Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అన్నదాతకు ‘అనంత’ కష్టాలు!

$
0
0

కర్నూలు, డిసెంబర్ 24 : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా సాగులో ఉన్న 45వేల ఎకరాలు ఎండిపోయి రైతుల పరిస్థితి దయనీయంగా మారనుంది. కర్నూలు - కడప కాలువ కింద రైతులకు సాగునీరు అందించడానికి తుంగభద్ర జలాశయంలో ఉన్న నీటిని అనంతపురం జిల్లా హిందూపురం ప్రాంతానికి ఇవ్వాలని ప్రభుత్వం ఈనెల 5వ తేదీన తుంగభద్ర బోర్డుకు జారీ చేసిన ఆదేశాలతో కెసి కాలువకు నీటి పంపిణీ నిల్చిపోయింది. దీంతో సుంకేసుల నుంచి బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు ఉన్న 150 కిలోమీటర్ల కెసి కాలువ కింద రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం సాగులో ఉన్న పంటను బతికించుకునేందుకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం, జల మండళి ఎదుట గత రెండు రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కెసి రైతుల అవసరాల కోసం సాగు నీటితో పాటు ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం తుంగభద్ర జలాశయంలో నీరు నిల్వ ఉంచుకుంటారు. ఇందులో నుంచి 10 టిఎంసీల నీటిని అనంతపురం జిల్లాకు కేటాయిస్తూ 2008లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అనంతపురానికి తరలించిన నీటి తగ్గుదలను భర్తీ చేస్తూ శ్రీశైలం జలాశయం నుంచి అంతే మొత్తంలో కేటాయించింది. అనంతకు కేటాయించిన నీరు, ఖరీఫ్‌లో వాడుకున్న నీరు పోను ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో కెసి నీటివాటా సుమారు 7.05 టిఎంసీలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నీటిని హిందూపురానికి తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేయడంతో కెసి కాలువకు నీరు లేకుండా పోయింది. కాగా గతనెల మొదటి వారంలో కర్నూలులో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో అందుబాటులో ఉన్న నీటిని దృష్టిలో ఉంచుకుని కెసి కాలువకు మార్చి నెల వరకు సాగు నీరిస్తామని అధికారులు వెల్లడించారు. దీంతో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. అంతా బాగుందన్న దశలో ప్రభుత్వం తుంగభద్ర జలాలను అనంతపురం జిల్లాకు కేటాయించడంతో సమస్య ఏర్పడింది. ఈ ఆదేశాలు జారీ చేసే ముందు తమ ప్రయోజనాలు ఏ మాత్రం పట్టించుకోలేదని కెసి రైతులు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా కోసం తుంగభద్ర జలాశయంలోని నికరజలాలతో పాటు శ్రీశైలం మిగులు జలాలను కేటాయించి తమకు అన్యాయం చేశారని స్థానిక రైతులు మండిపోతున్నారు. ప్రభుత్వం కెసి కాలువను పూర్తిగా మూసేస్తే మొత్తం నీరు తమ ఇష్టం వచ్చిన ప్రాంతానికి తరలిస్తే సరిపోతుందంటూ చెబుతున్నారు. రైతుల ఆందోళనతో అధికారులు దిగి వచ్చి ప్రస్తుతం సుంకేసులలో ఉన్న నీటిని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తుంగభద్ర జలాలను అనంతపురం జిల్లాకు కేటాయించడంపై కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మంగళవారం మరోమారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కెసికి సాగునీరు ఇవ్వకపోతే కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో