న్యూఢిల్లీ, జనవరి 19: భారత వైమానిక దళం ప్రముఖులు ప్రయాణించడానికి ఇప్పటివరకు ఉపయోగిస్తున్న తన హెలికాప్టర్లను ఈ ఏడాది నుంచి దశలవారీగా ఉపసంహరించుకోనున్న నేపథ్యంలో ఇందుకోసం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఎంఐ-17వి5 హెలికాప్టర్లను ఉపయోగించుకోవాలని రక్షణ శాఖ యోచిస్తోంది, ప్రముఖులు ప్రయాణించడానికి 12 హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి అగస్టా వెస్ట్‌లాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రక్షణ శాఖ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు కాలం చెల్లిన ఎంఐ-8 హెలికాప్టర్లను దశలవారీగా ఉపసంహరించుకునే ప్రక్రియ ఈ ఏడాది నుంచి ప్రారంభం కానుంది. ‘ఈ సమస్యను పరిష్కరిండానికి మార్గాలను అనే్వషించాలని మేము వైమానిక దళాన్ని కోరాం. అంతేకాకుండా ప్రముఖులు ప్రయాణించడానికి ఎంఐ-17వి5 హెలికాప్టర్లను ఉపయోగించుకోవడం ఒక పరిష్కారం అవుతుందేమోననే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాం’ అని రక్షణ శాఖకు చెందిన ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
ఎంఐ-8 హెలికాప్టర్ల స్థానంలో ప్రముఖులు ప్రయాణించడానికి 12 అగస్టా వెస్ట్‌లాండ్-101 హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 2010లో ఆ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఆంగ్లో-ఇండియన్ కంపెనీ కాంట్రాక్ట్‌కు ముందు నిజాయితీకి సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన కారణంగా ఆ ఒప్పందాన్ని ఈ ఏడాది జనవరి 1న రద్దు చేసుకుంది. రష్యా నుంచి 139 మిగ్-17వి5 హెలికాప్టర్లకోసం మన దేశం కొన్ని సంవత్సరాల్లో ఆర్డరు ఇచ్చింది. ఈ హెలికాప్టర్లలో చాలావరకు ఇప్పటికే మన దేశానికి చేరుకున్నాయి కూడా. అయితే మన దేశం ఆర్డర్ ఇచ్చిన హెలికాప్టర్లు అన్నీ కూడా సైనిక అవసరాలకోసం ఉపయోగపడేవే తప్ప వీటిలో ఏవీ కూడా ప్రముఖులు ప్రయాణించడానికి అనువైనవి కావు. ఒకవేళ రాష్టప్రతి, ప్రధానమంత్రి లాంటి వాళ్లు ప్రయాణించడానికి ఉపయోగించుకోవాలనుకుంటే వాటిలో మార్పులు చేయాల్సి ఉంటుంది.
నిజానికి అగస్టావెస్ట్‌లాండ్-101 హెలికాప్టర్ల సరఫరా గత ఏడాది చివరికే పూర్తి కావలసివుంది. అయితే ఈ కాంట్రాక్ట్ తమకు దక్కేలా చూడడానికి భారతీయ ఏజంట్లకు 310 కోట్ల రూపాయల మేర ముడుపులు చెల్లించారన్న ఆరోపణలపై ఇటలీలో అగస్టా వెస్ట్‌లాండ్ మాజీ సిఈఓను అరెస్టు చేయడంతో మన దేశం గత ఏడాది ఫిబ్రవరిలో ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది. రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఈ ఒప్పందాన్ని రద్దు చేయడానికి ముందు వైమానిక దళం ఈ హెలికాప్టర్లకు అవసరమైన వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడమే కాక దాని పైలట్లు బ్రిటన్‌లో శిక్షణ కూడా పొందారు. అంతేకాకుండా ఇప్పటికే సంస్థ సరఫరా చేసిన మూడు హెలికాప్టర్లతో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు.
అగస్టా వెస్ట్‌లాండ్ ఒప్పందం రద్దు నేపథ్యంలో రక్షణ శాఖ యోచన
english title:
p
Date:
Monday, January 20, 2014