Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మీ - సేవతో మహాకష్టాలు

$
0
0

గుంటూరు (కార్పొరేషన్), డిసెంబర్ 24: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించి, పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన మీసేవా కేంద్రాలతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన ప్రజలు ప్రస్తుతం మీ సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. మీసేవా కేంద్రంల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, సిబ్బంది కనీస పరిజ్ఞానం లేని వారు కావడం, ఇంగ్లీషుపై పట్టులేని వారు విధులు నిర్వహిస్తుండటంతో సర్ట్ఫికెట్లలో పెద్దఎత్తున తప్పులు దొర్లుతున్నాయి. తత్ఫలితంగా వీటిని మరలా ఎంట్రీ చేయడం, కరెక్షన్ కోసం నగరపాలక సంస్థ, రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళాల్సి రావడంతో ఇటు జాప్యంతో పాటు, అటు డబ్బులు కూడా నష్టపోతున్నారు. కొందరు మీసేవా కేంద్ర నిర్వాహకులు సంవత్సరంలోపు పుట్టిన పిల్లల బర్త్ సర్ట్ఫికెట్‌ను పేరుతో పాటు నమోదు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ డబ్బు కోసం రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం ఒకసారి, పేరు నమోదుకు ఇంకోసారి నమోదు చేస్తూ ఆర్థికంగా తమను నష్టపరుస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. మీసేవా కేంద్రాల్లో ఆధార పత్రాలను సరిగ్గా అందించినప్పటికీ కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల జరిగిన తప్పిదాలకు కప్పిపుచ్చుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తూ వ్యయ ప్రయాసలకు గురి చేస్తున్నారు. అలాగే స్కాలర్‌షిప్, ఇన్‌కమ్ సర్ట్ఫికెట్‌ల విషయంలో చాలా జాప్యం జరుగుతోందని విద్యార్థులు వాపోతున్నారు. హైదరాబాద్ నుండి వచ్చే సర్వర్ సమస్యతో సర్ట్ఫికెట్లను జారీ చేయడంలో ఆలస్యమవుతోంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, భూముల రిజిస్ట్రేషన్ కూడా మీసేవా కేంద్రాలకు అప్పగించడంతో ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈలోగా సర్వర్‌లు పనిచేయక పోవడంతో పని మళ్లీ మొదటికి వస్తోంది. ప్రజల అసౌకర్యం దృష్ట్యా మీ సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ప్రత్యేక శిక్షణతో పాటు, ఇంగ్లీషుపై పట్టున్న వారిని నియమించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

కానిస్టేబుల్ వీరంగం
రేపల్లె, డిసెంబర్ 24: విధి నిర్వహణలో ఉన్న రేపల్లె టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఎం రామయ్య తరచు తాగి తోటి ఉద్యోగులపై దాడి చేస్తూ వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ సిఐ యు నాగరాజు చాంబర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ అడ్డు వచ్చిన డోర్‌ను పగలగొట్టి స్టేషన్‌లో వీరంగం సృష్టించాడని సిఐ నాగరాజు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎం రామయ్య అనే కానిస్టేబుల్ తరచూ విధులకు గైర్హాజరౌతూ తాగు తూ డ్యూటీ సక్రమంగా చేయకపోగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆయన చెప్పారు. గతంలో ఇతనిపై అనేకమంది ఫిర్యాదు చేశారని, భార్య, అత్తమామలపై దాడులు చేయటంతో కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. ఒక మెడికల్ రిప్రజెంటేటివ్‌పై ఇటీవల దాడి చేశాడని, మున్సిపల్ వర్కర్లపై మరోమారు దాడి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని సిఐ వివరించారు. తరచు విధులకు రాకపోవటంతో అతనికి రెండు మాసాలుగా జీతం కూడా రావటం లేదని, ఎస్‌ఐ, సిఐపై కక్ష సాధించేందుకు కుట్ర పన్నాడని పోలీస్ స్టేషన్‌పై దాడి చేయటంతో భయభ్రాంతులకు గురికావటంతో అతనిపై కేసు నమోదు చేసి వైద్య పరీక్షలకు పంపినట్లు సిఐ నాగరాజు తెలిపారు.

