Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సభ్యుల చేతికి గణాంకాలు

$
0
0

హైదరాబాద్, జనవరి 10: ఎట్టకేలకు తెలంగాణ బిల్లులోని అంశాలపై వివరాలు సభ్యులకు అందాయి. అయితే అవి కేవలం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిన వివరాలు మాత్రమే. వాస్తవంగా ఆర్ధికం, అప్పులు, ఆస్తులపై సభ్యులు అడిగిన వివరాలను అందించడంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సభ్యులకు అందించిన వివరాల్లో నీటిపారుదల, విద్యుత్, ఉద్యోగులు, ఉపాధి కల్పన, ఆర్ధికశాఖ సాధారణ పరిస్థితులు వంటి అంశాలు మాత్రమే గణాంకాలతో ఉన్నాయి. ఇవి కూడా చర్చకు పెద్దగా ఉపకరించే అవకాశాలు లేవని పలువురు సభ్యులు పెదవి విరుస్తున్నారు. సాధారణ వివరాలు మాత్రమే ఉన్నాయని, ప్రాంతీయ సమస్యలను గుర్తించే అంశాలు సక్రమంగా లేవని వారు అంటున్నారు.
రానున్న 17వ తేదీ నుంచి తిరిగి ప్రారంభమయ్యే సమావేశాల కోసం సన్నద్ధమయ్యేందుకు 69 పేజిలతో కొన్ని శాఖల వివరాలను శుక్రవారం సభలో సభ్యులకు అందించారు. ఇందులో నీటిపారుదలశాఖకు సంబంధించిన వివరాల్లో కృష్ణా బేసిన్‌కు సంబంధించి మూడు ప్రాజెక్టులు విభజన జరిగితే రెండు రాష్ట్రాలకు కామన్ ప్రాజెక్టులుగా ఉంటాయని నివేదికలో పేర్కొన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టు, చెన్నైకి తాగునీరు అందించే ప్రాజెక్టులు ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉంటాయి. శ్రీశైలం ప్రాజెక్టులో 33 టిఎంసిలు ఆవిరి నష్టాలుగా ఉంటుందని, అది మూడు ప్రాంతాలకు 11 టిఎంసిల చొప్పున సమానంగా ఉంటుందని వివరించారు. ఇక కేవలం మిగులు జలాలతోనే కొనసాగే ప్రాజెక్టులు ఏడు ఉన్నట్లు అధికారికంగా నివేదికలో పొందుపరిచారు. రాయల సీమకు సంబంధించి తెలుగుగంగ, హంద్రినీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, కోస్తాంధ్రకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టు, తెలంగాణకు సంబంధించి మాధవరెడ్డి ఎస్‌ఎల్‌బిసి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, జవహర్ నెట్టెంపాటు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఇక కొత్త కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు మేరకు 65 శాతం ఆధారిత విధానంలో భాగంగా తెలంగాణలోని జూరాలకు తొమ్మిది టిఎంసిలు, సీమలోని రాజోలిబండ కుడి కాలువకు నాలుగు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కేరీ ఓవర్‌గా 30 టిఎంసిలు ఉంటాయని నివేదికలో పేర్కొన్నారు. గోదావరి బేసిన్‌కు సంబంధించి తెలంగాణలో 912 టిఎంసిలు, కోస్తాంధ్రలో 509 టిఎంసిలు వినియోగంలో ఉంటాయని వివరించారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 10.87 లక్షల ఉద్యోగాలు ఉన్నట్లు నివేదికలో వివరించారు. అత్యధికంగా పాఠశాల విద్యలో 3.70 లక్షలు, హోంశాఖలో 1.54 లక్షలు, రెవెన్యూలో 1.28 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. ఆదాయానికి సంబంధించి 2012-13 సంవత్సరానికి మొత్తం 68 వేల కోట్లు రాగా, అందులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా చెల్లించే ఆన్ లైన్ వసూళ్లు రంగారెడ్డి ట్రెజరీలో నమోదవుతుండగా, రాజధానిలో జరిగే వాణిజ్య పన్నులు, అమ్మకపు పన్నులు, ఆయిల్ సంస్ధలకు చెందిన పన్నుల చెల్లింపులు హైదరాబాద్ అర్బన్ ట్రెజరీలో నమోదవుతున్నాయి. అందుకే మొత్తం 68 వేల కోట్ల రూపాయల ఆదాయంలో ఒక్క రంగారెడ్డి నుంచే 28.68 వేల కోట్లు, హైదరాబాద్ అర్బన్ నుంచే 22.79 వేల కోట్లుగా రికార్డవుతోంది. మిగిలిన 17 వేల కోట్లు మాత్రమే ఇతర 21 జిల్లాల నుంచి నమోదవుతున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో కూడా నవంబర్ వరకు పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంలో సింహభాగం రంగారెడ్డి, హైదరాబాద్‌ల నుంచి వచ్చిందే కావడం గమనార్హం. ఇలా ఉండగా, పెట్టుబడులకు సంబంధించి గత 55 సంవత్సరాల్లో హైదరాబాద్‌లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెట్టిన పెట్టుబడుల వివరాలు, ప్రయివేటు సంస్థల పెట్టుబడుల వివరాలు, వాటి విలువ వంటివి తమ వద్ద లేవని నివేదికలో పేర్కొనడం గమనార్హం. విభజన జరిగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించి ఆస్తులు, అప్పుల వివరాలు అందుబాటులో లేవని నివేదిక తేల్చిచెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రనుత్వ రంగ కార్పొరేషన్ల వివరాలు వెల్లడించినప్పటికీ, వాటికి సంబంధించి ఆర్ధిక లావాదేవీల వివరాలు కూడా అందుబాటులో లేనట్లు రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. ఇలా ఉండగా, గత నెల్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వివరాల కోసం కేంద్ర హోంశాఖకు లేఖ రాయగా, అందుకు సమాధానంగా వివిధ వర్గాలు, అధికారుల నుంచి సేకరించిన, శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఉన్న వివరాల మేరకే బిల్లు తయారుచేసి మంత్రివర్గానికి అందించినట్లు హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి రాష్ట్రానికి పంపించిన లేఖలో వెల్లడించారు.

అందుబాటులో ఉన్న వివరాలను ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>