రైతాంగం వీధిన పడతారని సిఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇందుకు స్పందించిన సిఎం సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తుంగభద్ర నుంచి కెసికి నీరు విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ నీరు సుంకేసులకు చేరే వరకు రెండు రోజుల సమయం పడుతుందని ఈలోగా సుంకేసుల జలాశయంలోని 1.20 టిఎంసీల నీటిని కెసికి విడుదల చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అన్యాయం చేస్తే సహించం
* రబీకి నీరు విడుదల చేయాలి
* మొదటి ఎత్తిపోతల పథకం వద్ద రైతుల బైఠాయింపు
నందికొట్కూరు, డిసెంబర్ 24 : కెసి ఆయకట్టు కింద రబీ పంట సాగుకు నీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం కెసి కాలువ ఆయకట్టు కిద పంటలు సాగు చేస్తున్న రైతులు ట్రాక్టర్లలో పెద్దసంఖ్యలో మల్యాల హంద్రీనీవా ప్రాజెక్టుకు చేరుకుని ఆందోళన చేపట్టారు. మొదట హంద్రీనీవా నీటి విడుదలను నిలిపి వేసేందుకు రైతులు పంప్‌హౌస్‌లోకి ప్రవేశిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు రైతులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హుటాహుటిన సిఐ శివనారాయణ స్వామి, ట్రైనీ డిఎస్పీ నర్మద, బ్రాహ్మణకొట్కూరు ఎస్సై రఘురాం సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని సమీక్షించారు. ప్రాజెక్టు వద్ద రైతులు సాయంత్రం వరకూ బైఠాయించి ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం నుంచి కెసి కాలువకు రావాల్సిన 10 టిఎంసిల నీటివాటను రాత్రికిరాత్రే కొత్తజీవోలు సృష్టిస్తూ అనంతపురం జిల్లాకు తరలించి జిల్లా రైతులకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎబి సమావేశంలో కెసి ఆయకట్టుకు మార్చి ఆఖరి వరకూ నీటిని ఇస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించడంతోనే 45 వేల ఎకరాల్లో మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, వేరుశెనగ, ఆరుతడి పంటలను సాగు చేశామన్నారు. ఈ నేపథ్యంలో సుంకేసుల నుంచి కెసి కాలువకు అధికారులు నీటిని నిలుపుదల చేయడంతో 150 కిలోమీటర్ల వరకూ సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యాం నుంచి రావాల్సిన నీటివాటను విడుదల చేస్తామని అధికారులు స్వష్టమైన ప్రకటన చేయాలని కెసి కాలువ, హంద్రీనీవా ఎస్‌సి రవీంద్రకుమార్, డిఇ శ్రీనివాస్ నాయక్‌ను కోరారు. ఇందుకు స్పందించిన అధికారులు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కెసి ఆయకట్టు రైతులను ఆదుకునేంత వరకూ హంద్రీనీవా నీటి విడుదలను నిలిపివేస్తామని హెచ్చరించారు. అంతేగాకుండా బుధవారం జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యూలేటర్ వద్ద ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పగిడ్యాల మాజీ జెపిటిసి పుల్యాల నాగిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస నాయుడు, రామిరెడ్డి, వైకాపా నాయకులు పలుచాని మహేశ్వరరెడ్డి, నందికొట్కూరు టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి తమ్మడపల్లె విక్టర్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

టిటిడిలో ఉగ్రవాదుల కదలికలు!
