
ఏభై రెండేళ్ల ఏపిల్‌బీ తను నడిపే ఏంటిక్ షాప్‌కి వచ్చిన ఓ నలభై ఐదేళ్ల లేడీ కస్టమర్‌కి ఓ పురాతన గంటని చూపిస్తూ చెప్పాడు.
‘‘ఈ స్కాటిష్ బెల్ పదహారో శతాబ్దానికి చెందింది. బహుమతిగా ఇవ్వడానికి బాగుంటుంది.’’
‘‘ఇది చాలా సాధారణ వస్తువు. ఈ జ్యువెలరీ బాక్స్ ఎంత?’’ ఆమె అడిగింది.
‘‘ఇది కూడా అమ్మకానికి లేదు.’’
‘‘మీ షాప్‌లోని చాలా వస్తువులని ఎందుకు అమ్మడంలేదు?’’ ఆమె అడిగింది.
పక్కనే వున్న ఓ బొమ్మని ఆమె అందుకుంటుంటే ఏపిల్‌బీ కంగారుగా చెప్పాడు.
‘‘ఇక్కడి చాలా వస్తువులు పగిలిపోయేవే. జాగ్రత్త!’’
తన దుకాణంలోకి వచ్చిన ఓ ముప్ఫై ఐదేళ్ల వ్యక్తిని చూసి అతని దగ్గరికి వెళ్లి అడిగాడు.
‘‘గుడ్ ఆఫ్టర్‌నూన్. మీకేం కావాలి?’’
‘‘ఇది ఎక్కడినుంచి వచ్చింది?’’ పక్కనేవున్న ఓ పురాతన వస్తువుని తీసి చూపిస్తూ అతను అడిగాడు.
వెంటనే దాన్ని అందుకుని జాగ్రత్తగా యధాస్థానంలో ఉంచుతూ ఏపిల్‌బీ చెప్పాడు.
‘‘జాగ్రత్త. ఇది చాలా విలువైన వస్తువు.’’
‘‘నాకు తెలుసు. అది పధ్నాలుగో శతాబ్దపు వస్తువు. సహారా ఎడారినుంచా?’’
‘‘అవును. మీకెలా తెలుసు?’’
‘‘అంకారా నగరం మీదుగా అది మీ షాప్‌కి వచ్చింది. నేను అక్కడినుంచే వస్తున్నాను.’’
‘‘ఓ! మీరు డీజార్ కంపెనీనుంచా?’’ ఏపిల్‌బీ వెంటనే అడిగాడు.
‘‘అవును. డీజార్ అండ్ సన్స్. నేనే ఆ సన్‌ని.’’
‘‘ఇది ఆనందకరం. మీ నాన్నగారు నాకు చాలా విలువైన వస్తువులని సరఫరా చేస్తుంటారు. మంచి టేస్ట్ కల మనిషి. ఆయన్ని ఓసారి కలవాలి.’’
‘‘ఆయన బదులుగా నేను వచ్చాను.’’
‘‘పదండి. నా ఆఫీస్ గదిలోకి వెళ్దాం.’’
ఇద్దరూ గదిలోకి వెళ్లాక ఏపిల్‌బీ చెప్పాడు.
‘‘నేను టర్కీకి ఎన్నడూ రాలేదు. నిజానికి ఏ దేశానికి పోకపోయినా, ఈ ఏంటిక్ వస్తువులని చూస్తుంటే, అవన్నీ చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది.’’
‘‘మీరు రెండు వారాల్లో డీజార్ అండ్ సన్స్‌కి పనె్నండువేల డాలర్లు చెల్లించాలి. అందుకే నేను వచ్చాను.’’
‘‘నా దగ్గరఅంత మొత్తం లేదు.’’
‘‘అందుకే రెండువారాల టైమ్ ఇచ్చాం. మీ షాప్‌లోని దాదాపు పది వస్తువులు ఇప్పటికే అమ్మేస్తాం అని చెప్పి ఆమెకి అమ్మలేదు. అంటే మీ వ్యాపారం బానే వున్నట్టు కదా?’’ అతను అడిగాడు.
‘‘వాటిని నేను ఎవరికీ అమ్మలేదు. వాటి అమ్మబుద్ధి కాక అలా చెప్పాను.’’
