నిజామాబాద్, జనవరి 16: పాత కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను అరెస్టు చేసేందుకు వచ్చిన సిఐడి అధికారులు అవాక్కయ్యారు. చేతికి చిక్కినట్టే చిక్కి చివరి నిమిషంలో ఎంతో చాకచక్యంగా వారిని బోల్తాకొట్టించి సదరు సిఐ పరారవడంతో సిఐడి అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. చేసేదేమీ లేక స్థానిక పోలీస్ స్టేషన్‌లో సిఐపై గురువారం ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని పోచంపాడ్‌లో ఆర్మూర్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో సిఐ శ్రీనివాస్‌రెడ్డి మెదక్ జిల్లా తూఫ్రాన్‌లో పని చేస్తుండగా ఓ కేసు ఉంది. సగం ధరకే బంగారం అందిస్తానంటూ వివిధ స్కీంల స్కాంతో శ్రీనివాస్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆ సమయంలోనే సస్పెండ్ చేశారు. రెండేళ్ల అనంతరం తిరిగి విధుల్లోకి చేరిన శ్రీనివాస్‌రెడ్డి మొదటగా హైదరాబాద్‌లో అప్రాధాన్యత పోస్టులో కొనసాగారు. ఆరు మాసాల క్రితమే ఆయనను ఆర్మూర్ రూరల్ సిఐగా పోస్టింగ్ కల్పించారు. సిఐడి అధికారులు ఈ విషయాన్ని కోర్టుకు నివేదించగా, సిఐ శ్రీనివాస్‌రెడ్డిపై విచారణకు హాజరుకావాల్సిందిగా పలుమార్లు వారెంట్లు జారీ అయ్యాయని తెలిసింది. అయినప్పటికీ సిఐ శ్రీనివాస్‌రెడ్డి హాజరుకాకపోవడంతో కోర్టు అనుమతి మేరకు అరెస్టు వారెంటుతో సిఐడి ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో బుధవారం నాడే పోచంపాడ్‌కు చేరుకున్నారు. ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీనివాస్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలుసుకుని తాము అరెస్టు చేసేందుకు వచ్చామని వారెంట్‌ను చూపి తమ అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుండి దుస్తులు తెచ్చుకుంటానని సిఐ శ్రీనివాస్‌రెడ్డి కోరగా అందుకు అనుమతించారు. ఇదే అదనుగా శ్రీనివాస్‌రెడ్డి పరారయ్యారు. చాలాసేపటి వరకు శ్రీనివాస్‌రెడ్డి తిరిగి రాకపోవడంతో అవాక్కయ్యారు.
పాసు వచ్చినా వెళ్లకూడదని ముందే నిర్ణయం: ఉండవల్లి
రాజమండ్రి, జనవరి 16: అఖిలభారత కాంగ్రెస్ సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనేందుకు తనకు పాసు వచ్చినాగానీ వెళ్లకూడదని ముందుగానే నిర్ణయించుకున్నానని రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. యుపిఏ ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చిన ఆరుగురు కాంగ్రెస్ ఎంపిలకు ఎఐసిసి సమావేశాల్లో పాల్గొనేందుకు పాసులు ఇవ్వకూడదని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్టు వార్తలు వెలువడిన సంగతి విదితమే. ఈ అంశంపై ఎంపి మాట్లాడుతూ ఎఐసిసి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనాలని, పాసులు తీసుకోవాలని కోరుతూ తన సెల్‌కు ఎస్‌ఎంఎస్ వచ్చిందని అన్నారు. కాగా గత అక్టోబరు 3నే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేసానని, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తరువాత మళ్లీ ఆ పార్టీ సమావేశాలకు హాజరుకాలేమన్నారు. ఈ ఉద్దేశ్యంతోనే తనకు పాసు వచ్చినాగానీ ఎఐసిసి సర్వ సభ్యసమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఎంపి ఉండవల్లి చెప్పారు. కోస్తా జిల్లాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ మ్యాప్ వేసిన ఫ్లెక్సీలు ఎవరు వేసారో తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఉండవల్లి చెప్పారు.
ట్రావెల్స్‌పై ఆగని ఆర్‌టిఏ దాడులు
విజయవాడ, జనవరి 16: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు మూడింటిని అధికారులు సీజ్ చేశారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో సీజ్ చేసిన బస్సుల సంఖ్య 200కు చేరింది. గత రెండు నెలలుగా నిబంధలను విరుద్ధంగా తిరుగుతున్న బస్సులపై అధికారులు దాడులు చేస్తున్నా ఆపరేటర్లు మాత్రం రూట్లు మార్చి వాటిని నడుపుతూనే ఉన్నారు. అధికారులు పట్టుకుంటూనే ఉన్నారు. గతంలో పండగ సీజన్‌లో ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇష్టానుసారం రేట్లు పెంచి బస్సులు నడుపుతుండేవారు. అయితే ‘గీత’ దాటిని ఏ బస్సును అధికారులు వదిలిపెట్టకపోవడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టే అవుతోంది. కృష్ణాజిల్లాలో రవాణాశాఖ ఉప కమిషనర్ సిహెచ్ శివలింగయ్య, ఆర్‌టివో హరిప్రసాద్‌ల నేతృత్వంలో సిబ్బంది గురువారంనాడు దాడులు నిర్వహించి మూడు ప్రైవేట్ బస్సులను సీజ్ చేసారు. విజయవాడ నుంచి బెంగుళూరు వెళుతున్న కోమిట్ల ట్రావెల్స్ బస్సును కనకదుర్గ వారధి వద్ద సీజ్ చేసారు. హైదరాబాద్ వెళుతున్న కావేరి ట్రావెల్స్, బత్తిన ట్రావెల్స్ బస్సులను ఇబ్రహీంపట్నం వద్ద సీజ్ చేసారు. గడచిన 70 రోజుల్లో ఒక్క కృష్ణాజిల్లాలోనే మొత్తం 200 ప్రైవేట్ బస్సులను సీజ్ చేయటం జరిగింది.