చింతకాని, డిసెంబర్ 24: ప్రజా సమస్యలపై సిపిఎం ప్రజా ఉద్యమాలు కొనసాగుతాయని సిపిఎం రాష్ట్ర నాయకులు సామినేని రామారావు స్పష్టం చేశారు. ఖమ్మం - బోనకల్ ప్రధాన రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల పరిధిలోని పందిళ్ళపల్లి నుండి మండల కేంద్రమైన బోనకల్ వరకు సిపిఎం పాదయాత్ర నిర్వహించింది. పాదయాత్ర ప్రారంభోత్సవ సభలో ముఖ్య అతిథిగా హాజరైన సామినేని రామారావు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. భట్టి విక్రమార్క శాసన సభ్యునిగా గెలుపొందిన తర్వాత నియోజక వర్గంలో విపక్ష పార్టీకి చెందిన ప్రజలు వివక్షకు గురవుతున్నారన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరిని సమాన దృష్టితో చూడటం మీ బాధ్యత కాదా అని భట్టిని సూటిగా ప్రశ్నించారు. ఖమ్మం-బోనకల్ ప్రధాన రహదారి సమీప గ్రామాలైన జగన్నాథపురం, నాగులవంచ, ముష్టికుంట్ల, బోనకల్ గ్రామాలు సిపిఎం గ్రామ పంచాయతీలు కావడం వలనే రహదారిని అభివృద్ధి చేయడం లేదని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి పొన్నాం వెంకటేశ్వరరావు మండిపడ్డారు. పదమూడు కోట్లు రహదారి మరమ్మతులకు మంజూరయ్యాయని చెప్పే కాంగ్రెస్ నాయకులకు కమీషన్‌లు కుదరకనే పనులు ప్రారంభించడం లేదని ఆరోపించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి అధ్వానంగా తయారై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొంటున్నారని, గర్భిణులుప్రయాణించే సమయంలోనే ప్రసవిస్తున్నారన్నారు. రహదారి సరిగా లేక అనేక ప్రమాదాలు జరుగుతున్నా మీరేం చేస్తున్నారని భట్టిని ప్రశ్నించారు. ఇకనైనా వెంటనే రోడ్డు మరమ్మతులనుప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం భారి సంఖ్యలో హజరైన నాయకులు కార్యకర్తల ర్యాలీని సిపిఎం రాష్ట్ర నాయకులు సామినేని రామారావు జెండా ఊపి ప్రారంభించారు. ఎర్ర చొక్కాలు ధరించిన కార్యకర్తలు ఎర్ర జెండాల రెపరెపలతో ప్రారంభమైన ర్యాలీ పందిళ్ళపల్లి నుండి- జగన్నాథపురం, నాగులవంచ, ముష్టికుంట్ల మీదగా బోనకల్ చేరుకొని పాదయాత్రను ముగించారు. మార్గం మధ్యలో జగన్నాథపురం వద్ద తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మంకెన రమేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం మండల నాయకులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అంతకు ముందు పందిళ్ళపల్లిలో ఇటీవల హత్యకు గురైన న్యాయవాది శ్రీనివాసరావు స్మారక స్థూపం వద్ద సిపిఎం జిల్లా మండల నాయకులు కార్యకర్తలు నివాళులర్పించి, పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగాల కమలరాజు, బండి రమేష్, మదిని రమేష్, కట్టా గాంధీ, సిహెచ్ కోటేశ్వరరావు, వత్సవాయి జానకిరాములు, మడుపల్లి గోపాలరావు, కోలేటి సూర్యప్రకాశరావు, బల్లి చినవీరయ్య, కొల్లి నారాయణ, మండల డివిజన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రుద్రంపూర్ సిఇఆర్‌క్లబ్‌లో
అంగరంగ వైభవంగా సింగరేణి ఉత్సవాలు
కొత్తగూడెం, డిసెంబర్ 24: కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ సిఇఆర్ క్లబ్‌లో సోమవారం అర్ధరాత్రి వరకు సింగరేణి దినోత్సవ వేడుకలను కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట సిజిఎం ఎం మల్లేష్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించగా ఏరియా ఎస్‌ఓటుజిఎం జెవిఎల్ గణపతి సభకు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిధులుగా కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు ఎం పద్మజారాణి, గుర్తింపుసంఘం నాయకులు ఎస్ చందర్, జికెఓసి ప్రాజెక్టు అధికారి