షాపులోంచి ఏదో పగిలిన శబ్దం వినిపించి ఏపిల్‌బీ లేచి అక్కడికి వెళ్లాడు. ఓ పురాతన ఒంటె బొమ్మ నేలమీద పడి విరిగింది. దాన్ని చూసి బాధపడే ఏపిల్‌బీతో ఆమె చెప్పింది.
‘‘సారీ! ఎలా పడిందో నాకే అర్థం కావడంలేదు. మీకు నష్టం రాకుండా దాని ధర నేను చెల్లిస్తాను.’’
‘‘వెయ్యి డాలర్లు విలువచేసే ఆ బొమ్మని రిపేర్ చేయలేం. ఇలాంటిది ఇంకోటి రాదు.’’ అతను బాధగా చెప్పాడు.
‘‘నా దగ్గర అంత డబ్బులేదు. చెక్ రాసివ్వచ్చా?’’ ఆమె అడిగింది.
‘‘అలాగే. లారెన్స్ ఏపిల్‌బీ పేరున చెక్ రాసివ్వండి.’’ పెన్ అందించి చెప్పాడు.
‘‘ఆమె పేరు మార్తాస్ట్రర్‌జిస్ అని, న్యూయార్క్‌లోని ఆమె అడ్రస్ కూడా చెక్‌మీద ముద్రించి వుండడం ఏపిల్‌బీ గమనించాడు.
‘‘సారీ. మిస్టర్ ఏపిల్‌బీ’’ ఆమె చెక్‌ని అందిస్తూ చెప్పింది.
‘‘ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మిసెస్ స్ట్రర్‌జిస్’’ ఏపిల్‌బీ చెప్పాడు.
‘‘మిస్.’’ చెప్పి ఆమె వెళ్లిపోయింది.
ఆ చెక్‌ని అందుకుని డీజార్ కొడుకు చెప్పాడు.
‘‘మిగిలిన పదకొండు రెండు వారాల్లో చెల్లించాలి.’’
‘‘కానీ అది అసాధ్యం అని ఇందాకే చెప్పాను.’’
‘‘అలాంటప్పుడు మా వస్తువులని వెనక్కు తీసుకోవడం తప్ప మాకు వేరే గత్యంతరం లేదు.’’
‘‘నో. ఎలాగోలా ఆ డబ్బు సంపాదిస్తాను. బేంక్‌నుంచి లోన్ గాని..ఎలాగో...’’ ఏపిల్‌బీ కంగారుగా చెప్పాడు.
* * *
ఏపిల్‌బీ తనింటికి వచ్చేసరికి గ్రామఫోన్ రికార్డులోంచి పెద్దగా పాట వినిపిస్తోంది. అతని భార్య సోఫాలో కూర్చుని ఏదో పత్రిక చదువుతోంది. అతను దాన్ని ఆఫ్ చేయగానే ఆమె చెప్పింది.
‘‘నాకు సంగీతం తప్ప మరో కంపెనీ లేదు. అందుకే ఓ పిల్లిని కొనివ్వమన్నాను.’’
‘‘పిల్లి ఫర్నిచర్‌ని పీకి నాశనం చేస్తుంది.’’ నువ్వు ఇంట్లో ఏ పనీ చేయవు.’’
ఆమె తినే పళ్లు, గింజలని చెత్త డబ్బా వైపు తీసుకెళ్తూ సోఫామీది బట్టలని చూసి ఏపిల్‌బీ కోపంగా అరిచాడు.
‘‘ఇల్లు శుభ్రంగా పెట్టు.’’
‘‘నువ్వు ముసలాడిలా సాధిస్తుంటావు. నీ దుకాణంలో దుమ్ము కణమే ఉండదు. కానీ ఇది ఇల్లు. నీ దుకాణంలో ఎవరికీ ఏదీ అమ్మవు.’’
‘‘నీతో పోట్లాడడం నాకు ఇష్టం లేదు లీనా. నా షాప్ గురించి నువ్వు చెప్పింది నిజమే. నా వ్యాపారానికి అర్జెంటుగా పదకొండు వేల డాలర్లు అవసరమయ్యాయి. నీ ఎండోమెంట్ పాలసీని తనఖాపెట్టి ఆ డబ్బు తెస్తావా?’’