* హిందు ధర్మ పరీరక్షణ సమితి కార్యదర్శి రామాంజినేయులు
ఆదోని, డిసెంబర్ 24: తిరుమల తిరుపతిలో అగ్రవాదుల కదలికలు ఉన్నాయని హిందు ధర్మ పరీరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులు పేర్కొన్నారు. ఆదోనిలో మంగళవారం ఆంధ్రభూమితో మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రానికి ఉగ్రవాదుల ముప్పు ఉందని ఇంటలిజెన్సీ రిపోర్టులు కూడా స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికే తిరుపతి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉగ్రవాదులను అరెస్టు చేయడం కూడా జరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా గొడుగుల్లో బాంబులు పెట్టి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని పేల్చాలని ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నట్లు కూడా అధికారులు స్పష్ట చేస్తున్నారని అన్నారు. కావున తిరుపతి పట్టణానికి కూడా తిరుమల టిటిడి పరిధిలోనికి తీసుకొని రావాలని రామాంజినేయులు డిమాండ్ చేశారు.తిరుపతిలో ఉన్న అన్యమతస్థుల చర్చిలు, మసీదులను తిరుపతి నుంచి వేరే ప్రాంతానికి మార్చాలని డిమాండ్ చేశారు. పరమతస్థులను ఇతర ప్రాంతాలకు తరలించి వారికి స్థలాలు చూపించి తిరుపతి నుంచి పంపించాలని ఆప్రాంతాలను టిటిడి స్వాధీనం చేసుకోవాలని కోరారు. తిరుపతిలో అన్యమతస్థుల ఉనికిని అంగీకరించేది లేదని, అలా అంగీకరిస్తే హిందు పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఉగ్రవాద చర్యలు పెరిగిపోతాయన్నారు. అంతేకాకుండా ప్రపంచానికే హిందు పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుపతిలో అన్యమతస్థులు ప్రచారం చేస్తే 120 కోట్ల మంది హిందు ప్రజల మనోబావాలు దెబ్బతినగలవన్నారు. అన్యమతస్థుల వల్ల భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మక్కా, వాటికన్ సిటీల్లో హిందు మత మందిరాలను నిర్మిస్తే వారు అంగీకరిస్తారా అని అన్నారు. తిరుపతి కూడా హిందు మత పుణ్యక్షేత్రమని, కావున తిరుపతిని తిరుమల దేవస్థానం వారికి అప్పగించాలని కోరారు. ఇందుకోసం హిందు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శక్తులను కూడగట్టుకొని ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రూ.68 కోట్లతో తిరుమల దేవస్థానం అభివృద్ధికి ఖర్చు చేస్తుందని ఆయన అన్నారు. అలాంటి తిరుపతిలో అన్నమయ్య వంశస్థులు నిర్మించిన తిమ్మప్ప ఆలయం పరిధిలో హీరా ఇస్లామిక్ యూనివర్శిటీని నిర్మించడం యాథృచ్చికంగా జరిగిన సంఘటన కాదని పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదుల సంస్థల నిధులతో నిర్మించాలని ఆయన అన్నారు. ఆ యూనివర్శిటీని నిర్మిస్తున్న నౌహీరా అనే మహిళ ఒకప్పుడు చిన్న ఇంటిలో ఉండేదని ఇప్పుడు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోందని, ఆ డబ్బులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదుల హస్తం ఉందని కాబట్టి అంత డబ్బు సమకూరిందని ఆయన అన్నారు. ఏడుకొండలను రెండు కొండలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న 2008 సంవత్సరంలోనే ఇస్లామిక్ యూనివర్శిటీకి కూడా అనుమతి వచ్చిందని, అయితే అన్నమయ్య వంశస్థుల స్థలంలో ఎలాంటి అధికార అనుమతులు లేకుండా ఏడు అంతస్థుల యూనివర్శిటీ భవనాలను నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు. ఆ భవంతి నుంచి ఉగ్రవాదులు రాకేట్ లాంచర్లను పేల్చితే నిమిషాల్లో తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, తిరచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం