ఖమ్మం, జనవరి 17: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం ఏర్పడింది. పార్టీ ఏర్పడిన నాటి నుంచి నాయకుల మధ్య ఉన్న విభేదాలు, అధినాయకత్వంతో వైరుధ్యాలు పార్టీ నేతలను ఇతర పార్టీల వైపు వెళ్ళేలా చేస్తున్నాయి. సుదీర్ఘకాలం ఓ వ్యక్తి జిల్లా కన్వీనర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. గతంలో అజయ్‌కుమార్ గాని, నేడు మచ్చా శ్రీనివాసరావు గాని జిల్లా కన్వీనర్ పదవిని వదులుకునేందుకు నాయకుల వ్యవహారశైలే కారణమని తెలుస్తోంది. వీరంతా వ్యక్తిగత ఆరోగ్య కారణాల రీత్యా పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ విభేదాలే కారణమనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం మచ్చా శ్రీనివాసరావు జిల్లా కన్వీనర్ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఏ పార్టీలోనూ చేరలేదు. అయితే ఆయన త్వరలో తెలంగాణ రాష్టస్రమితిలో చేరి ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పదవిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మచ్చా శ్రీనివాసరావు స్థానంలో గతంలో బూర్గంపాడు ఎమ్మెల్యేగా పని చేసి తర్వాత సిపిఐ నుంచి వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన పాయం వెంకటేశ్వర్లును కన్వీనర్‌గా నియమించారు. జిల్లాలో అంతా తానై వైఎస్‌ఆర్‌సిపిని నడిపిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లోనే ఈ నియామకాలు జరిగినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. వైఎస్‌ఆర్‌సిపి ఆవిర్భవించిన నాటి నుంచి జిల్లాలో బలం పుంజుకునేందుకు ప్రయత్నిస్తుండటం, మధ్యలోనే నాయకులు రాజీనామాలుచేయటం జరుగుతోంది. ఎన్నికల ముందు పార్టీ బలంగా ఉందని చెప్పుకుంటున్న సమయంలో ఏకంగా జిల్లా కన్వీనర్‌గా ఉన్న వ్యక్తే పార్టీని వదులుకోవటం నేతల్లో నిరుత్సాహాన్ని నింపుతోంది. నాయకత్వ లేమి కారణంగానే పార్టీ ప్రజల్లోకి వెళ్ళటం లేదని, అధినాయకత్వం దానిపై దృష్టి సారించాలని ఆ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలు కోరుతున్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం ఏర్పడింది
english title:
ysrcp
Date:
Saturday, January 18, 2014