ప్రముఖుల క్రిస్మస్ శుభాకాంక్షలు
గుంటూరు (కల్చరల్), డిసెంబర్ 24: ప్రపంచ శాంతికై ఉద్భవించిన కారణ జన్ముడు ఏసుక్రీస్తు జయంతిని పురస్కరించుకుని విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు క్రైస్తవ సోదరులకు మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ ప్రతిఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి, ఆర్థికశాఖ సహాయ మంత్రి జెడి శీలం, శాసనసభాపతి నాదెండ్ల మనోహర్, మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, కాసు వెంకట కృష్ణారెడ్డి, ఎంపి రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు మస్తాన్‌వలి, ఐజి సునీల్‌కుమార్, కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్, జెసి వివేక్‌యాదవ్, అదనపు జెసి కె నాగేశ్వరరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చేందుకే
భారత్ నిర్మాణ్- పౌర సమాచార ఉత్సవం
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, డిసెంబర్ 24: సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చాలన్న సంకల్పంతో కేంద్రప్రభుత్వం భారత్ నిర్మాణ్ - పౌర సమాచార ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సంచాలకులు టివికె రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రప్రథమంగా 2006లో కేంద్రం నల్గొండలోఈ ఉత్సవం నిర్వహించిందని, తదనంతరం 45 ప్రాంతాల్లో నిర్వహించామని, తెనాలిలో 46వ ఉత్సవం జరుపుతున్నామని చెప్పారు. జనవరి 5,6,7 తేదీల్లో గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో భారత్ నిర్మాణ్ పౌర సమాచార ఉత్సవాన్ని నిర్వహిస్తున్న తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, చట్టాలు గురించి ప్రజలలో సంపూర్ణ అవగాహన కల్గించి వారిని చైతన్య వంతులను చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వివరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సంక్షేమ పథకాల వివరాలను తెలియజెప్పడం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రతి రోజూ ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయన్నారు. సంక్షేమ పథకాల అమలు, వాటి పనితీరు, జరిగే లబ్ధి గురించి తెలియజేస్తూ సుమారు 50 నుండి 55 శాఖలు ఫొటో ప్రదర్శనలను ఏర్పాటు చేస్తారన్నారు. గతంలో గుంటూరు జిల్లా నరసరావుపేట, బాపట్లలో నిర్వహించిన ఈ ఉత్సవాలు విజయవంతమయ్యాయన్నారు. పథకాల అమలుతో పాటు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం, ఆహార భద్రత, విద్యాహక్కు, సమాచార హక్కు, ఉపాధి హామీ చట్టాలపై కూడా విశేష ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాల్లో కేంద్ర, రాష్టమ్రంత్రులు, జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. వివిధ విభాగాలు పంపిణీ చేయదలచిన పట్టాలు, రుణాలు, ఉప కరణాలు, సర్ట్ఫికెట్లను మూడు రోజుల ఉత్సవాల్లో ముఖ్య అతిథులు పంపిణీ చేస్తారని చెప్పారు. జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ పౌర సమాచార ఉత్సవాల్లో భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చూడాలన్నారు. మూడు రోజుల కార్యక్రమాల విజయవంతానికి అదనపు జెసి నేతృత్వంలో తెనాలి ఆర్‌డిఒ, మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్, ఎండిఒలతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో అదనపు జెసి కె నాగేశ్వరరావు, డిఆర్‌ఒ కె నాగబాబు, ప్రణాళిక శాఖ జెడి శ్రీనివాస్, తెనాలి ఆర్‌డిఒ ఎస్ శ్రీనివాసమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఐక్య ఉద్యమాలతోనే నివేశన స్థలాల సాధన
గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 24: పేదలందరూ సమష్టిగా ఉద్యమాలు చేయడం ద్వారానే నివేశన స్థలాలను సాధించుకోవచ్చని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ప్రగతినగర్‌లో పుచ్చలపల్లి సుందరయ్య భవన్ (సిపిఎం కార్యాలయం)ను రాఘవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సిఐటియు నగర అధ్యక్షుడు నళినీకాంత్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రంలో భూముల ధరలు పెరగడంతో బడాబాబుల కళ్లు పేదల స్థలాలపై పడ్డాయన్నారు. కాల్వగట్టలపై ఉన్న పేదల గుడిసెలను ఖాళీ చేయించి హోటళ్లు, పార్కులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. కొండలపై నివాసముండే వారిని కూడా వెళ్లగొట్టి ఖరీదైన భవనాలు నిర్మించి పేదలకు నిలువనీడ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం ఒక్కటిగా ఉంటుందో, విడిపోతుందో అర్థం కావడం లేదన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య కోరిన విశాలాంధ్ర ఏర్పడిందని, ప్రజారాజ్యం మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విశాలాంధ్ర ఎగిరిపోయే పరిస్థితి నెలకొందన్నారు. రాజకీయ పార్టీలు వాటి స్వార్థ ప్రయోజనాల కోసమే విభజనాంశాన్ని తెరపైకి తెచ్చాయన్నారు. రాష్ట్ర విభజన విషయంలో పార్టీల నాయకులు సీమాంధ్ర, తెలంగాణలో భిన్నవాదనలు వినిపిస్తూ తమ పార్టీ కార్యాలయాల్లో మాత్రం కలిసి మాట్లాడుకోవడం వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శనమన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విభజన జరిగినా పేదలకు కడగండ్లు తప్పవన్నారు. రాష్ట్రంలో పాలన స్తంభించడంతో పేదల కష్టాలను పట్టించుకునే అధికారులే కరవయ్యారన్నారు. ప్రస్తుతం అనిశ్చితి, అయోమయ పరిస్థితులు తొలగిపోతేనే పేదల సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయన్నారు. ప్రజా ఉద్యమాలు, పోరాటాలతో పాటు సేవా కార్యక్రమాల్లో పుచ్చలపల్లి సుందరయ్య ముందుండేవారని కొనియాడారు. మహబూబ్‌నగర్‌లో కరవు సంభవిస్తే రాగులు సేకరించి గంజి కేంద్రాలను ఆయన ఏర్పాటు చేశారన్నారు. దివి సీమ ఉప్పెన సమయంలో మృతదేహాలను దహనం చేసి పశువులను పూడ్పించారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రగతినగర్‌లో డ్రైన్ల నిర్మాణానికి తన నియోజకవర్గ నిధుల నుండి ఇచ్చిన రెండు లక్షల రూపాయలు విడుదలయ్యాయన్నారు. సుందరయ్య భవన్‌లో గ్రంథాలయ ఏర్పాటుకు రూ. 5 వేల విరాళాన్ని లక్ష్మణరావు ప్రకటించారు. పేదల ఇళ్లకు జాగా కల్పించని ప్రభుత్వాలు, పెద్దలకు ఎన్ని భూములైనా కేటాయిస్తున్నాయని ఆరోపించారు. సిమెంటు ఫ్యాక్టరీల కోసం ఏర్పాటు కోసం పల్నాడులో కేటాయించిన భూముల కంటే అధికంగా వందల ఎకరాల భూమి బడా బాబుల కబ్జాలో ఉన్నాయన్నారు. ఈ భూములను పేదలకు పంపిణీ చేయాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి రమాదేవి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను నాగేశ్వరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎంఆర్ దేవి, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి కృష్ణకాంత్, సంజీవరెడ్డి, పరశురామిరెడ్డి, సతీష్, కందుల సుబ్బారావు, వై వేణుగోపాల్, మల్లెల త్రినాధ్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.

