లూథియానా/న్యూఢిల్లీ, జనవరి 19: రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా కాంగ్రెస్ ప్రకటించకపోవటంపై బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చేసిన విమర్శను కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఆదివారం, కేంద్ర మంత్రి మనీష్ తివారి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. బిజెపి ప్రధాని అభ్యర్థులను ప్రకటిస్తుంది కాని అది శక్తివంతమైన ప్రధానులను అందించదు అని అన్నారు. టీని అమ్మే ఒక వ్యక్తి ప్రధాని పదవి నిర్వహించలేడన్న జెడి(యు) వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. విషంతో కూడిన టీని అమ్మే వ్యక్తికి ఆ అర్హత లేదని తివారి అన్నారు. ఎదురుచూసే ప్రధాని మోడల్ (పిఎం ఇన్ వెయిటింగ్)ను బిజెపి ఎందుకు అనుసరిస్తుందో చెప్పాలని అజయ్ మాకెన్ ప్రశ్నించారు. ‘బిజెపి కేవలం ప్రధాని అభ్యర్థులను మాత్రమే ఇస్తుంది ప్రకటిస్తోంది. అయితే కాంగ్రెస్ దేశానికి బలమైన ప్రధానులను ఇస్తుంది. గత రెండు సాధారణ ఎన్నికల్లో బిజెపి నుంచి అభ్యర్థులు మాత్రమే ముందుకు వచ్చారు. కాని ప్రధాని కాంగ్రెస్, యూపిఏ నుంచి వచ్చారు’ అని తివారి పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకపోవటంపై మోడీ స్పందిస్తూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పొందనున్న కాంగ్రెస్, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన కుమారున్ని రక్షించుకునేందుకే రాహుల్ పేరును ప్రకటించలేదని విమర్శించారు. కాగా మోడీ వ్యాఖ్యలు, ప్రధాని కావాలన్న కోరికపై కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ కూడా విరుచుకుపడ్డారు. టీ ని అమ్ముకునే వ్యక్తికి కాంగ్రెస్ నేతల్ని విమర్శించే నైతికహక్కు లేదన్నారు. మోడీ ప్రధాని కావాలన్న లక్ష్యం ఈ శతాబ్దంలో నెరవేరదని అయ్యర్ పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ నేతల విమర్శలపై మోడీ పార్టీ జాతీయ మండలి సమావేశం వేదికగా ప్రతివిమర్శ చేశారు. ‘కులీన వంశాల కుటుంబాల్లో జన్మించినవారు టీ అమ్మే వ్యక్తితో పోటీపడటం తమ గౌరవానికి భంగకరమని భావిస్తారు’ అని అన్నారు.
కాంగ్రెస్ బలమైన ప్రధానులను తెస్తుంది మోడీపై కాంగ్రెస్ ఎదురుదాడి
english title:
b
Date:
Monday, January 20, 2014