‘‘నా సంతకం వుంటే కాని అప్పు పుట్టదు. నేనా సంతకం చేయదలుచుకోలేదు. ఆ డబ్బుతో ఇంకొన్ని ఎన్నటికీ నువ్వు అమ్మని పాత వస్తువులని కొంటావు. అంతేగా.’’ ఆమె కోపంగా బెడ్‌రూంలోకి వెళ్లిపోయింది.
ఏపిల్‌బీ మేంటెల్ పీస్ పక్కనున్న బుక్‌షెల్ఫ్‌లో వెనక దాచిన ఓ చిన్న పుస్తకాన్ని బయటికి తీసి బెరుకుగా బెడ్‌రూం తలుపు వంక చూసి దాన్ని తెరిచాడు.
‘ఏక్సిడెంటా? లేదా హత్యా?’ అనే ఆ పుస్తకాన్ని చదివాక మేంటల్ పీస్ ముందు ఓ చిన్న మేట్‌ని పరిచాడు. తర్వాత దాన్ని పక్కకి తిప్పి జారేందుకు వీలుగా మడత పెట్టాడు. తర్వాత ఆ పుస్తకం తెరిచి చదివి కుర్చీని కార్పెట్‌కి కొద్దిగా దగ్గరగా లాగాడు. ఆ తర్వాత అతను కుర్చీలో కూర్చుని గట్టిగా చెప్పాడు.
‘‘లీనా! ఓ గ్లాస్ మంచినీళ్లిస్తావా?’’
మంచినీళ్ల గ్లాస్‌తో ఆమె దగ్గరికి వస్తుండగా ఒంగుని బూట్ లేసు కట్టుకుంటున్నట్టుగా నటించిన ఏపిల్‌బీ ఆమె ఆ మేట్‌మీదకి ఎక్కగానే రెండు చేతులతో దాన్ని తన వైపుకి బలంగా లాగాడు. పెద్దగా అరుస్తూ ఆమె నేలకూలింది. ఆమె తల మేంటల్ పీస్‌కి కొట్టుకుంది. అతను నెమ్మదిగా లేచి వెళ్లి ఆమె నాడిని చూసి చేతిని వదిలేసాడు. తర్వాత ఫోన్ దగ్గరికి వెళ్లి రిసీవర్ అందుకుని ఓ నంబర్ డయల్ చేసి చెప్పాడు.
‘‘ఇప్పుడే జరిగిన ఓ ప్రమాదాన్ని రిపోర్ట్ చేస్తున్నాను.’’
* * *
‘‘సారీ మిస్టర్ ఏపిల్‌బీ. ఈ డబ్బుని గట్టిగా అడిగి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తప్పలేదు.’’ అంకారానుంచి వచ్చిన సన్ చెప్పాడు.
‘‘వివిధ దేశాలు, వివిధ పద్ధతులలో వ్యాపారాన్ని చేస్తుంటాయి. మీరు ఎప్పట్లానే నాకు సరుకు సరఫరా చేస్తారని ఆశిస్తాను’’
‘‘తప్పకుండా. హైతీకి చెందిన కొన్ని పురాతనన వస్తువులు ఉన్నాయి. కానీ మీరు ఇక్కడ బేంక్‌కి వాటి ధరని చెల్లించి తీసుకోవాలి.’’
‘‘నా దగ్గర ఉన్నదంతా ఊడ్చి ఇచ్చాను.’’
‘‘ఓ వస్తువుని పగలగొట్టి వెయ్యి డాలర్లు ఇచ్చిన కస్టమర్ బాగా ధనవంతురాలై ఉండాలి.’’
అతను సూచించాడు.
‘‘మార్తా స్ట్రర్‌జిస్?’’
‘‘గుడ్‌డే.’’ చెప్పి అతను వెళ్లిపోయాడు.
ఏపిల్‌బీ గతంలో మార్తాకి అమ్మానని చెప్పిన జువెలరీ బాక్స్‌ని అందుకుని దాని వంక ఆలోచనగా చూసాడు.
* * *
గిఫ్ట్ రేప్‌ని విప్పి అందులోంచి ఆ జువెలరీ బాక్స్‌ని తీసిన మార్తా ఆనందంగా నవ్వుతూ దాన్ని తెచ్చిన ఏపిల్‌బీతో చెప్పింది.
