రవీంద్రభారతి, జనవరి 15: వంశీ తేజస్విని ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్‌టిఆర్ ఆడిటోరియంలో శ్రీశ్రీశ్రీ వజ్రాల సుంకులమ్మదేవి గానలహరి ఆడియోను ఆవిష్కరించారు. డాక్టర్ కె.నాగలక్ష్మీ రాసిన పాటలను ములగలేటి గోపాలకృష్ణ సంగీత దర్శకత్వంలో ఆడియో క్యాసెట్‌గా రూపొందించారు. ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్రతికినంతకాలం చస్తూ బ్రతకడం కంటే మన మంచి శాశ్వతంగా బ్రతికేవుంది అన్నారు. తాను ‘ప్రాణం ఖరీదు’ సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసానని చెప్పారు. రిటైర్డ్ ఇపిఎస్ ఆఫీసర్ కె.నరసింహ మాట్లాడుతూ పల్లెలు బాగు చెయ్యాలని వైద్యులకు గ్రామాలలో పోస్టింగ్ ఇస్తే రికమండేషన్‌లతో నగరాలకు వచ్చేస్తున్న ఈ తరుణంలో డా.కె.నాగలక్ష్మీ పల్లె ప్రజలు సేవలు అందిస్తూ వృత్తి ధర్మాన్ని గౌరవిస్తోంది అని అన్నారు. కె.వి.రమణాచారి మాట్లాడుతూ మనసులో అనుకున్న దానిని అక్షర రూపంలో పెట్టిన నాగలక్ష్మీని అభినందించారు. సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ, బిహెచ్‌ఇఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవిచందర్, సాంఘిక సంక్షేమశాఖ సలహా మండలి చైర్మన్ రాగం సుజాతా నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు.
నీటి కుంటలో పడి మహిళ మృతి
మేడ్చల్, జనవరి 15: ప్రమాదవశాత్తు ఒక మహిళ నీటి కుంటలో పడి మృతిచెందిన సంఘటన పిఎస్ పరిధిలో జరిగింది. వివరాలు- మండలంలోని యాడారంకు చెందిన ఎస్.శివలక్ష్మి (42) పశువులు మేపడానికి వెళ్లింది. మంగళవారం సమీపంలోని నీటికుంటవద్ద కాళ్లు చేతులు కడుక్కోడానికి వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జంధ్యాల జన్మదినం హాస్యానికి పట్ట్భాషేకం
రవీంద్రభారతి, జనవరి 15: భాషా సాంస్కృతిక శాఖ, జంధ్యాల చిత్ర మిత్రమండలి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సంక్రాంతి సంబరాల జంధ్యాల హాస్యోత్సవం జరిగింది. రవీంద్రభారతిలో సాయంత్రం 3 గంటలకు పల్లెవాతావరణం కనిపించింది. ఆరుబయట రంగు రంగుల రంగవల్లులు గంగిరెద్దుల గంతులు, సన్నాయి మేళాలు చాలా కాలం తరువాత ఈ పల్లె వాతావరణంలో ప్రేక్షకులు చుట్టూ చేరి తిలకించారు. అనంతరం ఆడిటోరియంలో సినీ దర్శకులు కె.విశ్వనాధ్ జ్యోతిని వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. జంధ్యాలతో తనకు శంకరాభరణం సినిమాతో అనుబంధం ఏర్పడిందని ఆయన అన్నారు. హాస్యసన్నివేశాల సంబరాలు హాస్యానికే పట్ట్భాషేకం. ఈ విధమైన ఉత్సవాలు ఒక్క జంధ్యాలకే జరుగుతున్నాయి అని ఆయన అన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఆవిర్భవించాక మొదటి ఉత్సవం ఈ హాస్యానికి పట్ట్భాషేకం, తెలుగు భాష, హాస్యం రెండిటిని కలబోసిన జంధ్యాల చిరస్మరణీయాలు అని సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముక్తేశ్వరరావు అన్నారు. ప్రారంభోత్సవ సభ అనంతరం జరిగిన ప్రతి సన్నవేశం హాస్యంతో ప్రేక్షకులపై నవ్వుల జల్లు కురిపించాయి. హాస్యావధాని శంకరానారాయణ హాస్యపు చలోక్తులు, కామెడీ క్విజ్, మిమిశ్రీ శ్రీనివాస్ ధ్వని అనుకరణతోపాటు బుర్రామోహన్ మిమిక్రీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘‘అమెరికా అల్లుడు’’ నాటికలో మల్లాది భాస్కర్ హాస్యాన్ని పంచారు. జొన్నవితుల కర్జూరపు చెట్టుపై సాహిత్యాన్ని వినిపించారు. మిమిక్రీ కళాకారుడు చిట్టూరు గోపీచంద్ పర్యవేక్షణలో ‘వెనె్నల’ నవ్వుల సీమ టపాకాయలు పేలాయి. సినీ టీవీ కళాకారుల హాస్యవల్లరి, గురుస్వామి స్వరగతులు కలిసి 5 గంటలపాటు నాన్‌స్టాప్ నవ్వు మేళ ఈ జంధ్యాల జయంతి వేళ అని ప్రేక్షకులు అభినందించారు. అనంతరం జరిగిన సభ కార్యక్రమానికి ప్రారంభం ఇటీవల మరణించిన నటీనటులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు వౌనం పాటించారు. ముగింపు కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ రచయితల సంఘానికి చాలా కాలం అధ్యక్షులుగా ఉన్న జంధ్యాల బతికి ఉంటే వెయ్యి చిత్రాలు పూర్తిచేసి ఉండేవారు అని అన్నారు. జంధ్యాల మనస్తత్వాన్ని కలబోసిన రచయిత, దర్శకుడు, హాస్యానికి వారసుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను అభినందించారు. కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ జంధ్యాల అక్షరాలు తిని లక్షలు సంపాదించుకున్నాము. హాస్య గళానికి కులపతి జంధ్యాల అని తనికెళ్ల భరణి అన్నారు. నడిచే హాస్యానికి పాఠశాల జంధ్యాల అని రాళ్ళబండి కవితాప్రసాద్ అన్నారు. నటుడు నరేష్ మాట్లాడుతూ సభ అంటే మనుషులతో నిండినది కాదు, మనసులతో నిండినది, సంక్రాంతి పండుగవేళ ఆరు గంటలపాటు ఆడిటోరియం నిండుగా ఉంది అంటే జంధ్యాల ప్రేక్షకుల మనస్సులో ఉన్నారనేది సత్యం అని అన్నారు. ఆయన అద్భుతమైన హాస్యాన్ని సృష్టించారు. జంధ్యాల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించడానికి మూడు అడుగుల స్థలాన్ని కేటాయించమని భాషా సాంస్కృతిక శాఖను నరేష్ కోరారు. విగ్రహ ప్రతిష్టకు అవసరమైన ఖర్చుకు లక్ష రూపాయల విరాళాన్ని నరేష్ ప్రకటించారు. ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడ జంధ్యాల కనిపిస్తాడు అని దర్శకులు రేలంగి నరసింహారావు అన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను శాలువా కప్పి సన్మానించి జంధ్యాల పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ హాస్య కళాకారుల ఇంటిపండుగలో హాస్యపు సన్నివేశాల విందు భోజనంతో కడుపునిండిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ జంధ్యాలతో తన అనుభవాలను ఆయన ఆశీర్వచనాలు అక్షింతలు అని అన్నారు. జంధ్యాల, అన్నపూర్ణలు దైవ సమానులు, నాకు తల్లిదండ్రులు, వారి గురించి మాట్లాడటానికి మాటలు లేవు. మనసంతా నిండిపోయిన వారికి పాదాభివందనం అని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రవీంధ్రభారతిని కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేయండి. వ్యాపార సరళివైపు మరల్చకండి అని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నటులు ఎల్.బి.శ్రీరామ్, కాదంబరి కిరణ్‌కుమార్, అశోక్‌కుమార్, దైవజ్ఞశర్మ పాల్గొన్నారు.
