న్యూఢిల్లీ, జనవరి 19: లోక్‌పాల్‌ను అమలులోకి తీసుకురావడంతో పాటు పెండింగ్‌లో ఉన్న నాలుగు అవినీతి నిరోధక బిల్లులను రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదింపజేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌పాల్ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసిందని, లోక్‌పాల్ చైర్‌పర్సన్, సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందని, పెండింగ్‌లో ఉన్న నాలుగు అవినీతి నిరోధక బిల్లులను రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.నారాయణస్వామి ఆదివారం న్యూఢిల్లీలో పిటిఐ వార్తా సంస్థకు వివరించారు. విదేశీ ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వకుండా నిరోధించేందుకు ఉద్దేశించిన బిల్లుతో పాటు విజిల్‌బ్లోవర్స్ ప్రొటెక్షన్ బిల్లు, అవినీతి నిరోధక (సవరణ) బిల్లు, సిటిజన్ చార్టర్ బిల్లు పార్లమెంట్ ఎదుట పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ బిల్లులను ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాతిపదికన ఆమోదింపజేస్తుందని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్టు నారాయణస్వామి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నందున ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పార్లమెంట్ చివరి సమావేశాలు జరుగనున్నాయి.
లోక్‌పాల్ ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, త్వరలోనే ఇది పూర్తవుతుందని నారాయణస్వామి చెప్పారు. లోక్‌పాల్ చైర్‌పర్సన్, సభ్యుల ఎంపికకు సంబంధించిన దరఖాస్తులు అందిన తర్వాత ప్రభుత్వం వీరి ఎంపిక ప్రక్రియను పూర్తిచేస్తుందని ఆయన తెలిపారు.
భర్త జీతం భార్యకు
తెలియాల్సిందే..!
న్యూఢిల్లీ, జనవరి 19: భర్త జీతమెంతో తెలియని భార్యలకు తీపి కబురు... భర్త సంపాదించే జీతం భార్యలకు తప్పనిసరిగా తెలియజేయాల్సిందేనని కేంద్రీయ సమాచార కమిషన్ (సిఐసి) స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగుల భార్యలకు అలా తెలుసుకునే హక్కు ఉంటుందని సిఐసి వివరించింది. కుటుంబాన్ని నడిపేందుకు ఆ వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం భార్యకు తప్పనిసరిగా ఉంటుందని సమాచార కమిషనర్ ఎం. శ్రీ్ధర్ ఆచార్యులు తెలిపారు. ప్రభుత్వోద్యోగులు పొందే జీతం ప్రజలు చెల్లించే పన్నుల నుంచే వస్తోందని, వారు పొందే జీతభత్యాలు తెలుసుకోవడం ఆర్టీఏ చట్టం కిందకే వస్తుందని ఆయన తెలిపారు. ఇది మూడో పార్టీకి తెలియజేయడం కిందికి రాదని ఆయన అన్నారు. అలా అడిగిన వివరాలు ఇవ్వకపోవడం తప్పేనని ఢిల్లీ హోంశాఖను మందలించారు. ఢిల్లీ హోంశాఖలో పనిచేసే ఒక వ్యక్తి భార్య తన భర్త పేస్లిప్ వివరాలు తెలియజేయాలని కోరింది. దానికి ఆ శాఖ నిరాకరించడంతో ఆమె సిఐసిని ఆశ్రయించింది.
తరుణ్ తేజ్‌పాల్‌పై
నెలాఖరులోగా చార్జిషీట్
పనాజీ, జనవరి 19: తెహెల్కా పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న గోవా పోలీసులు ఈ నెలాఖరు లోగా అభియోగ పత్రం (చార్జిషీటు) దాఖలు చేయనున్నట్టు క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. ఈ కేసు దర్యాప్తు దాదాపు తుది దశకు చేరుకుందని ఆయన ఆదివారం పనాజీలో పిటిఐ వార్తా సంస్థకు తెలియజేశారు. ఈ కేసులో తరుణ్ తేజ్‌పాల్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోను, ల్యాప్‌టాప్ తదిరత పరికరాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపడం జరిగిందని, ఆ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, ఈ కేసులో ఈ నెలాఖరు లోగా చార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు.