
‘సండే గీత’లో మేస్ర్తి ఏదో చేసేసి నాలుక కరచుకోకూడదని, ఎల్లవేళలా సిన్సియర్‌గా పని చేయాలనే ‘చింతన’ అందరికీ శిరోధార్యం. అలాగే శాస్ర్తిగారితో ముఖాముఖి ఎన్నో అంశాలను చర్చించింది. ‘ఆంధ్రాయణం’ ద్వారా తెలంగాణ సమస్య ఎలా రావణ కాష్ఠం అయిందో తెల్సింది.
-ఎ.రామారావు (కాకినాడ)
ఆకట్టుకొంది
ఆదివారం అనుబంధం మా ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటోంది. తేజ్‌పాల్ గురించి ‘ఈ వారం స్పెషల్’లో ఎన్నో విషయాలు తెల్సుకున్నాం. కార్టూన్లు కడుపుబ్బ నవ్వించాయి. మల్లాదిగారి ‘చివరి కోరిక’ సీరియల్ ఆకట్టుకొంది. యర్రంశెట్టి సాయి ‘హలో మైక్ టెస్టింగ్’ సరదా తాళింపు.
-సి.కళ్యాణి (నర్సాపురం)
ఇంట్రెస్టింగ్
ఆదివారం అనుబంధం అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది ‘చివరి కోరిక’ సీరియల్ ఇంట్రెస్టింగ్‌గా ఉండి సీరియల్ మొత్తం ఒకేసారి చదివేయాలన్న ఉత్సుకత కలుగుతోంది. నల్ల సూరీడు నెల్సన్ మండేలా నివాళి సందర్భంగా ఈ వారం ‘సండే గీత’ ధన్యమైంది. ‘అక్షరాలోచనాలు’లో కవితా సుమాలు గుభాళించాయి. శరత్‌చంద్ర ‘సౌందర్యం’ కథ కథనాలు అలరించాయి.
-వి.రాఘవులు (విశాఖపట్నం)
మనోరంజకం
‘ఏమి లోకమిది’లో ఛాయాచిత్రాలు, వింతలూ విడ్డూరాలూ మనోరంజకంగా ఉంటున్నాయి. ‘అక్షరాలోచనాలు’లోని సహజాతం, పరిమళం, నది నైజం కాదు కవితలన్నీ భావాత్మకంగా, రసరంజకంగా ఉన్నాయి. మనం దారిని నడిచేటప్పుడు గాని, ఆలోచించేటప్పుడు గాని, జీవిత పథాన నడచునప్పుడు గాని కొంత ప్రాథమిక పరిజ్ఞానం, చింతన అవసరమని - వినోదంతో కలగలిపి ‘జర సోచ్ కె ఛలో’లో యర్రంశెట్టి సాయి చక్కగా చమత్కరించారు. ‘పావురాల కలకలం’ చదువుతూంటే ఒళ్లు గగుర్పొడిచింది. అలాగే సామాన్యుడికి సాధారణంగా సహనం ఎక్కువ. ఆగ్రహం తక్కువ. కాని అతని ఓర్పును పరీక్షిస్తే మాత్రం కేజ్రీవాల్‌లా ఒక విప్లవాన్ని తీసుకురాగలడు. ఒక చారిత్రాత్మక మార్పునకు నాంది కాగలడని కేజ్రీవాల్ ఉదంతం నిరూపించింది. ‘సరిరారు మనకెవ్వరూ’ అని సరాగ యుతంగా చర్చించారు.
-పి.బాబ్జీ (కర్నూలు)
వాస్తవం
ఈ వారం ‘హలో మైక్ టెస్టింగ్’లో అందించిన ‘మేరా బ్రాందీ మహాన్ హై..’ కడుపుబ్బ నవ్వించింది. రెండు రాష్ట్రాలు అయితే నదీ జలాల పంపిణీ కంటే ముఖ్యంగా బ్రాందీ జలాల పంపిణీ రా భయ్. నిజమే. హాస్య సెటైర్ తాలింపు సూపర్బ్.
-శ్రీరాములు (శ్రీకాకుళం)
సిసింద్రి
సిసింద్రీ పేజీ ప్రధాన ఆకర్షణ. కథలు, స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ మంచి సందేశాన్ని అందించే విధంగా ఉంటున్నాయి. అలాగే ‘సుడుకో’ ‘పదాల ఆట’ పిల్లల మెదడుకు పదును పెట్టే విధంగా ఉంటున్నాయి. ‘చింటూ’ బొమ్మల కథ ఆకర్షణీయంగా ఉంది. ‘నమ్మండి ఇది నిజం’ నిజ జీవితంలో జరిగే సంఘటనలను చక్కగా అందిస్తున్నారు.