బాలల ఆరోగ్యాన్ని కాపాడటం అందరి బాధ్యత
గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 24: కడుపున పుట్టిన బిడ్డ తమ కళ్లెదుటే మరణిస్తుంటే ఏమి చేయాలో తెలియని మాతృహృదయం పడే బాధ వర్ణనాతీతమని, వారిని కాపాడాల్సిన బాధ్యత సమాజ పౌరులుగా మనందరిపై ఉందని నగర క్రైం డిఎస్‌పి కె రవీంద్రబాబు పేర్కొన్నారు. శ్రీ బాలభారతి, అట్లాంటా వాలీబాల్ లీగ్ సంయుక్త నిర్వహణలో మంగళవారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని బాలల వార్డులో ఆసుపత్రిలో లభించని అత్యవసర మందుల ఉచిత పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు శ్రీ బాలభారతి వ్యవస్థాపక అధ్యక్షుడు యర్రం సాంబిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి రవీంద్రబాబు మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను బాలభారతి చేపట్టడం అభినందనీయమన్నారు. సంస్థ అధ్యక్షుడు యర్రం సాంబిరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రల్లో శిశుమరణాలు అతి తక్కువ శాతంలో ఉండగా, ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రతినెలా 90 మంది శిశువులు మృత్యువాత పడటం దురదృష్టకరమన్నారు. శిశు మరణాలను నివారించేందుకు తాము అత్యవసర మందుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వ వైద్యశాల శిశు విభాగాధిపతి డాక్టర్ పెనుగొండ యశోదర మాట్లాడుతూ చిన్నారుల ప్రాణాలను రక్షించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల చిన్నారులు మృత్యువాత పడటం బాధాకరమన్నారు. కొత్తపేట సిఐ టివి ఆంజనేయులు మాట్లాడుతూ కేవలం వైద్య పరికరాలు, నర్సుల కొరత కారణంగా చిన్నారులు మృత్యువాత పడుతుండటం ఆవేదనకు గురి చేస్తుందన్నారు. అనంతరం 24 బాలలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎస్‌ఐ కోటేశ్వరరావు, ఎస్‌డబ్ల్యుఎస్ అధ్యక్షుడు యు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజావ్యతిరేక విధానాలను కార్యకర్తలు తిప్పికొట్టాలి
గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 24: ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం ఇన్‌చార్జి కందుకూరి వీరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందన్నారు. పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మరింత మమేకం కావాలన్నారు. ఆయా ప్రాంతాల్లో వౌలిక సమస్యలు, వాటి పరిష్కారానికి కార్యకర్తలు చొరవ చూపి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్ర పార్టీ పరిశీలకులు కొమ్మినేని సాయి వికాస్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచే కార్యకర్తలు కష్టించి పనిచేస్తే ఎన్నికల్లో తప్పక విజయం సాధించగలుగుతామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజలతో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజా సంక్షేమంపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రాజెక్టులు నిర్మిస్తామన్న కాంగ్రెస్ పార్టీ చివరకు కాల్వల మరమ్మతులు నిర్వహించలేని స్థితిలో ఉందన్నారు.
వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి తండ్రి శవాన్ని పక్కనబెట్టుకుని పదవి కోసం సంతకాలు చేయించుకున్నారని, ఇలాంటి వారు రాజకీయాల్లోకి రాబట్టే ఈ వ్యవస్థ భ్రష్టుపడుతోందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, తెనాలి శ్రావణ్‌కుమార్, బోనబోయిన శ్రీనివాసయాదవ్, కొల్ల వీరయ్య చౌదరి, వట్టికూటి హర్షవర్ధన్, కూనాటి రమేష్, కుర్రి సుబ్బారెడ్డి, హస్సేన్‌సాహెబ్, పసుపులేటి సుబ్బారావు, సునీల్‌చౌదరి, పప్పుల దేవదాసు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ అవిరళ కృషి

* సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు
గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 24: జిల్లాలో ప్రజా సమస్యలపై సిపిఐ విశ్రమించకుండా నిరంతరంగా పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయడం ఆనందించదగ్గ విషయమైనప్పటికీ ప్రాజెక్టు పనులను పూర్తిస్థాయిలో చేయకపోవడంతో రైతులు, ప్రజలకు ప్రయోజనకరంగా లేదన్నారు. నీటి నిల్వ సామర్థ్యం లేనప్పుడు ప్రాజెక్టు నిర్మించి ఏం లాభమన్నారు. పులిచింతల ప్రాజెక్టు తొలిదశ పనుల నుండి ఇప్పటివరకు సిపిఐ తమ పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చిందన్నారు. మిర్చిరైతులను ఆదుకునేందుకు ఒక చట్టం తేవాలన్నారు. ఇటీవల 7 కోల్డ్‌స్టోరేజ్‌లు తగలబడ్డాయని, రైతుల పక్షాన సిపిఐ అండగా నిలిచి నష్టపరిహారాన్ని ఇప్పించేందుకు ఎంతో కృషి చేసిందని తెలిపారు. కొండవీటి వాగు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారే తప్ప నీటిని సముద్రంలోకి ఏ విధంగా మళ్లించాలో పక్కా ప్రణాళిక నేటికీ రూపొందించలేదన్నారు. ఈనెల 18,19,20 తేదీల్లో జాతీయ రైతు సమ్మేళనం నిర్వహించామని, రైతులకు దశాదిశా నిర్దేశించే విధి విధానాలను రూపొందించామని, 2014 ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ఈ విధి విధానాలే మ్యానిఫెస్టో కాబోతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నగర కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, రాష్ట్ర నాయకులు జివి కృష్ణారావు, కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

నేటి నుండి 28 వరకు దస్తావేజు లేఖరుల నిరసన, బంద్
నరసరావుపేట, డిసెంబర్ 24: ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు పట్టణంలో నిరసనలతోపాటు బంద్ పాటిస్తున్నట్లు దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జీవీ నాగభూషణరావు, జెవీ సుబ్బాచార్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విభాగంలో చేపడుతున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే కొన్ని రకాల సేవలను మీ సేవలకు బదిలీ చేశారని పేర్కొన్నారు. దస్తావేజు లేఖరులుగా స్థిరపడి జీవనోపాధిని కొనసాగిస్తున్న వారు తమ జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మీసేవా కేంద్రాలకు తమ సేవలన్నింటినీ బదిలీ చేస్తే, దస్తావేజు లేఖరులు వీధినపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. మూడు రోజులపాటు జరిగే నిరసన, బంద్ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.

ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో జన విజ్ఞాన సదస్సు

నరసరావుపేట, డిసెంబర్ 24: స్థానిక ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం జన విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ వి బ్రహ్మరెడ్డి మానవ సంబంధాలు, భావ వ్యక్తీకరణను అభివృద్ధి పరుచుకోవడంపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు నిజాయితీ, వివేకం, సామర్థ్యత, స్కిల్స్ తదితర విషయాలు పెంపొందించుకోవాలని నంది అవార్డుగ్రహీత, ఎన్టీఆర్ అవార్డు గ్రహీత, గజల్ విద్వాంసుడు మహమ్మద్ మియా అన్నారు. ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో గతంలో పలు కార్యక్రమాలను నిర్వహించామని రంగస్థలి సెక్రటరీ బాషా తెలిపారు. ఈ సదస్సులో జిల్లా అధ్యక్షుడు ఎం నరసింహారెడ్డి, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ షేక్ కరీం, డైరెక్టర్ మస్తాన్‌షరీఫ్ పాల్గొన్నారు.

తూనికలు, కొలతలలో తేడాలుంటే ఫిర్యాదు చేయాలి
నరసరావుపేట, డిసెంబర్ 24: బాల్యం నుండే వినియోగదారుల హక్కుల పట్ల అవగాహన పెంపొందించుకుంటే లోపాలను గుర్తించి ప్రశ్నించే తత్వం అలవడుతుందని తూనికల కొలతల శాఖ జిల్లా ఇన్‌స్పెక్టర్ ఎన్ స్వామి అన్నారు. మంగళవారం స్థానిక శ్రీ రామకృష్ణ ఓరియంటల్ హైస్కూలులో పాఠశాల వినియోగదారుల క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవ సభలో మాట్లాడారు. సభకు ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణసింగ్ అధ్యక్షత వహించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ వినియోగదారులేనన్నారు. వస్తువుల కొనుగోళ్ళు, సేవలు, వినియోగం అన్నింటిలో వినియోగదారులకు హక్కులుంటాయన్నారు. తూనికలు, కొలతలు తదితర అంశాలలో లోపాలు గుర్తిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ సందర్భంగా పరికరాల ద్వారా తూనికలు, కొలతల్లో జరిగే మోసాలు వివరించారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంఆర్‌పి ప్రకారం ధర, పరిమిత గడువు తేదీ తదితర విషయాల్లో ఔషధాలు కొనుగోలు చేసేవారు జాగ్రత్త వహించాలన్నారు. విధిగా రశీదులు పొందితేనే వినియోగదారులకు ప్రశ్నించే అర్హత, అవకాశం, ఫిర్యాదుకు అధారం ఉంటుందన్నారు. మెడికల్ దుకాణాల్లో శాంపిల్స్ విక్రయించరాదన్నారు. లైసెన్స్ దుకాణాల్లో ఔషధాలను కొనుగోలు చేయాలన్నారు.