మిగలవని రామాంజినేయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల స్థానంగా తిరుపతిని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తే తాము సహించేది లేదని అన్నారు. ఇప్పటికే తిరుపతి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని అన్నారు. తిమ్మప్ప ఆలయం స్థలంలో నిర్మించిన హీరా ఇస్లామిక్ యూనివర్శిటీని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని రామాంజినేయులు డిమాండ్ చేశారు. పేద రాలుగా ఉన్న నౌహీరా అనే మహిళకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రైతుల పాస్ పుస్తకాలకు ఆధార్ జతచేయాలి
* ఆర్డీవో నరసింహులు
మహానంది, డిసెంబర్ 24: రైతులు అనుమానాలు విడనాడి పట్టాదార్ పాస్ పుస్తకాలకు తమ ఆధార్‌కార్డులను జతపరచాలని నంద్యాల ఆర్డీవో నరసింహులు తెలిపారు. మంగళవారం ఆయనతో పాటు ఆర్‌అండ్‌బి ఇఇ చెన్నకేశవులు మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో కూలిన బీమ్‌ను, ఆర్డీవో అటవీ శాఖ ఆధీనంలో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఐటిడి ఎపిఓ, కలెక్టర్ ఆదేశాల మేరకు మహానంది గిరిజన పాఠశాలలో మూడు నెలల క్రితం కూలిన బీమ్‌ను పరిశీలించామన్నారు. ఇఇ పరిశీలించిన నివేదికను అధికారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఓటరు లిస్టుల పరిశీలన జరుగుతుందన్నారు. జనవరి 16 నాటికి చివరి లిస్టును విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఫారం-6 ప్రకారం అందిన అర్జీలను పరిశీలించి వివాహాలు చేసుకుని వెళ్లిన వారిని, మరణించిన వారి పేర్లను తొలగిస్తామన్నారు. నంద్యాల డివిజన్‌లో 3,335 ఎకరాల భూమి పంపిణీ చేయడం జరిగిందని, ఈ నెల 21న జిల్లాస్థాయిలో ప్రారంభమైన భూ పంపిణీ కార్యక్రమం 31తేదీ లోపల పూర్తవుతుందన్నారు. డివిజన్‌లో 17 మండలాలు ఉండగా 11 మండలాల్లో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఫారెస్టు అధికారులతో సంప్రదించి మహానందిలోనీ ఈశ్వర్‌నగర్ కాలనీలో ఖాళీగా ఉన్న స్థలంలో స్థలాన్ని ఐటిడిఎ అధికారులకు ఆసుపత్రి నిర్మాణం కోసం అందిస్తామన్నారు. వీరివెంట డిప్యూటీ తహశీల్దార్ మాబుసాహెబ్, సర్పంచ్ జయసింహారెడ్డి, పిఆర్‌ఓ శ్రీకాంత్, ఆర్‌ఐ మధు, వార్డెన్ సత్య తదితరులు ఉన్నారు.

కెసి రైతులకు న్యాయం చేయాలి
* జలమండలి కార్యాలయం ముట్టడి
కల్లూరు, డిసెంబర్ 24 : కెసి కెనాల్ కింద పంటలు వేసిన రైతులకు అవసరమైన నీటిని వదలడంలో విఫలమైన ఇరిగేషన్ అధికారులు అనంతపురం జిల్లాకు సాగు, తాగు నీరును వదలడ ం ఏంటని రైతులు ప్రశ్నించారు. కర నూలు నుండి నీటిని అనంతపురం జిల్లాకు నీరు వదలడాన్ని నిరసిస్తూ కెసి కెనాల్ కింద పంటలు వేసుకున్న రైతులు మంగళవారం నగరంలోని జ లమండలి కార్యాలయాన్ని ముట్టడిం చి దిగ్బంధించారు. ఈ సందర్భంగా ఆయకట్టు రైతులు ధర్మారెడ్డి, సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కెసి కెనాల్ కింద రైతులకు తీవ్ర అన్యా యం చేస్తోందన్నారు. గతంలో జరిగి న నీటి సలహా మండలి సమావేశంలో ఫిబ్రవరి 15 వరకు నీటిని వదులుతామని అధికారులు బాధ్యత ఉన్న మం త్రులు హామీ ఇచ్చినందుకు 40 వేల ఎకరాల్లో జోన్న, మిరప, మొక్కజోన్న పంటలు వేసుకున్నామన్నారు. ఇప్పు డు పంటలకు నీరు లేకపోతే ఈ పం టల పరిస్థితి ప్రశ్నించారు. ఇప్పటికైన అధికారులు స్పందించి రైతులకు న్యా యం చేయాలని లేని పక్షంలో తీవ్ర ఉద్యమం చేపడుతామన్నారు. అనంతరం ఇరిగేషన్ ఎస్‌ఇని కలిసి నీటి విడుదలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు.
