ప్రతినెలా సంక్రాంతి వచ్చినా మకర సంక్రాంతికి ఉన్న ప్రాముఖ్యంవల్ల సంక్రాంతి పండుగ పెద్దపండుగగా జరుపుకోవడం మన ఆచారం. సంక్రాంతి పండుగకు మొదటి రోజైన ‘్భగి’ దక్షిణాయానికి, ధనుర్మాసానికి చివరి రోజు. భోగి శబ్దానికి నిఘంటువులు తొలినాడు, పండుగ అనే అర్థాలు చెబుతాయ. ఈ భోగి పొద్దునే్న అరిష్ట నివారణ కోసం భోగిమంటలు వేసి, వాటిలో పాతవి, పనికిరానివయిన వస్తువులు వేసి, ఆ పీడ విరగడైనట్లు భావించడం ఒక ఆచారం. శ్రీమన్నారాయణుడిని రంగనాథునిగా భావించి అండాల్ అమ్మ ప్రవచించిన తిరుప్పావై అన్ని కోవెలలోనూ పఠిస్తుంటారు. ఆ పాశురాలను చదువుతూ ఈ భోగీపండుగరోజున శ్రీ గోదాదేవి (ఆండాళ్) శ్రీ రంగనాథుని వివాహం చేస్తారు. ఈ ఆండాల్ తల్లికి ఇంతటి మహోన్నతమైన భోగాలను ఇచ్చింది కనుకనే ఈ పండుగను భోగిపండుగగా కూడా వ్యవహరిస్తుంటారు. ఈ రోజున పొంగలి వండి నారాయణునికి నివేదన చేసి బంధువులందరూ కలసి ఆ ప్రసాదాన్ని సేవిస్తారు.
ఈ రోజు తైలాభ్యాంగన స్నానం ఆరోగ్యాన్నిస్తుంది. స్నానపానాదుల తర్వాత భగవదర్శనం మనశ్శాంతినిస్తుంది. సంక్రాంతికి ముందుర నెలరోజులనుంచి మహిళలు అందమైన ముగ్గులు తీర్చిదిద్దుతారు. వాటిమధ్యలో ఆవుపేడతో గొబ్బెమ్మలను తయారుచేసి వాటిని పసుపుకుంకుమలు, తంగేడు, గుమ్మడిపూలతో అలంకరిస్తారు. వాటిచుట్టు కనె్నపిల్లలందరూ ‘‘గొబ్బియలో.. గొబ్బిలయ’’లంటూ పాటలు పాడుతారు. ఆ పాటలలో వారికి అందమైన భవిష్యత్తు ఉండాలన్న ఆకాంక్షను వెలిబుచ్చుతారు. రైతులందరూ తమ తమ వ్యవసాయపు పంటలను ఇంటికి తెచ్చుకొని ఆనందంగా ఉంటారు. ఆ ఆనందాన్ని తమకు తోడ్పడిన కర్మచారులకు, జానపదకళాకారులకు పంచుతూ తాము పండించిన ధాన్యాన్ని వారికి కొంత దానం చేస్తారు. హరిదాసులు, జంగందేవరలు, సన్నాయ మేళం వారు, బుడబుక్కలవారు, గంగిరెద్దుల వారు, పగటివేషగాండ్లు, వీరందరూ గ్రామస్తుల ఇంటి ముంగిటకు వచ్చి వారి వారి సంప్రదాయాలనుగుణంగా కళలను ప్రదర్శిస్తారు. వీరికందరికీ మహిళలు వడ్లను, కొత్తబట్టలను దానం చేస్తుంటారు. సాయంత్రం పిల్లల ఆయురారారోగ్యల కోసం వారిని కూర్చోబెట్టి కొత్తబట్టలు తొడిగి, వారికి భోగిపళ్లు పోయడం మన సంప్రదాయం. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలకు తగిలే దృష్టిదోషం దూరం అవుతుందంటారు. ఇంకా ఆయుర్వృద్ధీ జరుగుతుంది. సాయంత్రం వేళ పేరంటం చేసి ముతె్తైదువులను పిలిచి వారికినువ్వులు బెల్లంతో చేసిన ఉండలను, నానిన పచ్చిశనగలు పండుతాంబూలాలతోపాటు ఇచ్చి వారి దీవనలందుకుంటారు. కొన్ని చోట్ల బొమ్మల కొలువుకూడా తీర్చడం సంప్రదాయమే. ద్వాపరయుగంలో ఒకసారి ఇంద్రుడు రేపల్లెవాసులపై కోపం తెచ్చుకొన్నాడు. యాదవులందరికి కష్టాలు కలిగించసాగాడు. తానే దిక్పాలందరికి అధిపతిననే గర్వంతో జనులను నానాఇబ్బందులకు గురిచేసాడు. ఆ బాధలను పడలేక వారందరూ కృష్ణుడితో తమ బాధలను తీర్చమని మొరపెట్టుకొనగా కృష్ణుడు మనలను గోవర్థనగిరికి పూజచేస్తే వారి బాధలను దూరం అవుతాయని చెప్పి వారితో కలసి తాను గోవర్థనగిరికి పూజచేయడం ఆరంభించాడు. దాన్ని చూచిన ఇంద్రుడు అమిత క్రోధంతో వారిపై వడగండ్లవానకురిపించగా కృష్ణుడు ఆ గోవర్థనగిరి ఎత్తిపట్టుకుని దానిక్రిందకు గోపజనాన్ని రమ్మని వారినందరినీ కాపాడాడు. కృష్ణుడు అండగా ఉన్న యాదవులను చూచి తెలివి తెచ్చుకున్న దేవతలరాజు కృష్ణుడు పరబ్రహ్మమని గ్రహించాడు. వెంటనే కృష్ణుడు దగ్గరకు వచ్చి తనను మన్నించమని కోరాడు. అపుడు కృష్ణుడు శాంతం వహించి ఇంద్రుడిని మన్నించాడు. యాదవులతో తిరిగి ఇంద్రపూజ చేయమని చెప్పాడు. కనుక ఈ భోగిపండుగరోజు ఇంద్రపూజ చేయడం కూడా ఆచారం.తమిళనాట బాలబాలికలు భోగిమంటల చుట్టు తిరుగుతూ డప్పులను వాయస్తూ ఇంద్రునిపై తమకున్న గౌరవాన్ని తెలుపుతారు. కొన్ని చోట్ల వామనపురాణం కూడా ఈ భోగిరోజు చదివే సంప్రదాయం కనిపిస్తుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గోపూజ విశేషంగా చేస్తుంటారు.
మంచిమాట
english title:
manchimaata
Date:
Monday, January 13, 2014