హైదరాబాద్, జనవరి 10: తెలంగాణ ముసాయదా బిల్లుపై సవరణలు ప్రతిపాదించాలని అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటనపై ఎమ్మెల్యేలు భారీ ఎత్తున స్పందించారు. వందల సంఖ్యలో వచ్చిన సవరణల ప్రతిపాదనలను క్రోడీకరించేందుకు కనీసం నాలుగైదు రోజులు పడుతుందని అసెంబ్లీ అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకు ఎంత మంది ఎమ్మెల్యేలు నిర్ణీత ‘్ఫర్మెట్’లో స్పీకర్‌కు ప్రతిపాదనలు అందజేశారో లెక్క తేలలేదు. కుప్పలు-తెప్పలుగా వచ్చిన సవరణల ప్రతిపాదనల ఫార్మెట్‌లను కట్టలు కట్టిపెట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎలాంటి ప్రాతిపాదనలు చేయలేదు. సవరణల ప్రతిపాదనలకు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు గడువు ముగిసింది. అయినా మరో రోజు సవరణలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
బాబు మినహా టిడిపి
ఎమ్మెల్యేల నుంచి సవరణలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 10: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు 40 మంది మొత్తం 108 సవరణలు అందజేశారు. కాగా, టిడిపి తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు మొత్తం పది అంశాల్లో సవరణలు సూచించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మినహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సవరణలు ప్రతిపాదించారు. తాను తెలంగాణ ఎమ్మెల్యేల సవరణల ప్రతిపాదనలపై సంతకం చేయలేదని, అందుకే సీమాంధ్ర ఎమ్మెల్యేల సవరణల ప్రతిపాదనలపై కూడా సంతకం చేయనని చంద్రబాబు అన్నట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు. బిజెపి తరఫున కొన్ని సవరణలు సూచిస్తూ స్పీకర్‌కు లేఖ ఇచ్చినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీనారాయణ తెలిపారు. ఎంఐఎం సభ్యులు మొత్తం 31 సవరణలు సూచించారు. సవరణలు సూచిస్తూ స్పీకర్‌కు లేఖ అందజేసినట్టు సిపిఐ ఎమ్మెల్యే గుండ మల్లేష్ తెలిపారు.
సిఎం కిరణ్
సీమాంధ్ర వ్యక్తే: హరీష్
సిఎం మనసు తెలంగాణే: గుండా మల్లేష్
చరిత్రను వక్రీకరించే దౌర్భాగ్యం: శైలజానాథ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 10: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శుక్రవారం మధ్యాహ్నం సీరియస్‌గా చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ ప్రాంతానికి చెందిన వారనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. పునర్వ్యవస్థీకరణ బిల్లుపై సిపిఐ అభిప్రాయాన్ని గుండా మల్లేష్ వినిపిస్తుండగా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లేచి తాను హైదరాబాద్‌లోనే పుట్టానని, ఇక్కడే పెరిగానని, ఇక్కడే చదువుకున్నానని, హైదరాబాద్‌లోనే క్రికెట్ ఆడానని, ఇంతకీ తాను ఏ ప్రాంతానికి చెందుతానో చెప్పాలని ప్రశ్నించారు. దానికి వెంటనే టిఆర్‌ఎస్ నేత హరీష్‌రావు లేచి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సీమాంధ్రకు చెందిన వారేనని అన్నారు. అయితే గుండా మల్లేష్ దానిపై స్పందిస్తూ, ముఖ్యమంత్రి మనసు మాత్రం తెలంగాణ అంటోందని, సీటు మాత్రం అక్కడ ఉండటంతో అలా మాట్లాడుతున్నారని అన్నారు. తన ఉపన్యాసంలో అన్యాపదేశంగా ముఖ్యమంత్రిని ప్రస్తావిస్తూ, ఆయన చాలా మంచివారే కాని ఎందుకు ఇలా మారిపోయారో అర్ధం కావడం లేదు అని అన్నారు. అంతకు ముందు నెహ్రూ వ్యాఖ్యలకు సంబంధించి, ఆంధ్రరాష్ట్రం అవతరణకు సంబంధించి జరిగిన చర్చలో శాసనసభా వ్యవహారాల మంత్రి శైలజానాధ్ జోక్యం చేసుకుంటూ చరిత్ర వక్రీకరణ దౌర్భాగ్యం చూడాల్సి వస్తోందని అన్నారు. విశాలాంధ్ర ఉద్యమం చేసిన సిపిఐ నేతలు చరిత్రను వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు.
హరీష్‌రావుపై కేసు నమోదు
హైదరాబాద్, జనవరి 10: తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్‌రావుపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదుచేసారు. గత బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గచ్చిబౌలిలో గేమింగ్ అండ్ యానిమేషన్ ఎంటర్‌టైన్‌మెంట్ పార్కు ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వచ్చిన టిఆర్‌ఎస్ నేత హరీష్‌రావుని అరెస్టు చేస్తున్న సమయంలో ఎపిఎస్‌పి 15వ బెటాలియన్ కానిస్టేబుల్ రమేష్‌పై దురుసుగా ప్రవర్తించడంతోపాటు దుర్భాషలాడినట్లు రాయదుర్గం సిఐ బాలకోటి చెప్పారు. రమేష్ సిఎం కార్యక్రమంలో బందోబస్తు విధులు నిర్వహిస్తుండగా సంఘటన జరిగింది. రమేష్ ఫిర్యాదు మేరకు హరీష్‌రావుపై ఐపిసి 353 కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలకోటి తెలిపారు.
స్పందించని కిరణ్, చంద్రబాబు, బొత్స
english title:
k
Date:
Saturday, January 11, 2014