సిహెచ్ వీరారెడ్డి, ఏరియా రక్షణ అధికారి పి కొండయ్య, ఎజిఎం (ఐఇడి) విఎన్‌విఎస్‌వి ప్రసాద్, ఎజిఎం (ఇఅండ్‌ఎం) ఎస్ శంకర్, జెవిఆర్‌ఓసి ప్రాజెక్టు అధికారి సూర్యనారాయణ, యుజిమైన్స్ ఏజెంట్ వెంకటేశ్వర్లు, డివైజిఎం (ఎఫ్‌అండ్‌ఎ) ఆర్ నాగేంద్రకుమార్, డివైజిఎం ఇఅండ్‌ఎం టి వెంకటేశ్వరరావు, డివైజిఎం (పర్సనల్) కెజెఆర్ పాల్‌లు హాజరయ్యారు. ప్రారంభసభలో సిజిఎం మల్లేష్ మాట్లాడుతూ సింగరేణి దినోత్సవ వేడుకలకు హాజరైన అధికారులకు, కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు సింగరేణి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 120ఏళ్ళ సింగరేణి చరిత్రలో ఎన్నో మైలురాళ్ళు సాధించడం జరిగిందన్నారు. సింగరేణి సంస్థ నూతన టెక్నాలజీతో ముందుకు కొనసాగుతూ నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తుందని పేర్కొన్నారు. కొత్తగూడెం ఏరియా 2013-14 ఆర్ధిక సంవత్సరంలో నిర్ధేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాన్ని ఇంకా మూడుమాసాలు మిగిలివుండగానే అధిగమించినందుకు అధికారులకు, కార్మికులకు, యూనియన్ నాయకులకు అభినందనలు తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న గుర్తింపుసంఘం నాయకులు ఎస్ చందర్ మాట్లాడుతూ సింగరేణి దినోత్సవాన్ని జరుపుకోవడం హర్షనీయమన్నారు. నంది అవార్డు గ్రహీత ఏటూరి హరినాధ్, కన్నం చంద్రయ్యలను సిజిఎం మల్లేష్ అభినందించి సత్కరించారు. 2013 సంవత్సరంలో ఉత్తమ సేవామహిళలుగా ఎన్నికైన సిహెచ్ ఆదిలక్ష్మి, ఎం తిరుమల, జివి సత్యవతి, విజయలతో పాటు సింగరేణి సేవాసమితి ద్వారా శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందిన శేఖర్‌లను అభినందించి బహుమతులు అందించారు. సిజిఎం దంపతులను కూడా అధికారులు, కార్మికులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి సినీనటుడు తాగుబోతు రమేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జబర్ధస్త్ నటుడు వెంకి తన మిత్రబృందంతో పాల్గొన్నాడు. వేడుకల్లో ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈకార్యక్రమంలో 5ఇంక్లైన్ మేనేజర్ రవీందర్, పర్సనల్ మేనేజర్లు పి శ్రీనివాస్, వి సాయికృష్ణ, గుర్తింపుసంఘం నాయకులు, ఎస్‌అండ్‌పిసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిడబ్ల్యుసి నిర్ణయం మేరకే తెలంగాణ
* వచ్చే సమావేశాల్లో బిల్లుపై సుదీర్ఘ చర్చ
* డెప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 24: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటవుతుందని డెప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకే అసెంబ్లీకి రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు వచ్చిందని, దీనిపై వచ్చే నెల 3వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సుదీర్ఘ చర్చ జరగనున్నదన్నారు. ప్రజాప్రతినిధులు ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇంతకంటే ప్రధానమైన సమస్య లేదనే విషయాన్ని గమనించాలన్నారు. రాష్ట్ర విభజనకు, టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనానికి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ నాయకత్వంలోనే తమ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ నేతలంతా కట్టుబడి ఉంటారన్నారు. రాష్ట్ర విభజన అంశంపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చ ప్రారంభమైందని, 3వ తేదీ నుంచి దానిని కొనసాగించటం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు బహిరంగంగా రాష్ట్ర విభజనపై మాట్లాడిన నేతలు ఇప్పుడు అధికారికంగా అసెంబ్లీలో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. రాష్టప్రతి విధించిన గడువులోగా బిల్లును తిరిగి పంపటమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