అలరించిన అన్నమయ్య పాష్య గీతిక
ముషీరాబాద్, జనవరి 15: అన్నమయ్య సంకీర్తనలు ఆపాత మధురాలతోపాటు ఆలోచనామృతాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. రెండు దశాబ్ధాలుగా కృషిచేస్తున్న తాళ్లపాక పదసాహిత్య విశే్లషకుడు వెంకట్ గరికపాటి సేవలు అభినందనీయమని తెలిపారు. వెంకట్ ఆర్ట్స్ అకాడమీ, త్యాగరాయ గానసభల సంయుక్త ఆధ్వర్యంలో మకర సంక్రాంతిని పురస్కరించుకుని ‘అన్నమయ్య పాష్యగీతిక’ (అన్నమయ్య జానపద సంకీర్తనల వ్యాఖ్యాన సహిత గాత్ర గోష్ఠి) మంగళవారం రాత్రి కళాసుబ్బారావు కళావేదికలో జరిగింది. గానసభ అధ్యక్షుడు డా. కళా వేంకట దీక్షితులు అధ్యక్షత వహించగా, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి.నారాయణరెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డా. ఎల్లూరి శివారెడ్డి, ప్రముఖ సాహితీవేత్త- డా. కె.బి.లక్ష్మి, వెంకట్ ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి జి.వి.ఉమావర్ధనిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భాష ప్రయోజనాన్ని గుర్తించి సామాన్యుల భాషకు మాన్యత కల్పించిన అసామాన్య వాగ్గేయకారుడు అన్నమయ్య అని పేర్కొన్నారు. అన్నమయ్య తెలుగులోనే కాకుండా దాక్షిణాత్య భాషల్లోనే ప్రప్రథమ వాగ్గేయకారుడని పేర్కొన్నారు. సాహితీవేత్త డా. కె.బి.లక్ష్మి మాట్లాడుతూ, అన్నమయ్య పాటలు నేడు జనబాహుళ్యానికి సంగీత, సాహిత్య మధురిమలు పంచుతున్నాయన్నారు. తొలుత కొత్తపల్లి రమ్యభావన నేతృత్వంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనకు కోలంక సాయికుమార్, టిపి. బాలసుబ్రమణియన్ వాయిద్య సహకారం అందించారు.
గీతాంజలికి శోభన్‌బాబు జీవిత సాఫల్య పురస్కారం
ముషీరాబాద్, జనవరి 15: అలనాటి అందాల నటుడు, నటభూషణ శోభన్‌బాబు 78వ జయంతి వేడుకలు మంగళవారం సాయంత్రం శ్రీ త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘వంశీ -గరుడవేగ’ 2013 అవార్డులను ప్రదానం చేయడంతోపాటు శోభన్‌బాబు జీవిత సాఫల్య పురస్కారాన్ని అలనాటి స్వర్ణయుగ సినీనటి గీతాంజలికి ప్రదానం చేసి సత్కరించారు. వంశీ సంస్థల వ్యవస్థాపకులు ‘శిరోమణి’ వంశీ రామరాజు సభాధ్యక్షత వహించగా, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి.నారాయణరెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం జ్యోతిష్య శాఖాధిపతి ఆచార్య సి.వి.బి.సుబ్రహ్మణ్యం, అట్లాంటా, అమెరికా ఎండి- గరుడవేగ- శేషు పురాణం, సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, నటుడు తనికెళ్ల భరణి, నిర్మాతలు నరసింహారావు, డా. సత్యమూర్తి కోటంరాజు హాజరయ్యారు.