హైదరాబాద్, జనవరి 10: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చించాల్సి రావడం దురదృష్టకరమని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య పేర్కొన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై శాసనమండలిలో శుక్రవారం జరిగిన చర్చలో పాల్గొంటూ, రాష్ట్ర శాసనసభ/మండలి అనుమతి లేకుండా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు బిల్లును రూపొందించడం శోచనీయమన్నారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, రూపాయి విలువ పడిపోయి ద్రవ్యోల్బణం పెరిగిందని, ఇంకా అనేక సమస్యలున్నాయని, ఈ తరుణంలో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని హెచ్చరించారు. తెలంగాణా రాష్ట్రంలో రాష్టస్థ్రూల ఉత్పత్తి తగ్గిపోతుందని, దాంతో కొనుగోలు శక్తి తగ్గుతుందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి 44 వేల కోట్ల రూపాయలు కావాలని ఈ నిధులు ఎక్కడ నుండి తెస్తారని ప్రశ్నించారు. ఈ పరిస్థితిలో ఎవరూ అప్పు కూడా ఇవ్వబోరని రామచంద్రయ్య పేర్కొన్నారు. ఆంధ్రాప్రాంతానికి చెందిన ఎంటర్‌ప్రూనర్స్ వల్ల హైదరాబాద్‌లో పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయని, హైదరాబాద్-దాని చుట్టుపక్కల ఏర్పాటైన కంపెనీలు, సంస్థలలో 90 శాతం పెట్టుబడులు ఆంధ్రులవేనని అన్నారు. సాఫ్ట్‌వేర్ రంగం నుండి రాష్ట్రానికి ఏటా వచ్చే 55 వేల కోట్ల రూపాయల్లో, 99 శాతం హైదరాబాద్ నుండే వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 45 సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని, ఇవన్నీ ఉమ్మడి ఆస్తి అన్నారు. ఇదంతా వదిలేసి వెళ్లిపొండని ఆంధ్రులను అంటే ఎలా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లాంటి రాజధానిని కొత్తగా ఏర్పడే ఆంధ్రారాష్ట్రంలో ఎప్పుడు నిర్మించుకోగలం అని ప్రశ్నించారు. రెవెన్యూ వాటా కూడా సరిగ్గా పంపించే విధానం లేదన్నారు. అమ్మకం పన్నులో హైదరాబాద్ నుండి 75 శాతం వస్తోందన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఎంత మేరకు ఆర్థిక సాయం చేస్తుందో కేంద్రం ప్రకటించలేదని రామచంద్రయ్య పేర్కొన్నారు. కేవలం వ్యవసాయం పైనే ఆధారపడకుండా, పరిశ్రమలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో ప్రణాళిక లేదన్నారు. నదీజలాల వివాదాలు పెరుగుతాయని హెచ్చరించారు. ఇన్ని సమస్యలను తీసుకుని తాము కొత్తగా ఏర్పడే తమ రాష్ట్రానికి ఎలా వెళ్లిపోవాలని, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని రామచంద్రయ్య ప్రశ్నించారు. ఈ కారణాల వల్ల ఈ బిల్లును తిరస్కరిస్తున్నానని ప్రకటించారు.
అందుకే తిరస్కరిస్తున్నాం హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్ర పెట్టుబడులు ఆస్తులు వదిలి వెళ్లిపోవాలా? కొత్త రాజధాని, పోలవరానికి నిధులేవీ ధ్వజమెత్తిన మంత్రి రామచంద్రయ్య
english title:
b
Date:
Saturday, January 11, 2014