‘‘దీన్ని మీరు అమ్మేసానని చెప్పారు కదా?’’
‘‘దీన్ని కొన్న వ్యక్తి పూర్తి డబ్బు చెల్లించలేదు. ఇది మీకు బాగా నచ్చిందని మీ కోసం బహుమతిగా తెచ్చాను.’’
‘‘కానీ నేను మీనుంచి దేన్నీ ఉచితంగా తీసుకోలేను.’’
‘‘ఆరోజు నేను మీతో కఠినంగా ప్రవర్తించాను. అందుకు బదులుగా దీన్ని తెచ్చాను.’’
‘‘కానీ అందుకు ఇంత ఖరీదైన బహుమతా? దీన్ని మీరు అమ్మితేనే తీసుకుంటాను.’’
‘‘నేను ఇంటింటికీ తిరిగి అమ్మే సేల్స్ మేన్‌ని కాదు.
‘‘మీరు చాలా దయగా దాన్ని తెచ్చారు. దీని ఖరీదు చెప్తే చెక్ ఇస్తాను.’’
‘‘నేను మరోసారి వచ్చినప్పుడు ఆ చెక్ తీసుకుంటాను. నాకు మీ దగ్గరికి ఇంకోసారి రావాలని ఉంది. రావచ్చా?’’ ఏపిల్‌బీ అడిగాడు.
‘‘తప్పకుండా. నాకది ఆనందానే్న ఇస్తుంది’’ మార్తా చెప్పింది.
* * *
మరి కొద్ది రోజుల తర్వాత మార్తా ఇంటి తలుపు తెరిచిన మెయిడ్ చెప్పింది.
‘‘గుడ్ ఈవినింగ్ మిస్టర్ ఏపిల్‌బీ. మార్తా మీకోసం ఎదురు చూస్తోంది’’
సోఫాలో కూర్చున్న మార్తాకి పూల బొకేని ఇచ్చి చెప్పాడు.
‘‘గుడ్ ఈవినింగ్ మిస్ మార్తా. నేను చిత్రకారుడ్ని అయితే బాగుండేది. అలా కూర్చున్న మీ బొమ్మ గీసేవాడిని.’’
‘‘నలభై ఐదేళ్ల వయసులో నాకింత పొగడ్తా? నేను టీనేజర్ని కాదు.’’ ఆమె ఇబ్బంది పడుతూ లేచి నించుని చెప్పింది.
‘‘మార్తా! నాదో సూచన. మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి.’’ ఆమెదగ్గరికి వెళ్లి చెప్పాడు.
‘‘మీరేం అంటున్నారో నాకు అర్ధం కావడంలేదు.’’ అదే ఇబ్బందితో చెప్పింది.
‘‘నేనేం చెప్తున్నానో నాకు తెలుసు. వంటరిగా వుండేవారు ఎక్కువకాలం దాన్ని భరించలేరు. అలాటి మగాడు తనకి తగిన భార్యకోసం ప్రయత్నం చేయడంలో తప్పులేదు.’’
‘‘కానీ మీ షాపులోని వస్తువులు చాలా విలువైనవి. నేను మీ అంత ధనవంతురాలిని కాదేమో? నేను ఇంతకాలం పెళ్లి చేసుకోకుండానే ఉన్నాను. ఇంత త్వరగా నేను పెళ్లికి అంగీకరించలేను. ఆలోచించుకోవాలి. నా భర్తకి నా మీద, నా ఆనందం మీద ఎక్కువ ఆసక్తి ఉండాలి. కానీ మీకు మీ షాపు ఉంది. నేను నా భర్తకి ముఖ్యం అవ్వాలి.’’
‘‘ఐతే ఇద్దరం అందుకు అంగీకరించినట్టే.’’
‘‘ఓసారి మీరు నా లాయర్ గెయిన్స్‌ని చూడాలి. మా నాన్న మరణించినప్పటినుంచి ఆయనే తండ్రిలా నా వ్యవహారాలన్నీ చూస్తున్నారు. ఆయన అనుమతి లేకుండా నేనేమీ చేయను.’’
‘‘తప్పకుండా.’’ ఏపిల్‌బీ ఒప్పుకున్నాడు.
