హైదరాబాద్, జనవరి 16: రాష్ట్ర విభజన బిల్లు చర్చలో తమ పార్టీ పాల్గొనదని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు సూత్రప్రాయంగా విభజనకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని శాసనసభలో తెలియచేస్తారన్నారు. గురువారం లోటస్‌పాండ్‌లోని వైఎస్‌ఆర్‌సిపి కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం భూమన విలేఖర్లతో మాట్లాడుతూ విభజన అంశంపై శుక్రవారం జరిగే చర్చలో ఓటింగ్ కోసం పట్టుబడుతామన్నారు. విభజన ప్రక్రియను వైఎస్‌ఆర్‌సిపి పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టి ఒక రోజు అసెంబ్లీ నుంచి సస్పెండయ్యారు. మరొక రోజు నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్, టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. అసెంబ్లీకి వచ్చిన బిల్లును సజావుగా మళ్లీ వెనక్కు పంపేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. తిరుమలలో భక్తులపై దేవస్ధానం కేసులు నమోదు చేయడాన్ని తమ పార్టీ ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా మెడ నొప్పి వల్ల జగన్ 17వ తేదీన తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర ఒక రోజు వాయిదా పడింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ యాత్ర ఉంటుందని ఆ పార్టీ ప్రకటనలో తెలిపింది.
కాంగ్రెస్‌లోనే ఉంటా: మంత్రి రఘువీరా
రాష్ట్ర విభజన జరిగినా, జరగకపోయినా, తాను మాత్రం కాంగ్రెస్‌లలో కొనసాగుతానని మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు. సిఎల్‌పి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఎటువంటి పరిస్ధితుల్లో వదిలే ప్రసక్తిలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వచ్చే ఆరు రోజులు చక్కగా చర్చిస్తే రాష్టప్రతిని గడువు అడగాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు చివరి నిమిషం వరకు పోరాడుతామన్నారు.
గడువు ఇవ్వొద్దని రాష్టప్రతికి లేఖ: గండ్ర
విభజన బిల్లుపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాల గడువును పొడిగించవద్దని కోరుతూ తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడిన ఒక లేఖను రాష్టప్రతి పంపనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. అసెంబ్లీకి రాష్టప్రతి ఇచ్చిన ఆరు వారాల గడువును సరిపోతుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్, ప్రతపక్షనేత చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్ విభజన జరగకుండా అడ్డుకునే యత్నాలు సాగవని, ఫిబ్రవరిలో రాష్ట్ర విభజన తథ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలు సహకరించాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ హైకమాండ్‌పై తీవ్ర అసంతృప్తి: గాదె, జెసి
తమను ఎఐసిసి సమావేశాలకు ఆహ్వానించకపోవడం పట్ల సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గాదె వెంకటరెడ్డి, జెసి దివాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేసినందుకు ఈ విధంగా తమ పట్ల ప్రవర్తించడం బాధాకరమన్నారు. తమకు ఆహ్వానం వస్తుందని ఆశించామన్నారు. కొత్త పార్టీని ముఖ్యమంత్రి కిరణ్ ఏర్పాటు చేస్తారని భావించడం లేదన్నారు. రాష్టప్రతి బిల్లుపై చర్చించేందుకు అసెంబ్లీకి గడువును పొడిగించే అవకాశం ఉందన్నారు. సీమాంధ్రనేతల పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వేషపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. తమ పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శించడం తగదన్నారు.
వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే భూమన
english title:
bhoomana
Date:
Friday, January 17, 2014