విజయవాడ, జనవరి 13: నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారుల పైనే స్వైరవిహారం చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ కృష్ణా జిల్లాలో ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా పరిపాలన అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రైవేటు ట్రావెల్స్‌కు కొమ్ముకాసే వారు లేకపోవటంతో రవాణా శాఖ ఉప కమిషనర్ సిహెచ్ శివలింగయ్య తనదైన శైలిలో వాటిపై నిత్యం కొరడా ఝుళిపిస్తున్నారు. దీంతో పండుగ రోజుల్లో ఎడాపెడా చార్జీలు పెంచి లక్షల రూపాయలు ఆర్జించదలచుకున్న యజమానుల పరిస్ణితి అగమ్యగోచరంగా మారింది. గత 10రోజులుగా గతంలో మాదిరిగా బాహాటంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు రోడ్డెక్కటంలేదు. అయితే కొన్ని బస్సులను రూట్లు, వేళలు మార్చి దొడ్డిదారిన నడుపుతున్నప్పటికీ ప్రయాణికుల ఆదరణ కన్పించడంలేదు. సోమవారం కృష్ణా జిల్లాలో మూడు ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. ఆర్టీవో పూర్ణచంద్రరావు నేతృత్వంలో అధికారులు జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్‌పోస్టు వద్ద శ్రీ వెంకటేశ్వర కనకదుర్గ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులను సీజ్ చేశారు. తొలుత హైదరాబాద్‌కు వెళుతున్న బస్సును, తర్వాత కొద్దిసేపటికే హైదరాబాద్ నుంచి వస్తున్న మరో బస్సును సీజ్ చేశారు. అయితే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వారిని ఎప్పటికప్పుడు బస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. కాంట్రాక్ట్ క్యారేజీగా అనుమతి పొంది స్టేజీ క్యారియర్‌గా నడుపుతున్నారంటూ ఆ రెండు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఆర్టీవో సుబ్బారావు నేతృత్వంలో అధికారులు విజయవాడలో కనకదుర్గ వారధి వద్ద నిఘా వేసి ఖాళీగా వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. ఫిట్నెస్ సర్ట్ఫికెట్ కాలపరిమితి ముగిసినా రోడ్డుపై తిరుగుతున్నదంటూ ఆ బస్సుపై కేసు నమోదు చేశారు. విజయవాడ నుంచి సాధారణ రోజుల్లో నిత్యం 150 నుంచి 200 ప్రైవేటు బస్సులు నడుస్తుండేవి. ప్రస్తుతం ప్రైవేటు బస్సులన్నీ నిలిచిపోవడంతో ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 230 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. గడచిన నాలుగు రోజులుగా ఒక్క హైదరాబాద్‌కే 400 ప్రత్యేక బస్సులు నడిచాయి.
19న విద్యుత్ ఉద్యోగుల సమైక్య దీక్ష
విశాఖపట్నం, జనవరి 13: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌లో విద్యుత్ ఉద్యోగులు నిర్వహించే ‘సమైక్యదీక్ష’ నిర్వహిస్తున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జెఏసి కన్వీనర్ పోలాకి శ్రీనివాసరావు తెలిపారు. వివిధ డిస్కంల ఉద్యోగులతో సోమవారం విశాఖలో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమైక్య దీక్ష ఉంటుందన్నారు. ఇందిరాపార్కు వద్ద జరిగే ఆ రోజు దీక్షలో వేలాది మంది తరలివస్తారన్నారు. అలాగే అన్ని జెఏసిల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షను విజయవంతం చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర 13 జిల్లాల్లో చేపట్టిన తీవ్ర ఉద్యమాల ఫలితంగానే తదుపరి చర్యలు లేకుండా చేయగలిగామన్నారు. ఇదే ఉద్యమ స్ఫూర్తితో విభజనను పూర్తిగా అడ్డుకుంటామన్నారు. రాష్ట్రంలోని ట్రాన్స్‌కో, జెన్‌కోలకు సంబంధించి ఉద్యోగులంతా ఇందులో పాల్గొంటారన్నారు. రెగ్యులర్ ఉద్యోగులే 30 వేలకు పైగా ఉండగా, కాంట్రాక్ట్ ఉద్యోగులు వేలల్లో ఉన్నారన్నారు. వీరంతా ఉద్యమిస్తే ప్రభుత్వం దిగిరావాల్సిందేనని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ దాటిన తరువాత అనేక రూపాల్లో సమైక్య ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన జరగనీయబోమన్నారు.
చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
వినుకొండ, జనవరి 13: గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని మనే్నపల్లి చేపల చెరువులో మునిగి సోమవారం ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. చేపల చెరువు కాపలాదారు చల్లంచర్ల లక్ష్మయ్య మనవరాళ్లు చంబేటి శిరీష, తిరువీధి వెంకటేశ్వరి, మనవడు దుర్గాప్రసాద్ కలిసి ఇంట్లో పెద్దలు లేని సమయంలో చిన్న పడవపై చెరువులోకి వెళ్లారు. పడవ పైనుండి ప్రమాదవశాత్తూ వెంకటేశ్వరి(3) చెరువులో పడిపోయింది. ఈ చిన్నారిని రక్షించేందుకు శిరీష నీటిలోకి దూకింది. వీరిద్దరూ చెరువులో మునిగి మృతి చెందారు. దిక్కుతోచని స్థితిలో దుర్గాప్రసాద్ చెరువు మధ్యలో పడవలో ఉండిపోయాడు. లక్ష్మయ్య బయటి నుంచి ఇంటికి చేరుకునేసరికి పిల్లలు కనిపించలేదు. దుర్గాప్రసాద్ చేపల చెరువు మధ్యలో పడవలో వుండటాన్ని గమనించి లక్ష్మయ్య అక్కడికి చేరుకున్నాడు. జరిగిన విషయం తెలిసి స్థానికుల సహాయంతో వెంకటేశ్వరి, శిరీష మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు.
3జి లవ్ నిర్మాత ప్రతాప్ అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జనవరి 13: విజయనగరం పట్టణానికి చెందిన 3జి లవ్ సినిమా నిర్మాత, స్క్వేర్ ఇండియా సంస్థ యజమాని కోలగట్ల ప్రతాప్ కుమార్‌ను కరీంనగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ప్రతాప్‌కుమార్ తనను వివాహం చేసుకుంటానని నమ్మబలికి మోసగించాడంటూ ఈ నెల 8వ తేదీన కరీంనగర్‌కు చెందిన ఎఎ కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఈయనపై ఐపిసి 420, 417 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసినట్టు తెలిపారు. కరీంనగర్ పోలీసులు విజయనగరం వచ్చి ప్రతాప్‌కుమార్‌ను అరెస్టు చేసినట్టు తెలిపారు.
ఢిల్లీ ముట్టడికి సిద్ధంకండి: టిజి
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జనవరి 13: రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటుకు చేరితే ఢిల్లీ ముట్టడి నిర్వహిస్తామని, ఇందుకు సీమాంధ్ర ప్రజలు సిద్ధం కావాలని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. బిల్లు పార్లమెంటుకు చేరితే విభజనను అడ్డుకోవడం సాధ్యం కాదన్నారు. కర్నూలులో సోమవారం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ విభజన బిల్లుపై శాసనసభలో క్లాజుల వారీగా చర్చించాలని రాష్టప్రతి సూచించారన్నారు. అయితే కొద్ది రోజులు తెలంగాణ, సమైక్యవాదులు సభను అడ్డుకోవడం, సెలవుల కారణంగా బిల్లుపై ఇంత వరకు పూర్తి స్థాయిలో చర్చ ప్రారంభం కాలేదన్నారు. ఒకరిద్దరు నాయకులు మాత్రమే బిల్లుపై తమ అభిప్రాయాలు తెలిపారన్నారు. సంక్రాంతి తరువాత బిల్లుపై సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే బిల్లుపై సమగ్ర చర్చ జరగాలంటే మరికొంత సమయం అవసరమవుతుందన్నారు. అదనపు సమయం ఇవ్వాలని రాష్టప్రతిని కోరే అవకాశముందన్నారు. ఒకవేళ రాష్టప్రతి సమయం ఇవ్వని పక్షంలో బిల్లును ఢిల్లీకి పంపించాల్సి ఉంటుందన్నారు. ఈ బిల్లు రాష్టప్రతి నుంచి కేంద్ర కేబినెట్‌కు, అటు నుంచి పార్లమెంటుకు చేరుతుందన్నారు. ఇదే జరిగితే పెద్ద ఎత్తున సమైక్యవాదులు ఢిల్లీ ముట్టడి నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ప్రజలు ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.
* పండుగ రోజుల్లోనూ ఆర్టీఏ బ్రేకులు
english title:
p
Date:
Tuesday, January 14, 2014