
హైదరాబాద్, జనవరి 13: కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర సచివాలయంలో ఉన్న భవనాలను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై కసరత్తు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత సచివాలయంలోని బ్లాకుల వినియోగంపై పరిపాలనాపరంగా తుది నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలో ఎనిమిది బ్లాకులు ఉన్నాయి. దక్షిణం వైపు ఉన్న పాత గేటు నుండి సచివాలయంలోకి వెళ్లే రోడ్డు రెండు సచివాలయాలకు సరిహద్దుగా మారుతుంది. పాత గేటు నుండి సచివాలయం కిండర్‌గార్డెన్ స్కూలు వరకు ఉన్న రోడ్డుకు ఎడమవైపు నాలుగు బ్లాకులు (ఎ, బి, సి, డి) ఉండగా కుడివైపు నాలుగు బ్లాకులు (హెచ్, జె, కె, ఎల్ బ్లాకులున్నాయి. ఎ, బి, సి, డి బ్లాకులు ఒక రాష్ట్రం సచివాలయంగా, హెచ్, జె, కె, ఎల్ బ్లాకులు మరో రాష్ట్రం సచివాలయానికి ఉపయోగించుకునేందుకు వీలుంది. ఈ బ్లాకులకు కొత్త గేటును వినియోగించుకోవచ్చు. రెండు సచివాలయాల మధ్య ఉన్న రోడ్డు సరిహద్గుగా (బౌండరీగా) నిలుస్తుండటంతో ప్రత్యేకంగా ప్రహరీగోడ కూడా కట్టాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు.
ఎ, బి, సి, డి బ్లాకులు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే, ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం కోసం వినియోగిస్తున్న ‘సి’ బ్లాకు (సమతా) యథాతథంగా కొనసాగించేందుకు వీలుంది. హెచ్, జె, కె, ఎల్ బ్లాకులు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే వాటిల్లో ఒక దాన్ని సిఎం కార్యాలయంగా వాడుకునేందుకు వీలుంది. ‘హెచ్’ బ్లాకు కొత్త భవనం కావడంతో దానే్న ముఖ్యమంత్రి కార్యాలయంగా వినియోగించుకునేందుకు వీలుంది.
ఒక్కో రాష్ట్రానికి 30 నుండి 40 మంది వరకు మంత్రులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న భవనాలు సరిపోతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలో 34 ప్రధాన శాఖల్లో నాలుగున్నర వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో సీమాంధ్రకు చెందిన వారే 80 శాతం దాకా ఉన్నారు. రాష్ట్ర సచివాలయంలో ప్రస్తుతం సీమాంద్ర సచివాలయ ఉద్యోగుల సంఘం, తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అంటూ రెండు సంఘాలు ఏర్పాటయ్యాయి. నాలుగు నెలల క్రితం వరకు ఒక్క సంఘమే (ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం) ఉండేది. ఇప్పుడు రెండు సంఘాలు వేర్వేరుగా ఏర్పాటయ్యాయి. దాంతో ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఎంత మంది ఉన్నారో స్పష్టమైంది. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని ఏ విధంగా రెండు రాష్ట్రాల సచివాలయాలకు పంపిణీ చేయాలా అన్న అంశం మాత్రం సీరియస్‌గానే ఉంటుంది. సచివాలయానికి సిబ్బంది ఎంపిక (నియామకం) ఎపిపిఎస్‌సి ద్వారా ప్రత్యేకంగా చేశారు. ఒక పర్యాయం సచివాలయ మినిస్టీరియల్, నాన్-గెజిటెడ్ ఆఫీసర్లుగా నియామకం అయితే పదవీ విరమణ వరకు ఇక్కడే పనిచేయాల్సి ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం పనిచేస్తున్న వారిని కొత్త రాష్ట్రాల సచివాలయాల్లో అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ సచివాలయంలో సీమాంధ్రకు చెందినవారు పనిచేసేందుకు ఆమోదం తెలిపినా వారికి తెలంగాణ సచివాలయంలో కొనసాగేందుకు సాంకేతికంగా వీలవుతుంది. ఒక్కో సచివాలయంలో కనీసం మూడు వేలమంది ఉద్యోగుల అవసరం ఉంటుందని భావిస్తున్నారు.