హైదరాబాద్, జనవరి 15 : రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలంలోని బడంగ్‌పేట గ్రామంలోని స్వయంభూ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా-రంగనాథస్వామి కల్యాణం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది.
ధనుర్మాసం చివరిరోజైన మంగళవారం ఉదయం కళ్యాణ మండపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయం వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల వేంకటాచార్యులు, ప్రధాన పూజారులు జగన్‌మోహనాచార్యులు, మదన్‌మోహనాచార్యులు, వేదపండితులైన పవన్‌కుమార్ ఆచార్య నేతృత్వంలో కళ్యాణోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముడుంబై రాఘవాచార్యులు, ముడుంబై శ్రీరంగాచార్య, విశ్వనాథశర్మతో పాటు పరిచారకులుగా మరింగంటి లక్ష్మణాచార్యులు, సప్తగిరి, నర్సింహాచార్యులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా శ్రీవైష్ణవ సేవా సంఘం రాష్ట్ర నాయకులు లక్ష్మీనాథాచార్యులు, ఈ సంఘం బడంగ్‌పేట విభాగం ప్రధాన కార్యదర్శి తిరుమలాచార్యులు పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కళ్యాణోత్సవ కార్యక్రమం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కొనసాగింది.
ధనుర్మాసం సందర్భంగా గత నెల రోజుల నుండి ప్రతిరోజూ తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా తిరుప్పావై పారాయణం, ప్రవచనాలు జరిగాయి.కళ్యాణోత్సవం సందర్భంగా గోదాదేవి వేషధారణ ధరించిన కుమారి నిత్యశ్రీ, కుమారి హర్షిత, చిన్ని కృష్ణుడి వేషధారణ చేసిన చిన్నారి ఆశ్రీత వత్సల అందరినీ ఆకర్షించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
* బడంగ్‌పేట వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాసం ముగింపు
english title:
y
Date:
Thursday, January 16, 2014