నిర్మల్, జనవరి 10: నిర్మల్ నియోజకవర్గంలోని పలు కల్లు డిపోలపై శుక్రవారం నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. నిర్మల్ మండలంలోని కడ్తాల్, లక్ష్మణచాంద, సారంగాపూర్ మండలంలోని లక్ష్మీపూర్ కల్లు డిపోలపై దాడులు నిర్వహించి నిబంధనలకు విరుధ్దంగా ఉపయోగిస్తున్న ఎనిమిది కిలోల క్లోరోఫాం, 1 కిలో డైజోఫాం, కల్తీకల్లు లోడుతో ఉన్న లారీని స్వాధీనం చేసుకోవడంతో పాటు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఉన్నత స్థాయి ఎక్సైజ్ అధికారుల ఆదేశాలతోనే ఈ దాడులు జరిగినట్లు తెలిసింది. దాడుల విషయం తెలిసి ఆయా గ్రామాల నుండి గౌడ సంఘం నాయకులు పెద్ద ఎత్తున నిర్మల్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలివచ్చి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఎలాంటి లైసెన్సులు లేకుండా నిర్మల్ డివిజన్‌లో పలు తెల్లకల్లు దుకాణాలు, బెల్టు షాపులు నడుస్తున్నప్పటికీ వాటిపై కనె్నత్తి కూడా చూడకుండా కులవృత్తినే నమ్ముకుని పొట్టపోసుకుంటున్న తమపై దాడుల చేయడం ఏంటని మండిపడ్డారు. నిబందనలకు విరుద్ధంగా ఉంటే తమపై చర్యలు తీసుకున్నా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గౌడకులస్తులు తరలిరావడంతో ఎలాంటి అల్లర్లు జరుగకుండా నిర్మల్ శిక్షణ డిఎస్‌పి కవిత, ఎస్‌ఐ జాడే శాంతారాం ఆద్వర్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఎక్సైజ్ దాడులకు నిరసనగా నేడు ధర్నా, ర్యాలీ
ఆకారణంగా ఎక్సైజ్ అధికారులు తెల్లకల్లు దుకాణాలపై దాడులు చేయడాన్ని నిరసిస్తూ శనివారం నిర్మల్‌లో ధర్నా, ర్యాలీ నిర్వహిస్తున్నట్లు గౌడజన హక్కుల పోరాట సమిటి రాష్ట్ర కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు తమ ఇళ్లలోకి చొరబడి దొంగల్లాగా తమను చిత్రీకరించి సోదాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిచారు. ఈ ధర్నాకు జిల్లానుండి గౌడకులస్తులు పాల్గొనాలని ఆయన కోరారు.
* మత్తుపదార్థాలు స్వాధీనం
english title:
nirmal
Date:
Saturday, January 11, 2014