తెనాలి గడ్డపై జన్మించడం సుకృతం
తెనాలి, డిసెంబర్ 24: విభిన్న రంగాలకు విభిన్న కళలకు నెలవై అనాదిగా సర్వోన్నతంగా భాసిల్లుతున్న తెనాలి గడ్డపై జన్మించడం సుకృతమని తుమ్మల వెంకట్రామయ్య స్మారక అవార్డు అందుకున్న సందర్భంగా ప్రొఫెసర్ చందు సుబ్బారావు అన్నారు. తమదైన పంధాలో తెనాలికి ఉన్న ప్రాధాన్యతను జన రంజకంగా ప్రస్తావించారు. స్థానిక తాలూకా జూనియర్ కళాశాల ప్రాంగణం వేదికగా కొనసాగుతున్న పోలేపెద్ది నరసింహమూర్తి, తుమ్మల వెంకట్రామయ్య స్మారక 5వ రాష్టస్థ్రాయి ఆహ్వాన నాటికల పోటీలలో భాగంగా రెండో రోజైన మంగళవారం నిర్వహించిన కార్యక్రమాల్లో సాహితీవేత్త, సద్విమర్శకులు ప్రొఫెసర్ చందు సుబ్బారావుకు తుమ్మల వెంకట్రామయ్య స్మారక అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కళాకారుల సంఘం కార్యదర్శి ఎమ్.సత్యనారాయణశెట్టి అధ్యక్షత వహించగా వక్తలు తమ ప్రసంగాల్లో తెనాలి కళా వైభవాన్ని, పరిషత్ నిర్వహణలో నిర్వాహకుల కృషిని ప్రశంశించారు. ఇదే క్రమంలో తుమ్మల వెంకట్రామయ్య స్మారక అవార్డును స్వీకరించిన ప్రొఫెసర్ సుబ్బారావు మాట్లాడుతూ, శతాబ్దాల చరిత్రలో తెనాలికి ఉన్న ప్రాధాన్యత వివరించారు. సర్వమత సహన సదస్సులో 1070 ప్రాంతంలోనే ఈ ప్రాంతానికి సమీపాన ఉన్న చందోలులో నిర్వహించిన నాటి చరిత్ర వివరించారు. వెలనాడులులలో కొంకణభూపతి రాజ్యపాలన తీరును వివరించారు. సర్వ సంస్కృతులకు నైలవైన తెనాలి గడ్డపై జన్మించడం ఓ సుకృతంగా భావిస్తున్నా అన్నారు. తన చిన్నతనంలో మేనమామ బొల్లిముంత శివరామకృష్ణ చేతులు పట్టుకుని పలు కళాసంస్థలు నిర్వహించిన కార్యక్రమాలో పాల్గొన్న వాసనలే తన ఉన్నతికి దోహదపడ్డాయన్నారు. కళల రాజధాని తెనాలిలో సత్కారం అందుకునే అవకాశం లభించడం ఓ వరంగా భావిస్తున్నాఅన్నారు.
తొలుత ప్రదర్శించిన మూర్తి కల్చరల్ ఆసోసియేషన్ కాకినాడ వారి సంచలనం నాటిక ఆద్యంతం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. రెండవ ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి పొడుస్తున్న పొద్దు నాటిక ప్రదర్శించారు. పట్టణ కళాకారుల సంఘం అధ్యక్షుడు షేక్ జానిబాషా, కళా పరిషత్ ఆహ్వాన కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.

పెదరావూరులో 22.30 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం

తెనాలి రూరల్, డిసెంబర్ 24: తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర, తెనాలి మండలాల్లోని పలు అభివృధ్ధి కార్యక్రమాలకు భూమిపూజ, ప్రారంభోత్సవ కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే, శాసన సభాపతి నాదెండ్ల మనోహర్ మంగళవారంతో ముగించారు. ఇందులో భాగంగా కొల్లిపర మండలానికి సుమారు 72 లక్షలు, తెనాలి మండలానికి దాదాపు 3 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఇప్పటికే ప్రారంభించి ముగించిన పనులను లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా మండలంలోని జగ్గడిగుంటపాలెంలో నిర్మాణమవుతున్న సిమెంటు రోడ్‌ను ఆయన పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం పెదరావూరులో 22.30 లక్షల విలువగల నిధులతో నిర్మాణాలు పూర్తి చేసుకున్న రెండు రోడ్లు, ఎస్సీలకు చెందిన శ్మశాన వాటికలో ఫెన్సింగ్ నిర్మాణం, అదనపు గదిని స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి కోసం విడుదల చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు సక్రమంగా, సకాలంలో అందేలా అధికారులు కృషి చేయాలని కోరారు.
* స్పీకర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రైస్తవులు జరుపుకోనున్న క్రిస్మస్ శుభాకాంక్షలను శాసనసభ సభాపతి నాదెండ్ల మనోహర్ మంగళవారం ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా పెదరావూరులోని ఆంధ్ర యూవాంజిలికల్, తెలుగు బాప్టిస్టు చర్చీల్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయాచర్చీల పాస్టర్లు, సంఘ పెద్దలు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

