
గర్భాశయానికి ఇరువైపులా వుండే అండాశయాలు స్ర్తి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఆడపిల్ల యుక్తవయస్కురాలైన దగ్గర్నించి చివరిదశ మెనోపాజ్ వరకు ఓవరీలనించి హార్మోన్లు ఒక క్రమబద్ధమైన నిష్పత్తిలో స్రవించి స్ర్తి ఆరోగ్యం కాపాడుతూ వుంటాయి. ఈస్ట్రోజన్ స్ర్తి ఆరోగ్యం ఎముకల దృఢత్వం, చర్మ సౌకుమార్యం, కురుల మృధుత్వం, పెరుగుదలను కాపాడితే ప్రొజిస్టిరాను కొంచెంపాటి ఏండ్రోజన్లు ఈస్ట్రోజను చర్యల్ని క్రమపరుస్తాయి. గర్భాశయంలోపలి పొర ఎక్కువ పెరగకుండా ఈ రెండు హార్మోన్లు నియంత్రిస్తాయి. అండం ప్రతినెలా విడుదలవుతుంది. 24-30 గంటల్లో అది కరిగిపోతుంది. ఒకవేళ ఏ కారణంచేతైనా అండం విడుదల కాకపోతే అది ఒక నీటి బుడగలాగా ఓవరీ లోపలి భాగంలో అంచు చుట్టూ నిలబడిపోతుంది. అలా చాలా నీటిబుడగలు చేరితే దాన్ని పోలీసిస్టిక్ ఓవరీలు (పిసిఒడి) అంటారు. ఇందువల్ల నెలసరి క్రమం మారిపోయి రెండు మూడు నెలలకోసారి రావడం, ఇంకా ఆలస్యంగా వచ్చి, అసలే రాకపోవడం, సంవత్సరంపాటు కూడా ఆగిపోవడం కద్దు.
దీని చికిత్సకు మందులు నోటిమాత్రలు, ఇంజెక్షన్లు వున్నాయి. వీటికి లొంగకపోతే మహిళలలో వయసు మీరి సంతానం లేకపోతే లాపరోస్కోపు ద్వారా సిస్టులను తీసివేయడం లేక కరెంటుతో కాల్చివేయడం చేస్తారు. ఒక్కొక్కప్పుడు ఈ సిస్టులలో ఒకటి పెరిగి పెద్దదవుతుంది. పిసిఓడివల్లనే గాక హార్మోనుల అసమతుల్యత వల్లగాని సంతాన ప్రాప్తికోసం వాడే మందుల వల్లగాని రావచ్చు. అయితే ఇవి క్యాన్సరు అయ్యే అవకాశం లేదు కాబట్టి నెమ్మదిగా చికిత్స చేయవచ్చు. వీటి సైజు 5 సెం.మీ అంతకంటే ఎక్కువైతే తొలగించాల్సిన అవసరం వుంది. అంతకంటే తక్కువ సైజు అయితే స్కానింగు ద్వారా అప్పుడప్పుడు పరిశీలన చేస్తారు.
ఇంకా వేరే రకమైన సిస్టులు ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి ఏర్పడి చాలా నొప్పి, ఋతుశూల కలుగుతాయి. ఇవి సర్జరీ ద్వారా తీసివేయడం అనివార్యం. తీయకపోతే బాధలేగాక సంతానం కూడా కలుగదు. మామూలు ఆపరేషన్ లేక లాపరోస్కోపీ ద్వారా దీనికి నివారణ చేయవచ్చు.
ఇంకొన్ని సిస్టులు ట్యూమర్లుగా ఏర్పడతాయి. వాటిలో 60-70 శాతం సాధారణమైనవే అయినా కొన్ని క్యాన్సర్‌కి చేరువగాను మరికొన్ని క్యాన్సర్ అయే అవకాశం వుంది. కనుక ఓవరీలో ఏ చిన్న సిస్టు వున్నా సిఎ-120 అనే రక్తపరీక్ష తప్పక చేస్తారు.