-రాజ్‌మధు (నిజామాబాద్)
సండే గీత
ఆదివారం అనుబంధంలో ‘సండే గీత’ చాలా బాగుంటోంది. ‘హలో మైక్ టెస్టింగ్’లో మేరీ బ్రాందీ మహాన్ హై.. ఈ వారం స్పెషల్ ‘అందని ద్రాక్ష’.. శీర్షికలన్నీ సూపర్.
-పి.రాంగోపాల్ (విశాఖపట్నం)
నల్ల సూరీడు
‘సండే గీత’లో నల్ల సూరీడు ప్రతిభా వ్యుత్పత్తులతోపాటు ఆయన దీక్షా దక్షత, ప్రజాసేవ, మూర్త్భీవించిన స్వేచ్ఛా స్వాతంత్య్ర కాంక్షలను చక్కగా రచయిత మలిచారు. కళాగోపాల్ ‘పాటే ఒక జ్ఞాపకమైన వేళ’ శైలజా మిత్ర ‘కాలాంశలిప్తలు’ కవితా బలంతో అక్షరాలోచనాలుగా రూపొందాయి. క్లిష్టమైన రాష్ట్ర విభజన విషయంలో సారా విషయాన్ని చొప్పించి మేరా బ్రాందీ మహాన్ హై అంటూ యర్రంశెట్టి సాయి శీర్షిక హాస్యాత్మకంగా రూపొందింది. గోపాలం సినీ మానసం ‘లోకాభిరామమ్’లో రక్తి కట్టింది. రాజరికం అంతరించినా అంకురించని ప్రజాస్వామ్య ఆకాంక్షల గురించి ‘అందని ద్రాక్ష’లో రాజేశ్వర ప్రసాద్ చక్కగా చర్చించారు.
-వి.తరుణ్ (కర్నూలు)
బాగుంది
మల్లాది సీరియల్ ‘చివరి కోరిక’లో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన జనరల్ నాలెడ్జి ప్రశ్నలూ జవాబులూ కథకు టెంపోను పెంచేట్టు చేశాయి. భమిడిపాటి గౌరీశంకర్ ‘పొత్తర్లు’ కథ ఓ బ్రాహ్మణ అగ్రహారం చుట్టూ తిరుగుతూ, సంక్రాంతి సంబరాల కోలాహలం నెల ముందే చూపి సందడి చేసింది. నిష్ణాతుడైన గంగాధర శాస్ర్తీగారి శిష్యగణం శ్రీకాకుళం పరిసర గ్రామాలు సుసరాం, సత్యవరం, నరసన్నపేట, పోలాకి, కోమర్తిలలో పురోహితులుగా, అర్చకులుగా స్థిరపడినట్లు రచయిత పేర్కొనగా, చిన్ననాటి జ్ఞాపకాల దొంతర్లు, మా మూక తిరుగాడిన దూసి, ఉర్లాం, దేవాది, మబగాం, వనిత మండలం, శాలిహుండం, గార, వంశధార ఏటి తినె్నలు, తిరిగి కళ్ల ముందు నిలిచి ఉద్వేగపరచింది.
-మల్లీశ్వరి (గుంటూరు)
అద్భుతం
‘ఏమి లోకమిది’లో కళాకారుడి సృజనకు హద్దులు ఉండవు అని నిరూపించిన ఛాయాచిత్రాలు అద్భుతం. అపూర్వం. చేసే పనిపై గురి, శ్రద్ధ ఉండాలి. ‘కుంచెం తేడా’గా కార్టూన్లు బాగుంటున్నాయి. యర్రంశెట్టి సాయి ‘ఇలా అయిందేమిటి’ సరదా సంగతుల సెటైర్ తాళింపు చక్కగా కుదిరి వంటకం రుచికరంగా తయారైంది. పి.ఎస్.ఆర్. ‘నేతల గుండెలు వెబ్‌డబ్’ వ్యాసం ఈ వారం స్పెషల్ ఆసక్తికరంగా ఉంది. ‘అమ్మకానికో గ్రామం’ చదివి ఆశ్చర్యపోయాం. ‘క్లాప్ కొట్టు గురూ’ విశేషాలు, చిత్రాలతో కూడిన వార్తలు ముచ్చటగొలిపాయి.
-సిహెచ్.మార్తాండవర్మ (ఖమ్మం)