హైదరాబాద్, జనవరి 10: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రితో సహా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్ మాట ఇచ్చి, రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నాక మాట మార్చారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభలో శుక్రవారం జరిగిన చర్చలో గండ్ర మాట్లాడుతూ, గత బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర విభజన అంశం రాష్ట్రం పరిధిలో లేదని, దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి చెప్పారని గుర్తు చేసారు. ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఎవరూ మద్దతు ఇవ్వవద్దని తమపై ఎన్ని వత్తిళ్లు వచ్చినా, ముఖ్యమంత్రిపై, పార్టీ అధిష్ఠానంపై నమ్మకంతో ఆయనకు మద్దతు ఇచ్చామని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నాక, గతంలో ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు మాట మార్చడం తెలంగాణ ప్రజల హృదయాలను గాయపర్చేలా ఉన్నాయని ఆయన వాపోయారు. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌పై కేంద్రం అన్ని పార్టీలతో చర్చించిన తర్వాత తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి రాష్ట్రం ఏర్పాటుకు సహకరించాలని గండ్ర విజ్ఞప్తి చేసారు. బిల్లుపై చర్చ కూడా అవసరం లేకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవర్చేందుకు ఏకగ్రీవంగా ఆమోదించి రాష్టప్రతికి పంపించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు రాజ్యాంగ విరుద్దమంటూ చేస్తోన్న వ్యాఖ్యలు బాధకరమన్నారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్ కూడా విభజన బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని చెప్పడం భావ్యం కాదని ఆయన అన్నారు. మంత్రిగా కాకుండా వట్టి వసంతకుమార్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెబితే బాగుండేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు ఆనాడే ఇందిరాగాంధీ వ్యతిరేకించారని కొంత మంది సీమాంధ్ర నాయకులు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిజాం నవాబు ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించారని, ఆ కారణంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఇందిరాగాంధీ అప్పట్లో ఏర్పాటు చేయకపోవడానికి కారణమని గండ్ర వివరించారు. సీమాంధ్ర ప్రజలు ఒక్క హైదరాబాద్‌లోనే స్థిరపడలేదని, తెలంగాణవ్యాప్తంగా ఉన్నారని, వారికి లేని భయాందోళనలు వీరికేందుకని గండ్ర ప్రశ్నించారు. దేశానికి ప్రధాన మంత్రిని అందించగలిగిన తమకు సమర్థ నాయకుల కొరత లేదని, సీమాంధ్ర పాలకులు తమ మోచేతికింద నీళ్లు తాగేవారికి మంత్రి పదవులు ఇచ్చి, వారిని అసమర్థులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రధాన మంత్రిగా సమర్థవంతంగా పని చేసిన పివి నరసింహారావును ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయలేదా? టిడిపి ఆవిర్భావం తర్వాత కాంగ్రెసు పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చిన చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపలేదా అని గండ్ర ప్రశ్నించారు.
తెలంగాణకు కట్టుబడి ఉంటామని అప్పుడన్నారు సిఎం, చంద్రబాబు, జగన్‌పై గండ్ర విసుర్లు
english title:
a
Date:
Saturday, January 11, 2014