ఈ ట్యూమర్లలో ముఖ్యమైనవి సాధారణంగా కనిపించేవీ డెర్మాయిడు సిస్టులు, సూడోమ్యూసినస్ సిస్టులు, పాపిల్లరీ సిస్టులు. డెర్మాయిడు సిస్టులు చాలా బరువుగా వుండి మెలిపడే అవకాశం ఎక్కువ. త్వరగా తీసివేస్తారు అందుకనే. ఎప్పుడూ హాని చెయ్యని డెర్మాయిడు లోపల వెంట్రుకలు, చిన్న మృదులాస్తి ముక్కలు (కార్టిలేజి) దంతాలు కూడా వుంటాయి. ఇవి ఎక్స్‌రేలోను స్కానింగులోను చక్కగా కనిపిస్తాయి. చాలా అరుదుగా టెరటోమా అనేది క్యాన్సరుగా మారవచ్చు. ఇక సూడోమ్యూసిన్, పాపిల్లరీ సిస్టులు అగ్నిపర్వతం లాంటివి. ఎప్పుడు క్యాన్సరుగా మారేది ముందు తెలియదు. వీటిని పొటెన్షియల్ మాలిగ్నన్సీ అంటారు. అందుకని తప్పక సర్జరీ ద్వారా పగిలిపోకుండా జాగ్రత్తగా తీయాలి. వాటితోపాటు గర్భాశయం కూడా తీసివేయాల్సి రావచ్చు. రెండో ఓవరీ నార్మలుగా వుంటే బయాప్సీ తీసి వదిలివేస్తారు. పొట్టలో నీరు కూడా వుంటే దానిలో కూడా క్యాన్సరు కణాలు ఉన్నాయా అని పరీక్ష అవసరం. వుంటే తర్వాత కీమోథెరపీ, రేడియోధెరపీ అవసరాన్ని బట్టి వైద్య నిపుణులు ఇస్తారు. ఈ ఆధునిక యుగంలో ఖరీదైన స్కానింగులు- సి.టి స్కాన్ లాంటివి, ఎంఆర్‌ఐ వంటివి అందుబటులో వున్నాయి కాబట్టి మొదటి దశలోనే క్యాన్సరు గుర్తుపట్టి చికిత్స చేయగలం. ఆరోగ్యం ఖరీదు జీవితమే కదా!
*
ప్రశ్న - జవాబు
కోటీశ్వరి - నెల్లూరు
ప్ర: నా వయస్సు 36సం. నాకు కొద్ది రోజులుగా కాళ్లు వాపులు వస్తున్నాయి. ఎలాంటి పరీక్షలు చేయించాలి?
జ: మొదటగా హిమోగ్లోబిన్ పరీక్ష, యూరిన్ పరీక్ష చేయించండి. తర్వాత రక్తంలోని క్రియాటినిన్ అనే పరీక్ష అవసరం. వాపులెందుకు వస్తున్నాయో ఆ కారణానికి చికిత్స చేయాలి. వాపులు తగ్గే మందులు ముఖ్యం కాదు. మంచి జనరల్ ఫిజిషియన్‌ని సంప్రదించండి. మీకు గైనిక్ సమస్యలు వుంటే లేడీ డాక్టరుతో పరీక్ష తప్పనిసరి.
ఆరోగ్య సమస్యలు, సందేహాలు పంపాల్సిన చిరునామా:
డాక్టర్ కేతరాజు సరోజినీ దేవి,
హబ్సిగూడ పాలీ క్లినిక్ అండ్ నర్సింగ్ హోం,
ఇంటి నెం. 1-2-98, కాకతీయనగర్ కాలనీ,
హబ్సిగూడ, హైదరాబాద్- 500 007.
ఫోన్ నెం. 040- 2717 0468 (క్లినిక్),
040- 2717 0246 (ఇల్లు)