విశాఖపట్నం, జనవరి 13: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొమ్మరిల్లు సంస్థ మోసం తవ్వే కొద్దీ బయటపడుతోంది. ప్రధాన నిందితులు పరారీలో ఉండగా ఐదుగురు డైరెక్టర్లను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. విశాఖ క్రైం ఎసిపి వరదరాజులు సోమవారం విలేఖరులకు తెలియచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాయల రాజారావు 2011లో బొమ్మరిల్లు సంస్థను ప్రారంభించాడు. రాజారావు ఎండిగా, ఆయన భార్య స్వాతి రాజ, సోదరుడు లక్ష్మీ నారాయణ డైరెక్టర్లుగా సంస్థను తొలుత హైదరాబాద్‌లో, ఆ తరువాత విశాఖ నగరంలో ప్రారంభించాడు. రోజుకు 10 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకూ సంస్థలో డిపాజిట్ చేసిన వారికి సంవత్సరం తరువాత అసలుతో సహా వడ్డీ చెల్లించే పథకాన్ని ప్రారంభించాడు. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, మూడేళ్ల తరువాత ఆ సొమ్ముకు 50 శాతం మొత్తాన్ని కలిపి అందచేస్తామంటూ ఖాతాదారులను ఆకర్షించాడు. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన వారికి నెలకు 12 శాతం వడ్డీ కూడా చెల్లిస్తామని ప్రకటించాడు. ఖాతాదారులు చేసిన డిపాజిట్లతో అనేక ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. వాటిని లే-అవుట్‌లుగా మలిచారు. ఖాతాదారులు ఎవరైనా మెచ్యూర్ అయిన డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇమ్మనమంటే, వారికి ఆ సొమ్ము చెల్లించకుండా, ఇంటి స్థలం ఇస్తామంటూ మభ్య పెట్టారు. ఇలా కొంతమందికి స్థలాలు ఇచ్చాడు. ఈ వ్యాపారం గిట్టుబాటు కావడంతో సంస్థ బ్రాంచ్‌లను కరీంనగర్, మచిలీపట్నం, సామర్లకోట, శ్రీకాకుళం, నర్సన్నపేట, టెక్కలి, కాశీబుగ్గ, బరంపురం తదితర చోట్ల విస్తరించాడు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3000 మంది ఏజెంట్లను కూడా నియమించుకున్నాడు. కేవలం 2011-13 మధ్య 5000 మందిని చేర్చుకుని వారి నుంచి 85 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించినట్టు పోలీసులు వివరించారు. ఖాతాదారుల 40 వేల వరకూ ఉంటుందని పోలీసు వర్గాలే తెలియచేస్తున్నాయి. బొమ్మరిల్లు ఎండిగా ఉన్న రాజారావు మూడు నెలల కిందటే తన పదవికి రాజీనామా చేసి, వెళ్లిపోయాడు. ఆ బాధ్యతలను వానపల్లి వెంకటరావుకు అప్పగించాడు. ఖాతాదారులకు చెల్లించాల్సిన డిపాజిట్లు చెల్లించకపోవడంతో సంస్థ అసలు రంగు బయటపడింది. ఆ తరువాత పోలీసులు రంగ ప్రవేశం చేసి విశాఖలోని సంస్థ కార్యాలయం, రాజారావు ఇంటిలోను సోదాలు నిర్వహించారు. విలువైన కార్లను, బంగారాన్ని, నగదును, విలువైన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సంస్థకు చెందిన డైరెక్టర్లు వానపల్లి వెంకటరావు, ఎస్ శ్రీనివాసరావు, కమ్మెల బాపూజీ, గోవిందు ఎర్రయ్య, హెచ్ ఆర్ మేనేజర్ కె సూర్యనారాయణను అరెస్ట్ చేశారు. సంస్థకు చెందిన ఏజెంట్లు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సోమవారం సాయంత్రం చేరుకుని, అరెస్ట్ చేసిన వెంకటరావును విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేయడం విశేషం.
* పరారీలో ప్రధాన నిందితులు
english title:
b
Date:
Tuesday, January 14, 2014