
చంద్రగిరి, జనవరి 13: సమైక్య అంశాన్ని కాంగ్రెస్, వైకాపా, టిఆర్‌ఎస్‌లు జటిలం చేసి ప్రజలను రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేశారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో సంక్రాంతిని చేసుకోవడానికి సోమవారం ఆయన ఇక్కడకు వచ్చారు. విభజన అంశాన్ని ఆ మూడు పార్టీలు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయని అన్నారు. అందుకే తాను రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లను కోరుతున్నది ఒక్కటేనని, రాష్ట్ర విభజన అంశాన్ని సామరస్యం పరిష్కరించాలన్నారు. రాష్ట్రాన్ని విభజించమని సోనియా ముందు కోరిన మొదటి వ్యక్తి వైఎస్ అన్నారు. నేడు ఆ విషయాన్ని విస్మరించి జగన్ సమైక్యవాదం వినిపించడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రమంత్రులు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. నేడు రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్ల వెనుకబడిందన్నారు. టిడిపిపై ప్రజలు ఎనలేని విశ్వాసం పెంచుకున్నారని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి గమనించిన కాంగ్రెస్ తెలంగాణలో టిఆర్‌ఎస్‌తోను, సీమాంధ్రలో వైసిపితోను మ్యాచ్‌పిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కావాలని తనను కలిసిన చిన్ననాటి స్నేహితులతో అన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు. ప్రతి ఒక్కరిని పేరుపేరున పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ గ్రామంలో పుట్టి అందరు ఏదోవిధంగా ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన వారేనన్నారు.
విజయమే లక్ష్యంగా పని చేయండి
వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోపోతే మనుగడే ప్రమాదంలో పడుతుందని, అందుకే విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో అన్నారు. నారావారి పల్లిలో సంక్రాంతి జరుపుకోవడానికి వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సిపి గెలిస్తే దేశంలోనే ఒక వింతవుతుందన్నారు. అదే సమయంలో టిడిపిని గెలిపించుకోపోతే పార్టీ కార్యకర్తలకు భవిష్యత్ ఉండదన్నారు. కార్యకర్తలను విజయలక్ష్యం వైపు నడిపేందుకు బాబు తనదైన శైలిలో ప్రసంగిస్తూ సామ,బేధ దండోపాయాలను ప్రయోగించారు. ఓవైపు వైకాపా గెలవదని చెపుతూనే, ఈ మారు టిడిపిని గెలిపించుకోవడం మీ అవసరం అన్న చందాన తన ప్రసంగాన్ని సాగించారు. స్వర్గీయ ఎన్‌టిఆర్ ఏ ముహూర్తంలో పార్టీని ఏర్పాటు చేశారో తెలియదని, అప్పటి నుంచి నేటి వరకు పార్టీకి అండదండలుగా ఉన్నది కార్యకర్తలేనని అన్నారు.
నాటు బాంబులు
తయారు చేస్తూ వ్యక్తి మృతి
నిడుమనూరు, జనవరి 13: అడవి పందుల వేట కోసం రసాయన పద్దార్థాలతో నాటు బాంబులు తయారు చేస్తూ ప్రమాదవశాత్తు బాంబు పేలి వ్యక్తి మృతి చెందిన సంఘటన నిడుమనూరు మండలం గుంటిపల్లి శివారు జంగాల వారి గూడెం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని పలువురు పాత ఇనుము వ్యాపారంతో పాటు అడవిపందులను వేటాడి మాంసాన్ని విక్రయిస్తుంటారు. అందులో భాగంగా మంగళవారం సంక్రాంతి పండుగ కావడంతో సోమవారం రాత్రికి వేటకు వెళ్లేందుకు కడమంచి శ్రీను(28), కడమంచి వెంకటయ్య, శేఖర్, ఆలేటి రవిలు కలిసి సోమవారం మధ్యాహ్నం వెంకటయ్య ఇంటి వద్ద నాటుబాంబులను తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు బాంబు పేలడంతో కడమంచి శ్రీను అక్కడిక్కకడే మృతి చెందాడు. బాంబు పేలిన శబ్దానికి గ్రామంలోని చట్టుపక్కల వారు వచ్చిన కొద్దిసేపటికే శ్రీను మృతిచెందినట్లు తెలిపారు. అయితే ఇతనితోపాటు సంఘటన స్థలంలో ఉన్న వెంకటయ్య, శేఖర్, రవిలు పరారీలో ఉన్నారు. సంఘటన స్థలానికి హాలియ సి ఐ ఆనంద్‌రెడ్డి, నిడుమనూరు ఎ ఎస్ ఐ లతీఫ్ బాబా సంఘటనస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.