* * *
‘‘మిస్ మార్తాకి లీగల్ అడ్వయిజర్‌గా నేను ఆమెకి సలహాలు ఇస్తుంటాను. పెళ్లి విషయంలో ఆమె ఆస్తి ఒకోసారి గమ్యం అవుతుంటుంది.’’ లాయర్ గెయిన్స్ చెప్పాడు.
‘‘మిస్ మార్తాకి ఎంత ఆస్తి వుందో నాకు తెలీదు. దానిమీద ఆసక్తి కూడా లేదు.’’ ఏపిల్‌బీ జవాబు చెప్పాడు.
‘‘కానీ ఆ నిజం మారదు. ఐనా మిమ్మల్ని మార్తా పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. మిస్టర్ ఏపిల్‌బీ. మీకు ఎప్పుడైనా పెళ్లయిందా?’’
‘‘అయింది.’’
‘‘విడాకులా?’’
‘‘గుడ్ హెవెన్స్. కాదు. నా భార్య మరణించింది.’’
‘‘సరే. మిస్ మార్తాకి ఓ సలహా ఇచ్చాను. నైతిక విలువలు పడిపోతున్న ఈ రోజుల్లో ఆమెని ప్రేమగా, శ్రద్ధగా, అపురూపంగా మీరో నెలరోజులు చూసుకుంటే అప్పుడు ఆమెకి మీమీద నమ్మకం ఏర్పడుతుందన్నది నా సలహా.’’
‘‘నెలరోజులా? సరే..’’ ఒప్పుకున్నాడు.
మర్నాడు లాయర్ గెయిన్స్ నాలుగైదు పేజీలు టైప్ చేసిన ఎగ్రిమెంట్‌ని మార్తా సమక్షంలో ఏపిల్‌బీకి ఇచ్చి చెప్పాడు.
‘‘ఈ నెలరోజుల్లో ఎవరికి ఏం జరిగినా ఒకరి ఆస్తి మరొకరికి చెందే ఒప్పంద పత్రం ఇది. దీని మీద సంతకం చేయడానికి మీకు అభ్యంతరం లేదు కదా?’’
‘‘లేదు.’’ ఏపిల్‌బీ సంతకం చేస్తూ చెప్పాడు.
‘‘ఆ నియమం చెప్పారా?’’ మార్తా లాయర్ని అడిగింది.
‘‘అవును. మీ పెళ్లయ్యాక మీరు మార్తాతో ఇదే ఇంట్లో ఉండాలి. మార్తా ఇక్కడే పుట్టి పెరిగింది.’’
‘‘అలాగే. ఆమె ఇల్లే నా ఇల్లు.’’ ఏపిల్‌బీ అంగీకరించాడు.
* * *
కొద్ది నెలల తర్వాత ఏపిల్‌బీ షాపునుంచి ఇంటికి వచ్చాక,తాగిన కాఫీ కప్పులని, నేప్కిన్‌ని టేబుల్‌మీద చూసి మార్తాతో చెప్పాడు.
‘‘ఆడవాళ్లు ఇంత అశుభ్రంగా ఎలా పెట్టుకుంటారో నాకు తెలీదు.’’
‘‘మీరు అలిసిపోయారు. నేను వాటిని తీసేస్తాను. కూర్చుని ఇవాళ మీ షాపు విషయాలు చెప్పండి.’’ మార్తా నవ్వుతూ అతన్ని సోఫాలో కూర్చోబెట్టింది.
‘‘చాలా భయంకరమైన రోజు. అప్పిచ్చిన వాళ్లు షాపుని మూయించేస్తానని బెదిరిస్తున్నారు. వెంటనే ఏడువేల డాలర్లు చెల్లించాల్సి ఉంది’’ ఏపిల్‌బీ చెప్పాడు.
‘‘వాళ్ల పురాతన విగ్రహాలని వాళ్లకి వెనక్కి ఇచ్చేయండి.’’ మార్తా నవ్వుతూ సలహా చెప్పింది.
‘‘అదే జరిగితే, మిగిలిన వస్తువుల్నికూడా సరఫరాదారులు స్వాధీనం చేసుకుంటారు. అప్పుడే నేను షాపుని మూసివేయాల్సి వస్తుంది.’’
