
విశాఖపట్నం, జనవరి 16: ఆర్కే బీచ్‌కు ముప్పు పరిణమించింది. బీచ్ నిత్యం కోతకు గురవుతోంది. బీచ్‌లో ఉన్న కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియంకు చెందిన గోడ కోతతో కూలిపోయింది. బీచ్ వెంబడి రోడ్డుకు ఆనుకుని నిర్మించిన గోడకు ఇప్పుడు కెరటాలు తాకుతున్నాయి. ఇంతటి కోత ఈమధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. ఇటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న అంశంపై ఆంధ్రా యూనివర్శిటీ జియో ఇంజనీరింగ్ ఎమిటరస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురువారం ‘ఆంధ్రభూమి’కి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. పోర్టు నిర్మాణ సమయంలో ఔటర్ హార్బర్ నిర్మాణం కోసం సిమెంట్ రాళ్ళను సముద్ర కెరటాలకు అడ్డంగా వేసినప్పటి నుంచిబీచ్ కుచించుకుపోతూ వస్తోంది. కెరటాల దిశలో మార్పు వచ్చింది. ఇసుక మేటల్లో కూడా మార్పులు సంభవించాయి. బీచ్ అంచెలంచెలుగా కోతకు గురవుతూ వస్తోంది. ఈ పరిస్థితిని గమనించిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అప్పుడప్పుడు కొంత ఇసుకను గొట్టాల ద్వారా తీసుకువచ్చి తీరంలో వేస్తోంది. దీన్ని చూసిన కొంతమంది కొత్త బీచ్ ఏర్పడిందని సంబరపడుతున్నారని, కాని ఇది ఎంతో కాలం ఉండదని నాగేశ్వరరావు తెలిపారు. అధికారులు పదేపదే కృత్రిమంగా ఇసుకను తీసుకువచ్చి ఒడ్డున వేస్తున్నారే కానీ, శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించడం లేదు. ఇటువంటి చర్యల వల్ల కెరటాల దిశ మార్చుకుని వేరేచోట తీరాన్ని కోసేస్తున్నాయి. ఇటీవల మ్యూజియం వద్ద గోడ కూలిపోయింది. కొన్నాళ్ళకు కురుసుర మ్యూజియమే కాదు, బీచ్ రోడ్డు కూడా కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. 1990లో బీచ్ రోడ్డు కొతకు గురైన విషయాన్ని నాగేశ్వరరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కెరటాలు బలమైన శక్తితో ముందుకు వస్తాయి. భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఆ కెరటాలు మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతాయి. అంతటి శక్తితో ముందుకు వస్తున్న కెరటాలను గోడలు కట్టి అడ్డుకోవడం వలనే అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆర్‌కే బీచ్ రెండు కొండల మధ్య ఏర్పడింది. దీనిని హెడ్‌ల్యాండ్ అంటారు. దీని మధ్య ఉన్న సముద్రానే్న ‘బే’ అని పిలుస్తారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు వచ్చినప్పుడు సముద్రంలోని కెరటాల తీవ్రత, దిశ మారుతాయి. నైరుతి రుతుపవనాల సమయంలో కెరటాలు నేరుగా తీరానికి రాకుండా, ఒక పక్కకు వాలి వస్తాయి. దీనికి సమాంతరంగా తీరంలో ఇసుక మేట వేస్తుంది. దక్షిణ దిశగా కెరటాలు వస్తే, ఉత్తర దిశలో ఇసుక మేట వేస్తుంది. తిరిగి ఇదే ఇసుక కొంత కాలానికి సముద్రంలో కలిసిపోతుందని నాగేశ్వరరావు చెప్పారు. ఈశాన్య రుతుపవనాలు వచ్చినప్పుడు ఈ దిశలు అటు..ఇటుగా మారుతాయి. కేరళలలో సముద్ర తీరంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు పెద్ద పెద్ద గోడలు నిర్మించారు. నైరుతి రుతుపవనాల సమయంలో కెరటాలు ఈ గోడలను పెద్దఎత్తున తాకుతాయని, అప్పుడు వీటి నిర్వహణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని నాగేశ్వరరావు వివరించారు. జపాన్‌లోని కైకె బీచ్ కూడా కోతకు గురవుతుంటే, బీచ్‌కు సమాంతరంగా సుమారు 300 మీటర్ల దూరంలో సిమెంట్ రాళ్ళతో గోడ నిర్మించారు. అయితే, ఈ గోడ బీచ్ అందానికి విఘాతం కల్పిస్తోందని తెలుసుకున్న అక్కడి నిపుణులు సముద్ర గర్భం నుంచి గోడ నిర్మించారు. ఎంత పెద్ద కెరటాలైనా ఇక్కడికి వచ్చిన తరువాత తీవ్రత తగ్గించుకుంటాయి. (చిత్రం) కోతకు గురవుతున్న విశాఖ ఆర్‌కె బీచ్*జపాన్‌లోని కైకే బీచ్‌లో కెరటాల ఉద్ధృతిని తట్టుకునే నిర్మాణాలు