గిరిజనుల అభివృద్ధికే పీసా చట్టం
వి.ఆర్.పురం, డిసెంబర్ 24: గిరిజన ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధికే పీసా చట్టమని, ఈ చట్ట ప్రకారం ఏదైనా కొరవడిన సమస్యలు గానీ గ్రామసభల ద్వారా తీర్మానం చేస్తే పీసా చట్టం ప్రకారం అమలౌతుందని ఐటిడిఏ పిఓ జి వీరపాండియన్ అన్నారు. రేఖపల్లి ఎఎస్‌డిఎస్ సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయంలోని పీసా డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూనవరం, వి.ఆర్. పురం, చింతూరు, కుక్కునూరు, మణుగూరు, పినపాక మండలాల నుంచి గిరిజనులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన పీఓ వీరపాండియన్ మాట్లాడుతూ గతంలో ఏఎస్‌డిఎస్ సంస్థ పీసా చట్టంపై సమావేశం ఏర్పాటుచేసి తనను ఆహ్వానించారని, నాడే తాను పీసా చట్టంపై పూర్తిగా తెలుసుకుని భద్రాచలంలో ఈ చట్ట ప్రకారం ఇసుక ర్యాంపులను స్థానిక గిరిజనులకే చెందేలా చేశానని గుర్తు చేశారు. దీంతో ఆ ప్రాంత గిరిజనులు దాదాపు రూ. 20 కోట్ల మేర ఆదాయం పొందారని చెప్పారు. అనంతరం డివిజన్‌లో దాదాపు 120 గ్రామాల నుంచి ఇసుక ర్యాంపుల కోసం దరఖాస్తులు అందాయన్నారు. పీసా చట్టం ప్రకారం చర్ల మండలం తాలిపేరు, అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టుల నీటి వనరులపై స్థానిక గ్రామసభల ద్వారా చేపల పెంపకానికి రూ.17 లక్షల వ్యయంతో తాలిపేరులో 16 లక్షల చేప పిల్లలు, పెద్దవాగులో 13 లక్షల చేప పిల్లల పెంపకం చేపట్టారన్నారు. తద్వారా ఆదాయం పొందే అధికారం ఆ గ్రామసభలకు ఉంటుందని చెప్పారు. ఈ ప్రాంతంలో పీసా చట్టం అమలౌతున్న విధానాన్ని చూసి బీహార్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఐఏఎస్‌లు కూడా ఈ చట్టం గురించి అడిగి తెలుసుకొని వారు కూడా అక్కడ అమలు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. అనంతరం ఆయన ఏఎస్‌డిఎస్ సంస్థ కుట్టుమిషన్లపై శిక్షణనిచ్చిన 40 మంది గిరిజన మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎస్‌డిఎస్ సంస్థ డైరెక్టర్ వి గాంధీబాబు, ఏఎస్‌ఓ పులిరాజు, ఆర్‌ఐ తారాచంద్, సిబ్బంది పాల్గొన్నారు.
వినియోగదారులు
ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి
ఖమ్మం(స్పోర్ట్స్), డిసెంబర్ 24: వినియోగదారులు హక్కులతో పాటు తమ బాధ్యతలను తెలుసుకొని ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని అదనపు సంయుక్త కలెక్టర్ కె బాబూరావు అన్నారు. మంగళవారం టిటిడిసిలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవంకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సాధికారత, వినియోగదారుల హక్కుల సార్వత్రికీకరణ అంశంపై వివిధ శాఖాధికారులతో మాట్లాడారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం గురించి అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్యాపారస్తులు లాభాపేక్షతో ఉంటారని, వినియోగదారుల ప్రకటనలు, బహుమతుల ఆకర్షణకు లోనై నాశిరకం వస్తువులను కొనుగోలు చేయవద్దన్నారు. కాల పరిమితి కలిగిన, మన్నిక కలిగిన కంపెనీ బ్రాండ్ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. వినియోగదారులకు ఏదైనా సమస్యలు ఏదురైతే నేరుగా జిల్లా యంత్రాంగానికి, వినియోగదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.గ్రామీణ, మండల స్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.