‘‘అది మరీ మంచిది. మీరు రోజంతా నాతోనేకలిసి ఉండొచ్చు.’’ మార్తా సూచించింది.
‘‘అప్పుడు నాకు పిచ్చెక్కుతుంది.’’
టెలిఫోన్ మోగింది.
‘‘మీ లాయర్ మిస్టర్ గెయిన్స్ ప్రతీ రాత్రి నీకు ఫోన్ చేస్తుండాలా?’’ ఏపిల్‌బీ విసుగ్గా అడిగాడు.
‘‘మా నాన్న మరణించినప్పటినుంచి ఆయన నాకు ప్రతి రాత్రి ఫోన్ చేసి కులాసాగానే ఉన్నానా అని తెలుసుకుంటుంటాడు. అప్పుడు నేను వంటరిని కదా? నాకు పెళ్లయినా ఆ అలవాటుని ఆయన మానుకోలేకపోతున్నాడు.’’
మార్తా లేచి వెళ్లి ఫోన్ మాట్లాడుతుంటే, ఆమె పాదాల కింద వున్న మేట్ ఏపిల్‌బీ కంటపడింది.
* * *
మర్నాడు రాత్రి షాపునుంచి తిరిగి వచ్చిన ఏపిల్‌బీకి సోఫాలోని పిల్లి కనిపించింది.
‘‘మార్తా! వెంటనే కోపంగా అరిచాడు.
‘‘యస్.డియర్’’ అంటూ బయటికి వచ్చి మార్తా చెప్పింది.
‘‘మీరు ఆలస్యంగా వచ్చారు. మీరు రోజురోజుకీ ఆలస్యం చేస్తున్నారు.’’
‘‘ఇదేమిటి?’’ పిల్లి వంక చూపిస్తూ కోపంగా ప్రశ్నించాడు.
‘‘ఇది డికీ. నాకు కంపెనీ కోసం కొన్నాను.’’
‘‘పిల్లులు నాశనకారులు. అవి ఫర్నిచర్‌ని ఎంత పాడుచేస్తాయో తెలుసా?’’
‘‘్ఫర్వాలేదు.’’
‘‘మార్తా! రేపటికల్లా నాకు పదివేల డాలర్లు కావాలి.’’ కోరాడు.
‘‘నీకు ఆకలిగా ఉందా డికీ? అన్నం తింటావా?’’ పిల్లిని తీసుకుని మార్తా వెళ్లబోయింది.
‘‘మార్తా! నేను చెప్పింది వినపడడంలేదా? రేపు మధ్యాహ్నం కల్లా నాకా డబ్బు అవసరం ఉంది. లేదా నా షాపు పోతుంది.’’ ఆమెని ఆపి కోపంగా చెప్పాడు.
‘‘అదేమంత పెద్ద నష్టం కాదు. మీరీ ఇంట్లో నాతోనే ఉండొచ్చు.’’ మార్తా చెప్పింది.
‘‘అంటే నాకా డబ్బు అప్పివ్వవా?’’
‘‘లేదు.’’
మార్తా పిల్లికి అన్నం పెట్టడానికి ఉపయోగించే ప్లేట్‌ని చూసి, పురాతన వస్తువులని ప్రేమించే ఏపిల్‌బీ తృళ్లిపడి అడిగాడు.
‘‘ఇది పధ్నాలుగో శతాబ్దపు మింగ్ ప్లేట్ అని తెలుసా?’’
‘‘వీటిని ప్రేమించేది మీరే.’’ చెప్పి నవ్వి వెళ్లిపోయింది.
ఏపిల్‌బీ కోపంగా మేంటెల్ పీస్ దగ్గరికి నడిచాడు. అతనికి కాళ్లకింద మేట్ కనిపించింది. వెంటనే వంగుని జారేందుకు వీలుగా దాన్ని అటు ఇటు కదిపాడు. తర్వాత దాని ముందుకు కుర్చీని లాగి కూర్చుని అరిచాడు.
‘మార్తా డియర్! ఓ గ్లాస్ మంచి నీళ్లు తెచ్చిస్తావా?’’
‘‘అలాగే.’’
మార్తా గ్లాస్‌తో వస్తుంటే, ఒంగుని బూట్ లేస్‌ని కట్టుకుంటున్నట్టుగా నటించాడు. తర్వాత చటుక్కున మేట్ పట్టుకుని పైగి లాగాడు.