క్రిస్మస్ సందర్భంగా అరటి గెలలు పంపిణీ

బాపట్ల, డిసెంబర్ 24: ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులంతా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న క్రిస్మస్ పర్వదిన వేడుకలను మరింత శోభాయమానం చేయడానికి బాపట్ల శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 700 గెలల అరటి పండ్లను ప్రార్థనా మందిరాలకు ఫలహారంగా అందించారు. మంగళవారం యువ నేత గాదె మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో పటేల్ నగర్ నుండి ప్రత్యేక వాహనాల ద్వారా 700 అరటి గెలలను పంపిణీ చేశారు.
వైఎస్‌ఆర్ సిపి ఆధ్వర్యంలో
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో నియోజక వర్గంలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాలకు అరటి గెలలను పంపిణీ చేశారు.
తెలుగుదేశం ఆధ్వర్యంలో
తెలుగుదేశం నాయకుడు అన్నం సతీష్‌ప్రభాకర్ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణం, మండలంలోని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అరటి గెలలను పలహారంగా పంపిణీ చేశారు.

వైద్యవృత్తికి జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ వుళ్ళక్కి
తెనాలి,డిసెంబర్ 24: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా తెనాలి శాఖకు మెరుగైన సేవలు అందించిన డాక్టర్ వుళ్ళక్కి మరణానంతరం ఆయన భౌతికకాయాన్ని వైద్య పరిశోధనలకు అందజేసిన ఆదర్శమూర్తి అని ఐఎమ్‌ఎ తెనాలి శాఖ అద్యక్షుడు డాక్టర్ ఎస్‌వి.కృష్ణారావు అన్నారు. మంగళవారం స్థానిక ఐఎమ్‌ఎ హాల్‌లో డాక్టర్ వుళ్ళక్కి 49వ వర్ధంతి పురస్కరించుకుని డాక్టర్ల బృందం ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. ఈ కార్యక్రమంలో ఐఎమ్‌ఎ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌వి.కృష్ణారావు ఆరోగ్య పత్రిక ఆరోగ్యవాణి అవిష్కరించారు. ఈ క్రమంలో డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ ప్రజలకు వైద్య విజ్ఞాన్ని అందించడంలో ఐఎమ్‌ఎ తెనాలి బ్రాంచ్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కళాశాల ఆచార్యులు డాక్టర్ ఎ.అశ్వనీకుమార్ వైద్య ప్రమాణాలు నాడు - నేడు అనే అంశంపై డాక్టర్ వుళ్ళక్కి స్మారకోపన్యాసం చేశారు. అనంతరం అసోసియేషన్ తరఫున డాక్టర్ అశ్వనీకుమార్‌ను డాక్టర్ వుళ్ళక్కి స్మారక బంగారు పతకంతో సత్కరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పన
తెనాలి రూరల్, డిసెంబర్ 24: ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు వౌలిక వసతుల కల్పనకు, శ్రద్ధాసక్తులు కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు తెనాలికి చెందిన మదర్ థెరిస్సా సోషల్ సర్వీస్ ఫ్రెండ్స్ సర్కిల్ మంగళవారం సాయం చేసింది. తెనాలి మండలం నందివెలుగు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ప్లేట్లు, గ్లాసులు, నోట్ పుస్తకాలు పంపిణీ, అదే గ్రామంలో ఎంపిపి పాఠశాల(ఆర్) విద్యార్థులకు నోట్ పుస్తకాలు, కొల్లిపర జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు దుస్తులు, బ్యాగ్‌లు, చక్రాయపాలెం, వల్లభాపురం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్ పుస్తకాలు మంగళవారం తెనాలి మారీసుపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో అందజేసినట్లు సర్కిల్ అధ్యక్షుడు ఎవి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

