మైరా బిషప్‌గా ఉండేవారు. ఆయన తనకు వచ్చే ఆదాయాన్నంతా పేద పిల్లలకు ఖర్చుపెట్టేవాడు. ధనవంతుడైనప్పటికీ ఎలాంటి అహంకారం లేకుండా ఆహ్లాదకరంగా కనిపించే శాంతాక్లాజ్‌ను ఆ రోజుల్లోనే పిల్లలు ఎంతో ఇష్టపడేవారట. నికోలస్ చిన్నతనం నుంచి క్రైస్తవ మతానికి తన జీవితాన్ని అంకితం చేశారు. మధ్యయుగంలో యూరోపియన్ దేశాలలో శాంతాక్లాజ్ వేడుకలను డిసెంబర్ 6నే నిర్వహించేవారు. తదనంతరం ఈ వేడుకలు డిసెంబర్ 24, 25 తేదీలకు మారింది. క్రిస్మస్‌కు ముందురోజు రాత్రి అంటే డిసెంబర్ 24న శాంతాక్లాజ్ ఆకాశంలో పయనిస్తూ, మంచు ముద్దలను దాటుకుంటూ వచ్చి పిల్లలకు బహుమతులు ఇస్తాడని నమ్మకం.
ఆ నమ్మకం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఆ నమ్మకాలలో భాగంగా ఆ క్రిస్మస్ తాతను తమ మదిలో పదిలపరుచుకుంటూ ఆ శాంత స్వభావ రూపాన్ని పిల్లలకు పరిచయం చేస్తూ అనేక మంది విభిన్న రీతుల్లో స్మరించుకుంటూనే ఉన్నారు. బొమ్మలు, దుస్తులు, కేకులు, స్వీట్లు, చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్- ఇలా అన్ని రకాల వస్తువులలో ఈ టర్కీ పురాణ పురుషుడు చోటుచేసుకొని చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు ఆనందాన్ని అందిస్తున్నాడు.
పిల్లలకు ఆనందాన్నిచ్చేవి బొమ్మలు. కాబట్టే క్రిస్మస్ తాత బొమ్మల రూపంలోకి వచ్చేశాడు. శాంతాక్లాజ్ బొమ్మలంటే ఇష్టపడని పిల్లలు ఉండరు కాబట్టి ఈ నెలలో కోట్లాది రూపాయలలో శాంతాక్లాజ్ బొమ్మలు అమ్ముడుపోతుంటాయి. తల్లిదండ్రులు కూడా ఈ శాంతాక్లాజ్ దుస్తులను తమ చిన్నారులకు ధరింపజేసి క్రిస్మస్ తాత తమ ఇంటికి వచ్చినట్లే మురిసిపోతుంటారు.
ప్రసిద్ధి చెందిన కోకాకోలా కంపెనీ శాంతాక్లాజ్‌ను విభిన్న రంగుల్లో చూపించి తన అమ్మకాలకు ఉపయోగించుకున్నది. పచ్చ, ఊదా,బ్లూ, బ్రౌన్ రంగుల్లో 1800 సంవత్సరాల్లోనే వాడుకలోకి తెచ్చింది. ఎవరు ఎన్ని రంగుల్లో శాంతాక్లాజ్‌కు రూపకల్పన చేసినా చివరకు ఆయనకు ఎరుపురంగు సూట్, తెల్ల టోపీనే స్థిరపడటం గమనార్హం. ఆ రోజుల్లో ఆర్టిస్ట్ లూరుూస్ పరాంగ్ రూపొందించిన క్రిస్మస్ కార్డులు విరివిగా అమ్ముడుపోయేవంటే పిల్లల్లో శాంతాక్లాజ్‌కున్న ప్రేమాభిమానాలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. అలాగే ’27వ దశకంలో న్యూయార్క్ సిటీలో ఎరుపు దుస్తులు ధరించిన శాంతాక్లాజ్‌నే విరివిగా ప్రాచుర్యం పొందాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కోకాకోలా కంపెనీ శాంతాక్లాజ్‌ను తన డ్రింక్స్ అమ్మకాలకు ఉపయోగిస్తూ విశేషంగా లాభాలను గడిస్తుంది. అలాగే 120 ఏళ్లనుంచి శాంతాక్లాజ్ దుస్తులు విరివిగా అమ్ముడవుతూనే ఉన్నాయి. సాహిత్యంలో కూడా శాంతాక్లాజ్‌కు అగ్రస్థానమే ఉంది.
ఆయన కథలు, బొమ్మలతో రూపొందించిన పిల్లల పత్రికలు చిన్నారులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా యూరోపియన్ దేశాలలో డిసెంబర్ నెల వచ్చిందంటే పిల్లల సాహిత్యమంతా శాంతాక్లాజ్ చూట్టూనే తిరుగుతుందంటే అతిశయోక్తికాదు. 18వ దశకంలోనే అమెరికా, కెనడా దేశాలలో పత్రికా సంపాదకులు శాంతాక్లాజ్‌పైనే దృష్టిపెట్టి తమ రచనలలో ఆయనకు పెద్దపీట వేసేవారు. ఆ మహనీయునిపై సంపాదకీయాలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చలికాలంలో శాంతాక్లాజ్ మేజోళ్లు విరివిగా డిజైన్ చేసి అమ్మకాలు సాగిస్తుంటారు.
సినిమా, టీవి నిర్మాతలకు శాంతాక్లాజ్ కాసుల వర్షమే కురిపించాడు. పిల్లల టెలివిజన్ కార్యక్రమాలను రూపొందించే నిర్మాత జోనాథన్ శాంతాక్లాజ్‌పై అధ్యయనం చేసి ఎన్నో కార్యక్రమాలను రూపొందించాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిర్మాతగా మారటానికి, పిల్లలకు చేరువవ్వటానికి శాంతాక్లాజ్‌నే స్ఫూర్తిగా తీసుకున్నానని గర్వంగా చెప్పేవాడు. శాంటా లెటర్స్ అంటూ చిన్నారులకు కొన్ని దేశాలలో పోస్టల్ శాఖ బట్వాడా చేస్తుంటుంది.
లోక రక్షకుడైన జీసస్‌ను నమ్మండని, ఎల్లవేళలా ప్రేమించమని డిసెంబర్ 24 రాత్రి వచ్చి పిల్లలకు బోధించి, వారికి చాక్లెట్లు ఇచ్చి వారిని సన్మార్గంలో నడిపే ఈ క్రిస్మస్ తాతకు ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఘనంగా ఆహ్వానం పలకాలంటే చిన్నారులు రాత్రంతా టివీలతోనూ, కంప్యూటర్ గేమ్స్‌తో కాలం గడపకుండా మేల్కొని ఉండాలి. అంతేకాదు క్రిస్మస్ బహుమతులంటూ వేలాది రూపాయల విలువ చేసే లాప్‌టాప్ లాంటి వస్తువులను కొనుగోలు చేయకుండా ఆ డబ్బును పేదవారికి ఖర్చు చేయాలని ఆనాటి క్రిస్మస్ తాత ఆచరణలో చూపెట్డాడు. పిల్లలు కూడా ఈ మార్గానే్న ఆచరణలో చూపితే తాత మోము చిన్నబోదు. ఆయన ముఖం ఆనందం వెల్లివిరుస్తోంది.