‘‘మీరు ఇదివరకు ఇలాగే చేసారా? మీ భార్యది ప్రమాదమా? హత్యా?’’ మార్తా అతన్ని అడిగింది.
నివ్వెరపోయి చూస్తున్న ఏపిల్‌బీతో చెప్పింది.
‘‘నేనూ ఆ పుస్తకాన్ని చదివాను. ఐనా మీరలా చేసారని నమ్మలేదు. నా లాయర్ మిస్టర్ గెయిన్స్ మీ భార్య ప్రమాదవశాత్తు మరణించిందని మన పెళ్లికి ముందే చెప్పాడు.’’
‘‘నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్ధం కావడంలేదు.’’ ఏపిల్‌బీ లేచి నిలబడి చెప్పాడు.
‘‘మీరు సంతకం చేసాక ఆ అగ్రిమెంట్‌ని చదవలేదా? అధికారులు ఆ పుస్తకాన్ని చదివితే, మీ భార్యకి
ఏమైందో తెలుసుకోగలరు’’
‘‘నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్లమంటావా?’’ ఏపిల్‌బీ అడిగాడు.
‘‘నాకు మొట్టమొదట వచ్చిన ఆలోచన అదే. అప్పుడు మీరేం చేస్తారు? ఇంకో అమాయకురాలిని పెళ్లి చేసుకుని ఆమెనీ చంపుతారా? మీనుంచి వారిని రక్షించాల్సిన బాధ్యత నాకుంది. మీరు ఆ దుకాణాన్ని వదిలేసి మిగిలిన మీ సమయం అంతా ఈ ఇంట్లో ఇక నాతోనే గడపాలి.’’
‘‘అది అసాధ్యం.’’ ఏపిల్‌బీ చెప్పాడు.
‘‘మీకు వేరే దారి లేదు. అన్ని ఏర్పాట్లు జరిగాయి. మిస్టర్ గెయిన్స్ ఐరన్ సేఫ్‌లో నా ఉత్తరం ఉంది. ఏ కారణంగానైనా నేను ప్రమాదవశాత్తు మరణిస్తే అది మీవల్లే అని రాసి సంతకం చేసాను. మిస్టర్ గెయిన్స్ మీ మొదటి భార్య హత్య గురించి కూడా వాళ్లకి చెప్పి ఆ పుస్తకాన్ని వారికి అందచేస్తాడు. ప్రతీ రాత్రి అయన నాకేం కాలేదని తెలుసుకోడానికే నాకు ఫోన్ చేస్తుంటాడు.’’
టెలిఫోన్ మోగింది.
‘‘ఆన్సర్ చేయండి. ఆయన్నుంచే’’ మార్తా చెప్పింది.
‘‘హలో?’’
‘‘మిసెస్ ఏపిల్‌బీతో మాట్లాడుతాను.’’ గెయిన్స్ కంఠం వినిపించింది.
‘‘ఐయాం సారీ. ఆమె ఇప్పుడు ఫోన్‌దగ్గరికి రాలేదు. ఏం చెప్పమంటారు?’‘ అడిగాడు.
‘నీకే’’ మిస్టర్ ఏపిల్‌బీ నిస్పృహగా మార్తాతో చెప్పాడు.
ఆమె నవ్వుతూ టెలిఫోన్ వైపు రెండడుగులు వేసింది. ఆమె కాలు మేట్ మీద జారి పెద్దగా అరుస్తూ కిందపడింది. ఆమె తల మేంటెల్ పీస్ ముందున్న ఇటుక రాళ్ల ప్లాట్‌ఫాంకి కొట్టుకుంది.
‘‘మార్తా!’’ ఏపిల్‌బీ ఆమె దగ్గరికి ఒక్క ఉదుటున వెళ్లి పిలిచాడు.
ఆమెలో చలనం లేదు.
‘‘ఏపిల్‌బీ పది క్షణాలు అన్నాను. వినపడుతోందా? లేదా...’’ ఫోన్‌లోంచి గెయిన్స్‌కంఠం వినిపిస్తోంది. *
---------------
రచన: స్టాన్లీ ఎలెన్
దర్శకత్వం: జేమ్స్ నీల్సన్