
విజయవాడ: రాష్ట్ర విభజన ప్రక్రియను నిరసిస్తూ విజయవాడలో పలుచోట్ల తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులు భోగి మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈసందర్భంగా సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగాయి. ఎపిఎన్‌జివో సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు కోనేరు రవి, రమేష్ ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఉద్యోగులు టి.బిల్లు ప్రతులను తగులబెట్టారు. గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సీమాంధ్ర శాసనసభ్యులంతా ఏకమై టి.బిల్లుపై ఓటింగ్ జరిపించి వెనక్కి తిప్పికొట్టాలని కోరారు. టిడిపి అర్బన్ ఉపాధ్యక్షుడు లుక్కా సాయిరాం గౌడ్ నాయకత్వంలో పార్టీ నాయకులు టి.బిల్లు ప్రతులను భోగిమంటల్లో వేసి తగులబెట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యాంధ్ర ఉండాలన్నా, సీమాంధ్ర హక్కులకు రక్షణ కావాలన్నా చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమని అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మేయర్ తాడి శకుంతల నాయకత్వంలో మహిళలు టి.బిల్లు ప్రతులను తగులబెట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ జగన్ ఒక్కరే రాజీలేని పోరు సాగిస్తున్నారన్నారు.
విజయవాడలో టి.బిల్లు ప్రతులను దగ్ధం చేస్తున్న దృశ్యం