కాటసాని సంఘీభావం
రైతులకు అన్యాయం జరిగితే సహించమని, అంతేగాకుండా పార్టీలకు అతీతంగా రైతులకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాకు నీటి విడుదలను నిరిసిస్తూ జలమండలి దగ్గర ధర్నా చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసి నీటిని అనంతపురం జిల్లాకు సాగు, తాగు నీరు కింద వదలడంతో కర్నూలు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ముఖ్యంగా డ్యాం అధికారులు నీటి లభ్యతపై స్పష్టమైన సమాచారాన్ని అధికారులతో పాటు రైతులకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు, రైతుల కష్టాలను ఎవ్వరు పట్టించుకోరా ఎందుకు రైతులను ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇరిగేషన్ ఎస్‌ఇని ప్రశ్నించారు. జిల్లాలో రైతులకు అవసరమైన నీటిని వదిలిన తరువాతనే ఇతర జిల్లాల గురించి ఆలోచించాలన్నారు. ఈ విషయంపై జిల్లా మంత్రులు, ఇరిగేషన్ అధికారులు స్పందించి కెసి కెనాల్ కింద పంటలపైన ఆధారపడిన రైతులకు న్యాయం చేయాలన్నారు.
నేడే క్రిస్మస్ పర్వదినం
కల్లూరు, డిసెంబర్ 24 : ప్రపంచ శాంతికి సూచికంగా క్రీస్తు జన్మదినాన్ని నేడు జరుపుకుంటారు. ఈ సందర్భంగా నగరంలోని చర్చిలకు విద్యుత్ దీపాలతో అలంకరించి ముస్తాబు చేశారు. క్రైస్తవులు క్రీస్తు పుట్టుకను తమ పాప విమోచనానికి గుర్తుగా ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా మానవాలి విటికన్ సిటీ నుండి పోప్ ఇచ్చే దైవ సందేశం కోసం ఎదురు చూస్తూ ఆ సందేశాన్ని విని ఆ విధంగా నడుచుకుంటు అన్ని విషయాల్లో ఇతరులకు మాదిరిగా నడుచుకోవడానికి క్రైస్తవులు భావిస్తారు. మంగళవారం అర్థ రాత్రినుండే ప్రతి ప్రార్ధన మందిరంలో ప్రార్ధనలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా పేదలకు అన్నదానం, వస్త్ర దానాలను చేశారు. అలాగే ఆసుపత్రిలలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ప్రార్ధనల అనంతరం క్రైస్తవులు ఒకరిని ఒకరు క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేసుకుంటారు.
పితృదేవతల ఆశీస్సులు పొందాలి
ఆళ్లగడ్డ, డిసెంబర్ 24 : సంవత్సరానికి ఒకమారు పితృదేవతలను తలచుకుని ఆశీస్సులు పొందితే భావితరాల వారికి సుఖం ప్రాప్తిస్తుందని శ్రీ జ్వాలా ట్రస్ట్ అధినేత శ్రీ్ధర్ గురూజీ అన్నారు. అహోబిలంలో ఆళ్వారు కోనేరు సమీపంలో నిర్వహిస్తున్న మహాయజ్ఞం మంగళవారం కూడా కొనసాయింది. శ్రీ మహాజ్వాలా నృసింహ సంపుటిత మహా సుదర్శన ధన్వంతరీ నారాయణ అప్సరగాన ప్రయోగ మహాయజ్ఞంలో భాగంగా అగ్నిముఖం, ప్రథమ పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే సాలెగ్రామాలకు రుత్వికులు తిరుమంజనం నిర్వహించారు.