వినియోగదారులకు వస్తువుల కొనుగోలు చేసే సమయంలో దాని నాణ్యత ప్రమాణాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ వినియోగదారుల ఫిర్యాదు అందిన 90రోజుల్లోపు పరిష్కారం చూపుతున్నామన్నారు. అన్ని పరిష్కారాలు ఫిర్యాదుదారుడి పక్షాన నిలిచాయన్నారు. వినియోగదారులు సంఘటితం కావాలని, వినియోగదారుల ఫోరంలో యువభాగస్వామ్యం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ఒత్తిడికి లోనై వినియోగదారులు ఏదైనా వస్తువులు కొనుగోలు చేయరాదని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా సరఫరా అధికారి గౌరీశంకర్, నగర పాలకసంస్థ కమిషనర్ శ్రీనివాసరావు, తూనికల, కొలతల జిల్లా ఇన్‌స్పెక్టర్ శివానంద, జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మినారాయణ తదితరులు తమ శాఖల ద్వారా వినియోగదారుల సేవలపై చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. తొలుత విద్యార్థులకు నిర్వహించిన తెలుగు, ఇంగ్లీష్, ఉర్ధూ మీడియంలలో వక్తృత్వ,వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల విజేతలకు 3వేలు, 2వేలు, 1500రూపాయల చెక్కులను అందించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తున్నాం
ఖమ్మం(ఖిల్లా), డిసెంబర్ 24: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును లోక్‌సత్తా పార్టీ స్వాగతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రవిమారుత్, జిల్లా అధ్యక్షుడు జి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు పట్ల సీమాంధ్రలోని ప్రజల భయాందోళనలను పొగొట్టేందుకు అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బలవంతంగా కలిసి ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నామని, తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సామరస్యపూర్వక, సమగ్రంగా రాష్ట్ర విభజన జరగాలన్నారు. ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ కిరణాల పేరుతో నిరుద్యోగ యువతను మోసగిస్తుందని, ఇప్పటి వరకు 16లక్షల మందిని అర్హులుగా ప్రకటించి కేవలం రెండు లక్షల మందికి ఉపాధి కల్పించి గొప్పలు చెబుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని బహిర్గతం చేసేందుకు లోక్‌సత్తా పార్టీ ఆధ్యర్యంలో యువభేరి నిర్వహించనున్నట్లు తెలిపారు. కలుషిత నీటి వల్ల అనేక వ్యాధులు సంభవిస్తున్నాయని, ఈ నెల 26 నుండి నగరంలో మంచినీటి పరీక్షలు జరిపి, కార్పొరేషన్ వ్యవరిస్తున్న తీరుపై ఉద్యమిస్తామన్నారు. ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.సమావేశంలో నాయకులు భద్రునాయక్, రవీందర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
దునే్నవాడికే భూమి దక్కాలి: ఎమ్మెల్యే చంద్రావతి
వైరా, డిసెంబర్ 24: దునే్నవానికే భూమి దక్కాలి అని వైరా ఎమ్మెల్యే బాణోతు చంద్రావతి అన్నారు. మంగళవారం స్థానిక తహశీల్ధార్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 7వ విడత భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా నడుస్తున్న భూపంపిణీ కార్యక్రమం పోరాటం ప్రభుత్వం దశలవారీగా భూ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ భూపంపిణీ కార్యక్రమం పేదలైన ప్రజలకు ఇవ్వడమే కాకుండా ఇందులో మహిళలనే భాగస్వాములను చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. అనంతరం ఖమ్మం ఆర్డీవో సంజీవరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచి భూమి లేని పేద ప్రజలకు భూమి పంపిణీ చేసే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 7వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని గరికపాడు, గన్నవరం, కొండకొడిమ, గొల్లెనపహాడ్ గ్రామాలకు చెందిన పేదలకు సుమారు 11ఎకరాల 31కుంటల భూమి పంపిణీ చేశామాని తహశీల్దార్ ఘంటా శ్రీలత తెలిపారు. వీరిలో 16మంది ఎస్టీలు, 1బిసి, 3జనరల్‌కు చెందిన పేదవారికి పంచామని ఆమె అన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీఒ జి.మధుసూదన్‌రాజు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, విఆర్‌ఒలు పాల్గొన్నారు.
గ్యాస్ స్టౌవ్‌లు పంపిణీ
మండల పరిధిలోని సోమవరం గ్రామంలో దీపం పథకం కింద 48మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే బాణోతు చంద్రావతి గ్యాస్‌స్టౌలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సిపిఐ నాయకులు చావా కుమార్, గ్రామస్థులు పాల్గొన్నారు.
