
కాన ఆ యెడ అప్పుడా మహాపురుషుడు కానరాక దిక్కులు పిక్కటిల్ల ఆర్చాడు. లోకభీకరంగా ఆ జగల్లోచనుడి లోకంమీదకి ఆ జగత్కంటకుడు దండుసాగుతూ నడుమ మేరు పర్వత శిఖరాగ్రంపైన నిడిసి, ఒక రేయి గడపాడు.
రావణుడు సూర్యాదులపైకి దండెత్తుట
మరునాడు హేమమణికాంతుల విరజిమ్మే భుజకీర్తులు, చెవి తమ్మంటుల వ్రేలే కుండలాలు, రక్తాంబరాలు, రక్తమాల్యాలు, రక్తచందనాదులతో రంజిల్లుతూ మిక్కిలి తీక్షణమగు ప్రకాశించే సహస్ర కిరణాలతో దురవలోకుడైన సహస్ర కిరణుడిని కాంచాడు. ప్రహస్తుడి వంక చూడ్కులు ప్రసరించాడు. ‘‘ప్రహస్తా! ఉగ్రరీతిని తేజంతో మండే ఈ భాస్కరుడికి చెంతకు పోయి అతనికి నా రాక ఎరుగజేసి అని చేయరమ్మని పిలువు. రాక శంకిస్తే ఆ భానుడిచేత ‘ఓటమి చెందాను’ అను ఆడించి మరలిరా!’’ అని ఆనపెట్టాడు. ప్రహస్తుడు వెంటనే అరిగి దండ పింగళుకులను నామధారులైన భానుడి దౌవారికులకి దశవదనుడి ఆన వినిపించాడు. వెంటనే దండుడు ఏగి, భాస్కరుడికి ప్రణామాలు సల్పి ‘‘ప్రభూ! లంకాధితి రావణుడు సంగ్రామార్థి అయి చనుదెంచాడు. ఆలోచన సల్పి అనువు కాదనకొన్న ఓటమిని అంగీకరించు. జయమో అపజయమో తేల్చుకొని ఏదో ఒక్కటి తెలుపకుంటే దశాననుడు ఇక్కడనుంచి చనడు’’ అని విన్నవించాడు. తత్‌క్షణమే రవి ఆ దౌవారికుడు దండుని కనుకొని ‘‘మహావీరుడు దశాననుడు. అతడితో అని సల్పజాలను. గెలువజాలను’’ అని తెలిపి రావలసింది అని పలికాడు.
అంత ఆ దండుడు రావణుడి వద్దకు ఏతెంచి ‘‘అర్కుడు అమిత విక్రమశాలివైన నీతో సమరం సల్పజాలడు. నా మాటే ఆ భాస్కరుడి మాట’’ అని వినిపించాడు. రావణుడు అతడి మాటకి అలరి తన జయాన్ని ఘోషించి, చంద్రలోకానికి అరుగుతూ మేరు గిరిపైన ఆ రోజు వసించాడు.
అక్కడ ఒక దివ్య పురుషుడు జలకేళీలోలుడై అలసి కనుమోడ్చి వుండగా అప్సరసలు ఆ పురుషుణ్ణి పరీరంభణం చేసి, తేలియాడడం చూసి అక్కడి వారిని మేల్కొల్పాడు. అప్పుడా దివ్యపురుడు దివ్య వస్తమ్రులు, దివ్యాభరణాలు, దివ్యమాల్యాలతో అమర తన్ను ఆ అమర కాంతలు ముదముతో కొలువ రథమెక్కి ఆకాశ మార్గమున కెగిరి వెడలిపోవడం కనుగొన్నాడు. అపుడు ఆ భూధరంతో ‘‘గిరిరాజా! తేరెక్కి వేగంగా వెడలిపోయే ఇతడు ఎవరు? ఇతడెవడో అమర విరోధినైన నా దిక్కు కనుగొనక పోతున్నాడు. ఈ గర్వాంధుడు ఎవ్వరు?’’ అని ప్రశ్నించాడు.
ఆ ప్రశ్న విని మేరువు ‘‘రావణా! ఈ దివ్య పురుషుడు చతుర్ముఖ బ్రహ్మని సంతృప్తిపరచాడు. ఈ పురుషుడు మోక్షానికి అరుగుతున్నాడు. వత్సా! నువు లావు కలిమి అఖిలోకాలు గెలిచావు. ఆ పురుషుడు తపమాచరించి, ఆ తపోబలంతో నిఖిల జగాలని గెలిచాడు. శూరాగ్రగణ్యుడివి నువ్వు. ఇట్టి శాంతమూర్తులపై కోపం కూడదు’’ అని చెప్ప అలుకమానాడు. ఇంకొకడు స్వర్ణమణి ప్రభలతో మెరుస్తున్న రథం అధిరోహించి చనడం కని ‘‘మహీధరా అధీశా! ఆనందంతో అచ్చరలు ఆడుతూ పాడుతూ వుండగా దేవతలు కొనియాడ వెడలుతున్న ఆ ఉజ్జ్వలాంగుడు ఎవరు?’’ అని ఎరుగగోరాడు.
ఆ ప్రశ్నకు మేరు పర్వత రాజు రావణాసురుడితో ఈ మనుజవరుడు ‘‘శత్రువుల నెదిరించి, వెనుకంజ వేయక అమిత విక్రమం ప్రదర్శించి, వైరుల ఘోరాయుధహతులు సైరించి, వేడ్కతో తన అధిపతిని వంచింపక- ఆ హవం ఒనర్చి నిర్జర లోకానికి అరుగుతున్నాడు. అంతేకాక తనకు ప్రీతి కల్గిన తావున విహరింప చన బోతున్నాడు’’ అని ఆ వీరవరుణ్ణి గురించి వివరించాడు. అంతలో ఇంకొకుడు నిరుపమాన ఆకారుడై అంతరిక్షంలో- తేజంలో ఆదిత్యుణ్ణి పోలుతూ చుక్కలరేని చందంగా ముఖం వెలుగుతూ వుండగా- మనోహరాలైన ఆభరణాలు, నిర్మలాంబరాలు, గంధమాల్యాలు వింతలయి మెరసిపోతూ వుండగా- అమరాంగనలు వలంతులై గీతావాద్య నృత్యాలతో అలరింప కాంచన విమానంలో చనడం చూసి ‘‘అతడు ఎవ్వరివాడు?’’ అని రావణాసురుడు మరల ప్రశ్నించాడు.
-ఇంకాఉంది