
నా టాలెంటే వేరు!
నేనొక ప్రత్యేకమైన నటిని. నాలాగా టాలెంట్ ఉన్నవాళ్ళెవరూ నా దరిదాపుల్లో లేరు. ఏవైనా సరే స్పెషల్ సాంగ్‌లకు డాన్సులు చేయాలంటే నేనే చేయాలి అంటోంది మల్లికా అరోరాఖాన్. సినిమాకు ప్రేక్షకులను రప్పించే శక్తి కేవలం ఐటెమ్ సాంగ్‌లకే ఉందని, దాన్లోకూడా నృత్యాలు చేసే మాలాంటివారికి మరింత ప్రాధాన్యత ప్రస్తుతం సంతరించుకుంటోందని, అందుకే నృత్యాలకే తాను ప్రధాన పీట వేస్తున్నానని చెబుతోందామె. పెద్ద పెద్ద కథానాయికలే ఐటెమ్ సాంగ్‌లవైపే వచ్చేస్తోంటే, కేవలం వాటిని నమ్ముకున్న తాము ఎందుకు సిగ్గుపడాలి అని అడుగుతోంది. పరిశ్రమలో ఎవరి పని వారికుంటుంది. ఎవరి ప్రతిభని బట్టి వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఫలాని పాటకు డాన్సుకు ఎవరు న్యాయం చేస్తారని దర్శక నిర్మాతలు అనుకుంటారో వారికే అవకాశాలు ఇస్తారు కాని, ఎవరికిపడితే వారికి ఇవ్వరుకదా! ప్రస్తుతం తాము ఓ టీవీ రియాలిటీ షోలో కూడా డాన్సులకు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నానని, అయితే ఈ డాన్సుల్లో కూడా సరికొత్తదనం కోసం తాను ప్రయత్నిస్తున్నానంటోంది. మరి, ఆ సరికొత్త డాన్సులు ఏంటో అమ్మడే చెప్పాలి.
మరోసారి ఐటెమ్
సోనాక్షి సిన్హా ఒక్కసారిగా దబాంగ్ చిత్రంతో లైమ్‌లైట్‌లోకొచ్చింది. కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో మాత్రమే తాను కన్పిస్తానని, ఎలాబడితే అలాంటిపాత్రలు ఒప్పుకోనని మొదట్లో బీరాలు పలికినా ఇప్పుడు మాత్రం ఏం నిర్ణయించుకుందో ఏమో కానీ ఎటువంటి పాత్రలైనా నటిస్తానంటూ ముందుకొస్తోంది. అందులో భాగంగా ఐటెమ్ పాటలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసి చేస్తోంది. ఉత్తరాదిగా పరిమితం అనుకుంటే సోనాక్షి దక్షిణాది చిత్రాల్లోకూడా ఐటెమ్‌లకు సై అంటోంది. కోలీవుడ్‌లో హీరో సూర్యతోకలిసి ఓ ఐటెమ్ పాటలో చిందేయడానికి వస్తోంది. సంగీతం అందిస్తోన్న ఈ పాటలో ఆమె సూర్యతోపాటుగా కలసి ఢీ అంటే ఢీ అన్న లెవెల్లో డాన్సులు ఆడబోతోందట. క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సోనాక్షి ఇలా తమిళ పరిశ్రమలో ఐటెమ్ పాటలో నటించడం విశేషమే. ఐతే దర్శకుడు మాత్రం ఓ సరికొత్త గీతాన్ని వెరైటీ డాన్సు మూమెంట్స్‌తో చేస్తున్నామని, అందుకే ఆ పాటకు సోనాక్షి అయితేనే న్యాయం జరుగుతోందని ఆమె సంప్రదించాలని చెబుతున్నాడు. మొత్తానికి సోనాక్షి తమిళ తెరపై సునామీ సృష్టిస్తుందేమో చూడాల్సిందే.
పోటీ నృత్యాలు
సినిమాలో నటన డాన్స్‌లు ఎట్లా వున్నా వెనుక సపోర్టు ఉంటే సరిపోతుంది. అవకాశాలు వాటంతట అవే తన్నుకుంటూ వస్తాయి అనే ఆలోచనలోనే ఉంది రాధ కూతురు కార్తీక. రంగం చిత్రం ఇచ్చిన గుర్తింపుతో కొద్దో గొప్పో చిత్రాల్లో నటిద్దామని ఎంత ప్రయత్నించినా సినిమాలు రావడంలేదు. ఇక లాభం లేదని ఏదో విధంగా నిరంతరం మీడియాలో నానడం కోసం సరికొత్త డాన్సులు చేస్తున్నానంటూ ముందుకొచ్చింది కార్తీక. తాజాగా అధర్వ కథానాయకుడుగా నిర్మిస్తున్న ‘పోరంబోకు’ చిత్రంలో కార్తీక లీడ్ రోల్ చేస్తోంది. ఇందులో హీరోతోపాటు పోటీపడి డాన్సులు చేయాల్సిన పాత్రలో నటిస్తోంది. ఇంతవరకూ ఎవరూ చేయని ఓ వెరైటీ డాన్స్ మూమెంట్‌ను తాను చేసే ప్రయత్నం చేస్తున్నానని, ఈ డాన్సులు చూశాక అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. డాన్సుల సంగతి ఏమోగానీ అసలు సినిమా ముందు క్లిక్ అవ్వాలి కదా. అప్పుడే ఎన్ని డాన్సులు చేసిన వాటికి గుర్తింపు వస్తుంది. అప్పటివరకూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది కార్తికా!