సిపిఐ 88వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించండి
బూర్గంపాడు, డిసెంబర్ 24: సిపిఐ పార్టీ 88వ వార్షికోత్సవాలను పినపాక నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో వాడవాడలా ఘనంగా నిర్వహించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి అయోధ్య పిలుపునిచ్చారు. మంగళవారం సారపాక సిపిఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం జరిగే సిపిఐ వార్షికోత్సవాల సందర్భంగా వాడవాడలా జెండాలు ఎగురవేయడంతో పాటు ఖమ్మంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ బహిరంగ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి కేసుపాక నర్సింహారావు, సహాయ కార్యదర్శి పేరాల శ్రీనివాసరావు, నాయకులు దుద్దుకూరి నరేంద్ర, మైసాక్షి వెంకటాచారి, బొర్రా రాఘవులు, బొక్కా బాబురావు, వై సుభ, మువ్వా వెంకట శ్రీనివాసరావు, ఇస్సం శ్రీనివాసరావు, సిహెచ్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
గిరిజన బాలికల
వసతిగృహ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలి
కొత్తగూడెం, డిసెంబర్ 24: ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధులు గిరిజన బాలికల వసతిగృహానికి మంజూరైన నేపధ్యంలో స్థలాన్ని కేటాయించాలని ఎల్‌హెచ్‌పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ రాజేష్‌నాయక్ డిమాండ్ చేశారు. స్థానిక రైటర్‌బస్తీలో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం ఎల్‌హెచ్‌పిఎస్ నిర్వహించిన పోరాటాల ఫలితంగా గిరిజన బాలికలకు సెల్ఫ్ మేనేజ్‌మెంట్ హాస్టల్ మంజూరైందని కానీ సరైన స్థలాన్ని చూపించకపోవడంతో సుమారు 2కోట్ల రూపాయల నిధులు వెనక్కివెళ్ళే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆర్డీఓ అమయ్‌కుమార్‌కు కూడా ఎల్‌హెచ్‌పిఎస్ ప్రతినిధిబృందం వినతిపత్రం అందించారు. ఈకార్యక్రమంలో గిరిజన విద్యార్థిసంఘం జిల్లా అధ్యక్షులు బానోత్ రాజేష్‌నాయక్, మండల అధ్యక్షులు బానోత్ శ్రీను, టిఎన్‌ఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి భూక్య రమేష్, రతన్‌నాయక్, మంగీలాల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఆచూకీ లభించని విద్యార్థి అదృశ్యం
ఏన్కూరు, డిసెంబర్ 24: మండల పరిధిలోని టిఎల్‌పేట సమీపంలో ఒక ప్రైవేట్ పాఠశాలలో 9వతరగతి చదువుతున్న రాకేష్ అనే విద్యార్థి ఆదివారం సాయంత్రం అదృశ్యమైన సంఘటన విదితమే. అదృశ్యమైనటు వంటి రాకేష్ సాగర్ కాలువలో పడిపోయాడనే అనుమానంతో ఏన్కూరు పోలీస్‌స్టేషన్‌లో పాఠశాల హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు. అయినా విద్యార్థి ఆచూకీ ఇంతవరకు లభించకపోవడంతో కాలువలో పడిపోయాడా లేదా పారిపోయాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక పక్క పోలీసులు, మరోపక్క విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఊరువాడల్లా వెతకసాగారు. రెండురోజులుగా విద్యార్థి ఆచూకీ లభించకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపధ్యంలో ఒకానొక దశలో మంగళవారం హాస్టల్ వార్డెన్‌కు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు కల్పించుకొని ఆందోళనను విరమింపచేశారు. ఇంతవరకు విద్యార్థి ఆచూకీ లభ్యంకాకపోవడంతో అసలు ఏమయ్యాడని మండల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇల్లెందులో ఆటో దగ్ధం
ఇల్లెందు, డిసెంబర్ 24: పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయం సమీపంలో నిలుపుదల చేసిన ఆటోను గుర్తుతెలియని వ్యక్తులు తగలపెట్టారు. మంగళవారం తెల్లవారుజామున ఈఘటన జరిగివుంటుందని ఆటో యజమాని సలీమ్ తెలిపారు. తనకు ఎవరితోనూ శత్రుత్వంలేదని పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసిన పోలీసులు ఆటో తగలపెట్టిన సంఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.
కల్చరల్ పోటీలకు కవాళీటీం ఎంపిక
ఇల్లెందు, డిసెంబర్ 24: ఈనెల 27, 28 తేదీల్లో మందమర్రిలో జరగనున్న సింగరేణి స్థాయి కల్చరల్‌మీట్ పోటీలకు ఇల్లెందు, మణుగూరు ప్రాంతాలకు చెందిన కార్మిక కళాకారుల కవాళీంటీం ఎంపికచేశారు. మంగళవారం ఇల్లెందులో జరిగిన సాంస్కృతిక పోటీల్లో ఇల్లెందు, మణుగూరు ప్రాంతాలకు చెందిన కార్మిక కళాకారులు పాల్గొని పలురకాల కళాప్రదర్శనలు నిర్వహించారు. రెండు కోల్‌బెల్ట్ ప్రాంతాల నుండి ఏరియాటీంగా కవాళీ కళాకారుల జట్టును ఎంపికచేశారు.
రెండు నాల్కల పార్టీలు భూస్థాపితం
కొత్తగూడెం టౌన్, డిసెంబర్ 24: రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్న పార్టీలను తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో భూస్థాపితం చేస్తారని టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ఎండి హుస్సేన్ అన్నారు. కార్మికప్రాంతమైన రామవరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపిలు సమైఖ్యవాదంతో కుమ్మక్కై రెండునాలుకల ధోరణితో ఇష్టంవచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు టిఆర్‌ఎస్ అధ్యక్షులు కెసిఆర్‌పై విమర్శలు తగదని, కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్ పార్టీ విలీనం విషయం దయాకర్‌రావుకు సంబంధించిన విషయంకాదని ఖండించారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని, ఆరోజు తప్పకుండా వస్తుందని అన్నారు. ఈసమావేశంలో నాయకులు జల్లి శ్రీనివాస్, మధుసూదన్, వంశీకృష్ణ, యాకూబ్‌పాషా, అభిలాష్, పవన్‌కుమార్, అభినయ్ పాల్గొన్నారు.
క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైన చర్చిలు
ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 24: ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలకు నగరంలోని పలు చర్చిలు, ప్రార్థన మందిరాలు విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబవుతున్నాయి. నగరంలో మంగళవారం ఐక్య క్రిస్మస్ వేడుకలను ఐక్యంగా అందరూ ఘనంగా నిర్వహించారు. ప్రపంచానికి శాంతి, ప్రేమ, సహనం, సేవాభావనను నేర్పిన కరుణామయుని జన్మదినాన్ని ఆనందోత్సహల మధ్య భక్తితో జరుపుకునేందుకు పలు చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ చెట్టు, హలీక్రాస్, క్రిస్మస్ స్టార్‌లను తమ తమ గృహాలపై విద్యుత్ దీపాలతో అలంకరించారు. క్రిస్‌మస్ పండగను పురష్కరించుకొని వ్యాపార దుకాణాలు సైతం కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి.
ఆకట్టుకున్న క్రిస్మస్ సంబరాలు
కల్లూరు : స్థానిక సెంచరీ పాఠశాలలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం విద్యార్థులు ప్రదర్శించిన క్రిస్మస్ వేడుకలు ఆకట్టుకున్నాయి. ఈ నాటికలో దేవదూతలుగా డి సాయిచందన, వి గాయత్రి, మరియగా ఇంద్రాని, యోహానుగా రామ్‌సాయి, ఙ్ఞనులుగా కృష్ణవంశీ, సాయితేజ, కార్తీక్, రాజుగా అంజనీ కుమార్, భటులుగా అరుణ్, కైలాష్ పాత్ర దారులుగా పాల్గొని నటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని నాటికను ప్రదర్శించిన విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
సిహెచ్‌సిని ఆకస్మిక తనిఖీచేసిన ఐటిడిఏ పిఓ
కూనవరం, డిసెంబర్ 24: మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంగళవారం భద్రాచలం ఐటిడిఏ పిఓ జి వీరపాండియన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిహెచ్‌సిలో పర్యటిస్తూ మందుల నిల్వలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆస్పత్రిని పరిశీలించి రోగుల సంఖ్య, రిజిస్టర్‌ను చూశారు. వైద్యశాలలో కాన్పులు ఎక్కువగా జరిగేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారి కృష్ణప్రసాద్‌ను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో కూలిపోయిన క్వార్టర్స్‌ను పరిశీలించి త్వరలో మరమ్మతులు చేయిస్తానని తెలిపారు. అలాగే మంచినీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. వైద్యశాలకు చెందిన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, వెంటనే రెవెన్యూ అధికారులు సర్వేచేసి నివేదికలు అందించాలని ఆదేశించారు.
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న
చాంబర్లపై చర్యలు తీసుకోవాలి
బూర్గంపాడు, డిసెంబర్ 24: మండలంలో పుట్టగొడుగుల్లా గిరిజన భూముల్లో వెలుస్తున్న జామాయిల్ చాంబర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి బండారు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏజెన్సీలోని గిరిజన భూములను, అటవీ భూములను, ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసి గిరిజనుల పేరున దళారీలు జామాయిల్ చాంబర్లు ఏర్పాటు చేశారన్నారు. ఈ రకంగా గిరిజనులను దోచుకుంటూ లక్షలు గడిస్తున్నారని అన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు మేల్కొని గిరిజన గ్రామాల్లో గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల కంటి తుడుపు చర్యగా నోటీసులు అందించారని, వాటికి సమాధానం ఇచ్చారో లేదో తెలియదన్నారు. ఇప్పటికైనా తక్షణ చర్యలు చేపట్టని పక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దారు కిశోర్‌కుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేదారేశ్వరరెడ్డి, శ్రీను, ఆంజనేయులు, రాయల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన హెచ్‌డబ్ల్యుపి సహకార సంఘ ఎన్నికలు
అశ్వాపురం, డిసెంబర్ 24: స్థానిక హెవీవాటర్ ప్లాంటు కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల ప్రక్రియ మంగళవారం పూర్తయ్యింది. నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో ఏడుగురు డైరెక్టర్లు గెలుపొందారు. వారిలో నలుగురు డైరెక్టర్లను అధ్యక్ష, ఉపాధ్యక్ష, జనరల్ సెక్రటరీ, కోశాధికారులుగా ఎన్నుకునేందుకు గౌతమీనగరంలోని ఆ సంఘ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధ్యక్షునిగా కె గురవయ్య, ఉపాధ్యక్షునిగా కెవి విష్ణుమూర్తి, ప్రధాన కార్యదర్శిగా బి సీతారాములు, కోశాధికారిగా కెయుఎం చారిలు ఎన్నికయ్యారు. మిగతా ముగ్గురు డైరెక్టర్లు టి వెంకటేశ్వర్లు, పి ప్రతాపరెడ్డి, పి కేశవరావు కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఎన్నికల అధికారి, బూర్గంపాడు సబ్ డివిజనల్ కో ఆపరేటివ్ సొసైటీ అధికారి లీలాధర్ భారజల ఉద్యోగుల కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించారు. నూతన కార్యవర్గ సభ్యునికి అధికారికంగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికైన వారు మాట్లాడారు. వివాదాలకు ఆస్కారం లేకుండా ఉద్యోగుల సంక్షేమానికి, సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ మండల నాయకులు జాలె రామకృష్ణారెడ్డి, ఈదర సత్యనారాయణ తదితరులు గెలుపొందిన డైరెక్టర్లు, భారజల ప్లాంటు ఐఎన్‌టియుసి నాయకులు, కార్యకర్తలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఏకగ్రీవ ఎన్నికకు కృషి చేశారు. వివాదాలకు తావు లేకుండా కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించాలని సూచించారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవుల్లో ఒకటి తమకు ఇవ్వాలని డైరెక్టర్ ప్రతాపరెడ్డి పట్టుపట్టారు. ఆయనకు సర్ధిచెప్పారు. ఎట్టకేలకు కార్యవర్గ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. హెవీవాటర్ ప్లాంటు ఐఎన్‌టియుసి నాయకులు గడ్డం రమేష్, లవకుమార్, పెద్దిరెడ్ల శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరింత విస్తరించనున్న బిఎస్‌ఎన్‌ఎల్ సేవలు
చింతూరు, డిసెంబర్ 24: భద్రాచలం డివిజన్‌లోని ఎనిమిది మండలాల్లో మరింతగా బిఎస్‌ఎన్‌ఎన్‌ఎల్ సేవలు విస్తరించనున్నట్లు టెలికాం అడ్వైజరీ కమిటీ (టిఏసి) జిల్లా డైరెక్టర్ ఎండీ హబీబ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎల్‌డబ్ల్యుఇ నిధుల కింద మండలంలో ఏజికోడేరు, బుర్కనకోట, ఇర్కంపేట గ్రామాల్లో బిఎస్‌ఎన్‌ఎల్ టవర్లు మంజూరైనట్లు చెప్పారు. కూనవరం మండలంలోని పెదార్కూరు, వి.ఆర్.పురం మండలంలోని పెద్దమట్టపల్లి గ్రామంలో బిఎస్‌ఎన్‌ఎల్ టవర్లు మంజూరయ్యాయని తెలిపారు. అదే విధంగా కూనవరం, చింతూరు కేంద్రాలలో 2-జి సేవలు అందించనున్నామన్నారు. చింతూరు మండలంలోని చట్టీ, మోతుగూడెం, దేవరపల్లి గ్రామాలు, కూనవరం మండలంలోని కాచవరం, అభిచర్ల గ్రామాల్లోనూ, వి.ఆర్.పురం మండలంలోని చిన్నమట్టపల్లి గ్రామంలోనూ 2జి సేవలు అందించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. మండలంలో చింతూరు, మోతుగూడెం, పొల్లూరు, చట్టీ, ఏడుగురాళ్లపల్లి, కూనవరం మండలంలోని కూనవరం, వి.ఆర్.పురం మండలంలోని వి.ఆర్.పురం గ్రామాల్లో 3జి సేవలు అందించేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం ఉన్న మోటరోలో సిస్టంను తీసివేసి నార్‌సెల్ సిస్టంను వేయడం జరిగిందని, దీని వల్ల బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు నాణ్యమైన సేవలందించడం జరుగుతుందని తెలిపారు. నార్‌సెల్ సిస్టం ద్వారా 3 కి.మీ పరిధికి సేవలందించడం జరుగుతుందని, ఈ సిస్టంను చిడుమూరు, తులసిపాక, తూలుగొండ, కన్సులూరు, కొత్తపల్లి, సరివెల గ్రామాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. కూనవరం మండలంలో భగవాన్‌పురం, అభిచర్ల గ్రామాలు, వి.ఆర్.పురం మండలంలోని శ్రీరామగిరి, పెద్దమట్టపల్లి, కుందులూరు గ్రామాల్లో నార్‌సెల్ సేవలను విస్తరించనున్నామని వివరించారు. ఈ ప్రతిపాదనలు 2014 కల్లా అమలులోకి వస్తాయని తెలిపారు. బిఎస్‌ఎన్‌ఎల్ సేవలు మండలంలోని మారుమూల గ్రామాలకు సైతం అందుతాయన్నారు. విలేఖరుల సమావేశంలో అహ్మద్ అలీ, సోడె కృష్ణమూర్తి, ప్రదీప్, మడివి రమణ, సోడె రవి, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
ఇరుముడులతో శబరిమలై యాత్రకు తరలిన అయ్యప్పలు
కామేపల్లి, డిసెంబర్ 24: శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్వామి శరణ కోరుతూ 40రోజులు కఠోర దీక్ష పూర్తి గావించి శబరిమలకు మండలం నుంచి అనేక మంది దీక్షాస్వాములు మంగళవారం తరలివెళ్ళారు. మాలధారణ చేసిన రోజు నుంచి 40రోజులు కఠిన నియమాలతో త్రికరణ శుద్ధిగా ఆచరించిన అనంతరం శబరియాత్రకు వెళ్తుంటారు. దీనిలో భాగంగా దీక్షలు ముగిసిన మండలంలోని ఊట్కూరు, రామకృష్ణాపురం, గోపాలపురం, తాళ్ళగూడెం, టేకులతండా, కామేపల్లితో పాటు పలు గ్రామాల అయ్యప్పలు కామేపల్లిలోని షిరిడి సాయి మందిరం, ఆంజనేయస్వామి దేవాలయాల్లో గురుస్వాములచే ఇరుముడులు కట్టించుకొని బయల్దేరారు. కార్తీక మాసంలో దీక్షలు ప్రారంభించిన అనేక మంది భక్తులు మార్గశిర మాసంలో జరిగే మండల పూజకు శబరి చేరుకుంటారు. మండలంలోని అనేక మంది దీక్షాస్వాములు మండల పూజకు ఇరుముడులతో బయల్దేరగా, కామేపల్లి నుంచే సుమారు 100మందికిపైగా అయ్యప్ప దీక్షాపరులు ఒకేసారి బయల్దేరటం విశేషం. భక్తులు మండలంలో ఒకే సారి ఇరుముడులు కట్టించుకొని రైలు ప్రయాణం ద్వారా మంగళవారం బయల్దేరారు. ఉదయం గ్రామంలో అయ్యప్ప నామ సంకీర్తనలతో నగర సంకీర్తన జరిపి, అనంతరం రైలు ప్రయాణం ద్వారా శబరి మలై స్వామి దర్శనానికి తరలివెళ్ళారు. వందలాది మంది దీక్షాస్వాములు ఇరుముడులతో బయల్దేరగా, సాధారణ భక్తులు అనేక మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని వారిని సాగనంపారు. అయ్యప్ప నామ సంకీర్తనలతో గ్రామమంతా మారుమ్రోగి, శరణఘోషతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆయా గ్రామాల్లో అయ్యప్ప స్వామి మాలధారులకు ఇరుముడి కార్యక్రమాలు నిర్వహించటం మండలంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో గురుస్వాములు మెండ్రు పుల్లయ్య, తాళ్ళూరి జనార్థన్, బాగం రామారావు, భుక్యా సామ్యా, తిరుపతయ్య, వెంకన్న, ఆరుద్ర బ్రహ్మం, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
కరాటేలో విఎం బంజర్ విద్యార్థుల ప్రతిభ
పెనుబల్లి, డిసెంబర్ 24: ఫోటోఖాన్ చాంపియన్‌షిప్ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో విఎం బంజర్ టైగర్ కరాటే స్కూల్‌కు చెందిన 56 మంది విద్యార్థులు పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. వరంగల్‌లో జరిగిన ఈ పోటీల్లో విఎం బంజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అరుణోదయ మెరిట్‌స్కూల్, శ్రీవేద మల్టీటెక్ పాఠశాల, మోడల్ స్కూల్‌కు చెందిన 56 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 48 మంది విద్యార్థులకు బహుమతులు లభించాయి. 12 బంగారు పతకాలు, 21 సిల్వర్ మెడల్, 15 కాంస్య పతకాలను విద్యార్థులు సాధించారు. బంగారు పతకాలు సాధించిన వారిలో జ్యోత్స్న, అనుష్య, ఝాన్సీరాణి, బాలకృష్ణ, సాయికుమార్, ఎం వెంకటేశ్వర్లు, రామకృష్ణ, కిషోర్, ప్రసన్నకుమార్, వెంకటసాయి, ఉమేష్‌చంద్ర, అబ్దుల్ సాహెబ్‌లున్నారు.