హైదరాబాద్, జనవరి 16: అసెంబ్లీలో విభజన ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు గడువు పొడిగించవద్దని టిఆర్‌ఎస్ కోరుతోంది. ఈ మేరకు పార్టీ ఎంపి వివేక్‌తో పాటు ఇతర నాయకులు రాష్టప్రతికి లేఖ రాశారు. పొడిగింపు పేరుతో సీమాంధ్ర నాయకులు రాజకీయం చేస్తున్నారని, దీనికి అవకాశం ఇవ్వవద్దని టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం ఉప నాయకుడు హరీశ్‌రావు కోరారు. రాష్టప్రతి జనవరి 23 వరకు మాత్రమే గడువు ఇచ్చారని, మరింతగా గడువు కోరుతూ బిల్లు ఢిల్లీకి వెళ్లి పార్లమెంటులో ఆమోదం పొందకుండా చేయాలనేది సీమాంధ్ర నాయకుల వ్యూహం అని టిఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. అసెంబ్లీలో చర్చ ప్రారంభం కావడానికన్నా ముందే గడువు పొడిగింపు కోసం అడుగుతామని సీమాంధ్ర నాయకులు చెప్పారని, ఇదే విషయాన్ని రాష్టప్రతి దృష్టికి తీసుకు వచ్చినట్టు టిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. బిల్లును అసెంబ్లీలో ఓడిస్తామని ముఖ్యమంత్రి, సీమాంధ్ర నాయకులు పదే పదే చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఓటింగ్ లేని బిల్లును ఓడించడం ఏమిటని ఎమ్మెల్యే హరీశ్‌రావు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రవణ్ ప్రశ్నించారు. రాష్టప్రతి పంపిన బిల్లును అసెంబ్లీలో ఓడించడం అంటూ ఉండదని, ఓడించినా, గెలిపించినా చేయాల్సింది పార్లమెంటే అని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. ఓటింగ్‌పై రూలింగ్ ఇవ్వాలని మొదటి రోజు నుంచి వైకాపా సభ్యులు పట్టుపడుతుండగా, స్పీకర్ మాత్రం చర్చ కన్నా ముందే ఓటింగ్‌పై నిర్ణయం ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఓటింగ్ ఉంటుందో ఉండదో స్పీకర్ ఎక్కడా స్పష్టం చేయలేదు. స్పీకర్ అభిప్రాయాన్ని సీమాంధ్ర, తెలంగాణ నాయకులు ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. స్పీకర్ మాటలను బట్టి చర్చ తరువాత ఓటింగ్ ఉంటుందని అర్ధం చేసుకోవచ్చునని సీమాంధ్ర నాయకులు చెబుతుండగా, ఓటింగ్ ఉంటే ఆ విషయం స్పీకర్ స్పష్టం చేసేవారని తెలంగాణ నాయకులు వాదిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ఏర్పాటు సమయంలో ఎక్కడా బిల్లుపై ఓటింగ్ జరగలేదని, ఓటింగ్ ఉండదని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు.
23 తరువాత మరో పది రోజుల పాటు పొడిగింపు ఉండే అవకాశం ఉందని ఢిల్లీ నుంచి వార్తలు రాగా, టిఆర్‌ఎస్ నాయకులు మాత్రం పొడిగింపు ఉండదని అంటున్నారు. 23 తరువాత ఎలాంటి పొడిగింపు ఉండదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ఇది అత్యంత కీలక సమయం అని అప్రమత్తంగా ఉండాలని టిజెఎసి నాయకులు తెలంగాణ నాయకులకు సూచించారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ ఎమ్మెల్యేలు బిల్లు సమయంలో సభలో కలిసి కట్టుగా ఉండాలని టిజెఎసి కోరింది.
టిఆర్‌ఎస్ పాదయాత్ర
సంపూర్ణ తెలంగాణ కోసం టిఆర్‌ఎస్ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. టిఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో సంపూర్ణ తెలంగాణ కోసం నాలుగు రోజుల పాటు సాగే పాదయాత్రను కె కేశవరావు శుక్రవారం ఉదయం పదిన్నరకు శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో ప్రారంభిస్తారు.
విభజన ముసాయిదా బిల్లుపై ఓటింగ్ ఉండదు: టిఆర్‌ఎస్
english title:
trs
Date:
Friday, January 17, 2014