దేశం నలుమూలల నుండి వచ్చిన రుత్వికులు వేద పారాయణం చేశారు. చివరగా చేస్తున్న హోమంలో భాగంగా ప్రథమ పూర్ణాహుతి నిర్వహించారు. ఉత్పమూర్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజించారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం దేవస్ధాన ప్రధానార్చకులు లక్ష్మి నరసింహాచార్యులు, మురళీకృష్ణాచార్యులు శ్రీ జ్వాలా ట్రస్ట్ శ్రీ్ధర్ గురూజీని శాలువా పూలమాలలతో సత్కరించి వేద మంత్రాలతో ఆశీర్వదించారు.

సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తా
* డోన్ ఎమ్మెల్యే కెఇ కృష్ణమూర్తి
ప్యాపిలి, డిసెంబర్ 24 : రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల సహకారంతో సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తానని డోన్ ఎమ్మెల్యే కెఇ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మంగళవారం ప్యాపిలి మండలం కలచట్ల గ్రామంలో నిర్వహించిన అంకాలమ్మ దేవర ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కెఇ మాట్లాడుతూ కాంగ్రెస్, వైకాపా వల్ల రాష్ట్ర విభజన సమస్య ఉత్పన్నమైందని విభజన జరిగితే ఎక్కువగా నష్టపోయేది రాయలసీమ వారేనన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ సమైక్యాంధ్ర కోసం పోరాడాలన్నారు. విభజనను అడ్డుకుంనేందుకు ప్రజాప్రతినిధులు చట్ట సభల్లో ప్రయత్నించాలని కోరారు. ఎమ్మెల్యే కెఇ వెంట టిడిపి నాయకులు శ్రీనివాసులు, రామాంజినేయులు, కృష్ణమూర్తి, వెంకటేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
* మరో ముగ్గురికి గాయాలు
ఆదోని, డిసెంబర్ 24: ఆదోనిలోని బసాపురం బైపాస్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి... ఆదోనిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు చెత్తవేయడానికి ట్రాక్టర్‌లో బసాపురం వద్దకు వెళ్లారు. అక్కడ ట్రాక్టర్ పంచర్ అయింది. అనంతరం మున్సిపల్ కార్మికులు ఈరన్న, ఎల్లప్ప, చిరంజీవి, వీరేష్, ఖాదర్‌బాషా మరో ట్రాక్టర్ ద్వారా సామాగ్రి తెప్పించి పంచ్ వేస్తుండగా ఆగిఉన్న ట్రాక్టర్‌ను వెనక నుంచి లారీ ఢీకొనడంతో ఇద్దరు కార్మికులు వీరేష్(23), ఖాదర్‌బాషా (50) సంఘటన స్థలంలోనే లారీ కింద పడి మృతి చెందారు. ఈరన్న, ఎల్లప్ప, చిరంజీవికి తీవ్రంగాయపడ్డారు. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది గాయపడినవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. విషయం తెలుసుకున్న సిఐ రమణ, ఎస్‌ఐ రామయ్య హుటాహుటీన సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించి అక్కడ పరిస్థితిని సమీక్షించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం చేసిన లారీని అక్కడే వదిలి డ్రైవర్ పారిపోయాడు.

రోడ్డు ప్రమాదంలో ఒకని మృతి
ఓర్వకల్లు, డిసెంబర్ 24 : మండల పరిధిలోని పుడిచెర్ల గ్రామ సమీపాన కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి నెం-18పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. గుంటూరు శివ శంకర్ (26) నంద్యాల నుండి కర్నూలు వైపు మోటర్ సైకిల్‌పై వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో శివ శంకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఓర్వకల్లు ఎస్సై చిరంజీవి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

* సాగునీటి కోసం కెసి రైతుల ఆందోళన * ప్రమాదకర పరిస్థితిలో 45 వేల ఎకరాలు
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>