కొవ్వొత్తుల కాంతుల మధ్య వెలిగిన బాలయేసు వైభవం

గుంటూరు (కల్చరల్), డిసెంబర్ 24: నగరం నలుమూలల నుంచి ప్రార్థనామందిరాలకు తరలివచ్చిన వేలాది మంది క్రైస్తవులు, వారి కుటుంబాలు లోక రక్షకుడైన ఏసుక్రీస్తుకు ఆనంద ఆహ్లాదపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు జరిగే క్రిస్మస్ వేడుకలు చారిత్రాత్మకమైన గుంటూరు నగరంలో మంగళవారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా నగరంలోని 52 డివిజన్లు, రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో గల ప్రధాన చర్చిలు, క్రైస్తవ ఆరాధనా మందిరాల్లో అర్ధరాత్రి 12 గంటల వరకూ ప్రత్యేక ప్రార్థనా సమావేశాలు జరిగాయి. పెంతెకోస్తులు, బాప్టిస్టులు, ఇవాంజిలిన్‌లు, ప్రొటెష్టాంటులు, రోమన్ క్యాథలిక్‌ల ఆధ్వర్యంలో క్రీస్తు జయంతి ఉత్సవాన్ని కనుల పండువగా నిర్వహించుకున్నారు. రింగురోడ్డులోని బిషప్ బంగ్లాలో దివ్య పూజాబలి ప్రధాన ప్రార్థనా సమావేశాన్ని గుంటూరు క్యాథలిక్ పీఠాధిపతి రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ గాలిబాలి పర్యవేక్షణలో నిర్వహించారు.
గాలిబాలి ఆధ్వర్యంలో ఫాదర్లు దీవెనలందించారు. హిందూ కళాశాల వద్ద గల పరిశుద్ధ మత్తయి లూధరన్ శతవార్షిక పశ్చిమ గురుమండలంలో సంఘ కాపరి రెవరెండ్ సిహెచ్ విక్టర్ మోజెస్ ఆధ్వర్యాన జరిగిన విశేష ప్రార్థనలో అడిషనల్ పాస్టర్లు రెవరెండ్ రమేష్‌బాబు, కెకె పాల్, ఉత్సవ కమిటీ చైర్మన్ ఎం డేవిడ్ లూధర్‌బాబు, కార్యక్రమ నిర్వాహక వివిధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు పి ఉషానిరంజన్, సునీల్ రత్నకుమార్, బి శారామేరీగ్రేస్, రెవరెండ్ డానియేలు తదితరులు కీర్తన, బైబిల్ పఠనం సమావేశాల్లో పాల్గొని క్రీస్తు ఘనతను ప్రస్తుతించారు. లాడ్జిసెంటర్‌లోని నార్త్ ప్యారీష్ చర్చిలో ఆంధ్ర సౌవార్తిక లూధరన్ సంఘం పర్యవేక్షణలో ప్రధాన పాస్టర్ రెవరెండ్ సిహెచ్ ఏలియా, స్టీవెన్‌సన్‌బాబు, ఎన్ విలియంకేరి, ఉత్సవ కమిటీ చైర్మన్ టి జేమ్స్ వరప్రసాద్ బాబుల ఆధ్వర్యంలో మంగళవారం రోజంతా ప్రత్యేక ప్రార్థనా సమావేశాలు జరిగాయి. సిహెచ్ స్టీవెన్‌సన్ బాబు సందేశమిస్తూ ఏసుక్రీస్తు అవతరించడం లోకానికి శుభ దాయకమన్నారు.

ట్రాలీ ఆటో ఢీ: వ్యక్తి మృతి
దుర్గి, డిసెంబర్ 24: ట్రాలీ ఆటో ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన మండలంలోని ఓబులేశునిపల్లెలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన అలవాల పిచ్చయ్య (60) తెల్లవారుఝామున బహిర్భూమికి వెళ్ళి వస్తుండగా, ఏపి 26వై 0826 నంబరు గల ట్రాలీ ఆటో పిచ్చయ్యను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పిచ్చయ్య తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడు పిచ్చయ్యను చికిత్స నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. పిచ్చయ్య బంధువుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ పి కృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఐనవోలు మేజర్
గండి పూడ్చివేతకు చర్యలు
నూజెండ్ల, డిసెంబర్ 24: మండలంలోని ఐనవోలు మేజర్ గండిని పూడ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎన్‌ఎస్‌పి డిఇ బాబు మంగళవారం తెలిపారు. ఐనవోలు మేజర్‌కు గండి, సాగునీరు వృథా అనే శీర్షికన ఆంధ్రభూమిలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఇప్పటికే సాగునీటి సంఘం నాయకులతో చర్చలు జరుపుతున్నామని, సమస్య శాశ్వత పరిష్కారానికి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. రైతులకు సాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
సిపిఐ వ్యవస్థాపక దినోత్సవాన్ని జయప్రదం చేయాలి
నరసరావుపేట, డిసెంబర్ 24: ఈ నెల 26వ తేదీన జరిగే సిపిఐ 88వ వ్యవస్థాపక దినోత్సవం, కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు శత జయంతి సభను జయప్రదం చేయాలని సిపిఐ ఏరియాకార్యదర్శి కాసా రాంబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించి,
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles